సబ్ ఫీచర్

రాజాలా బతుకుతున్న రాజ్‌గోండులకు సలామ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని రాజ్‌గోండ్ ఆదివాసీలకిప్పుడు మోటారు సైకిళ్లు, కార్లు, ఇళ్లల్లో పాశ్చాత్య పద్ధతి శౌచాలయాలు, మరెన్నో సౌకర్యాలతో ఆర్థికంగా ఎంతో ఎదిగి కనిపిస్తున్నారని బ్రిటీషు మానవ పరిణామ శాస్తవ్రేత్త (ఆంథ్రపాలిజిస్టు) మిశ్చల్ యార్కె ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో చెప్పారు.
ఆస్ట్రియాకు చెందిన మానవ పరిణామ శాస్తవ్రేత్త, ఆదిలాబాద్ రాజ్‌గోండ్‌లపై విస్తృత అధ్యయనం చేసి, వారి జీవితాల్లో చెరగని ముద్రవేసిన హెమన్ డార్ఫ్ శిష్యుడే ఈ యార్కె. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రాజ్‌గోండ్ ఆదివాసీలపై హెమన్ జరిపిన అధ్యయనాన్ని కొనసాగించేందుకు యార్కె 1976-78 ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లాలో చాలారోజులు గడిపారు. అధ్యయనం చేశార. నాలుగు దశాబ్దాల అనంతరం ఇప్పుడు 2019 సంవత్సరంలో వచ్చినప్పుడు తాను చూసిన ‘‘మానవ పరిణామాన్ని’’ పేర్కొన్నారు. యార్కె గతంలో బి.బి.సి.కోసం రాజ్‌గోండ్‌లపై తీసిన చిత్రం ఎందరినో ఆకర్షించింది. అవార్డులు పొందింది. 1962 సంవత్సరంలో యార్కె ఇంటి నుంచి పారిపోయి భారతదేశానికి చేరుకుని తన గురువు హెమన్ డార్ఫ్ చేపట్టిన పనిని కొనసాగించారు. ఆ పని ఆయనకెంతో ఉత్సాహాన్ని- ఉత్తేజాన్ని- ఆనందాన్ని కలిగించింది. సుసంపన్నమైన రాజ్‌గోండ్ సాంస్కృతిక వారసత్వంపై సంపూర్ణంగా అధ్యయనం చేశాడు. దాంతో ఆ రంగంలో మంచి గుర్తింపును పొందాడు.
75 సంవత్సరాల యార్కె తిరిగి మరోసారి అసిఫాబాద్, ఆదిలాబాద్‌లను సందర్శించారు. కాలక్రమంలో చోటుచేసుకున్న పరిణామాలను చిత్రికపట్టారు. ఇప్పుడు ఆదివాసీ ప్రాంతంలో ఘననీయమైన మార్పు చోటుచేసుకుందని, విద్య- ఉద్యోగ రంగాలలో రాజ్‌గోండ్‌లు గొప్ప ముందడుగు వేశారని శ్లాఘించారు. ఇటీవల కేస్లాపూర్‌లో జరిగిన ‘నాగోబా జాతర’ను ఆయన సందర్శించి అబ్బురపడ్డారు. గతంలో చిన్నగా, పరిమిత స్థాయిలో జరిగే ఉత్సవం- జాతర ఇప్పుడు అనూహ్య రీతిలో విశాల పద్ధతిలో, విస్తృత రీతిలో పెద్ద సమూహంతో కలిసి జరుపుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. వాళ్లు ఆధునీకరణను అనుసరించి అభివృద్ధి సాధిస్తుంటే తాను అడ్డుకుని ఆదివాసీలను మ్యూజియంలకే పరిమితం చేయబోనని స్పష్టం చేశారు. రాజ్‌గోండ్‌లు ఆధునిక- పురోగమన గ్రూపుగా ఉబికి వస్తున్నారని, అది వారి బలమైన కోరిక అని ఆయన పేర్కొన్నారు. ఆయన అర్ధ శతాబ్ద క్రితం నాటి ఫొటోలను ప్రదర్శించారు. అవి ఈనాటి కొత్త తరాలను అబ్బురపరిచాయి.
