సబ్ ఫీచర్

చేనేతకు చేయూత అందేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్భుతాలకు నిలయమైన భారతదేశంలో తరతరాలుగా ఎన్నో కళలు వారసత్వ సంపదగా వర్థిల్లుతూ వచ్చాయి. ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వరకు నాగరికతతోపాటు విలసిల్లుతూ తమ ప్రత్యేకతను నిలుపుకున్నాయి. చిటికి పద్ధతితో తయారైన వస్త్రాలను ఆనాటి రాజులు కూడా బాగా ఆదరించారు. ఇప్పటికీ కొన్ని మ్యూజియాలలో అప్పటి వస్త్రాలు కనిపిస్తున్నాయంటే వాటి ప్రత్యేకతేంటో అర్థంగాక మానదు.
తెలంగాణాలో హైదరాబాద్, పోచంపల్లి, పుట్టపాక, కొయ్యలగూడెం, ఘట్టుప్పల, యల్లంకి, సిరిపురం, ఆలేరు, జనగాం, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, గద్వాల, దేవరకద్ర తదితర ప్రాంతాలలో నేత మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. పారిశ్రామిక విప్లవం రాకమునుపు చేనేతకు గిరాకీ మహాద్భుతంగా ఉండేది. ప్రపంచంలోనే మన భారతీయుల నైపుణ్యత ఆకర్షణీయంగా వున్నదనడంలో ఎలాంటి అవాస్తవం లేదు. పద్మశాలీలు (నేతకానీ)వర్గం ఎవరికివారు తమ నైపుణ్యతను ప్రదర్శించుకుంటూ రకరకాల వస్త్రాలను తయారుచేసేవారు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక్కడినుండే ఆచార్య వినోబాభావే భూదానోద్యమం ప్రారంభించి దేశవ్యాప్తంగా కొనసాగేలా చేసి, ఎంతోమంది భూమిలేని రైతుల పాలిట దేవుడయ్యాడు. అలాగే వస్తప్రరిశ్రమకు పుట్టినిల్లులాంటిది. ఇక్కడ తయారైన వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించేది. ఇక్కడ చీరలను నేయడం వారి ప్రత్యేకత. అందుకే వీరు వాటిని ప్రత్యేక హక్కుగా భావించారు. మొదట ప్రత్తినుండి నూలును వడికి, దారాలుగా చేసి, టై అండ్ డై పద్ధతిలో చీరలను నేసేవారు. కుటుంబమంతా అదే పనిలో నిమగ్నమై పనిని విభజించుకొని ఎవ్వరు చేయాల్సిన పనిని వారు చేసేవారు. మాస్టర్ వీవర్స్‌వద్ద ముడిసరుకును పొంది హ్యాండ్లూమ్స్‌ను ఉపయోగించి వీవర్స్ చీరలు నేయడం జరిగేది.
అప్పుడప్పుడే పారిశ్రామికాభివృద్ధి చెందుతున్న సమయంలో హ్యాండ్లూమ్స్ కనుమరుగవుతూ పవర్‌లూమ్స్ అందుబాటులోకి వచ్చాయి. మాస్టర్ వీవర్స్ ఒక చిన్న పరిశ్రమను ఏర్పాటుచేసుకుని అందులో కొన్ని పవర్‌లూమ్స్‌ను ఏర్పాటుచేసి, ముడిసరుకులను అందజేస్తూ వీవర్స్‌తో పనిచేయించడం జరిగేది. పరిణామక్రమంలో భాగంగా పారిశ్రామిక విప్లవం వేగంగా అభివృద్ధిచెందడంతో నూలు పరిశ్రమలు ఏర్పాటుచేయబడ్డాయి. అప్పటినుండి చేనేత కార్మికులకు కష్టాలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు.
పోచంపల్లి దాని చుట్టుప్రక్కలగల 100 గ్రామాల్లో 10,000 కుటుంబాలు చేనేతపై ఆధారపడి జీవనం కొనసాగించేవి. కుటుంబమంతా వస్తత్రయారీలో నిమగ్నమై మాస్టర్ వీవర్స్ వద్ద ముడిసరుకులు తీసుకొని ఒక్కరోజులో 12 నుండి 15 గంటలు పనిచేస్తూ, అలా 50 రోజులు కష్టపడితే 8 చీరలను నేసేవారు. చేనేతలో ఎక్కువ రంగులు, డిజైన్స్ వుండవు గానీ నాణ్యతలో ముందుంటాయి. ఎప్పుడైతే నూలుమిల్లులు వెలసి రంగురంగుల వస్త్రాలు మార్కెట్లలో అతి చౌకగా లభించడం మొదలుపెట్టాయో, చేనేత వస్త్రాలకు క్రమంగా ఆదరణ కనుమరుగవుతూ వచ్చింది.
మొదట యూరప్‌లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం క్రమంగా ప్రపంచమంతటా వ్యాపించి కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారిపై గుదిబండగా మారిందని చెప్పవచ్చు. చేసేదేమి లేక చేనేత కార్మికులు తాము తయారుచేస్తున్న వస్త్రాలకు అంతగా గిరాకీ లేకపోవడంతో, కుటుంబాలను పోషించుకోవడానికి పట్టణాలకు వలసలుగా వెళ్ళి నూలు పరిశ్రమలో కార్మికులుగా చేరడం జరిగింది. పట్టణాలలో కార్మికులు పడే కష్టాల గురించి వేరే చెప్పనక్కర్లేదు. అందరికీ తెలిసిందే. అలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నారనడంలో ఎలాంటి అవాస్తవం లేదు.
