సబ్ ఫీచర్

బహుజనుల వోట్లు.. బలవంతులకు సీట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రాజ్యం వీరభోజ్యము.. పరాక్రమశాలియె భారతీయ సామ్రాజ్యమునేలజాలు’’- అని ‘మహాభారతం’లో ఓ పద్యం ఉంది. వీరుడంటే ఎవరు? ఎంత ఎక్కువమందిని చంపితే అంత గొప్ప వీరుడు. అంటే రథ గజ తురగ పదాతి దళాలను సమకూర్చుకొని ఇతరులను చంపి భూమిని ఆక్రమించుకున్నవాడే రాజు. ప్రాచీన కాలంలో యుద్ధాలన్నీ ఇలాగే జరిగాయి. విదేశాల్లోనూ ఆయుధమున్నవాడిదే రాజ్యం. రక్తపాతం అపరిమితంగా చేసినవాడే రాజు. నాగరికత పేరు మీద ఆయుధ సంపద పెరుగుతున్నకొద్దీ అత్యాధునిక ఆయుధాలతో యుద్ధం చేసి దేశాలను ఆక్రమించుకున్నారు. అప్పటికి పదునైన ఆయుధాలైన బాణం, గుర్రాలను ఉపయోగించి ఆర్యులు ద్రవిడులను జయించి భారతదేశ ప్రభువులయ్యారు. అలెగ్జాండర్ వేల మైళ్ళు అశ్వదళంతో ప్రయాణించి రక్తపుటేర్లు పారించి, తాను జగజ్జేతనని అనిపించుకున్నాడు. ముస్లిం రాజులు, బ్రిటిష్ వాళ్ళు అప్పటివరకు అధునాతన ఆయుధాలుగా పేర్కొనబడే తుపాకీ మందును, నౌకాయాన ప్రయాణ సౌకర్యాలను ఉపయోగించుకుని ఈ దేశ చక్రవర్తులయ్యారు. విదేశాల్లోనూ దాదాపు ఇదే పద్ధతి. యుద్ధాలు, రక్తపాతంతోనే రాజ్యం సంపాదించుకున్నారు. చెంఘిజ్ ఖాన్ సృష్టించిన బీభత్సం, హిట్లర్ చేసిన అమానుష హత్యాకాండ చరిత్ర పుటలను రక్తసిక్తం చేశాయి. ఎవడెక్కువ తలలు నరికితే వాడే వీరుడు, వాడే రాజు. రాజ్యవిస్తరణ కోసం యుద్ధాలు, రాజ్యం కాపాడుకోవడానికి యుద్ధాలు, మానవ రక్తం చిందని చోటు ప్రపంచంలో ఎక్కడా లేదు.
ఇదంతా ఎందుకోసం..? రాజ్యం కోసం... తాను గద్దెనెక్కడం కోసం... ‘బలమున్నోడిదే రాజ్యం.. ఆయుధమున్నోడిదే గెలుపన్నట్టు’గా ప్రపంచ చరిత్ర కొనసాగింది. భారతదేశ చరిత్ర మరింత నగ్నంగా, భయోద్విగ్నంగా వర్ణ్ధాక్య, మతాధిక్య యుద్ధాలుగా రక్తసిక్తమైంది. ఇరవయ్యవ శతాబ్దిలో ప్రపంచాన్ని విశేషంగా ప్రభావితం చేసిన కమ్యూనిస్టు పోరాటాలు కూడా హింసను ఆశ్రయించినవే. సాయుధ పోరాటాన్ని బాటగా ఎన్నుకున్నవే. వీటితోనూ ప్రపంచమంతటా హింస పేట్రేగిపోయింది. ఈ యుద్ధాలు, పోరాటాలు, రక్తపాతాలు.. నాయకత్వం కోసమే కదా! ఇవన్నీ ఆటవిక పద్ధతులు, రాచరక, ఫ్యూడల్ వ్యవస్థల ప్రతిరూపాలు.
