సబ్ ఫీచర్

అద్దంలో మేరుపర్వతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరణానికి అభిముఖంగా ప్రయాణించడమే -జీవితం. ఆ ప్రయాణంలో అనుభవంలోకి వచ్చే ప్రతి సన్నివేశమూ -పాఠమే. అలా అనేక విషయాలు తెలుసుకుంటూ, సాగే ప్రయాణానికి అన్వయించుకుంటూ -గమ్యానికి సాగిపోతుంటాం. మహానటుడు యన్‌టి రామారావు జీవితమూ అనేక అనుభవాల సమ్మేళనం. ఆయన జీవితంలో అన్నిరసాలు కనిపిస్తాయి. నటుడిగా జీవితాన్ని ప్రారంభించి మహానాయకుడిగా ఎదిగిన విధానం ప్రతీ తెలుగోడి కళ్లముందు కదలాడిన సినిమాయే. నటుడిగా కీర్తిశిఖరాలు చేరుకుని, సేవ పేరిట జనంలోకి రావడాన్ని ఏమని సమర్థించుకుంటారు అన్న ఒక ప్రశ్నకు ఆయనిచ్చిన సమాధానం -జీవితాన్ని పండించుకోవడానికి అని. జీవితంలో అన్ని దశలూ రుచిచూశాక చిట్టచివరి ప్రస్థానం ఏంటి అంటే నలుగురికి ఉపయోగకరమైన జీవితాన్ని గడపడమేనన్నది ఆయన భాష్యం. ఓ సందేశంగా తన జీవితాన్ని అందిస్తూ రాజకీయాల్లో సంచలనం రేపిన ఆయన ప్రజలకు, తనకిష్టమైన ప్రేక్షకులను దేవుళ్లుగా భావించి సమర శంఖారావం పూరించాడు స్వచ్ఛమైన పరిపాలన కోసం. అకుంఠిత దీక్షతో అచంచల ఆత్మవిశ్వాసంతో, అభిమానుల ఆదరణతో రాజకీయ వైకుంఠపాళిలో మొదటి మొట్టులోనే అద్భుతమైన సినీ గ్లామర్ నిచ్చెనెక్కి నేరుగా ముఖ్యమంత్రి అయ్యారు. దీని వెనుక దాదాపు 50 ఏళ్ల సినీ జీవిత ప్రస్థానం లేకపోలేదు. అనేక చిత్రాల్లో వివిధ పాత్రలతో తన స్వభావాన్ని ప్రేక్షకులకు రుచి చూపిన యన్టీఆర్, రాజకీయ అరంగేట్రం చేయగానే సీఎం అయ్యారంటే అదంతా సినీ గ్లామర్ మహిమే. అటువంటి ప్రస్థానానికి తొలి అడుగులు వేయించిన సినీ జీవితం గురించి, ఆయన అనేక చిత్రాల్లో ధరించిన పాత్రలు, స్వభావాలు, ఆహార్యాలు తదితర అంశాలను తీసుకొని సినీ విజ్ఞాన విశారద ఎస్వీ రామారావు ఓ లఘు చిత్రం రూపొందించారు. ఇది ఓ రకంగా ఎన్టీఆర్‌పై రూపొందించిన చిన్న బయోపిక్. విశ్వవిజేత ఎన్టీ రామారావు పేరిట రూపొందిన లఘు చిత్రాన్ని అమ్మకానికి పెట్టలేదు. కేవలం అభిమానులకు ఎన్టీఆర్ గొప్పదనాన్ని తెలిపేందుకే లఘు చిత్రాన్ని రూపొందించానని అంటున్నారు రామారావు. గత ఏడాది ఎన్టీఆర్ అవార్డును నటుడు చలపతిరావుకు విజయవాడలో అందించిన సందర్భంలో కార్యక్రమం మరికాస్త హంగు ఆర్భాటాలతో ఉండాలన్న కోరికతో, ఎన్టీఆర్‌పై వున్న అభిమానంతో ఈ లఘు చిత్రాన్ని రూపొందించడం జరిగింది. తరువాత ఈ లఘు చిత్రాన్ని నెల్లూరు, గుంటూరు తదితర పట్టణాల్లోనూ ప్రదర్శించారు.
