సబ్ ఫీచర్

ఎవర్‌గ్రీన్ మిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మఱ్ఱి విత్తనం అణువంతే. తడి తగిలి జీవం పోసుకుంటే -మహా వృక్షమవుతుంది. ఆకాశానికి విస్తరిస్తుంది. గాల్లో తేలిపోతున్న భూమిని వేళ్లతో బిగించి పట్టుకోగలిగే శక్తిని పుంజుకుంటుంది. మర్రి విత్తనం అణువంతే.
అవకాశం కూడా సూక్ష్మమంతే. దాపు దొరికి దారి పట్టుకుంటే- తరువును మించిపోతుంది. తూరుపు పొద్దున సూర్యుడవుతుంది. విశ్వానికే వెలుగునివ్వగల మహాశక్తిగా అవతరిస్తుంది. అవకాశం సూక్ష్మమంతే.

మర్రి విత్తనం నుంచి మహశక్తిగా ఎదిగినవాడు -జిత్‌మోహన్ మిత్ర. విశ్వనాథ్ ‘శంకరాభరణం’ చూసినోళ్లకు మోహన్‌మిత్ర ముఖాన్ని పరిచయం చేయక్కర్లేదు. ఆ సినిమాలో పాశ్చాత్య సంగీత మిత్ర బృందానికి లీడర్‌గా -శంకరశాస్ర్తీని, ఆయన సంగీత ప్రతిభను అవహేళన చేసిన బెల్‌బాటమ్ కుర్రాడు. ఒడ్డూ పొడుగూ ఒప్పించేలా ఉండటంతో -చిన్న పాత్రే సన్నివేశానుగుణంగా గుర్తుండిపోతుంది. ‘హల్లో శంకరశాస్ర్తీ/ హౌ ఆర్ యూ ఏరియల్ శాస్ర్తీ’ అంటూ పాశ్చాత్య పోకడతో శంకరశాస్ర్తీని పరాభవించబోయి పరాభవానికి గురైన బెల్‌బాటమ్ బృంద పాటగాడిగా జిత్‌మోహన్‌మిత్ర పరిచయమయ్యాడు. సినిమాలోని అండర్ కరెంట్ మెసేజ్ -ఆ సాంగ్ తరువాతి సన్నివేశంలో నిక్షిప్తం చేశాడు దర్శకుడు విశ్వనాధ్. అంతగా ఆ సీన్ శంకరాభరణానికి హైలెట్ అయ్యింది. విశేషమేమిటంటే, ఆ చిత్రంలో ప్రతి ఒక్కరూ ఏదోక విభాగంలో పనిచేసి ఉంటారు. జిత్‌మోహన్ మిత్ర మాత్రం మూడు విభాగాల్లో పని చేశాడు. పాట రాయడం, పాడటం, నటించడం. రచయితగా, గాయకుడిగా, నటుడిగా మూడు బాధ్యతలు మోశాడు మిత్ర. అలా చిత్ర పరిశ్రమలో దొరికిన చిన్న అవకాశంతో అల్లుకుంటూపోయి -దాదాపు 210 చిత్రాలను పూర్తి చేయడం అతని ప్రతిభకు తార్కారణం.
ఏదైనా సరే సరికొత్త పాత్ర, గుర్తుండిపోయే పాత్రలే చేశాను -ఇదీ అతని మాట. రాజమహేంద్రవరం వాస్తవ్యుడైన జిత్‌మోహన్ మిత్ర విద్యాభ్యాసమంతా అక్కడే పూరె్తైంది. 1964లో చీఫ్ ఇంజనీర్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ 1966-68లో నైట్ కాలేజీలో ఎల్‌ఎల్‌బి కోర్సు పూర్తి చేశాడు. తరువాత ఉద్యోగం వదిలేసి హైకోర్టులో ప్రాక్టీసు. మళ్లీ 1970లో రాజమండ్రికి తిరుగుటపా. తనలోని గాత్ర శక్తిని నిర్లక్ష్యం చేయడం ఇష్టంలేక ఓ మ్యూజికల్ ఆర్కెస్ట్రాకు శ్రీకారం చుట్టాడు. అలా మొదలైన బ్యాండ్ ప్రస్థానం -7వేల ప్రోగ్రామ్స్ దాటి ఇంకా సాగిపోతోంది. అందుకే -‘నేనేం చేసినా బంపర్ హిట్టే’ అంటూ ఆనందం వ్యక్తం చేస్తాడు జిత్‌మోహన్ మిత్ర.
