సబ్ ఫీచర్

ఏదైనా.. గొప్పదైతేనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య ఇండస్ట్రీలో తరచూ వినిపిస్తోన్న మాట -చిన్న సినిమా, పెద్ద సినిమా. గత రెండు దశాబ్దాలుగా పరిశ్రమలో ఈ వర్గీకరణ కనిపిస్తున్నా -ఇటీవలికాలంలో ఇది ఎక్కువైందనిపిస్తోంది. పెద్ద సినిమా, చిన్న సినిమా అన్న వర్గీకరణకు చాలా విషయాలనే చూపించొచ్చు. భారీ బడ్జెట్ నిర్మాతలు, స్టార్ ఆర్టిస్టులు, స్టార్ దర్శకులు, స్టార్ టెక్నీషియన్లు.. ఇలా స్టార్లు ఎక్కువైతే -పెద్ద సినిమా. ఇవన్నీ పరిమితంగా ఉంటే అది చిన్న సినిమా. ఇది సాంకేతికంగా మనం చూపిస్తున్న వర్గీకరణ విధానం. కానీ సినిమా చిన్నదైనా, పెద్దదైనా -సక్సెస్‌లో అదిచ్చే కిక్కుమాత్రం ఒక్కటేనన్నది కాదనలేని వాస్తవం. నిజానికి పెద్ద సినిమా ఒక్కటి దెబ్బతింటే నిర్మాతకూ, పరిశ్రమకు సంభవించే నష్టం అపరిమితం. అదే చిన్న సినిమా దెబ్బతిన్నా -కొలుకోగలిగే పరిస్థితి ఉండొచ్చు. పెద్ద సినిమాలు ఎన్ని హిట్లుకొట్టినా పరిశ్రమకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదన్నది సీనియర్ల మాట. అదే చిన్న సినిమాలు హిట్లందుకుంటే మాత్రం -పరిశ్రమకు కొత్త బలం వస్తూందనీ వాళ్లే చెబుతున్నారు. సినిమాల క్యాటగిరీలో కాసేపు చిన్న పెద్ద పక్కన పెడితే -గొప్ప సినిమాలు, ఆడియన్స్ అభిరుచిని సంతృప్తిపర్చే సినిమాలు రావాలన్న కానె్సప్ట్ మళ్లీ పరిశ్రమకు రావాలి. కాదంటారా?

రెండు దశాబ్దాలుగా సినిమాల్ని రెండు క్యాటగిరీలుగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అది చిన్న సినిమా.. పెద్ద సినిమా. పెద్ద చిత్రాల్లో మల్టీస్టారర్లు మరో క్యాటగిరీ. పెద్ద సినిమా అంటే -హిట్ మార్క్ కొట్టిన టీ’మన్నమాట. అంటే -దర్శకుడు, టెక్నీషియన్లు, చివరకు నిర్మాతకూ ఓ రేంజ్ ఉన్నట్టు. పెద్ద సినిమాకైనా, చిన్న సినిమాకైనా -24 ఫ్రేమ్స్ కష్టాపడాలన్నది వేరే విషయం. తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమా పిచ్చి బాగా ముదిరిపోయింది. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు, స్టార్ టెక్నీషియన్లు... ఇలా ‘స్టార్లంతా’ కలిసి స్టార్ ప్రొడ్యూసర్‌ను తీసుకుని సినిమా తీయడం. నిజానికి ఇదేం గొప్ప విషయం కాదు. అలాంటి ప్రాజెక్టు హిట్టయినా.. వచ్చే కిక్కేమీ అంతగా ఉండదు. కారణం -ప్రాజెక్టులో ఉన్నవాళ్లంతా స్టార్లే కనుక. వాళ్లకంటూ ఫ్యాన్స్, క్రేజు ఉంటాయి కనుక సక్సెస్ సులువనుకుంటారు. పైగా సినిమా విడుదలకు ముందే -పబ్లిసిటీ, ఆడియో లాంచ్, ఫస్ట్ లుక్, ప్రీ రిలీజ్‌లాంటి ప్రమోషన్స్‌తో ప్రేక్షకులను ఊరించి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అదే నిర్మాత కొత్త ఆర్టిస్టులపైనో, టెక్నీషియన్స్‌నో నమ్ముకుని భారీ బడ్జెట్ పెట్టడు. కారణం -నష్టాల భయం వ్యక్తం చేస్తాడు.