చేనేతపై ఆధారపడిన చాలా కుటుంబాలు ఎక్కడికీ వెళ్ళలేక, ఇప్పటికీ చేనేత వస్త్రాలను తయారుచేస్తూ, దళారుల చేతిలో సైతం మోసపోతూ నానా కష్టాలపాలవుతున్న కార్మికులెందరో వున్నారు. దినదినాభివృద్ధి జరుగుతున్నా మిల్లునుండి తయారైన వస్త్రాలనేగాకుండా అధిక ధర వెచ్చించి, చేనేత వస్త్రాలను సైతం ఇష్టపడేవారున్నారు. కొన్ని సందర్భాల్లో యంత్రాలనుపయోగించి వేయలేని డిజైన్స్ చేనేత ద్వారా వీలుపడుతుంది. అలాంటప్పుడు వస్త్రప్రియులు కొంతమంది తమకు ఎలాంటి చీర కావాలో, ఏయే రంగులు వాడాలో, ఎలాంటి డిజైన్స్‌తో ఉండాలో ముందుగానే వారి అభిరుచిని వ్యక్తపరుస్తూ దానికి తగినట్లుగా తయారుచేయించుకుంటారు. అంతా బాగానేవున్నా ఇక్కడ గమనించాల్సిన విషయం ఉన్నది. నేడు ఏ శుభకార్యం తలపెట్టాలన్నా ముందుగా నూతన వస్త్రాలను తీసుకోవాల్సిందే. ఇంకా ఎలా తయారయ్యారంటే మహిళాలోకం ఎవ్వరూ కట్టలేని చీరలను, మొదటగా తామే కట్టాలని తాపత్రయపడుతూ వస్త్రాల షాపుల యాజమాన్యంతో ముందుగానే తెలియజేస్తారు. వీరు మాస్టర్ వీవర్స్‌కు కావాల్సిన ముడిసరుకులు అందజేసి, తమకు కావాల్సినవి చెప్పుకోవడం, మాస్టర్ వీవర్స్‌తో నేయించడం, వాటిని యాజమానులు అధిక ధరకు అమ్ముకోవడం, ఏదో కొంత సొమ్మును తయారుచేసిన వారికి ఇవ్వడం, లేదంటే ఇవ్వకపోయినా వారిని చేసేదేమి లేదు. ఎందుకంటే అలా ఎగబెట్టిన సందర్భాలు సైతం కోకొల్లలున్నాయి, ఎందుకిలా అని ఎవరన్నా ప్రశ్నిస్తే సరైన గిరాకీలేదని, నేను పెట్టిన పెట్టుబడి నిమిత్తం అప్పుగాతెచ్చిన అసలు కాస్తా వడ్డీలతో అధికమవుతుందని తప్పించుకున్న సందర్భాలున్నాయి.
వస్త్రాల తయారీ విధానంలో కుటుంబమంతా గడపడం, మరే విధమైన ఆర్థిక వనరులు లేకపోగా వీటిపైననే ఆధారపడటం, వివిధరకాలైన రసాయనాలు, రంగులు వాడటం మూలంగా అనారోగ్యాల పాలుగావడం, కుటుంబానే్న కలిచివేసే విధంగా ఉంటాయి. ఇలాంటి సమస్యలు గుర్తించి, కోఆపరేటివ్ సంస్థలు ఏర్పాటు చేసుకొని దానిద్వారా ముడి సరుకులు, అప్పుడప్పుడు లోన్స్ పొందుతూ తయారుచేసిన వస్త్రాలను సైతం సంస్థకే అప్పగించడం, ఈ కోఆపరేటివ్ సంస్థ వివిధ పట్టణాలలో, నగరాలలో ఆప్కో సెంటర్లను తెరిచి, అందరికీ చేనేత వస్త్రాలను అందుబాటులోకి తెచ్చి, చేనేతకు ఒకింత ఆసరాగా నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. కానీ ప్రభుత్వం సైతం ఆలోచించి, వారి సమస్యలకు పరిష్కారమార్గం ఒక్కటే చూపకుండా, వారికీ ఎలా చేయూతనివ్వాలి. ఎలా ఆదుకోవాలని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రభుత్వం సైతం చేనేత కార్మికులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి వారి అభివృద్ధికి తోడ్పాటునివ్వాల్సిన అవసరం ఉన్నది.
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం సైతం ప్రతినెలా ఆసరా పింఛన్‌వలే కొంత సొమ్మును చెల్లిస్తుంది. వారి సంక్షేమంకోసం పలురకాల కార్యక్రమాలు చేపడుతూ, వారికి ఆర్థిక భరోసానివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్న బతుకమ్మ పండుగకు, ఆడపడుచులకు చీరల పంపిణీ కొనసాగిస్తున్నది. ఇకమీదట చేనేతతో తయారుచేసిన నాణ్యతగల చీరలను అందించాల్సిన అవసరం వున్నది. అలాగే సన్మాన కార్యక్రమాల్లో ఉపయోగించే కండువాలను సైతం ప్రభుత్వం చేనేతలవద్ద నుండే కొనుగోలు చేయాలి. అలాగే వారి సంక్షేమానికై సబ్సిడీకి వివిధ లోన్ సౌకర్యాలు కల్పించాలి. మరియు వారికి కావాల్సిన యంత్రాలను సైతం ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఎలాంటి అనారోగ్యాల బారినపడిన, ఉచిత వైద్య సౌకర్యాలను కల్పించే బాధ్యత ప్రభుత్వంపైననే ఉన్నది. దేశంలో పలువురి మేలు కోరే ధనవంతులు సైతం చేనేత వస్త్రాలనే కొనుగోలు చేస్తూ వారిని ఆదుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. అందుకే ఆ దిశగా నడవాలని కోరుకుందాం.

- డా. పోలం సైదులు.. 94419 30361