సబ్ ఫీచర్

ఆధునిక జీవన శైలితో అనారోగ్యాల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్యవంతమైన జీవన అలవాట్లను పెంపొందించుకోవడం వల్ల మనిషి ఆయుష్షు పరిమితి పెరుగుతుంది. ఆరోగ్యం అనేది మానవ హక్కు. మానసిక ఆరోగ్యం పెంపొందించుకుంటేనే ఎవరైనా శారీరకంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో కాలంతోపాటు పరుగులు తీస్తూ మనిషి కూడా ఒక యంత్రం వలే మారిపోయాడు. మనిషి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదన వేటలో పడి, టార్గెట్ల సాధనలో పరుగులు తీస్తూ ఉన్నాడు. మానసిక ఆరోగ్యానికి తన జీవన గమనంలో సమయం కేటాయించక శారీరక దృఢత్వాన్ని కోల్పోతున్నాడు. విలాసవంతమైన జీవన విధానంలో విహరిస్తూ చిన్నచిన్న సమస్యలను సైతం పరిష్కరించలేని స్థాయికి పడిపోతున్నాడు. ముఖ్యంగా నేటి యువత నిరాశా నిస్పృహలతో మానసిక ఆందోళనకు గురై అనారోగ్యం పాలవుతోంది.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఎంత సంపాదించినప్పటికీ ఆరోగ్యంగా లేకపోతే సంపాదనంతా వృథాయే. ‘ఇతరులను నవ్వుతూ పలకరించు, ఇతరులతో ప్రేమగా మాట్లాడు, అందరికీ ఆత్మీయతను పంచు..’ ఇదే ఆరోగ్యానికి ఏకైక సూత్రం. సాంకేతికత రంగంలో అన్ని విధాలుగా దూసుకెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పనులను సులభంగా చేసుకుంటూ, జీవనశైలి ఎంతో సుఖమయంగా మారింది. టీవీ రిమోట్ నుండి స్మార్ట్ఫోన్ వరకు అన్ని పనులు చేతులపై జరగటం వలన శారీరక శ్రమకు చాలామంది దూరమవుతున్నారు. జీవనశైలి ఎంతగా మారుతోందో వ్యాధులకు కూడా అదే రీతిలో గురవుతున్నాము. శారీరక శ్రమ కలిగించే పనులు చేయకపోవటం, ఒత్తిడి, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, మత్తుపానీయాలు, ధూమపానం, కాలుష్యం కారణంగా వ్యాధులకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది.
టెక్నాలజీ మూలంగా ఎలక్ట్రానిక్ పరికరాలు మన అవసరాలను తీర్చటమే కాకుండా మన చుట్టూ ఉండే వాతావరణంలో ప్రవేశించి మన జీవన శైలిలో గణనీయమైన మార్పులకు కారణమయ్యాయి. ఇవి మన జీవన శైలిని సులభతరంగా మార్చినప్పటికీ, శారీరకంగా అసమర్థులుగా మార్చుతున్నాయనడంలో సందేహం లేదు. ఫిజికల్ ఎక్సర్‌సైజులు లేకపోవడం వలన ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం మొదలైన రోగాలు వస్తున్నాయి. శారీరక శ్రమ తక్కువగాచేయటం వలన మెదడు కణాల పని తక్కువ అవటంతో ఒత్తిడి, ఉద్రిక్తతలకు లోనయ్యే అవకాశం కూడా ఉంది.
జంక్‌ఫుడ్‌కు దూరంగా..
జీవనశైలి మారడంతో వచ్చే వ్యాధులకు మరో కారణం- అనారోగ్యకర ఆహారపు అలవాట్లు. ప్రస్తుత కాలంలో చాలా మంది జంక్‌ఫుడ్ వైపు మొగ్గుచూపుతూ, శరీరానికి కావాల్సిన పోషకాల గురించి మర్చిపోయారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు కొవ్వు, ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ఇవి తక్కువ పోషకాలను కలిగి ఉండి, కేలరీలను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. ఆయిల్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలు, మాంసం, ఇతర ఆహార పదార్థాలు ప్రజలను లైఫ్‌స్టైల్ వ్యాధుల బారిన పడేలా చేస్తున్నాయి. ఇవేకాకుండా పనిలో ఒత్తిడి, జీవనశైలిలో మార్పు ఈ వ్యాధుల బారినపడటంతో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. తాజా పండ్లు, ఆకుకూరలు, తాజా కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు ఆరోగ్యకరమైన ఆహారంగా తీసుకొనవచ్చు.
మానసిక రుగ్మతలను జయించండి
జీవనశైలి వ్యాధులకు గురిచేసే కారకాలలో ఒత్తిడి కూడా ముఖ్యమైనది. ఒత్తిడి కారణంగా ఊబకాయం, మానసిక రుగ్మతలు, అల్జీమర్స్, జీర్ణాశయ సంబంధిత వ్యాధులు కలుగుతాయి. నిద్ర తీరులో మార్పు కారణంగా ఉద్రేకం లేదా నిద్రలేమి వలన మానసిక రుగ్మతలు ఎక్కువగా కలుగుతున్నాయి. ‘అడుసు తొక్కనేల.. కాలు కడగనేల’ అనే నానుడి చాలామందికి తెలిసే ఉంటుంది. అనారోగ్యం బారినపడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. పనిలో తీవ్రమైన ఒత్తిడి, మరోవైపు మత్తుపదార్థాలు, ధూమపానం వంటి అలవాట్ల కారణంగా కొందరు డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఫలితంగా కాలేయ వ్యాధులు, క్యాన్సర్లు వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. జీవనశైలి వ్యాధుల బారిన పడకముందే మేల్కొని, శారీరక శ్రమ, సమతుల ఆహారం తీసుకోవడం, ఒత్తిడి లేని ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించడం ఎంతో అవసరం.
ఆరోగ్యంగా ఉండాలంటే..
మానసిక దృఢత్వం వల్లనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఇందుకోసం యోగ, మెడిటేషన్ లాంటివి చేయాలి. ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ద్వారా అనారోగ్యాన్ని జయించవచ్చు. సహనం అలవరచుకోవాలి. పిల్లలలో దీన్ని చిన్నప్పటి నుండే పెంపొందించాలి. ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలపాటు శారీరక వ్యాయామం, పరుగు, నడక వంటివి చేయాలి. ప్రతి పనిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. సమయాన్ని సరైన ప్రణాళిక ద్వారా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. ప్రతిరోజూ కాసేపైనా సరదాగా గడపండి. కుటుంబ సభ్యులతో వారాంతాలలో కొత్త ప్రదేశాలకు వెళ్లి గడపండి. జీవనశైలి వ్యాధుల బారిన పడకముందే మేల్కొని, శారీరక పనులు (ఎక్సర్‌సైజ్), ఆరోగ్యకర ఆహారం (సమతుల ఆహారం) తీసుకోవడం, ఒత్తిడి లేని, ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించటం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. మానసిక ఆరోగ్యమే మనిషి ఆరోగ్యకరమైన జీవన విధానం.

-డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321