ఇక చిన్న సినిమాను చూద్దాం. పరిశ్రమలో ఒకింత అనుభవం సంపాదించినోళ్లు లేదా కొత్తగా పరిశ్రమకు వచ్చినోళ్లు చేస్తున్న ప్రయత్నం -చిన్న సినిమా. అప్‌కమింగ్ ఆర్టిస్టులు, దర్శకులు, టెక్నీషియన్లు ఈ టీంలో కనిపిస్తుంటారు. మంచి కథను ఎన్నుకుని తక్కువ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించి -హిట్టందుకుంటున్న ప్రాజెక్టుల్నీ చూస్తున్నాం. ఆ సక్సెస్‌లో దొరకే కిక్కేవేరు. అలాంటి కోవలోకే -పెళ్ళిచూపులు, క్షణం, గీత గోవిందం, గూఢచారిలాంటి చిత్రాలను చేర్చాలి. చిన్న సినిమాకు బడ్జెట్ తక్కువే కావొచ్చు. కానీ, మెసేజ్‌లో తక్కువేం కాదని చెప్పాలి. అన్నీ పరిమితమే అయినా -అపారమైన ప్రతిభను చూపించి ప్రాజెక్టులను సక్సెస్ చేస్తున్నవాళ్లు ఇటీవలి కాలంలో వేగంగానే వస్తున్నారు. నిజానికి పరిశ్రమ పరిఢవిల్లాలంటే -పెద్ద జట్లు ఎన్ని హిట్లు కొట్టాయన్నది చూడాల్సిన అవసరం లేదు. ఎన్ని చిన్ని సినిమాలు సత్తా చాటాయన్నదే చూడాలి. ఇక్కడ పెద్ద చిత్రాలు, మల్టీస్టారర్ చిత్రాల ఆలోచన తప్పని కాదు. అసలు ఉద్దేశం -చిన్న చిత్రాలు ఎంత బలంగావస్తే పరిశ్రమకు అంత బలం చేకూరుతుందనే. ఒకప్పుడూ అగ్ర హీరోలు కలిసి నటించిన సినిమాలు ఆడియన్స్‌ని చూరగొన్నాయి. వాటిని తెరకెక్కించిన దర్శక నిర్మాతలు, టెక్నీషియన్లు, ఆర్టిస్టులకూ మంచి గుర్తింపునిచ్చాయి. ఇప్పటికీ వాటినీ ప్రేక్షకుడు మర్చిపోలేడు. కానీ -అప్పట్లో సినిమా సినిమాగానే ఉండేది. పెద్ద చిన్న తారతమ్యం లేదు. వేటినైనా -మంచి సినిమా, చెత్త సినిమా అన్న కోణంలోనే చూసేవారు.
సినిమా చిన్నదా? పెద్దదా? అన్న విషయాన్ని పక్కనపెట్టి గొప్పదా? చప్పగా ఉందా? అన్న అంశానే్న పరిగణనలోకి తీసుకునే ఆలోచన రావాలి. చిత్రం చిన్నదైనా పెద్దదైనా -ఆడియన్స్‌ని సన్నివేశంలోకి లాక్కెళ్లగలిగే సత్తాను అప్పటి దర్శకులు, ఆర్టిస్టులు ప్రదర్శించేవారు. అలాంటి కొన్ని సన్నివేశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
-ఆకలి రాజ్యం చిత్రంలో కమల్, మిత్రబృందం కాళీ కంచాలను ముందు పెట్టుకుని పంచభక్ష్య పరమాన్నం తిన్నంత బిల్డప్ ఇస్తుంటే -అది గమనించిన శ్రీదేవి కంటతడి పెడుతుంది. ఓవైపు నటీనటులు కామెడీ చేస్తున్నట్టు కనిపిస్తుంటే, చూస్తున్న ఆడియన్స్ కళ్లలో మాత్రం కన్నీటి చుక్కలు కనిపిస్తాయి. అదీ -సన్నివేశం అంటే. మహర్షి చిత్రంలో రాఘవను పోలీసులు కాల్చినప్పుడు -అతని చేతిలో ప్రేమించిన అమ్మాయి బిడ్డ ఉంటుంది. కింద పడిపోబోతున్న బిడ్డను రక్షించబోయి కాలుజారి భవనం మీదనుంచి పడతాడు. రక్షించిన బిడ్డను ప్రియురాలికి అప్పగిస్తూ -కనీసం నీకు కొడుకుగానైనా పుట్టాలని, ఆ అదృష్టాన్ని దేవుడు కల్పించాలంటూ కళ్లుమూస్తాడు. అంతటి తాదాత్మ్యత ఇప్పటి దృశ్యాల్లో కనిపిస్తుందా?