శోభనాచల పిక్చర్స్ పతాకంపై సినిమాలు రూపొందించే నటి సి కృష్ణవేణి కథానాయికగా రూపొందిన ‘మనదేశం’తో ఎన్టీఆర్ నట ప్రస్థానంలో మొదటి అడుగుపడింది. తరువాత సోలో హీరోగా, షావుకారు జానకి కథానాయికగా విజయవారి తొలి చిత్రం ‘షావుకారు’ రూపొందించారు. ‘పలుకరాదటే చిలుక- సముఖంలో రాయబారమెందులకు’ అంటూ నూనూగు మీసాల ఎన్టీ రామారావు ఆలపించే గీతం లఘు చిత్రంలో ఉంది. తోటరాముడిగా ఆయన పాతాళభైరవిలో పోషించిన పాత్ర ఆయనను జానపద కథానాయకుడిగా నిలబెట్టింది. నేపాళ మాంత్రికుడు పాతాళభైరవిని ప్రసన్నం చేసుకోవడానికి గుహలోకి తీసుకెళ్లి బొడ్డుదేవరను గదతో పగలగొట్టమని చెప్పే సన్నివేశాన్నీ ఇందులో చూడొచ్చు. ఆ సన్నివేశ చిత్రీకరణలో ఎంత కష్టంవున్నదన్న విషయాన్నీ ఇందులో వివరించారు. తరువాత బిఎన్ రెడ్డి -్భనుమతి కథానాయికగా రూపొందించిన అద్భుత చిత్రరాజం ‘మల్లీశ్వరి’లో ‘ఆకాశ వీధిలో హాయిగా ఎగిరే మేఘం’ తన ప్రియురాలికి వర్తమానం అందజేయమని చెప్పడం నిక్షిప్తం చేశారు. భానుమతి దర్శకత్వంలో రూపొందిన చండీరాణి చిత్రంలో సిఆర్ సుబ్బరామన్ సంగీత దర్వకత్వంలో రూపొందించిన ‘ఓ తారక ఓ జాబిలి’ పాటను చక్కగా గుదిగుచ్చారు. రాజమకుటం చిత్రంలో గుమ్మడితో కత్తియుద్ధం, గులేబకావళి కథ చిత్రంతో సినీ గేయ రచయిత సి నారాయణరెడ్డిని పరిచయం చేస్తూ ‘నన్ను దోచుకుందువటే వనె్నల దొరసాని’ పాటనూ ఈ లఘు చిత్రంలో చూపారు. రామానాయుడు నేతృత్వంలో రూపొందిన ‘రాముడు భీముడు’ అనే సాంఘిక చిత్రంలో తొలిసారిగా ఎన్టీ రామారావు ద్విపాత్రాభినయం చేశారు. తరువాత విఠలాచార్య రూపొందించిన జానపద చిత్రం అగ్గిపిడుగులోనూ ఆయన ద్విపాత్రాభినయాన్ని చూడొచ్చు. ద్విపాత్రిభినయంలో అటు జానపదానికి ఇటు సాంఘికానికి వున్న తారతమ్యాన్ని లఘు చిత్రంలో చూపించారు. ‘ఏదో ఏదో యిది/ నాకేమో ఏమో అయినది’ పాటలో కృష్ణకుమారితో ఆయన నటించిన విధానం అద్భుతమనిపిస్తుంది. తిరుగులేని కథానాయకుడిగా కొనసాగుతున్న ఆయన డివిఎస్ రాజు రూపొందించిన ‘పిడుగు రాముడు’ చిత్రంలో రాజశ్రీ కథానాయికగా వచ్చిన ఈ చిత్రంలో కథానాయకుడు ఆడవేషం వేసి రాజనాలను ఆటపట్టించిన విధానం ముచ్చటనిపిస్తుంది. ‘రంగులు రంగులు రంగులు.. ఓహో రమణుల వయసుల పొంగులు’ అన్న పాటలో పద్మనాభం -ఎన్టీఆర్‌ల అభినయం ఈ లఘు చిత్రంలో ఆకట్టుకుంది. గుండమ్మ కథ చిత్రంలో ఎన్టీఆర్ ‘కోలు కోలోయన్న కోలో నా సామి’ అన్న పాటలో వేసిన అందమైన చిందులకు సావిత్రి నవ్వులు సరికొత్తగా అనిపిస్తాయి. అదే ఏడాది వి మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన రక్తసంబంధం చిత్రంలో