వీటి ద్వారా రాజరికాలు దక్కేది రాజకుటుంబాలకే. ఆ కుటుంబాల్లోని వారే వంశపారంపర్యంగా రాజులవుతారు. ప్రజలెప్పుడూ పాలితులే. పారిశ్రామిక విప్లవం, ఆ తర్వాత ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పడేంతవరకు ఈ పద్ధతే కొనసాగింది. రాచరిక ఫ్యూడల్ వ్యవస్థలో రాజుల ఆస్తులు పెరుగుతాయి. రాజకుటుంబాల, అనుచరవర్గాల ఆస్తులు వేల లక్షల కోట్లలో పెరుగుతాయి. ప్రజలు మాత్రం సేవకులుగానే ఉంటారు. వీళ్ళంతా రాజసేవలో తరించాల్సిందే. భారతదేశంలో నైజాం ఆస్తులు, వివిధ రాజకుటుంబాల ఆస్తులు లెక్కకుమించి ఉండటం ఇందులో భాగమే.
దీనికి భిన్నంగా ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న వారే పాలకులు. ప్రజలు ఎన్నుకుంటే అతి సామాన్యుడు కూడా నాయకుడు కావచ్చు. దేశంలో పౌరసత్వమున్న ఏ పౌరుడైనా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు. ఎంత నిరంకుశ పాలకుడినైనా ప్రజలు తలుచుకుంటే గద్దెదించవచ్చు. తమకు మంచివాడనిపించిన వాడిని గద్దెపై కూచోబెట్టవచ్చు. అది ఓటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. తమకిష్టమున్నవారిని, మంచివారిని లేదా ఇష్టమున్న పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సాధనం ఓటు హక్కు. విప్లవాలు, యుద్ధాలు, రక్తపాతం లేకుండా ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పరిచే ఆయుధం- ఓటు. ఒక్క రక్తపు చుక్క కారకుండా నిశ్శబ్దంగా అధికారాన్ని హస్తగతం చేసుకొనేందుకు ఉపయోగపడే బలమైన సాధనం ఓటు. అందుకే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కుల, మత, ఆర్థిక, విద్య, సామాజిక అంతరాలకు అతీతంగా ఓటు హక్కును కల్పించాడు. గాంధీ, పటేల్, నెహ్రూ లాంటి వాళ్ళు అందరికీ ఓటు హక్కు కల్పించడంలో భిన్నాభిప్రాయాలను ప్రకటించినా బ్రిటిష్ వారి కాలంలో 1931 రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్క ర్ తన అభిప్రాయాన్ని నెగ్గించుకున్నాడు. తరతరాలుగా అణచివేతకు, సామాజిక దురన్యాయానికి, సాంఘిక దురాచారాలకు గురవుతున్న ఈ దేశ బహుజనులు ఓటు హక్కును ఆయుధంగా ఉపయోగించుకొని ని శ్శబ్ద విప్లవం తీసుకురావాలని కోరుకున్నాడు. ఓటు అనేది ప్రజాస్వామిక యు గంలో అత్యంత బలమైన ఆయుధం. సామాన్యుడినైనా సరే సమున్నత స్థానంలో నిలబెట్టే సాధనం.
ఒకటి రెండు గల్ఫ్ దేశాలు, చైనా లాంటి కమ్యూనిస్టు దేశాలు, నేరుగా నాయకులను ఎన్నుకునే అవకాశాలు లేని కమ్యూనిస్టు దేశాలు ఉన్నా- మిగతా ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం ఓటుతో నాయకులను ఎన్నుకునే ప్రజాస్వామిక దేశాలుగానే ఉన్నాయి. అమెరికాలో జాతి వివక్ష లాంటి స్వల్పమైన తేడాలున్నా, నీగ్రో జాతికి చెందిన బరాక్ ఒబామా రెండుసార్లు అమెరికా అధ్యక్షుడు కావడానికి కారణం- ఓటు హక్కును అందరూ ఉపయోగించుకోవడమే. ప్రజాస్వామ్యానికి భంగం కల్పించే చర్యలు ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ జరుగుతున్నా ఓటు ద్వారా మాత్రమే నాయకులను ఎన్నుకోవడమనే ప్రజాస్వామిక ప్రక్రియ అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంది. భారతదేశంలోనూ అంతే. ఓటు హక్కు సరిగ్గా వినియోగింపబడటం లేదంటే అది ఆయా దేశ పాలకుల, వ్యవస్థలోని లోపాల వల్లనే తప్ప ఓటు హక్కునివ్వడంలోని ప్రజాస్వామికత తప్పుకాదు. ఓటు హక్కు వినియోగంలో విదేశాల్లో కనబడుతున్నంత విజ్ఞత, చైతన్యం, ప్రజాస్వామికత భారతదేశంలో కనబడదు. ఆ చైతన్యం భారతదేశంలో ఉండి ఉంటే తరతరాల పీడితులైన మూలజాతులు, బహుజనులు నూటికి ఎనభై ఐదు శాతంగా ఉన్నా- ప్రజాస్వామ్యంలోను పాలితులుగానే ఉండి ఉండరు.
దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న సబ్బండ బీసీ కులాల నుంచి ఇంతవరకు ఒక్కరు కూడా ప్రధానమంత్రి పదవికి, రాష్టప్రతి స్థానంలోకి రాలేకపోవడం ప్రధాన వైరుధ్యమే. అందుక్కారణం ఈ దేశంలోని బలహీనవర్ణాలు, బలహీన కులాలు తమ ఓటు హక్కును సరిగ్గా ఉపయోగించుకోలేని స్థితిలో ఉండటం. క్రమక్రమంగా భారతదేశంలో ఓటు హక్కు ఉపయోగం తమకిష్టమున్నవారికి వేయడానికి కాకుండా దేశంలోని పాలక కులాలు నిర్దేశించిన వారికే వేయడంగా మారిపోతుంది. మెజారిటీ ప్రజల అధికారానికి బదులు అగ్రవర్ణ పాలక కులాల అధికారం శాశ్వతంగా ఉండే దిశలో పయనిస్తోంది. 72 ఏళ్ళ స్వాతంత్య్రం దేశానికి చీడపురుగులాంటిదైన కుల వర్ణ వ్యవస్థను ని ర్మూలించకపోగా దా న్ని మరింత బలోపేతం చే సింది. సెక్యులరిజాన్ని, సోషలిస్టు మానవీయ సమాజాన్ని స్థాపించకపోగా మత తత్వాన్ని పెంచి పోషిస్తోంది. కో ట్లాది మంది నిరుపేదలుగా ఉన్నా, ఉండడానికి ఇల్లు కూడా లేని సంచార జీవులుగా ఉన్నా పిడికెడు మంది వేలు, లక్షల, కోట్లలో ఆర్జించడానికి సహకరిస్తుంది. 1శాతం మంది చేతిలో 73 శాతం దేశ సంపద, 7 శాతం మంది చేతిలో 93 శాతం దేశ సంపద కేంద్రీకృతమై ఉంది. ఇక పేదరిక నిర్మూలన జరిగేదెక్కడ...?
దేశానికి మాయని మచ్చ అయిన అంటరానితనాన్ని సంపూర్ణంగా నిర్మూలించలేని దౌర్భాగ్యం మనది. కోట్లాది మందిని నిరక్షరాస్యులుగా మిగిల్చిన ప్రజాస్వామ్యం మనది. వాడవాడకూ ఆలయాలు, మసీదులు, చర్చిలు నిర్మించుకున్నాం కాని అక్షరాస్యతను పెంచే పాఠశాలలు నిర్మించుకోలేదు. అభివృద్ధి పేరుమీద పిడికెడు మంది దగ్గర దేశ సంపదనంతా కేంద్రీకరింపజేసి కోట్లాది మందిని అంధకారంలో, పేదరికంలో ఉంచి సగటు ఆదాయం పెరిగిందని చెప్పే దేశం మనది. రాజ్యాంగానికి కూడా తూట్లు పొడిచి మనువర్ణ రాజ్యాంగాన్ని సుస్థిరం చేసే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. వీటన్నిటికీ కారణం అంబేద్కర్ తమ చేతికిచ్చిన ప్రజాస్వామిక, మానవీయ ఆయుధమైన ఓటు హక్కును ఈ దేశ మెజారిటీ ప్రజలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడమే.
