సబ్ ఫీచర్

జాడ లేని విద్యార్థి ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో విద్యార్థి ఉద్యమాలు మరి ముఖ్యంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళనలు బలహీన పడటం అటు రాజకీయంగా, ఇటు సామాజిక పరంగా వాంఛనీయం కాదు. చదువుతో పాటు దేశభక్తి, సమాజాభివృద్ధి, సేవాతత్పరతను విద్యార్థులు పెంపొందించుకోవాలి. ప్రభుత్వాల తప్పుడు విధానాలను తిప్పికొట్టేందుకు బలమైన విద్యార్థి ఉద్యమాల అవసరం ఉంది. ప్రభుత్వాల వింత పోకడల వల్ల ఆర్థికవ్యవస్థ దెబ్బతినడమేకాక ఉపాధి సైతం కోల్పోయే పరిస్థితులు నేడు ఏర్పడ్డాయి. అటువంటి సందర్భాలలో ప్రభుత్వాలను గాడిలో పెట్టడానికి బలమైన విద్యార్థి ఉద్యమాలు నిర్మించాలి. విద్యావిధానంలో మార్పుల ఫలితంగా విద్యార్థి ఉద్యమాలు నీరుగారాయి. విద్యార్థుల్లో పూర్వపుచైతన్యం కొరవడింది. స్వాతంత్య్రానికి ముందు, తరువాత కూడా దేశంలో బలమైన విద్యార్థి ఉద్యమాలు నడిచాయి. రాజకీయ మార్పులకు, సమసమాజాభివృద్ధికి అవి ఎంతో ఉపయోగపడ్డాయి.
గతంలో విద్యార్థులు అనేక ఉద్యమాలు సమర్థవంతంగా నిర్వహించి ఎన్నో విజయాలు సాధించారు. అటు రాజకీయ నాయకులకు, ఇటు సమాజానికి ఆదర్శంగా నిలిచారు. అన్ని రాజకీయ పార్టీలలో పేరు గడించిన నాయకులందరూ విద్యార్థి ఉద్యమాల నుంచే వచ్చారు. సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నప్పటికీ వారు నైతిక విలువలతోకూడిన రాజకీయ నాయకులుగా ఎదిగారు. ముఖ్యంగా వామపక్ష విద్యార్థి ఉద్యమ నేపథ్యం కలిగినవారు కులమతాలకు అతీతంగా సామాజిక చైతన్యం కలిగినవారుగా ఎదిగారు. అనేక విద్యార్థి సంఘాలు క్రియాశీలకంగా ఉండటం, పోటీ వాతావరణం వల్ల విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అబ్బాయి. రాజకీయ పరమైన, సామాజిక పరమైన సమస్యలను ఎదుర్కొనే సమర్థులుగా విద్యార్థులు తయారయ్యేవారు. ఉత్తమశ్రేణి నాయకత్వం తయారవడానికి విద్యార్థి సంఘాలు దోహదపడతాయి. ఆ దశలో వారికి కుల, మత వ్యత్యాసాలు తెలియవు. అభ్యుదయ భావాలు అలవర్చుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సమాజం పుట్టుక, పరిణామక్రమం, కులాల ఆవిర్భావంలో చారిత్రక నేపథ్యం, మానవతా విలువలు, సాటి మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి అనేక అంశాలను ఆయా పార్టీల పెద్దలు వివరించేవారు.
విద్యావ్యవస్థ, బోధనలో వచ్చిన మార్పులు, కుప్పలు తెప్పలుగా ఏర్పడిన కాలేజీవల్ల కాలక్రమంలో విద్యార్థి ఉద్యమాలు బలహీనపడ్డాయి. విద్యాబోధనలో నాణ్యత కూడా తగ్గింది. కాలేజీ యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానాల వల్ల విద్యార్థులలో చదువు తప్ప ఇతరత్రా చైతన్యం నశించింది. అటు రాజకీయం, ఇటు సామాజిక అంశాల పట్ల అవగాహన కూడా తగ్గింది. ఫీజుల పేరుతో సర్ట్ఫికెట్లను కూడా ఇవ్వకుండా వేధిస్తున్న కాలేజీ యాజమాన్యాల తీరుకు నిరసన తెలిపే పరిస్థితులు కూడా నేడు లేవు. పరిస్థితులు అంత దయనీయంగా మారిపోయాయి. వామపక్ష రాజకీయ పార్టీలు కూడా విద్యార్థి ఉద్యమాలను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఆ ప్రభావం వామపక్ష పార్టీల ఎదుగుదలపై స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థి సంఘాలను ఈ విధంగా వదిలివేస్తే ఆ పార్టీలు బలహీనపడటమే కాకుండా సమాజానికి ముప్పు తప్పదన్న విషయాన్ని ఆయా పార్టీల పెద్దలు గ్రహించవలసి ఉంది.
విద్యార్థి సంఘాలు, ఉద్యమాలు ఎప్పుడైతే బలహీనపడ్డాయో అప్పటినుంచి రాజకీయాల్లోకి వచ్చే యువత సంఖ్య తగ్గిపోయింది. ఉత్తమ నాయకత్వం కొరవడింది. రౌడీలు, గూండాలు, వ్యాపారవేత్తలు, కులాల పేరుతో రెచ్చగొట్టేవారు రావడం మొదలై రాజకీయాలు పూర్తిగా కలుషితమయ్యాయి. ప్రజాసేవ కంటే, ధనం దండుకోవడానికే ప్రాధాన్యత పెరిగింది. విలువలు పూర్తిగా దిగజారిపోయాయి. సామాజికపరంగా కూడా విద్యార్థుల్లో చైతన్యం, అవగాహన పూర్తిగా తగ్గిపోయాయి. విద్యార్థి దశలోనే వారు కులాలకు ప్రాధాన్యత ఇస్తూ మానసికంగా కలుషితమవుతున్నారు. సామాజిక స్పృహ లేకుండాపోతోంది. వౌలిక వసతులు, అర్హత కలిగిన బోధకులు లేకుండా ఇబ్బడిముబ్బడిగా వృత్తివిద్య కళాశాలలు పెరిగిపోవడం కూడా ఇటువంటి మార్పులు రావడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
1936 నుంచి దేశంలో విద్యార్థి ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని జేఎన్టీయూ నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా, విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వరకు అనేక విద్యాసంస్థలు పలు ఉద్యమాలకు వేదికలుగా నిలిచాయి. రాజకీయ ఉద్యమాలతోపాటు శాస్ర్తియ విద్యావిధానం అమలుకు, స్ర్తివాదం బలపడటానికి, దళిత, బహుజన, కులాతీత, మతాతీత ఉద్యమాలు అనేక నిర్వహించారు. విశ్వజనీన భావన ఏర్పడటానికి అవకాశం ఏర్పడింది. నేడు ఆత్మహత్యలు, పరువు హత్యలు, అరాచకశక్తుల ఆగడాలకు విద్యార్థినులు బలి అవుతున్నారు. ఏనాడైతే విద్యార్థి ఉద్యమాలు బలపడతాయో ఆనాడే ఇటువంటి చర్యలకు చెక్ పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. అన్నిస్థాయిల్లో విద్యార్థి ఉద్యమాలను నిర్మించి, సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉంది. ఇందుకు రాజకీయ రంగంలోని మేధావులు సరైన దిశా నిర్దేశం చేయాలి.

-శిరందాసు నాగార్జున 94402 22914