సబ్ ఫీచర్

మన అసలు శత్రువు ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఐదేళ్ల మోదీ పాలన మన అంతశ్శత్రువులెవరో ప్రజలకు తెలియజేసింది. దేశహితం తన ప్రథమ ప్రాధాన్యమని ప్రధాని మోదీ అనేకసార్లు పార్లమెంటు ద్వారా, బహిరంగ సభల ద్వారా తెలియజేశారు. గత పాలకుల కాలంలో ఈ శత్రువులు బయటికి రాకపోవడానికి కారణం వారికి ప్రభుత్వపరంగా లభించిన మద్దతు, భద్రతలే కారణం. ఎన్‌డిఏ ప్రభుత్వం తీసుకున్న కొన్ని కఠినచర్యల కారణంగా ఈ వర్గం మనుగడే ప్రశ్నార్థకమైంది. ఇంతకాలం చట్టాన్ని తమ చుట్టంగా చేసుకున్న వీరందరికీ మోదీ మాటలు తూటాలై, కోటలు కదిలి వారి బెదిరింపులు, హుంకరింపులు తాటాకు చప్పుళ్ళయినాయి. గణతంత్ర గౌరవం కాపాడుతూనే రణతంత్ర దుందుభిని వినిపించిన మోదీని చూసి గావుకేకలు, చావుకేకలు పెడుతున్న ఈ శత్రుగణం తాజాగా కొత్త పల్లవిని అందుకుంది. పుల్వామా ఉగ్రదాడులు మోదీనే ప్రణాళికా బద్ధంగా చేయించాడట! పుల్వామా దాడికి ప్రతిగా భారత వాయుసేన బాలాకోట్‌పై విమాన దాడులు చేయడం, దాదాపు 300 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమవడం, పాక్ సేనలకు పట్టుబడిన మన వింగ్ కమాండర్ అభినందన్ క్షేమంగా భారత్‌కు తిరిగిరావడం జరిగాక- అసలు సర్జికల్ దాడులు జరిగినట్లు ఋజువులెక్కడ? అని కాంగ్రెస్ వారు అన్నారు. మన సైన్యం మనోనిబ్బరాన్ని దెబ్బతీశారు. మోదీని దూషించే నెపంతో సైన్యాన్ని అవమానించారు. ఇక ఆఖరి ప్రయత్నంగా పుల్వామా దాడులు మోదీనే చేయించారంటున్నారు.
బాలాకోట్‌పై వైమానిక దాడులకు ఋజువులడుగుతున్న కాంగ్రెస్, యితర కూటమి నేతలు గత కాంగ్రెస్ హయాంలో జీపులు, ఆయుధాలు, సబ్‌మెరైన్‌లు, హెలికాప్టర్ల కొనుగోళ్ళలో జరిగిన అవినీతిని ఎందుకు నివారించలేకపోయారు? 2007 నుంచి రఫాలే విమానాల కొనుగోలుకు ఎందుకు నిర్ణయం చేయలేకపోయారు? 2009లో మన సైన్యం కోసం 1,86,000 బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లను కావాలని రక్షణశాఖ అడిగితే 2014 వరకు వాటిని నాటి ప్రభుత్వం సమకూర్చలేకపోయింది. 2014 నుంచి మోదీ ప్రభుత్వం 2,30,000 బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లను సైన్యానికి సమకూర్చింది.
పుల్వామా దాడుల అనంతరం పాకిస్తాన్‌ను కట్టడి చే సేందుకు భారత్ అనేక చర్యలు తీసుకుంది. పాకిస్తాన్‌కు యిచ్చిన ‘అత్యంత అనుకూల దేశం’ హోదాను వెనక్కు తీసుకోవడం, పాక్ నుంచి దిగుమతి అయ్యే సుమారు 50 కోట్ల డాలర్ల విలువ చేసే పలు వస్తువులపై కస్టమ్స్ సుంకాలను 200 శాతం పెంచడం వంటివి యిందులో కొన్ని. వీటిని కూడా కాంగ్రెస్ యితర కూటమి పక్షాలు రాజకీయం చేయగలవా? మాజీ సైనికుల ‘ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్’ సమస్య 40 ఏళ్ళుగా నలుగుతుంటే మోదీ ప్రభుత్వం పరిష్కరించింది. ఇప్పటికి 35వేల కోట్ల రూపాయలను సైనికుల సంక్షేమం కోసం ఖర్చుపెట్టింది.
