సబ్ ఫీచర్

వనరుల పరిరక్షణతో సుస్థిర అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్యత్ తరాల కోసం సహజ వనరులను మిగిల్చే ‘సుస్థిర అభివృద్ధి’ భావనకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని నార్వే ప్రధాని బ్రాంట్ లాండ్ అధ్యక్షతన 1987లో జరిగిన ‘ఐక్యరాజ్యసమితి ప్రపంచ వాతావరణ సదస్సు’లో తీర్మానించారు. అయితే, నేడు మానవ కార్యకలాపాలు సహజ వనరుల వినాశనానికి దారితీస్తూ, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. భూమి అనేది సహజ వనరుల గని. విశ్వంలో అనేక జీవజాతుల మనుగడకు అనుకూలత కలిగిన ఒకే ఒక గ్రహం భూమి. సమస్త ప్రాణికోటికి ఆధారంగా నిలుస్తోంది.
ప్రపంచ దేశాలు వాతావరణ సంరక్షణ పట్ల శ్రద్ధవహించక, సహజ వనరులపై ఇష్టానుసారం ఆధిపత్యం చూపడంతో పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చేందుకు, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, ఆర్థికాభివృద్ధి పేరుతో సహజ వనరులను ఎక్కువగా వినియోగించడంతో వాతావరణం కాలుష్యంతో భూగోళానికి ముప్పు ఏర్పడింది. మానవుడు ప్రకృతి నియమాలకు విరుద్ధంగా చేపట్టే కార్యకలాపాల వల్ల హరిత వాయువులు (గ్రీన్‌హౌస్ వాయువులు) విడుదలై భూగోళం వేడెక్కుతోంది. శిలాజ ఇంధన దహన ప్రక్రియ, వ్యవసాయ అవశేషాలను మండించడం, రసాయన ఎరువులు- మోటార్ వాహనాలు- గృహోపకరణాల వినియోగం వల్ల కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, మీథేన్, నైట్రేట్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్ లాంటి వాయువులు విడుదలై, గ్లోబల్ వార్మింగ్ (భూతాపం), ఓజోన్ పొర క్షీణత, ఆమ్లవర్షాలు లాంటి దుష్ఫలితాలు తప్పడం లేదు. ఫలితంగా జీవరాశిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
భూతాప ప్రక్రియ వల్ల ఉష్ణోగ్రతలో మార్పు జరిగి మంచు కొండలు కరగడం, తీరప్రాంతాలు ముప్పునకు గురికావడం, అకాల వర్షాలు, దుర్భిక్షం అనివార్యమవుతున్నాయి. ఆవరణ వ్యవస్థలు, ఆహార శృంఖలాలు దెబ్బతినడం, జీవవైవిధ్యం క్షీణించడం, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి తగ్గడం, రుతుపవన వ్యవస్థలో మార్పులు మనకు అనుభవం అవుతున్నాయి. ఆమ్లవర్షాల వల్ల పురాతన కట్టడాల జీవితకాలం తగ్గిపోతోంది. భూసారం తగ్గి పంట నష్టం జరుగుతోంది. ఓజోన్ పొర క్షీణతతో ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలు భూమిపై విడుదలై జీవజాతుల మనుగడపై ప్రభావం చూపుతున్నాయి. అభివృద్ధిపేరుతో చేపట్టే పారిశ్రామీకరణ, గనుల తవ్వకం, ప్రాజెక్టుల నిర్మాణం, అణురియాక్టర్ల నుండి రేడియో థార్మిక వ్యర్థాలు, పొలాల్లో రసాయనాలు విచ్చలవిడిగా వాడడం, పోడు వ్యవసాయంతో భూవనరులపై ఒత్తిడి పెరిగి వాతావరణం కలుషితమవుతోంది. పట్టణాలు, నగరాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, వాహనాల పొగ, అడవుల నరికివేత, ప్లాస్టిక్ వినియోగం వల్ల వాతావరణం దెబ్బతింటోంది. భారత్ ఇప్పటికే గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారంలో చైనా, అమెరికా, యూరప్ తరువాత ప్రపంచంలోనే నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూ భూగోళ ఉష్ణోగ్రతలను నివారించడాన్ని ప్రపంచ దేశాలన్నీ ప్రాథమిక బాధ్యతగా భావించాలి. ఇందుకు పర్యావరణహిత కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది. రసాయన ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువుల వాడకం పెరగాలి. పంట మార్పిడి పద్ధతిని ప్రోత్సహించి పోడు వ్యవసాయాన్ని అరికట్టాలి. రేడియో ధార్మిక వ్యర్థాలను ప్రత్యేక పరిసరాలలో ఉంచి నిర్వీర్యపరచాలి. నేల క్రమక్షయాన్ని అరికట్టడానికి సామాజిక అడవుల పెంపకంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. గృహాల నుంచి వెలువడే వ్యర్థాలను సేకరించి పునఃచక్రీయ ప్రక్రియ ద్వారా తిరిగి వినియోగించుకోవాలి. భూగర్భ జలాల వినియోగంపై శ్రద్ధవహించి వాటర్‌షెడ్ ప్రాజెక్టులు నిర్మించాలి. ప్లాస్టిక్ సంచులను నియంత్రిస్తూ జనపనారతో తయారుచేసిన సంచులను వాడాలి.
2015 నాటి ‘పారిస్ ఒప్పందానికి’ అనుగుణంగా భూతాపంలో పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువకు పరిమితం చేయాలనే ఒప్పందానికి అన్ని దేశాలు కట్టుబడాలి. ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. అమెరికా దీనిపై పునస్సమీక్షించాలి. పారిశ్రాక దేశాలు స్వచ్ఛందంగా గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలను నియంత్రిస్తూ ‘కార్బన్ ట్రేడింగ్’ విధానాలను అనుసరించాలి. శిలాజ ఇంధనాలకు బదులు సాంప్రదాయేతర ఇంధన వనరులు ప్రోత్సహించాలి. పర్యావరణ అనుకూలమైన సాంకేతిక పరిజ్ఞానం అన్ని దేశాలకూ అందాలి. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లలో ప్రియాన్ గ్యాస్‌కు బదులు ద్రవ నైట్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడాలి. పర్యావరణ మోటర్ వాహనాలను వాడుతూ జీవ ఇంధనాల వినియోగాన్ని అధికం చేయాలి. ముఖ్యంగా ప్రజారవాణా వ్యవస్థను ప్రోత్సహించాలి. సౌరశక్తి, పవనశక్తి వంటి ప్రత్యామ్నాయ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. పర్యావరణ సమాచార వ్యవస్థను వినియోగిస్తూ సహజ వనరుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి దుర్వినియోగాన్ని అరికట్టాలి. అప్పుడే- భవిష్యత్ తరాల అభివృద్ధికి సహజ వనరులు అందుబాటులో ఉంటాయి. ఫలితంగా సుస్థిర అభివృద్ధి కల సాకారమవుతుంది.

-సంపతి రమేష్ మహారాజ్ 99595 56367