సబ్ ఫీచర్

పౌరులకు బాధ్యతల్లేవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అలాగని ప్రజలు విచ్చలవిడితనంతో వ్యవహరించేందుకు వీల్లేదు. ముందుగా ఏర్పరచుకున్న నియమాలు- నిబంధనలు, మర్యాదలు- మన్ననలను ఆదరించాలి. అప్పుడే దానికి అర్థం.. ప్రజాస్వామ్యానికి పరమార్థం. దీనే్న బాధ్యత అంటారు. నేనొక్కడినే ఓటేయకపోతే ఏమవుతుందన్నట్టుగానే నేనొక్కడినే బాధ్యతను నిర్వర్తించకపోతే ఏమవుతుంది? నేనొక్కడినే క్రమశిక్షణను పాటించకపోతే, నిబంధనలు అతిక్రమిస్తే ఏమవుతుంది? అన్న మనస్తత్వం ప్రబలినప్పుడు ప్రజాస్వామ్యానికి ప్రమాదమే తప్ప ప్రమోదం కాదు.
ప్రపంచమంతటా నగరాలు, మహానగరాలు పెరుగుతున్నాయి. అంటే ప్రజలు అక్కడ కేంద్రీకృతమవుతున్నారు. ‘మంది పెరిగితే మజ్జిగ పలచన’ అన్నట్టు పౌర సౌకర్యాలు ప్రజాస్వామ్యంలో ఉండరాదు. పౌరుల సంపదతో, పన్నులతో పరిపాలన సాగుతున్నప్పుడు సరైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాల్సిందే! కాని పాలకులు, పాలితులు ప్రజలే కావడంతో కనిపించాల్సిన ‘సన్నని పొర’ అదృశ్యమవడంతో చాలా సందర్భాల్లో అరాచకం ఏర్పడుతోంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్, దాన్ని ఆనుకుని ఉన్న సికిందరాబాద్ నగరాలనే తీసుకుంటే సవాలక్ష సమస్యలు కనిపిస్తాయి. వీలైన వాటిని పరిష్కరించినా సరికొత్తవి తన్నుకొస్తుంటాయి. ఎవరి వల్ల?- ప్రజల వల్లే? ఈమాట కాస్త కఠినంగా అనిపించినా వాస్తవమదేకదా? పౌరులు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే సమస్యలెందుకు తాండవిస్తాయి?
జంట నగరాల్లో జనాభా పెరగడంతో పౌరులకు అందాల్సిన సౌకర్యాలు సరైన రీతిలో అందకపోవడంలో ఆశ్చర్యం లేదు! ముఖ్యంగా ట్రాఫిక్, కాలుష్యం సమస్యల బారిన పడని వారుండరు. కాలినడక బాట (్ఫట్‌పాత్)లను ఉపయోగించేవారి బాధలు వర్ణనాతీతం. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి, జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న వారూ ప్రజలే! వారు వ్యాపారస్తులు కావచ్చు, వాణిజ్యవేత్తలు కావచ్చు. చిరు వ్యాపారులు కావచ్చు... కాలిబాటలను ఆక్రమించి తమ ‘పని’చేసుకోవడం ‘జన్మహక్కు’గా భావించేవారూ ఉన్నారు. ఈ వైఖరిపై కొంతమంది చైతన్యవంతులైన పౌరులు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఎన్నో మార్లు పురపాలక అధికారులకు మొట్టికాయలు వేసింది. కాలిబాటలు పాదచారులు మా త్రమే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. ఆ వేడిలో జీహెచ్‌ఎంసీ అధికారులు దశాబ్దాల అరాచకం అనంతరం ఇటీవల కొన్ని ‘ఆక్రమణలు’ తొలగించారు. ఫుట్‌పాత్‌లపై వున్న కట్టడాలను కూల్చారు. అలా ఆ ‘డ్రైవ్’ కొనసాగింది. ఇలాంటి సందర్భాల్లో స్థానిక కార్పొరేటర్లు, ప్రధాన పార్టీల నాయకులు అడ్డుకోవడం, అధికారులను హెచ్చరించడం, కొన్ని సందర్భాల్లో రౌడీమూకలు సిబ్బందిపై దా డులు చేసిన సంఘటనలూ ఉన్నాయి. విచిత్రమేమిటంటే ప్రజలే ఎన్నుకున్న కార్పొరేటర్లు ఆక్రమణలకు వత్తాసు పలకడం. రకరకాలైన లాజిక్కులతో మాట్లాడటం, వీలైతే వారే ఆక్రమణలను ప్రోత్సహించడం షరా మామూలే!