1954లో థర్డ్ ఫారం చదువుతున్న టైం. ఓ వేడుకలో బైజుబావారా చిత్రంలోని ‘దునియాకే రఖ్ వాలే’ పాట మార్మోగింది. శ్రోతలు నాన్‌స్టాప్ చప్పట్లు కొట్టారు. అలా మొదలైన పాట -జిత్‌మోహన్‌మిత్ర గాత్రంలో ఇంకా నిత్యయవ్వనమవుతుంది.
ఓవైపు గాయకుడు. మరోవైపు నాటక సమాజాల్లో నటుడు. క్రమంగా రాణింపు అలవాటైపోయింది. ‘తండ్రి, అన్నల ప్రేరణతోనే కళాకారుడినయ్యా’నని సగర్వంగా చెప్పుకుంటున్నాడు మిత్ర. ఆంధ్ర వర్శిటీ విద్యార్థిగా ఉన్నపుడే అనేక అవార్డులు అతన్ని ప్రేమించాయి. మరో కోణమేమంటే -స్పోర్ట్స్‌మెన్‌గా జాతీయస్థాయిలో కబడ్డీ, బాల్‌బాడ్మింటన్, బాస్కెట్‌బాల్, షాట్‌పుట్, హేమర్, జావలిన్‌త్రో వంటి క్రీడలలో నైపుణ్యం ప్రదర్శించడం. ఇప్పటికీ ఇంత ఆరోగ్యంగా ఏ పాటైనా పాడగలిగిన జ్ఞాపశక్తి ఉన్నదీ అంటే -అది క్రీడారోగ్య రహస్యమేనంటాడు ఈ మిత్రుడు. 1969లో బాపు దర్శకత్వంలో బుద్ధిమంతుడు చిత్రానికి తొలిసారిగా మేకప్ వేసుకున్నాడు. తీరా చూస్తే -ఆ సీన్ ఎడిటింగ్‌లో మాయమైంది. మళ్లీ బందిపోటులో జమున కాంబినేషన్‌లో నటించాడు. దానిపైనా -కత్తెర దెబ్బపడింది. సినిమాలు అచ్చిరావులే అన్న ఆలోచనకు వచ్చింది ఆ టైంలోనే. ఒక ద్వారం మూసేస్తే -ఎక్కడో మరో ద్వారం తెరుస్తాడు దేవుడంటారు పెద్దలు. జిత్‌మోహన్‌మిత్ర లైఫ్‌లో అదే జరిగింది. సినిమా మోజు తీరదులే అనుకుంటున్న తరుణంలో -1975లో ముత్యాలముగ్గు పడింది. సినిమాలో కీచకుడనే విలన్‌గా బుల్లి వేషం వేశాడు. ‘దర్శకుడు బాపు ప్రత్యేకంగా పిలిచి -పాత్రను ఇవ్వడం పూర్వజన్మ సుకృతం’ అంటాడు జిత్‌మోహన్ మిత్ర. ఈసారి ఎడిటింగ్‌లో ఆ పాత్ర పోలేదు. అలా బాపు సినిమా బొమ్మల కొలువులో స్థానం దొరికింది. తరువాత సిరిసిరిమువ్వలో పోలీసు అధికారిగా, మళ్లీ అదే పాత్రని హిందీ సర్గమ్‌లోనూ చేశానంటాడు. నటుడిగా అతనికి బాపు, కె విశ్వనాథ్‌లు అందించిన సహకారం మరువలేనిది. ‘1980లో శంకరాభరణంలో చేసిన పాత్రకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, వొరియా భాషల్లో నటించే అవకాశం తెచ్చింది. 42ఏళ్లుగా రాజమండ్రిలో ఏ షూటింగ్ జరిగినా లైజాన్ ఆఫీసర్‌గా సేవలు అందించానని, అలా పరిశ్రమే నాదగ్గరికి వచ్చి నా చేత పని చేయించుకుందని గర్వంగా చెబుతాడు మోహన్‌మిత్ర. ఆనందభైరవిలో చిన్నపుడు హీరోయిన్‌ని సాకే తండ్రిగా, అలాగే జంధ్యాల మొదటి చిత్రం ‘ముద్దమందారం’లో హిందీ పాటకి పేరడీగా రాసిన ‘నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి’ అంటూ జిత్ పాడిన పాటకు ప్రపంచవ్యాప్తంగా అద్భుత ఆదరణ లభించింది. శంకరాభరణం తరువాత సప్తపదిలో ‘గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన’ పాటలో నటనకుగాను వచ్చిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. నాకు బాగా పేరు తెచ్చిన ఆ రెండు పాటల విశేషాలను వివరించారు జిత్‌మోహన్ మిత్ర.
