సబ్ ఫీచర్

పేదల బాధలు పట్టవా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ చరిత్రనే తిరగ రాయగల శక్తి మన యువతకు ఉంది. రేపటి సాధారణ ఎన్నికల్లో యువత తన ప్రభావాన్ని చూపగలిగితే- స్వార్థపరులైన నేతలకు బుద్ధిచెప్పగలిగితే- నూతన భారతావని ఆవిష్కరించగలదు. ఎన్నికల్లో దేశ సమస్యలు పక్కకుపోయి, నేతలు తమ వ్యక్తి ఆరాధనను ముందుకు తెచ్చేలా ప్రచారం చేసుకోవడం ప్రజల వ్యక్తిత్వాన్ని కించపరచడమే. యువతకు ఉపాధి అవకాశాలను, గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం, నూతన పారిశ్రామికీకరణ విధానాలు, ఇతర అభివృద్ధి ప్రణాళికల గురించి కాకుండా, పార్టీల నాయకులు పరస్పరం విమర్శించుకోవడమే ప్రచారంలో ప్రధానంగా కనిపిస్తోంది.
గత ఏడు దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన వివిధ రాజకీయ పార్టీలు సిద్ధాంతాలను గాలికొదిలేసి, కొన్ని వర్గాల శ్రేయస్సుకే పనిచేస్తూ వస్తున్నాయి. పార్టీలు మారినా, నాయకులు మారినా సామాన్యుడి ఆర్థిక, సామాజిక పరిస్థితి మాత్రం మారడం లేదు. రాజకీయ పార్టీలు తమ రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాలతో ప్రజల మెప్పుపొంది వోట్లు కోరడానికి బదులు, ప్రజల మనోభావాలతో, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడం, మతాన్ని రాజకీయం చేయడం పరిపాటైంది. సామాన్యుడు ఆర్థికంగా మరింతగా దిగజారిపోతున్నాడు. బతుకు సాగదీసుకొంటూ, భారంగా జీవనం గడుపుతుంటే, యువత తమ బతుకుదెరువు మాతృభూమిలో కాదు మరో దేశంలో అంటూ అటూ వలస పోతున్నారు. దేశ భవిష్యత్‌ను నిర్మించగల శక్తి ఉన్న యువత వలస వెళ్ళి కోట్ల కొద్ది డబ్బు సంపాదించి మన దేశానికి పంపుతుంటే, అర్థం లేని ప్రణాళికలతో దేశాన్ని దోచుకొంటున్న బడా వ్యాపారవేత్తలు లేదా వారి ప్రతినిధులే రాజ్యాధికారాన్ని చలాయిస్తుంటే ఇక సామాన్య ప్రజల బాగోగులు చూసేవారే లేకుండాపోతున్నారు.
సహజ వనరులను విదేశీ, దేశీయ వ్యాపారవేత్తలకు దోచిపెట్టడమే ప్రభుత్వ విధానంగా కనబడుతుంది. సహజ వనరులను, ఖనిజ సంపదను విదేశాలకు ఎగుమతి చేసి, తయారైన ఉత్పత్తులను దిగుమతి చేసుకొని లక్షల కోట్ల నిధులను వారికి బదిలీ చేయడమే నేటి అభివృద్ధిగా ప్రభుత్వాలు చెప్పుకోవడం మన ప్రజల ఆత్మగౌరవాన్ని, మేధాశక్తిని కించపరచడమే.
గ్రామీణ ప్రాంతంలో ఉండే సామాన్య వ్యవసాయదారులు కానీ అడవినే నమ్ముకొని తరతరాలుగా జీవిస్తున్న గిరిజన, ఆదివాసుల బతుకుల్లో వెలుగు నింపాలనుకొనే నాయకులే కరువయ్యారు. వ్యవసాయం రోజురోజుకూ భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా, గిరిజన ప్రాంతాల్లో ఖనిజాలను కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు ఖనిజాల పేర దోచుకొంటురు. ఆదివాసీల కనీస హక్కులను కూడా రక్షించలేని ప్రభుత్వాలు దేశ ప్రగతి పేర జరుపుతున్న దోపిడీని అరికట్టి, గ్రామీణ భారతానికి మళ్ళీ పూర్వవైభవం తెస్తామనే నాయకులే కరువయ్యారు. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన ‘సుస్థిర అభివృద్ధి ప్రణాళిక’ అంటూ గత ఇరవై యేళ్లుగా సదస్సులు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఆ ప్రణాళికలో ప్రవచించిన పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధి, యువతకు ఉపాధి, పట్టణీకరణపై మోజు తగ్గించడం వంటి వౌలిక సూత్రాలను గాలికి వదిలేసి బడా పారిశ్రామికవేత్తలకు సహజ వనరులను దోచిపెడుతూ, అదేమని ప్రశ్నించిన వారిని అభివృద్ధి నిరోధకులుగా ప్రచారం చేసే వారిని ప్రజాద్రోహులుగా ముద్ర వేయడం 21వ శతాబ్దపు కొత్త వొరవడిగా మారిపోయింది.
ఇతర దేశాలను తమ ఆర్థిక సహాయంతోనో, అప్పులిచ్చో తమకు అనుకూలంగా ఆయా అగ్ర దేశాలు మలుచుకొంటున్నాయి. ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలని చెప్పుకొనే అగ్రరాజ్యాలు, జి-20 దేశాలు కానీ మరే పేర ఉన్న ఆర్థిక శక్తులు కానీ, పశ్చిమాసియా దేశాలలో, మధ్యప్రాశ్చ్య దేశాల్లో, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో జరుగుతున్న మానవ హింసకు అవసరమైన అన్నిరకాల ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. అణ్వాయుధాలు కలిగి ఉందనే సాకుతో తనకు వ్యతిరేకంగా ఉన్న ఇరాక్‌ను సర్వనాశనం చేసిన అమెరికా అదే అణ్వాయుధాలను కలిగి ఇటు భారతదేశాన్ని, అటు ఇరాన్‌ను భయపెడుతూ ప్రపంచ ఉగ్రవాద కర్మాగారంగా మారిన పాకిస్తాన్‌ను మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది.