ఈ దేశంలో ‘ఓటు’ను తద్వారా రాజకీయాధికారాన్ని శాసిస్తున్నవి కర్మ సిద్ధాంతం.. మనీ.. మాఫియా.. మీడియా. కర్మ సిద్ధాంతం మాయలో పడి ఈ దేశ మెజారిటీ ప్రజలు తమ కర్మ ప్రకారం సేవకులుగా, పాలితులుగానే ఉంటామని ‘త్రివర్ణాల’ వారికే ఓటేస్తారు. బహుజనుల ప్రయోజనాలను కాపాడేవి కాకున్నా అగ్రవర్ణాల నాయకత్వంలో ఉన్న పార్టీలనే గెలిపిస్తారు. తరతరాలుగా వస్తున్న బానిసత్వ భావన, చైతన్యలేమి వారితో ఈ పని చేయిస్తుంది. బుద్ధుడు బహుజన హితం గురించి చెప్పినా, ఫూలే గులాం గిరీని విడిచిపెట్టమన్నా, అంబేద్కర్ బలమైన ప్రజాస్వామిక ఆయుధం ఓటు హక్కునిచ్చినా వాటిని ఉపయోగించుకోవడం లేదు. ఈ దేశంలో ఓటు హక్కును విశేషంగా శాసించేది డబ్బు. ఎన్నికల సమయంలో లక్షల కోట్లు మంచినీటి కంటె ఎక్కువగా చేతులు మారుతోంది. ఐదేండ్లు ప్రజల ముఖం కూడా చూడనివారు ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు, వాగ్దానాల వర్షం కురిపిస్తారు. అన్ని పార్టీల వారూ కోట్లల్లో డబ్బును ఖర్చుచేస్తున్నారని ఎన్నికల కమిషన్‌కు తెలుసు. పాలక పార్టీలకు తెలుసు. అది తప్పని, శిక్షార్హమని చట్టమన్నా ఎవరికీ శిక్షపడదు. ఎవరిపైనా చర్య తీసుకోరు. తీసుకున్నట్టు నటిస్తారు. అలాంటప్పుడు డబ్బులేని ఓ ఉత్తముడు, మేధావి ఎలా గెలువగలుగుతాడు? ఎన్నికలను డబ్బు శాసిస్తున్నంతవరకూ డబ్బున్న అగ్రవర్ణ కులాల వారే రాజ్యాలేలుతారు. ‘్భరీగా డబ్బు ఖర్చు పెట్టేవాడు.. అంతకంటే ఎన్ని రెట్లు ఎక్కువ సంపాదించుకుంటాడు?’ అని ఓటర్లు ప్రశ్నించే చైతన్యం ఈ దేశంలో లేదు. ఆ డబ్బంతా ఎక్కణ్ణుంచి వచ్చిందని అడిగే దమ్మున్న చట్టాలు లేవు.
ఎన్నికల సమయంలో మాఫియా రంగంలోకి దిగుతుంది, బెదిరిస్తుంది, డబ్బు పంచుతుంది. కులాలను రెచ్చగొడుతుంది. మతాలను రెచ్చగొడుతుంది. సెంటిమెంట్లను రెచ్చగొడుతుంది. గూండాగిరీ చేస్తుంది. బలవంతంగానైనా తాము అనుకున్న వారికే ఓట్లేయిస్తుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనలు ఇందుకు ఉదాహరణలు. నిష్పక్ష పాతంగా, ప్రజాపక్షంగా ఉండాల్సిన మీడియా అగ్రవర్ణ పాలకుల పక్షం వహించడం ఈ దేశ దౌర్భాగ్యం. పేదల, బహుజన కులాల, వాళ్ళ పక్షం వహించే పార్టీల వార్తలను మీడియా అసలే ప్రచురించదు, ప్రసారం చేయదు. అతి తక్కువగా నిష్పాక్షిక వార్తలొచ్చినా మీడియా మొత్తం పాలక పార్టీల, పాలక కులాల చేతిలో ఉంది కాబట్టి ఈ దేశ దీన, హీన మానవుల పక్షం వహించడం అరుదు. ఇలా ఓటును మీడియా కూడా శాసిస్తుంది.
ఈ మధ్యకాలంలో వోటింగ్ యంత్రాల (ఈవీఎంల)పై అనేక విమర్శలొస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న 200 పైచిలుకు దేశాల్లో 18 దేశాలు మాత్రమే ఈవీఎంలను వాడుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలూ వాడటం లేదు. అలాంటప్పుడు పేపర్ బ్యాలెట్ వాడితే నష్టమేంటి? ఈవీఎంలలో ఏ దురుద్దేశం లేకుంటే వాటినే వాడటం దేనికి? ఎన్నికల కమిషన్ కూడా నిష్పక్షపాతంగా ప్రవర్తించడం లేదని అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఏదేమైనా అంబేద్కర్ ప్రసాదించిన ఓటు ప్రజాస్వామిక ఆయుధంగా ఉపయోగించుకొని మూల జాతుల (బహుజనుల) రాజ్యాధికారం సాధించడానికి నిశ్శబ్ద విప్లవం నేటి సామాజిక అవసరం. రాజకీయ, మానవీయ అవసరం కూడా..!

-డా. కాలువ మల్లయ్య 91829 18567