‘శంకరాభరణంలో మొదటగా నేను పాడాల్సిన పాట హార్మోనియం వాయిస్తూ సంగీతం నేర్పే మాస్టారు పాడిన ‘బ్రోచేవారెవరురా నిను వినా రఘువరా’ పాట. కానీ ఆ పాటను అప్పటికే కెవి మహదేవన్ అనుచరుడు పుహళేంది ఓ భాగవతార్‌ను పిలిచి పాడించేశారు. ఆయనకు అడ్వాన్స్ ఇవ్వడమూ జరిగిపోయింది. దర్శకులు విశ్వనాథ్ ఆ పాటను నా చేత పాడించాలనుకున్నారు. ఆ విషయానే్న మహదేవన్‌కు చెప్పారు. కానీ పుహళేంది నన్ను పక్కకు పిలిచి భాగవతార్‌తో పాడించిన సంగతి లోపాయికారిగా చెప్పి దర్శకుడికి చెప్పవద్దన్నారు. ఆ విషయాన్ని దర్శకుడు విశ్వనాథ్ గమనించారు. తరువాత ఏవిధంగానైనా నాతో పాట పాడించాలని ఆలోచించి చివరికి పాశ్చాత్య సంగీత గాయకుడిగా పాత్రను సృష్టించి అప్పటికప్పుడు, శంకరశాస్ర్తీని అవహేళన చేస్తూ ఓ పాట ఉండే బాగుంటుందని నిర్ణయించారు. అలా అప్పటికప్పుడే నాకు చెప్పడం, నేను ‘హల్లో శంకరశాస్ర్తీ’ పాటను అప్పటికప్పుడే చెప్పడం, ‘లంబోదర లకుమికరా’ గీతాన్ని జత చేయడంతో ఆ పాటకు ఓ వైవిధ్యమైన బాణీ లభించింది. అది నచ్చి వెంటనే నాచేత పాడించడం, చిత్రీకరించడం చకచకా జరిగిపోయాయి.
అలాగే సప్తపదిలో ‘గోవుల్లు తెల్లన’ పాట కూడా. ఈ చిత్రంలో చిన్నబాబుగా నటించింది నా కూతురే. ఈ పాట చిత్రీకరణ నరసరావుపేట దగ్గరవున్న అడవి ప్రాంతంలో చిత్రీకరించారు. దాదాపు 300 ఆవులు, ఆంబోతులను చుట్టుప్రక్కల ఊళ్లనుంచి తీసుకొచ్చారు. మామూలుగా మూడు రోజుల్లో పాటను షూటింగ్ చేయాలనుకున్నా, అక్కడవున్న ఎండ వేడిమికి తట్టుకోలేక ఒక్కరోజులోనే పూర్తిచేశారు. ఈ పాట ఇప్పటికీ నాకు గుర్తింపునిస్తోంది’ అంటాడు జిత్‌మోహన్ మిత్ర. సీతారత్నంగారి అబ్బాయిలో బ్రహ్మానందం కాంబినేషన్‌లో ‘వయ్యగారూ మా వక్కండి’ అన్న డైలాగ్‌కు ప్రేక్షకులనుంచి మంచి ఆదరణ లభించింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడలేదు.