ఎన్టీఆర్ -సావిత్రిలు అన్నా చెలెళ్లుగా నటించి ప్రేక్షకులకు కంటనీరు తెప్పించారు. ఇంకా పసిపిల్లలుగా వుంటే ఎంత బాగుండమ్మా హాయిగా ఆడుతూ పాడుతూ నీకు జడలేస్తూ ఉండేవాడిని కదా అంటూ అంధుడైన ఎన్టీఆర్ పలికే డైలాగులు ఆయన నటనా వైదుష్యాన్ని తెలుపుతాయి. విశ్వశాంతి పతాకంపై దర్శకుడు విశే్వశ్వరరావు వాణిశ్రీ కథానాయిగా రూపొందించిన దేశోద్ధారకులు చిత్రంలో ‘మబ్బులు రెండు భేటీ అయితే మెరుపే వస్తుంది’ అన్న పాటలో యువ వాణిశ్రీకి తగిన విధంగా ఎన్టీఆర్ తనను తాను మార్చుకుని అభినయం, నృత్యం చేసిన విధానం సరికొత్తగా ఉంటుంది. అనేక చిత్రాల్లో కథానాయికగా నటించిన అంజలీదేవితో వయసుమళ్లిన పాత్రలో పి చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బడిపంతులు చిత్రంలో ఓ వైవిధ్యమైన సన్నివేశాన్ని చూపారు. యమగోలలో స్వతంత్ర భారత పౌరుండ అన్న డైలాగ్ యమలోకంలో ఎన్టీఆర్ చెప్పేటపుడు దానవీర శూరకర్ణలో దుర్యోధనుని సుధీర్ఘమైన డైలాగ్ గుర్తుకురాకమానదు. మహామంత్రి తిమ్మరసు చిత్రం కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందగా, శ్రీకృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్ పరకాయ ప్రవేశం చేసిన విధానాన్నీ ఆవిష్కరించారు. అదేవిధంగా రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేశన్‌ల కలయికలో రూపొందిన చాణిక్య చంద్రగుప్త చిత్రంలో అలెగ్జాండర్, చంద్రగుప్తుడి కత్తి యుద్ధాన్ని ఆవిష్కరించారు. బాపు-రమణలు కవి సార్వభౌముడు శ్రీనాధుడిగా తీర్చిదిద్దారు. సొంత పతాకంపై తమ్ముడు త్రివిక్రమరావు నిర్మాతగా పాండురంగ మహత్మ్యం చిత్రం ద్వారా బి.సరోజాదేవిని పరిచయం చేస్తే, ఆ తరువాత శ్రీకృష్ణపాండవీయం చిత్రం ద్వారా కె.ఆర్.విజయను వెండితెరకు ఎన్టీఆర్ పరిచయం చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్టీఆర్‌ను తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో దేముడిగా నిలబెట్టిన చిత్రం లవకుశ. రాముడిగా ఎంతగా ప్రేక్షకులను మెప్పించారో అంతకన్నా ఎక్కువగా సీతారామ కల్యాణంలో రాముని విరోధి రావణాసురునిగా, శివ భక్తుడిగా మెప్పించాడు. రాముడిగా, రావణాసురుడిగా ప్రేక్షకులను మైమరిపింపజేసిన ఆయన మాయాబజార్‌లో కె.వి.