సబ్ ఫీచర్

పాఠం నేర్వాల్సిన బౌద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిమాలయ రాజ్యం టిబెట్. అదో ‘నిషిద్ధ ప్రాంతం’గా చాలాకాలం కొనసాగింది. శతాబ్దాలుగా అక్కడ బౌద్ధం జీవన విధానమైంది. దలైలామా వారి ప్రభువు.. దేవుడు.. సర్వస్వం. నేటికీ ఆ పరంపర కొనసాగుతోంది. టిబెట్‌ను తాంత్రిక విద్యలకు, సాధనకు, యోగకు, ‘సిద్ధ’ పురుషులకు నిలయంగానూ భావిస్తారు. ‘షాంఘ్రిలా’ అనే పదం తరచూ వినబడుతుంది. అది అతీంద్రియ శక్తుల నిలయానికి పర్యాయపదం. శతాబ్దాలపాటు ఆధ్యాత్మిక, సాధన రంగంలో, బౌద్ధాన్ని ఆధారం చేసుకుని జీవిస్తున్న ఈ దేశంపై 1950లో పొరుగున ఉన్న చైనా దండయాత్ర చేసింది. టిబెట్ తమదేనని, దాన్ని విముక్తి (లిబరేట్) చేస్తామని చైనా చైర్మన్ మావో జెడాంగ్ ప్రజా సైన్యాన్ని (పీపుల్స్ ఆర్మీని) టిబెట్‌పైకి పంపారు.
దఫదఫాలుగా జరిగిన చైనా సైన్యం దాడుల్లో టిబెట్ సర్వనాశనమైంది. తననుతాను రక్షించుకోలేకపోయింది. అక్కడి సంస్కృతిని తుడిచిపెట్టమని మతంపై విశ్వాసం లేని చైనా కమ్యూనిస్టు నాయకుల ఆదేశాలపై టిబెట్ సాంస్కృతిక సంపదను సైనికులు తుడిచిపెట్టారు. ప్రజలు, బౌద్ధ సన్యాసులు, సాధకులు చెట్టుకొకరు పుట్టకొకరు పరుగులు పెట్టారు. చివరికి దేవుడితో సమానమైన దలైలామా ‘పారిపోయి’ మన దేశంలో తల దాచుకుంటున్నారు.
దాంతో టిబెట్ ‘ఉనికి’ ప్రమాదంలో పడింది. శతాబ్దాలుగా ఆచరిస్తున్న ‘బౌద్ధం’ వారిని పరాయివారి దాడుల నుంచి కాపాడలేకపోయింది. దేశ భూభాగాన్ని ఆక్రమించుకున్నా కిమ్మనలేని పరిస్థితి వారిది. స్వతంత్ర దేశమని ఎంత చెప్పుకున్నా చైనా లౌక్యం ముందు, సైన్యం ముందు, బలం ముందు ఆ వాదనకు ఎక్కడా మద్దతు లభించలేదు. బౌద్ధంలోని కరుణ,ప్రేమ, దయ, అహింస, ఆత్మజ్ఞానం, శాంతి, ప్రశాంతత.. ఇలాంటి మాటలను శతాబ్దాలుగా విశ్వసించిన ప్రజల పరిస్థితి రెక్కలు తెగిన పక్షుల చందంగా మారింది. తరతరాలుగా కూడేసిన సాంస్కృతిక సంపద-అనుభవం, అనేక కట్టడాలు లిప్తకాలంలో శిథిలమయ్యాయి. అపురూపంగా, ప్రాణపదంగా కాపాడుకున్న బౌద్ధ సన్యాసుల ఆరామాలు, ఆలయాలు, విద్యాకేంద్రాలు వగైరా కంటికి కనిపించకుండా పోయాయి. లక్షల మంది కన్నుమూశారు. చైనా సైనికుల దాడిని, సాంస్కృతిక విధ్వంసాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఆయుధాలు, సైనిక పటాలాలు, నైపుణ్యం, శిక్షణ ఏదీ టిబెట్‌లో లేదు. కేవలం ‘లామా’పై భారం వేసి, బౌద్ధాన్ని నమ్ముకుని కాలం గడిపితే పర్యవసానం ఏమిటో 1950లో టిబెట్‌కు తెలిసొచ్చింది. బౌద్ధమతాన్ని ఆచరించే మిగతా దేశాలకు కనువిప్పు కలిగింది.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి, పారిశ్రామిక విప్లవం ఆధారంగా ‘ఫనిక్స్’పక్షిలా బూడిద లోంచి ఎగిరేందుకు రెక్కలు చాచుకుంటున్న జపాన్ (బౌద్ధం ఆచరించే దేశమే) సహా మరికొన్ని దేశాలు వాస్తవిక, భౌతిక పరిస్థితుల నేపథ్యంలో కొత్త దృక్కోణంతో ముందుకు కదులుతున్న తరుణంలో టిబెట్ మాత్రం ‘లామా’ చల్లని చూపులు, సన్యాసుల పూజా పునస్కారాలు, అతీంద్రియ శక్తుల సాధన.. పూర్వజన్మల్లో తాము ధరించిన ‘‘పాత్రలు’’ తెలుసుకుంటూ, కలలుకంటూ ఉంటే మెడ మీద ‘కమ్యూనిస్టుల కత్తి’ పడనే పడింది. చివరికి రాజధాని ‘‘లాసా’’ రూపురేఖలు మారిపోయాయి. ప్రజలు వలసపోయారు. లక్షలాది మంది మరణించారు. కోట్లాది రూపాయల నష్టం జరిగింది. దుఃఖాన్ని, బాధను బౌద్ధం తొలగిస్తుందని గడిపిన వారికి గతంలో ఎన్నడూ చూడని కష్టం, అవమానం, చావులు దాపురించాయి. మరి బౌద్ధం వల్ల ఒరిగిందేమిటి? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది కదా? దుఃఖాన్ని మాపాల్సిన బౌద్ధం కొత్త దుఃఖాన్ని మోసుకొచ్చింది.
బౌద్ధం.. దానికి ప్రతీక లామా.. దేవుడు.. ఆయన చుట్టూ బౌద్ధ పండుగలు.. క్రతువుల చుట్టూ ప్రజల ప్రజ్ఞ, జ్ఞానం తరతరాలుగా తిరిగితే చివరికి టిబిటియన్లు ‘జన్మభూమి’ని కోల్పోవలసి వచ్చింది. భూటాన్, నేపాల్ తదితర పొరుగు దేశాల మాదిరి తమది స్వతంత్ర దేశమని తలచినప్పుడు దాన్ని సంరక్షించుకునే యంత్రాంగం, సమకాలీన రక్షణ ఏర్పాట్లు చేసుకోకుండా లామాపై, బౌద్ధంపై ఆధారపడితే చివరికి మిగిలింది భిక్షాపాత్ర, వలసబాట, శరణార్థి జీవితం, అవమానాలు.. 21వ శతాబ్దంలో ఇది ఎంతవరకు శ్రేయస్కరం? ఏమేరకు శోభాయమానం? రాజధాని లాసాలో ఒకప్పుడు బుద్ధుని పంచశీలకు ప్రతీకగా రంగురంగుల జెండాలు ఎగిరితే ఇప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఎర్రజెండా ఎగురుతోంది. చైనా సైన్యం కవాతు చేస్తోంది. అక్కడ మిగిలిపోయిన ప్రజలు చైనా పాలనకు అనుకూలమైన పద్ధతిలో మసలుకుంటున్నారు. ‘మతం’ మాట మరచిపోవాలని ‘ఆజ్ఞ’. చివరికి యోగా, ఆసనాలు తదితర విద్యలపై ఆంక్షలు. పిల్లలకు చైనా పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. ప్రధాన భూమి చైనాకు అనుబంధమైనది మాత్రమే. టిబెట్.. అని కొత్త తరాలకు పాఠాలు నూరిపోస్తున్నారు. అసంఖ్యాక పాత మానిస్టర్స్ (బౌద్ధ సన్యాసుల గురుకులాలు) కూల్చివేతకు, విధ్వంసానికి గురయ్యాయి. అసంఖ్యాక సన్యాసులను తరిమికొట్టారు. ఇప్పుడు వాటిల్లో పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి. గబ్బిలాలు నివాసముంటున్నాయి. ఒకప్పుడు ఎంతో కళకళలాడిన ప్రాంతాలు, ఉత్సవాలతో ఉర్రూతలూగిన విశాల వేదికలు దయనీయ స్థితికి చేరుకున్నాయి. అంతిమంగా టిబెట్ ప్రజలిప్పుడు తమ నేలపై ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవిస్తున్నారు. జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. చైనీయుల పెత్తనంతో కునారిల్లుతున్నారు. ఈ దుస్థితికి కారణం ఎవరు? ప్రతి ఒక్కరు తమని తాము ప్రశ్నించుకోవాలి.