రమేష్‌నాయుడు స్వరపరిచిన ముద్దమందారంలో పాట ‘నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి’ అన్నపాట ఇపుడు ఏ కార్యక్రమం చేసినా ఖచ్చితంగా పాడాల్సిందే. అసలు ఆ పాటను రమేష్‌నాయుడు నా చేత పాడించడమే ఆయన గొప్పదనం. అలాగే శంకరాభరణం షూటింగ్ సమయంలో కూడా కెవి మహదేవన్‌కు నన్ను పరిచయం చేసినపుడు ఆర్‌డి బర్మన్ బాణీలో, రఫీ బాణీలో, కిషోర్‌కుమార్ బాణీలో నేను పాడటం ఆయనకు నచ్చింది.
నా ఆర్కెస్ట్రాలో పాటలో నృత్యం చేయడంతో కెరీర్ మొదలుపెట్టిన అలీ అభివృద్ధిని చూసి ఆనందపడతా. అలాగే రాజబాబు కూడా మా ఆర్కెస్ట్రాలో నృత్యం చేయడం నాకు గర్వకారణం. ఇవన్నీ ఒకెత్తు అయితే పాండురంగడు చిత్రంలో కె విశ్వనాథ్‌తో కలిసి నటించడం జీవితంలో పెద్ద అదృష్టంగా భావిస్తున్నా. ఒకప్పుడు నెలలో 20 కార్యక్రమాలు చేసేవాడిని. ఇపుడు ఏదైనా ప్రత్యేకత వుంటేనే చేస్తున్నాను. అప్పటి దర్శకులు ఇపుడు లేరు. అందుకే దూరంగా ఉంటున్నా. మంచి పాత్రలు అవకాశంవస్తే చేయడానికి సిద్ధమే! ఇదంతా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను కానీ నా ప్రతిభ అనుకోను. 12సార్లు కిషోర్ కుమార్ అవార్డులు వరించాయి. అలాగే రెండుసార్లు మన్నాడే, రెండుసార్లు మహ్మద్ రఫీ, ఓసారి ఘంటసాల, మరో రెండుసార్లు బాలసుబ్రహ్మణ్యం అవార్డులు లభించడంతో ఈ జన్మకివి చాలు అనుకుంటాను. నాకు ముగ్గురబ్బాయిలు, అమ్మాయి. అందరూ జీవితంలో స్థిరపడ్డారు. రాజకీయంగానూ క్రీయాశీలంగా ఉంటున్నాను.
ఇప్పటి సినిమాల గురించి చెప్పాల్సి వస్తే అంకెలు లెక్కపెట్టి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వమంటున్నారు. అందరూ సింగర్లే. అందరూ నటులే. సినిమా ప్రజల దగ్గరకు వెళ్లే స్థోమత కోల్పోయింది. సరియైన అవగాహన లేకుండా కథకులు, దర్శకులు వస్తున్నారు. కథాగమనం, నృత్యం, సంగీతం, మోరల్స్‌లాంటివి ఏవీ ఉండటం లేదు. అప్పట్లో ప్రతీ విషయంలో సాధన చేసేవారు. ఇపుడంతా గంటలో అయిపోవాలి. బిట్లుబిట్లుగా తీసి కలిపేస్తున్నారు. కంగారు కంగారుగా కంపోజ్ చేస్తున్నారు. అన్నీ క్రాఫ్ట్‌లు కలగలిసి పనిచేయకపోవడంతో సినిమాలో వున్న టెంపో నిర్వీర్యమైపోతోంది. సంవత్సరానికి ఎన్ని సినిమాలు వచ్చినా కేవలం మూడు నాలుగు సినిమాలు మాత్రమే ప్రేక్షకులను చేరుతున్నాయి అంటూ ముగించారు.

-సరయు శేఖర్, 9676247000 (సహకారం: జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి)