సబ్ ఫీచర్

కేసీఆర్ ‘హంగ్’ పాట.. కేంద్రంపై పెత్తనమట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్- లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ‘హంగ్’ వస్తుందనే పాట మొదలెట్టారు. తెలంగాణలో తమ పార్టీ 16 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంటే చాలట! కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో తెరాస ఎంపీలు కీలకమవుతారట. కేంద్రంపై ఇక పెత్తనం తమదేనట! కాబోయే ప్రధానమంత్రిని కూడా వారే నిర్ణయిస్తారట! ఓపీనియన్ పోల్స్ అన్నీ ఎన్‌డీఏ కనీస మెజారిటీతో ఆధిక్యం పొందుతుందని, మోదీ మరోసారి ప్రధాని అవుతారని చెబుతుంటే- కేసీఆర్, కేటీఆర్‌లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 16 ఎంపీ సీట్లు గెలిచి కేంద్రంలో శాసించడమెలాగో తెరాస అధినాయకులకే తెలియాలి.
చంద్రబాబు పుణ్యమాని గంపగుత్తగా ఓట్లుపడి కేసీఆర్‌కు 88 సీట్లు ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లభించాయి. మెజారిటీ దక్కినా, చాలా రోజులవరకు కేసీఆర్ తన మంత్రివర్గాన్ని ఏర్పరచకపోవడం, కాంగ్రెస్, తెదేపాల నుంచి తమ పార్టీలోకి శాసనసభ్యుల వలసలను ప్రోత్సహించడం.. ఇదంతా ప్రజాస్వామ్యమేనా..? తెరాసలోకి వచ్చే శాసనసభ్యులను రాజీనామా చేసి రమ్మని వుంటే హుందాగా వుండేది. కేసీఆర్ తన మంత్రివర్గంలో వొక్క మహిళకూ స్థానం కల్పించలేదు. ఇలాంటి నేతలు ఢిల్లీలో పాగావేస్తారట! కేసీఆర్ కుమార్తె కవిత తప్ప మరెవరికీ పాలనార్హతలు లేవా? ఇదేనా మహిళా సాధికారత? నియంతృత్వ వైఖరితో ప్రజాస్వామ్య పద్ధతులను తన చెప్పుకింద పెట్టుకునే కేసీఆర్ వైఖరి గర్హనీయం. నిజాం పోకడలను గుర్తుచేస్తున్న వైనం యిది. రజాకర్ల పార్టీతో పొత్తుపెట్టుకుని కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.
30 ఏళ్ళపాటు సంకీర్ణ ప్రభుత్వాలతో దేశం చాలా నష్టపోయింది. అయినా కేటీఆర్ మళ్ళీ సంకీర్ణపాట పాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సాకారమయితే కాంగ్రెస్ పార్టీలో టిఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారు. సరే! ఐదేళ్ళకు ముందే శాసనసభ ఎన్నికలకు వెళ్ళారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో మోదీ ప్రభంజనంలో ఓడిపోతామని కేసీఆర్ భయపడ్డారు. సరే! అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తరువాత పదవీ రాజకీయాల అహంకారం తెరాసను ఆవహించింది. పంచాయతీ ఎన్నికల్లోనూ గెలిచారు. తరువాత ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలదన్నట్లు వాగాడంబరంతో ఢిల్లీకి ఎగబాకాలనుకుంటున్నారు.