వాణిజ్య పంట పత్తిని పండిస్తామని వారు గతంలో కలలోనైనా ఊహించలేదని ఇప్పుడు పత్తిని విస్తృతంగా పండిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారని ఆయన గుర్తుచేశారు. గతంలో మాదిరి ఆదివాసీలు జొన్న ఆహారం తీసుకోవడం లేదు... పండించడమూ లేదని కూడా పేర్కొన్నారు. ఒక బ్రిటీషు ఆంథ్రపాలజిస్టు పరిశీలనలోకి వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆ ప్రాంతంలో సమూల మార్పుల కోసం సాయుధ పోరాటం ప్రారంభించిన అప్పటి పీపుల్స్‌వార్ గ్రూపు నాయకులు, ప్రస్తుత మావోయిస్టులు పూర్తిగా విఫలమయ్యారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా కట్టడంలో మావోయిస్టులు అత్యుత్సాహం ప్రదర్శించడం తప్ప వాస్తవాలను పట్టించుకోరని పలుసార్లు రుజువైంది. ఉత్తర తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైన సమయంలోనే యార్కె తన అధ్యయనాన్ని ఆదిలాబాద్‌లో ప్రారంభించడం గమనార్హం. అప్పటి ఆదివాసీల జీవితాలను మార్చేందుకు, దోపిడీ నుంచి విముక్తి కల్పించే నెపంతో అడవిలోకి అడుగిడి ఆయుధాలతో- ఆయుధం లాంటి పాటలతో ఆదివాసీలను ఆకర్షించి సంఘటిత పరిచి వారిని ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దుతామని ‘వాగ్దానం’ చేసిన నక్సలైట్లు ఇప్పుడు ఆ ప్రాంతంలో కనిపించకుండాపోయారు.
కాలం కదులుతున్నకొద్దీ, మారుతున్న పరిస్థితులను అర్థంచేసుకుని అందుకు అనుగుణంగా ఎదుగుతూ రాజ్ గోండులిప్పుడు మోటార్ సైకిళ్లు, కార్లు, పాశ్చాత్య పద్ధతులో గృహాలు నిర్మించుకుంటున్నారని మావోయిస్టులు గుర్తించకపోవడం దారుణం. పేదలు- ఆదివాసీలు అర్థశతాబ్దం క్రితం మాదిరి అవే గుడిశెల్లో, అవే పశువుల కొట్టాల్లో, ఎద్దుల బండ్లతో, పాత పంటలతో పొద్దుపుచ్చాలని భావిస్తున్నారు. రాజ్‌గోండులు మాత్రం ఎవరి ‘‘బోధనలు’’ వినకుండా సహజసిద్ధమైన ‘‘పరిణామక్రమాన్ని’’ అనుసరించి లోకంతో కలిసి నడిచేందుకు సిద్ధమై ఆర్థికంగా బలపడ్డారని బ్రిటీషు పరిశీలకుడు చెప్పినా చెవికెక్కకపోతే ఎలా? ఒకప్పుడు గెరిల్లా దళాలతో ఆ ప్రాంతాలను రాజకీయంగా ‘కలుషితం’చేసి తప్పుకున్న నక్సలైట్లు మానవ పరిణామక్రమాన్ని సజావుగా అర్థంచేసుకోలేదని వెల్లడవుతోంది. కేస్లాపూర్ జాతర నిర్వహణ, సంప్రదాయ పంటలు పండించడం, కట్టు బొట్టులో చోటుచేసుకున్న సంస్కరణలు, తమ శ్రమ, బౌద్ధికశక్తితో ఆర్థికంగా ఎదిగి ప్రపంచంతో కలిసి అడుగేసేందుకు పడుతున్న ఆరాటం, అభివృద్ధికోసం విద్యపై మక్కువ పెంచుకుని వివిధ వృత్తివిద్యల్లో రాణిస్తూ డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదుగుతున్న వైనాన్ని మావోయిస్టులు గుర్తించకపోవడాన్ని ఎవరైనా ఎలా అర్ధం చేసుకుంటారు? తాజాగా గోండు చిత్రకారులు