రెడ్డి మాయాజాలంతో కృష్ణుడే బృందావనంనుంచి దిగివచ్చాడా అన్నట్లుగా ప్రేక్షకులను సమ్మోహితులను చేశారు. ఈ ప్రక్రియలో మార్కస్ బార్‌ట్లే పనితనంకూడా మరువలేనిది. ఆ తరువాత ఎన్టీఆర్ కృష్ణుడిగా దాదాపు 17 చిత్రాల్లో నటించడమంటే సామాన్యమైన విషయం కాదు. నటుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా, దర్శకుడిగా ఎన్టీఆర్ మూడు పాత్రలు ధరించి రూపొందించిన చిత్రం డివిఎస్ కర్ణ. అదేవిధంగా నర్తనశాలపైవున్న మమకారంతో ఎన్టీఆర్ ఐదు పాత్రల్లో మెప్పించిన చిత్రం శ్రీమద్విరాటపర్వం. దుర్యోధనుడిగా తన వాక్‌ప్రౌఢితో అలరిస్తే కృష్ణుడిగా రామకృష్ణ గాత్రంలో వినిపించే పద్యాలతో ఆకట్టుకున్నాడు. త్యాగశీలి కర్ణుడి పాత్రను ప్రేక్షకుల సానుభూతి చిందేలా రూపొందించారు. పాండవ వనవాసంలో భీముడిగా, దక్షయజ్ఞంలో శివునిగా మనుషుల్లో దేవుడు చిత్రాల్లో ప్రవరాఖ్యునిగా ఆయన చూపిన ప్రతిభ అనన్య సామాన్యం. నర్తనశాల చిత్రంలో నటించడానికి వెంపటి సత్యం వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకోవడం కూడా ఇందులో చూడవచ్చు. అన్నదమ్ముల అనుబంధం చిత్రంతో సరికొత్త ఇమేజ్ తెచ్చుకున్న ఆయన, ఆ తరువాత నిప్పులాంటి మనిషి వంటి డేర్ డెవిల్ పాత్రలు చేశారు. రౌడీరాముడు కొంటె కృష్ణుడు, సత్యం శివం, రామకృష్ణులు వంటి చిత్రాలు కూడా ఎన్నదగ్గవే. చండశాసనుడిలా శారద కాంబినేషన్‌లో వచ్చిన భయపడి కాదా, గుండె చెదిరి కాదా అన్న డైలాగ్ ఆకట్టుకుంటుంది. కె.రాఘవేంద్రరావు సృష్టించిన కొత్తవరవడిలో అడవి రాముడు నుండి వేటగాడు, డ్రైవర్‌రాముడు వంటి చిత్రాలు వచ్చాయి. దాసరి నారాయణరావుతో బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు వంటి అద్భుత చిత్రాలు కూడా వచ్చాయి. మేజర్ చంద్రకాంత్ చిత్రంలో దేశభక్తిపూరిత పాటని నిక్షిప్తం చేశారు. తొలి చిత్రం మనదేశంలో దేశభక్తి అన్న అంశంపైనే ఆయన పాత్ర ఉంటుంది. అదేవిధంగా చివరి చిత్రంలో కూడా దేశభక్తుడైన మేజర్‌గా నటించడం ఎన్టీఆర్ జీవితంలో యాదృచ్ఛికమైన విషయమే. అనేక కీర్తిశిఖరాలనందుకొని హిమవన్నగధీరుడిగా ఎదిగిన ఆయన చరిత్ర ఎంత చెప్పినా చర్వితచరణమే అవుతుంది.
అందుకే చేశాను
ఎన్టీఆర్‌పై లఘు చిత్రం చేయాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉండేది. తొలుత అక్కినేని నాగేశ్వరరావు, రేలంగి, గుమ్మడిలాంటి నటులపై లఘు చిత్రాలు రూపొందించాను. వందేళ్ల భారతీయ సినీ చరిత్రలో ఎన్టీఆర్ జీవితం ఓ మజిలీలాంటిదే. గత ఏడాది ఎన్టీఆర్ అవార్డును విజయవాడలో చలపతిరావుకు అందజేసే సమయంలో ఆ కార్యక్రమానికి నిండుదనం తీసుకొచ్చేందుకు ఈ లఘు చిత్రాన్ని రూపొందించాం. ఆ వేడుకలో ప్రేక్షకులు మరోసారి ఎన్టీఆర్ గొప్ప నటనను చూసి ఆస్వాదించాలన్న కోరికతో చేశాం. మేం చేసిన లఘు చిత్రం అందరికీ నచ్చడం ఆనందాన్నిస్తోంది. అభిమానులకు ఈ సీడీలను అమూల్యమైనదిగానే అందించాం.
-ఎస్వీ రామారావు

-సరయు శేఖర్