సంక్షేమ పథకాల పేరిట ప్రజల్ని సోమరిపోతులను చేస్తున్నది తెరాస ప్రభుత్వం. గత 70 ఏళ్ళలో ఎవరూ ఏమీ సాధించకుండానే దేశం ఇంతటి ప్రగతి సాధించిందా? గత ఐదేళ్ళ కేసీఆర్ పాలనలోనే అంతా జరిగిపోయిం దా? దేశం మొత్తం మీద గత 5 ఏళ్ళలో కోటి 30 లక్షల ఇళ్ళు నిర్మించగా, కేసీఆర్ పాలనలో ఐదువేల ఇళ్ళు కూడా కట్టలేదు. అంటే కనీసం 1% కూడా సామాన్యుడికి నీడనిచ్చే విషయంలో ఆయన అడుగువేయలేదు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో 9 లక్షల ఇళ్ళు తయారయినాయి. ఈ ఇళ్ళకు సహాయం చేస్తున్నది మోదీ ప్రభుత్వమే. తెరాస ప్రభుత్వం అప్పును పెంచింది, సంపదను సృష్టించలేదు. విభజనతో అప్పనంగా వచ్చిన ఆదాయాన్ని పంచిపెడుతూ వస్తున్నది. కేసీఆర్ కన్ను ఏకంగా ఆర్‌బిఐ నిధులమీదనే పడింది. రాష్ట్ర ఖజానాను ఖాళీచేసి పెట్టిన ఘనత కేసీఆర్‌దే. మరోవైపుగత 70 ఏళ్ళలో ఏ ప్రభుత్వమూ చేయని చిన్నచిన్న విషయాల పట్ల మోదీ ప్రభుత్వం దృష్టిపెట్టింది.
కేసీఆర్, కేటీఆర్‌లు ఏనాడూ యోగ, స్వచ్ఛ్భారత్‌ల గురించి మాట్లాడరు. మున్సిపల్‌శాఖను నిర్వహించిన సమయంలో కేటీఆర్ చేసింది సున్న. గ్రామాల్లో, పట్టణాల్లో, బస్తీల్లో ఎక్కడా స్వచ్ఛత కానరాదు. ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్‌లకు పాలనను వదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు చోద్యం చూస్తున్నారు. మోదీ రైతు సమ్మాన్ నిధిని ప్రకటించి ప్రధాని మోదీ తమ పథకాలను కాపీ కొట్టారంటున్నారు కేటీఆర్. కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు 4వేలు చొప్పున ఎన్ని ఎకరాలున్నా రైతుకివ్వడానికి, ఐదు ఎకరాలలోపు వున్న రైతులకు మోదీ సహాయం అందిస్తామనడానికి ఎంతో తేడావుంది. అయినా తెరాస చేసిందేమిటి? కాకతీయ, భగీరథ పథకాలను గుజరాత్‌ను చూసి కాపీ కొట్టలేదా? 2014లో తెలంగాణలో విజయం సాధించిన ఆరునెలలకే అక్టోబరు 2014లో అధికారులను తీసుకుని కెటిఆర్ గుజరాత్‌లో అనేక ప్రదేశాలలో తిరిగి తాగునీటి గ్రిడ్‌ను, ఇ-పంచాయత్ ప్రాజెక్టును అధ్యయనం చేశారు. అప్పటి గుజరాత్ వాటర్ బోర్డు చైర్మన్ రాజీవ్ గుప్తాతో అనేక సాంకేతికాంశాలు చర్చించారు. నర్మద నది నుంచి నీటిని తీసుకునేందుకు చేపట్టిన ప్రాజెక్టు గురించి అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. అదే పద్ధతిని తెలంగాణలో కూడా వాటిని అమలు చేయాలన్న విశ్వాసం కెటిఆర్ వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వమే నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు పంపిణీ చేయడాన్ని కూడా కేసీఆర్ విమర్శిస్తున్నారు. కేంద్రం యిచ్చే నిధులపై ఆయన ఆధిపత్యం కోరుకుంటున్నారు. నేరుగా నిధులను అందుకుంటున్నందువలనే గ్రామాలు నేడు అభివృద్ధి చెందుతున్నాయి. కాని కేసీఆర్ అభివృద్ధి కంటె ఆధిపత్యమే కోరుకుంటున్నారు. అందుకే తెలంగాణలో ప్రగతి స్తంభించింది. ఫెడరల్ ఫ్రంట్ పేరున కేసిఆర్ చేసింది కేవలం ‘స్టంట్’ అని దేశమంతా తెలిసిపోయింది. కొడుకు కేటీఆర్‌కు తెలంగాణ సీఎం పీఠం అప్పగించేందుకే ఈ వ్యూహం అనుకున్నా, కేసీఆర్‌తో జాతీయ స్థాయి ఫ్రంట్ ఏర్పాటుకు కలిసివచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరని అందుకే ఆయన మళ్ళీ తెలంగాణకే పరిమితమయ్యారని స్పష్టమయింది.