పుల్వామా ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ సంస్థ అధిపతి మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించమని మనం ఐక్యరాజ్యసమితిని ఎప్పటి నుంచో కోరుతున్నాం. దీనికి అడ్డుపడ్తున్న చైనా కూడా బాలాకోట్ వైమానిక దాడుల విషయమై పల్లెత్తు మాట్లాడడం లేదు. ప్రపంచ దేశాలకు పుల్వామా దాడుల విషయమై భారత్ వివరణ యిచ్చింది. ప్రపంచమంతా పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఖండిస్తుంటే కాంగ్రెస్, ఇతర విపక్షాలు పాకిస్తాన్‌ను సమర్ధించేలా మాట్లాడుతున్నాయి. వైమానిక దాడులకు ఋజువులు అడగడం, ఎంతమంది చనిపోయారో లెక్క చూపమనడం వంటి కువ్యాఖ్యలు పాకిస్తాన్ పత్రికల్లో పతాక శీర్షికలవుతున్నాయి. 2008 నవంబర్‌లో ముంబై దాడుల తర్వాత సైన్యం బాలాకోట్ వైమానిక దాడుల తరహా వ్యూహానే్న నాటి యూపీఏ ప్రభుత్వం ముందుంచినా ప్రభుత్వం అనుమతినివ్వలేదు. దేశరక్షణ కంటే ఓటుబ్యాంకు రాజకీయాలే నాటి ప్రభుత్వానికి ముఖ్యమైనాయి.
బాలాకోట్‌పై దాడి జరిపిన రోజున మోదీ రాజస్థాన్‌లో మాట్లాడుతూ- ‘మీ చేతుల్లో దేశం సురక్షితంగా వుంది.. దేశాన్నీ ఏనాడూ తలవంచనీయమని’ అన్నారు. దేశరక్షణ వ్యూహంలో యిదొక సాహసోపేతమైన మార్పు. నాటి ప్రధాని వాజపేయి పాకిస్తాన్‌కు స్నేహహస్తం అందిస్తూ లాహోర్‌కు బస్సుయాత్ర చేసి వచ్చారు. కాని వెనువెంటనే నాటి పాకిస్తాన్ పాలకుడు పర్వేజ్ ముషరఫ్ కార్గిల్ యుద్ధం సృష్టించాడు. పర్వేజ్ ముషరఫ్ మాటల్లో ‘పాకిస్తాన్ బలం భారతీయ కుహనా మేధావులని, అణుబాంబులు కాదని’ అన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌కు బలమిస్తున్న శక్తులు ఈ పంచమాంగ దళాలే. ఈ గాలి పీలుస్తూ, యిక్కడి నీరు తాగుతూ, యిక్కడి పంట పొలాలను అనుభవిస్తూ భారత భావన మాత్రం వీడి వర్తిస్తున్న ఈ భ్రష్టమేధావులే ఈ దేశానికి ప్రమాదకరం అవుతున్నారు. ధర్మప్రాణ భారతంలో విధర్మీయులతో యుద్ధం చేసిన ప్రతిసారీ విజయం మనదే అయింది.
అలనాడు ఛత్రపతి శివాజీ నెఱపిన గెరిల్లా యుద్ధతంత్రం శత్రువు గుండెలో భయం నింపింది. దెబ్బకుదెబ్బ తీసినపుడే జాతి మనోనిబ్బరం బలపడింది. రాజీపడే దేశభక్తితో దేశ భూభాగం ఎంతో యిప్పటికీ అన్యాక్రాంతం అయింది. ‘పాన్ కేలియే పాకిస్తాన్ లడ్‌కే లేంగే హిందుస్తాన్’అన్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో మాట స్వజాతీయుల మస్తిష్కంలో మారుమ్రోగుతూనే వుంటుంది. భారత్‌తో అవసరమైతే వెయ్యి యుద్ధాలు చేస్తామన్నాడాయన. యుద్ధం మాట విన్న ప్రతిసారీ బుద్ధుడ్ని గుర్తుచేసి నిద్దురపోతూ నీరసపడే నేతలకు కాలం చెల్లింది. నెత్తురు నిండి, సత్తువ చూపే నాయకత్వమే నేడు దేశం కోరుకుంటోంది.
సార్వత్రిక ఎన్నికలు సమీపించిన తరుణంలో జరిగిన బాలాకోట్ దాడులు ఎన్నికల్లో లబ్ధి కోసం మోదీ చేసిన ప్రయత్నంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2016లో జరిగిన సర్జికల్ దాడుల సమయంలో ఎన్నికలేమీ లేవుకదా? కనుక పరిస్థితి నిరపేక్షంగా పాలనలో నీతి రీతికి అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేస్తేనే ప్రజలకు విశ్వాసం కల్గుతుంది. పదవీ రాజకీయాలు శాశ్వత ప్రాతిపదికన దేశ ప్రజలను రక్షించలేవు. వ్యక్తితో ముడివడనిది జాతీయ జీవన ప్రవాహం. ప్రభుత్వం వస్తుంది, పోతుంది. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. మోదీ పాలన వున్నా లేకపోయినా ఈ దేశం నాలుగు కాలాలపాటు సురక్షితంగా ప్రజలు సుఖప్రదంగా జీవించగలిగే రాజనీతిజ్ఞత, సమర్ధవంతమైన పాలన దేశానికి అవసరం. ఈ అవసరం గతితప్పిన మతితప్పిన నేతలతో తీరేది కాదు. ఈ విషయం జనం గుర్తిస్తే, చైతన్యం ప్రభవిస్తే కోటి గొంతులొక్కటై కోటి అడుగులొక్కటై భరతమాత విజయపథం కోసం సమరం మొదలవుతుంది, తిమిరం తొలగిపోతుంది.

-తాడేపల్లి హనుమత్‌ప్రసాద్ 96761 90888