బౌద్ధం పేర, పరంపర పేర, పూర్వజన్మల వేటలో మునిగి పూర్వీకులతో మాట్లాడే ‘మత్తు’లో, అతీంద్రియ శక్తుల ఆవాహన పేర, ప్రశాంతత కోసం గుహల్లో కొలువుదీరడం వల్ల, సమాజంలో జరుగుతున్న మార్పులు, పొరుగు దేశాల్లోని పరిణామాలు, వ్యూహాలు పసిగట్టకుండా ‘ఉన్మత్తస్థితి’లో తమని బౌద్ధమే కాపాడుతుందని భావించేంత అమాయకంగా ప్రజలను తర్ఫీదునిచ్చి ‘నిషిద్ధ ప్రాంతం’గా దేశాన్ని మార్చి రాచరికం పోకడలతో, మత పాలన దిశలో ఆలోచిస్తే అంతిమంగా మిగిలింది అవమానమే! ప్రజలను మరో దేశానికి తాకట్టుపెట్టడమే! 21వ శతాబ్దంలో ఈ రకమైన అవమానం, తమ గడ్డపైనే ద్వితీయ శ్రేణి పౌరులుగా ప్రజలు జీవించడం న్యాయమా? దీని మూల కందకం ఎక్కడుంది? బౌద్ధం వైపే వేలు చూపుతోంది.
ఓవైపు అనేక దేశాలు స్వాతంత్య్రం సంపాదించుకుంటుంటే, బానిసత్వం నుంచి విముక్తి సాధించుకుంటుంటే ఇజ్రాయిల్ లాంటి దేశం ‘సొంత గడ్డ’కోసం అసమాన త్యాగాలుచేసి తమ జెండాను తమ సొంత గడ్డపై ఎగరేసుకుని రొమ్ము విరుచుకుని జీవిస్తుంటే... టిబెట్ ప్రజలు మాత్రం తమ సొంత నేలను విడిచి వలస బాట పట్టడం విడ్డూరం కాదా? తమ నేలపై తమ జెండాను ఎగురవేయలేని దుస్థితి వారిది. ‘అజ్ఞాతం’లో (ధర్మశాలలో) ఉంటూ పాలన సాగిస్తున్నామనడం విచిత్రం కాదా?
ఇప్పుడు అంతర్జాతీయ వేదికలను ఆశ్రయిస్తే ఏమిటి ప్రయోజనం, ఐక్యరాజ్యసమితికి మొరపెట్టుకుంటే ఏమిటి ఉపయోగం? చివరికి అంతర్జాతీయ మీడియాను సైతం చైనా తన గుప్పిట్లో పెట్టుకుంది. దాంతో టిబెట్ ప్రజల ‘గోస’ ప్రపంచానికి చేరకుండా పోయింది. బౌద్ధం ఎంత పేలవంగా మారిందో దీనివల్ల అర్థమవుతోంది. చైనా ఇప్పుడు ‘కొత్తపల్లవి’ అందుకుంది. శతాబ్దాల తరబడి బయటి ప్రపంచంతో సంపర్కం లేకుండా ఒంటరిగా ఉన్న దేశంలోని ప్రజలకు తాము ఆధునిక విద్య, వైద్యం, వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ‘సోషలిజాన్ని’ పరిచయం చేశాం, అక్కడ బహుళ అంతస్తుల భవనాలు కట్టాం, ప్రపంచంతో కలిసి నడిచేందుకు సౌకర్యాలు కల్పించామని గొప్పలు చెప్పుకుంటోంది.
భౌగోళికంగా కీలక ప్రాంతమైన టిబెట్‌ను, ప్రపంచం తలపై గొడుగుల్లా ఉన్న ఆ ప్రాంతాన్ని చైనా హింస ద్వారా లొంగదీసుకుంది. సైనిక స్థావరంగా మార్చింది. శాంతి-అహింస, ఆధ్యాత్మికత, యోగ, ధ్యానం, బౌద్ధమే బంగారమంటూ శతాబ్దాలపాటు నమ్మిన టిబెట్ తన ‘ఆత్మ’ను కోల్పోయింది. కమ్యూనిస్టుల పద ఘట్టనల కింద నలిగిపోతోంది. అప్పుడప్పుడు జరిగే తిరుగుబాట్లు, వ్యతిరేక ప్రదర్శనలు, శాపనార్థాలు, దూషణల వల్ల పూర్వ వైభవం లభించే అవకాశం లేశమాత్రమైనా కనిపించడం లేదు. బౌద్ధమా ఎంత పనిచేశావు?

-వుప్పల నరసింహం 99857 81799