ఊహ, శ్రీకాంత్‌లు జోడీగా చేసిన చిత్రం -ఆమె. ప్రధాన పాత్రల అభినయమే కాదు, తండ్రిగా చంద్రమోహన్ నటన కంటతడి పెట్టిస్తే, భరణి క్రూరత్వం, కోట పిసినారితనం కసి రేపుతుంది. నరేష్ మానవత్వం మనసుకు ఊరటనిస్తుంది. భయానక నిజ జీవితం కళ్లముందు సాగిపోతుందా? అన్న భావన సినిమా చూస్తున్నంతసేపూ అనిపించటం దాని గొప్పతనం. నిజానికి అది -చిన్న సినిమానే. ఇక రాజేంద్రప్రసాద్ నటించిన ‘ఆ నలుగురు’ -మధ్యతరగతి తండ్రీ కొడుకుల బాంధవ్యాన్ని ఎత్తి చూపించిన చిత్రం. కొడుకుల ఉన్నతికి తపించిన తండ్రి రుణాన్ని ఎంత గొప్పగా తీర్చుకున్నారో చెంప పగిలేలా చూపించాడు దర్శకుడు. ఇదీ చిన్న సినిమానే.
సుస్వాగతం చిత్రంలో -పవన్‌కళ్యాణ్ ప్రేమలో ఓడి అమర ప్రేమికుడిగా మిగిలిపోవడం, తండ్రి కపడటి చూపునకూ నోచుకోకపోవడం లాంటి సన్నివేశాలు అభిమానుల గుండెల్లోకి దూసుకెళ్లాయి. అదే హీరో -అత్తారింటికి దారేది చిత్రంలో మేనత్త సెంటర్ పాయింట్‌గా కుటుంబ బాంధవ్యాల్నీ గుర్తు చేశాడు. ఇవి మచ్చుకు మాత్రమే. గొప్ప సందర్భాలను, సన్నివేశాలను, ఆడియన్స్‌ని వెంటాడే కథలతో తెరకెక్కిన చిత్రాలెన్నో. వాటిలో పెద్ద, చిన్న తేడాలు చూడలేం. బావుందా? నచ్చిందా? ప్రేక్షకుడి మెప్పు పొందిదా? అన్న అంశాలను మాత్రమే చూడగలుగుతాం. అందుకే -పెద్ద చిన్న సినిమాలన్న తేడాలు లేకుండా గొప్ప దృశ్యాలు, కథలతో సినిమాలు రావాలి. అప్పుడే నటీనటుల్ని, దర్శకుల్ని, టెక్నీషియన్లను గొప్పగా చూడగలుగుతాం. గొప్పస్థానాన్ని ఆపాదించగలుగుతాం. మరోకోణాన్ని చర్చించుకుంటే -చిన్న సినిమా రక్తికట్టించలేకపోయినా వచ్చే నష్టం పెద్దగా ఉండదన్నది నిజం. అదే సినిమా ఫ్లాపైతే -ఆ నష్టాన్ని అంచనా వేయడం అంత ఈజీ కాదు. పెద్ద దర్శకులు పెద్ద హీరోలతో తీసిన సినిమాలూ అట్టర్ ఫ్లాపైన సందర్భాలు అనేకం. అలాంటప్పుడు స్టార్ ఇమేజ్ ఎంత కిందకు జారిపోతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.

-శ్రీనివాస్ పర్వతాల 9490625431