సైతం ఆదివాసీ చిత్రాలను కార్పొరేట్ సంస్థలకు అమ్ముతున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల గూడాలు, రాజ్‌గోండ్ ఆవాసాలు ఎలా రూపాంతరం చెందుతున్నాయో బ్రిటీష్ ఆంథ్రోపాలజిస్టు చెబితేనైనా పట్టించుకోవాలి కదా? ఆయన అధ్యయనాన్ని గౌరవించాలి కదా? గొప్ప ముందడుగు రాజ్‌గోండులు వేశారని ఇచ్చిన కితాబును గుర్తించాలి కదా? కళ్ళముందు కనిపిస్తున్న పరిణామాల్ని పట్టించుకోవాలి కదా?... ఒకప్పుడు భయంకరమైన అటవీ ప్రాంతంగా, అనాగరిక ఆవాసాలుగా పేరొందిన భూభాగమిప్పుడు ఆధునిక నాగరికతతో వైఫై సౌకర్యాలతో, 4జి సేవలతో తులతూగుతున్నాయి. ఈ అభివృద్ధిని ఎవరో బలవంతంగా వారిపై రుద్దడం లేదు. రాజ్‌గోండులే ఆహ్వానించి అక్కున చేర్చుకుంటున్నారు. ఈ పరిణామాన్ని ప్రతిఘటించడం భావ్యం కాదని మానవాధ్యయనవేత్త పేర్కొన్నప్పుడు మావోయిస్టుల మనసులో ఈ విషయం నాటాలి కదా? అదేమిటో గాని మావోయిస్టులు ఈ పరిణామాల్ని పట్టించుకోకుండా ఇంకా సాయుధ దళాల ఏర్పాటు, వాటి బలోపేతంపై సమయాన్ని, నిధుల్ని ఖర్చుపెడుతున్నారు. ఆంథ్రోపాలజిస్టు దృక్పథానికి, మావోయిస్టుల వైఖరికి ఎంత తేడా ఉందో దీన్ని బట్టి ఊహించవచ్చు. పూర్తి అశాస్ర్తియ పద్ధతిలో ఆలోచిస్తూ, శాస్ర్తియ సిద్ధాంతాన్ని అమలుజరుపుతున్నామని మావోలు పేర్కొనడం ఎంతటి అజ్ఞానం? ఆదివాసీలను, రాజ్‌గోండులను యథాతథంగా మ్యూజియాలలో ప్రదర్శించలేమని పేర్కొన్న మిశ్చల్‌యార్క్ అవగాహనకు, వారు దోపిడీకి గురవుతున్నారు... వారికి విముక్తి కల్పించేందుకు సాయుధ దళాలను నిర్మించండని చేసే మావోల బోధకు పొంతన కుదురుతున్నదా? గత 40 ఏళ్ళలో రాజ్‌గోండులు ఏ సాయుధ పోరాటం చేసి ఇంత అభివృద్ధిని, స్వావలంబనను సాధించారు? విదేశీ శాస్తవ్రేత్త కళ్ళకు కనిపించిన గొప్ప ‘మార్పు’ మావోయిస్టులకు కనిపించకపోవడం వింతల్లోకెల్లా వింత. ఇదిలా ఉంటే తాజాగా మావోయిస్టు పార్టీ అనేక ఎదురుదెబ్బలు తగిలాక, అనేక రాష్ట్రాలలో అనేక మంది మావోయిస్టులు లొంగిపోతున్న సందర్భంలో, ఎన్నో ఎన్‌కౌంటర్లలో ఎందరో మరణిస్తుండగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ఆరంభించారన్న వార్తలు వెలువడుతున్నాయి. కేంద్ర కమిటీలోకి కొత్తగా ఆరుగురిని తీసుకుని ఉద్యమానికి పూర్వవైభవం తీసుకురావాలని యత్నిస్తున్నారని వినికిడి. 2017 సంవత్సరంలో ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ సమాధాన్‌తో కుదేలైన పార్టీని నిలబెట్టేందుకు పునరంకితమవ్వాలని పథకం రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే మావోలకు ‘తత్వం’ బోధపడినట్టు కనిపించడం లేదు. ఆ అజ్ఞానంతో ఇంకెంత మంది ఆదివాసుల ప్రాణాలు బలిగొంటారో?

-వుప్పల నరసింహం 99857 81799