ఇరాన్ తన అవసరాలకు అనుగుణంగా అణుకార్యక్రమాలను నిర్వహిస్తుంటే గత 20 యేళ్లుగా అనేక రకాల ఆర్థిక దిగ్బంధనాలతో ఆ దేశ ఆర్థిక పరిస్థితిని అమెరికా అతలాకుతలం చేస్తుంది. ఇరాన్, ఇరాక్ దేశాలే కాదు అటు సిరియా, ఇటు యెమన్ దేశాల ప్రజలు క్షణమొక యుగంలా ప్రాణాలరచేతిలో పెట్టుకొని బతుకుతుంటే, అక్కడి ప్రజల మానవ హక్కులను పట్టించుకోని అగ్రరాజ్యాలు- తమ దేశ ప్రజలకు ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా అది ప్రపంచ దేశాల సమస్యగా చిత్రీకరించి పెడబొబ్బలు పెట్టడం అలవాటైపోయింది. ఆఫ్రికా దేశాలలోని పేదరికం కనబడని ఈ ప్రపంచాధినేతలు ప్రపంచపటంలో సరిగా కనబడని కొరియా ద్వీపంలోని సమస్యలను ముఖ్యంగా ఉత్తర కొరియా దేశంలోని అణ్వాయుధాల ఉత్పత్తులను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అణ్వాయుధాల కన్నా ప్రమాదకరమైన ఇజ్రాయిల్ దేశ ఆయుధ సంపత్తిని, అంతకంటే ఎక్కువగా ఫ్రాన్స్, జర్మన్, స్వీడన్, చైనా, రష్యా, అమెరికాలు తయారుచేస్తున్న బాంబులు, మిసైల్స్, ఇతర మారణాయుధాలను, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అప్పులిచ్చి మరీ అమ్ముకొంటున్నారు.
ప్రపంచంలోని ఉగ్రవాదానికి ఊతమిచ్చే ఆయుధ సంపత్తిని సమకూరుస్తుంది ఈ దేశాలే. తమ కనుసన్నల్లో ఉండే ప్రభుత్వాలను మాత్రమే మిత్ర దేశాలుగా ప్రకటిస్తూ, మిగతా తటస్థ దేశాలను లేదా స్వయం పోషక దేశాలుగా ఎదిగిన దేశాలను, ఆదేశాధినేతలను అణగద్రొక్కడమే అగ్రరాజ్యాల కుటిల రాజనీతి. అందులో భాగంగానే పాకిస్తాన్ మన దేశంలో ఎన్నికలు జరగడానికి ముందు దాడులకు పాల్పడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగ స్ఫూర్తితో నిలబెట్టుకోవడానికి ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు తమ మనస్సాక్షిగా వోటువేయాల్సిన అవసరం ఉంది. గత 16 సాధారణ ఎన్నికల్లో ఎన్నికైన ఏ పార్టీ నేతలైనా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పాలించారు. అధినేతలు తమకు అనుకూలమైన నియంత్రిత్వ ధోరణులనే అవలంబించారు. ముఖ్యంగా గత అయిదు సంవత్సరాలలో స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు సంకెళ్ళు వేసేలా పాలన సాగింది.
అన్ని ప్రజాస్వామ్య సంస్థలను, చట్టాలను కాలరాచిన పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాల్సిన వేళ ఇది. అవినీతి రహిత పారదర్శక పాలనకు ఉతమిచ్చే సమాచార హక్కు చట్టాన్ని అనేక విధాలుగా అవహేళన చేస్తూ, సామాజిక కార్యకర్తలను అణగదొక్కిన సంఘటనలు అనేకం. లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందినా, లోక్‌పాల్ అధినేతను నియమించడానికి ఐదేళ్ల కాలంలో నిర్లిప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు, సుప్రీం కోర్టు వేసిన మొట్టికాయలతో, ప్రతిపక్ష నాయకులు లేకుండానే లోక్‌పాల్‌ను నియమించడం ఆ సంస్థ పట్ల తమకున్న నిర్లక్ష్యానికి, నిర్లిప్తతకు నిదర్శనం.
ఈ పరిస్థితులకు ఒక్క భాజపానో, కాంగ్రెస్ పార్టీనో నిందించి లాభం లేదు. జాతీయ పార్టీల ఆగడాలకు అడ్డుకట్ట వేయగల శక్తి ఒక్క ప్రాంతీయ పార్టీల సమాఖ్యకే ఉంది. ప్రాంతీయ పార్టీల అండ లేకుండా జాతీయ పార్టీలు అన్ని రాష్ట్రాల్లో పోటీపడడం కానీ గెలవడం కానీ అసంభవం అనే విషయాన్ని గత ఎన్నికలు నిరూపించాయి. ప్రతిపక్ష పార్టీల మధ్య చీలిపోయే వ్యతిరేక ఓటును కట్టుదిట్టం చేసినందునే ఆయా పార్టీల అభ్యర్థులు గెలవగలుగుతున్నారు. అదే స్ఫూర్తితో బిజెపి- కాంగ్రెస్ పార్టీలను కాదని ప్రాంతీయ పార్టీల సమాఖ్య ఆలోచనలకు పూర్తి రూపం ఇస్తే, దేశంలో నిజమైన ఫెడరల్ ప్రభుత్వం ఏర్పడుతుంది.

-సిహెచ్‌వి ప్రభాకర్‌రావు