జంట నగరాల్లో ఏమాత్రం ఖాళీ స్థలం కనిపించినా, విశాలమైన రోడ్డు.. ఆ పక్కన ఫుట్‌పాత్ కనిపించినా అనుమతుల్లేని అనేక కట్టడాలు పుట్టుకొస్తాయి, తాత్కాలిక వ్యాపారం పేర ‘డబ్బాలు’ వెలుస్తాయి. మందబలం, కార్పొరేటర్ వెన్నుదన్ను ఉంటే పర్మినెంట్ కట్టడం రాత్రికి రాత్రే వెలుస్తుంది. ఇలాంటి కేసులు జంట నగరాల్లో కోకొల్లలు... ఎవరైనా నిజాయితీ అధికారి నిబంధనలు పాటించి ఏదైనా ఒక ఆక్రమణను తొలగిస్తే సాయంత్రానికి అతని చేతిలో ‘ట్రాన్స్‌ఫర్’ కాగితం ప్రత్యక్షమవుతుంది. దాంతో ఆ తొలగింపు తిరిగి ప్రత్యక్షమవుతుంది. రెచ్చిపోయి రెండు మూడు అంతస్తులకు వెళుతుంది ఆ అక్రమ కట్టడం. ఎప్పుడో అప్పుడు ‘‘రెగ్యులరైజేషన్ స్కీం’’ రాకపోతదా.. ఎంతోకొంత డబ్బు చెల్లించి దాన్ని రెగ్యులరైజ్ (చట్టబద్ధం) చేసుకోకపోతామా? ఈ మనస్తత్వం స్వైరవిహారం చేస్తూ జంటనగరాలు మురికి కూపాలుగా మారుతున్నా అధికారంలోకి వచ్చే ఏ పార్టీ నాయకులైనా ‘‘ఓట్ల తులాభారం’’ కోణంలో ఆయా అంశాలను చూడ్డం అలవర్చుకున్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యం, పన్నులు, వాటి ద్వారా సేవలు, ఆ సేవలను మెరుగుపరిచి ప్రపంచస్థాయి పౌరులుగా ‘తన’ ప్రజలను తీర్చిదిద్దాలన్న ‘యావ’ ఉన్నా.. ఓ ‘విషవలయం’లో చిక్కుకుని ఊపిరాడక ఆ పూట గడిస్తే చాలనుకునే మనస్తత్వం అటు పాలకుల్లో, ఇటు అధికారుల్లో బలంగా నాటుకుంది. కాలి బాటల ఆక్రమణ.. ముస్సిపల్ సిబ్బంది.. అధికారి.. వారిపై రాజకీయ నాయకుడు.. మంత్రి.. పోలీసువారు అంతటా ప్రజలే... అయినా వారి వారి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వహిస్తున్నారా? అన్నది కోటి రూకల ప్రశ్న.
ముఖ్యంగా సామాన్య ప్రజలు ఓట్లు వేస్తున్నారు కాబట్టే నాయకులు మంత్రులవుతున్నారు. అందుకే వారికన్నా తామే బలవంతులం కనుక తామేమి చేసినా చెల్లుబాటు కావాలని కోరుకునే ‘‘గుంపు మనస్తత్వం’’ విచారకరం. వీటన్నింటిని నియంత్రించే, మనమే ఆమోదించిన, సూచించిన నియమ నిబంధనలున్నయన్న విషయాన్ని విస్మరించి విశృంఖలంగా వ్యవహరించడంతో సమస్యల సర్పాలు బుసలుకొడుతున్నాయి.
‘అతిక్రమణల్లో, ఆక్రమణల్లో, అన్యాయం చేయడంలో గల కిక్కే వేరప్పా’ అని రెచ్చిపోతే ప్రజాస్వామ్యం ఎక్కడుంటుంది? అప్పుడు ప్రజలే ప్రభువులు ఎలా అవుతారు? ప్రజలు ఏర్పరచుకున్న నిబంధనలు, నియమాలు అతిక్రమించి వీరంగం వేసి, మందబలంతో, గుంపు మనస్తత్వంతో ఊరేగితే మిగిలేది ఏమిటి?.. ఇది ప్రజల బాధ్యత అనిపించుకుంటుందా?
ప్రజలు తమ బాధ్యతల్ని, హక్కుల్ని సరిగా బేరీజు వేసుకుని ప్రవర్తిస్తే ఆధునిక ప్రజాస్వామ్యానికి మించిన ‘స్వర్గం’ మరొకటి కనిపించదు. రాజులు, చక్రవర్తులు, భూస్వాములు, జాగీర్దార్లు నిరంకుశులుగాక పగ్గాలు ప్రజల చేతికే లభించినప్పుడు పరమ సంతోషంతో సమాజాన్ని స్వర్గంగా తీర్చిదిద్దే సదవకాశం లభించినందుకు సంతోషించాల్సింది పోయి.. దాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాం. తిలా పాపం తలా పిడికెడు అన్నచందంగా అందరం ఇందుకు బాధ్యులమే.