భారత్‌ను ప్రపంచంలో 6వ ఆర్థిక శక్తిగా మలచిన మోదీతో కెసిఆర్ తలపడడం, తగుదునమ్మా అని ఘీంకరించడం నేల విడిచి సాముచేయడమే అవుతుంది. రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్న కెసిఆర్ నిజామాబాద్‌లో కూతురు కవితతో పోటీకి దిగి నామినేషన్లువేసిన 250 మంది రైతుల నిరసనను ఎలా సమర్ధించుకుంటారు? పసుపు, ఎర్రజొన్న పంటలు ప్రభుత్వం కొనుగోలు చేసే జాబితాలో లేవు. రైతుల సమస్యలను కేంద్రం దృష్టికితేవడంలో ఎంపీగా ఉంటూ కవిత ఎందుకు విఫలమయ్యారు? కెసిఆర్‌కు హిందువుల పట్ల వున్న చులకన భావన. హిందూగాళ్ళు, బొందూగాళ్ళూ అంటూ ఆయన వాడిన భాష జుగుప్సాకరంగా వుంది. బతుకమ్మ ఆడే తెలంగాణ ఆడపడుచులను నగ్నంగా నర్తించమని ఆదేశించిన నిజాం నిరంకుశ వైఖరిని సమర్థించే కెసిఆర్‌కు హిందువుల మనోభావాలు ఎలా అర్థమవుతాయి? రజాకర్ల వారసులైన మజ్లిస్ నేతల ముందు మోకరిల్లి అప్పనంగా ప్రభుత్వ భూములను కారుచౌకగా కట్టబెట్టిన కపట రాజకీయ సూత్రధారి కెసిఆర్. హిందువుల యాగం, యోగం గురించి తెలుసుంటే ఆయన నోట ఆ అవాకులు చవాకులు వచ్చేవి కావు. మెజారిటీ హిందువులను వెనకేసుకొస్తే అది బిజెపి మతతత్త్వమని, మజ్లిస్‌ను చంకలో పెట్టుకుని తిరిగితే అది మతతత్త్వం కాదని కెసిఆర్ భావించడం ఆయన రాజకీయ దివాలాకోరుతనం. యుపిఎ హయాంలో మంత్రిగా వున్నపుడు ఆయన పార్టీ సర్జికల్ స్ట్రయిక్‌లు చేసిందోలేదో కానీ, పార్టీ అనుచరగణంపై ఆయన చేసిన స్ట్రైక్‌లు ఈసారి ఆయనకు అపఖ్యాతిని అపజయాన్ని తెచ్చిపెట్టనున్నాయి. ఎమ్‌ఎల్‌సి ఎన్నికల్లో పరాజయంలో ఆయనకు కౌంట్ డౌన్ మొదలయింది. ఎల్‌బి స్టేడియం సభ పేలవంగా సాగిపోవడం మరో అశుభ సూచకం.
దేశం దిశను, దశను మార్చేరీతిలో బలమైన ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడడం నేటి జాతీయ అవసరం. దేశానికి చౌకీదార్ కాదు జిమ్మేదార్ కావాలి అని కెటిఆర్ అన్నారు. చౌకీదార్ మాత్రం జిమ్మేదారీ కావక్కర్లేదా? మెసెంజర్ నుంచి మేనేజర్ దాకా, డోర్‌మన్ నుంచి చైర్మన్ దాకా, గల్లీనుంచీ ఢిల్లీదాకా అందరికీ బాధ్యత కావాలి. బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రజలు జీవించేలా పాలకులు వర్తించాలి. కెసిఆర్, కెటిఆర్‌లు తెలంగాణ ప్రాంతం తమ సొంత జాగీరు కాదని గుర్తించాలి. బలమైన భారత్ కోసం వారి ఓటుహక్కును సద్వినియోగపరచుకొనే స్వేచ్ఛ నివ్వాలి. నియంతృత్వం వదిలి స్వతంత్రించి పౌరులు తమ ఓటుహక్కును ఉపయోగించే వాతావరణం సృష్టించాలి.

-తాడేపల్లి హనుమత్‌ప్రసాద్ 96761 90888