‘్ఫర్త్ ఎస్టేట్’గా భావించే మీడియా సైతం అగ్నికి ఆజ్యం పోసిన సందర్భాలూ కనిపిస్తాయి. ఎవరి ప్రయోజనాలు.. ‘ప్రయోగాలు’ వారివి. నిబంధనల ప్రకారం జీహెచ్‌ఎంసీ అధికారులు ఏదైనా ఆక్రమణ తొలగిస్తే మీడియా మాత్రం అధికారుల నిజాయితీని సమర్ధించి నైతిక బలం చేకూర్చకుండా, ‘మనో భావాలు’ దెబ్బతిన్నాయని ఇల్లెక్కిన వారి మాటలకే ప్రాధాన్యతనిస్తూ పదే పదే ప్రసారం... ప్రచారం చేస్తే ఏమిటి అర్థం?... ఫలానాచోట ఆక్రమణ జరిగిందని రాయడం... ప్రసారం చేయడంతోపాటు ఆ ‘కొలబద్ధ’ప్రకారమే ఆక్రమణలను తొలగించినప్పుడు మీడియా ‘‘కొలబద్ధ’’ ఎలా ఉండాలి?... ప్రజాస్వామికంగానూ, ప్రజల జీవన విధానం మెరుగుపరిచేందుకు దోహదపడేదిగానూ, నియమ నిబంధనలకు బలం చేకూర్చేదిగానూ ఉండాలి. అలాగాక నిబంధనలు అతిక్రమించే గుంపు వైపు నిలిస్తే ఎలా? సంయమనం లేకపోతే ఎలా?... దురదృష్టవశాత్తు ఆ సానుకూల సన్నివేశం కనిపించడం లేదు. అంతా ఒక ‘‘విషవలయం’’. చివరికి బలవుతున్నదీ సాధారణ ప్రజలే! మందబలం... గుంపు మనస్తత్వంతో తామేమి చేస్తే దాన్ని ఆమోదించాలి... నిబంధనలు... నియమాలు జాన్తానై అంటే... ఇక ప్రజాస్వామ్యం ఎందుకు? పౌర పాలన ఎందుకు? మనది ప్రపంచ నగరి అని గొప్పలు పోవడం దేనికి?...
ప్రపంచ నగరం... గ్లోబల్ సిటీ... అంటే ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపిస్తే.. ఎక్కడ అనుకూలమైతే అక్కడ అక్రమ కట్టడాలు నిర్మించి, రెగ్యులరైజేషన్ కోసం ఒత్తిడి తెచ్చి, ఓట్లకోసం పాలకులు రెగ్యులరైజేషన్ సౌకర్యం కల్పించి అలాంటి ఆక్రమణలను, అక్రమాలను చట్టబద్ధం చేస్తే జంట నగరాలు గ్లోబల్ సిటీల సరసన చేరుతాయా? నిర్దిష్టమైన, నికార్సైన, నిజాయితీగల పాలసీ (విధానం) తీసుకొచ్చి నిక్కచ్చిగా వ్యవహరించి నియమ నిబంధనలకనుగుణంగానే నిర్మాణాలు జరిగితే, కాలిబాటల ఆక్రమణలు తొలగిస్తే, అలా తొలగించినప్పుడు ‘‘దురదృష్టకరం’’ అన్న మాటలకు తావులేకుండా నిబంధలకు విరుద్ధమైనది ఏదైనా, చివరికి దేవుడి గుడైనా, మరొకటైనా తొలగించినప్పుడే నిజమైన గ్లోబల్ సిటీ అవుతుంది తప్ప గల్లీ గల్లీకో పది పనె్నండు అక్రమ నిర్మాణాలు కనిపిస్తే 40 చదరపు అడుగుల స్థలంలో నాలుగంతస్తులు నిర్మించి, రోడ్డుపైనే మెట్లు కట్టి, ఆ ఇళ్ళ వాహనాలు రోడ్డుపై పెట్టి ఇతరులు నడవరాకుండా చేస్తే, రోడ్డు, ఫుట్‌పాత్‌లు మందబలంతో ఆక్రమించి, కార్పొరేటర్లు ప్రోత్సహించి, అడ్డదిడ్డంగా విస్తరిస్తే విషాదమే గానీ ‘విజ్ఞత’ అనిపించుకోదు.

-వుప్పల నరసింహం 99857 81799