సబ్ ఫీచర్
ఒక్క పాట చాలు...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయాలంటే సినిమాకు ప్రచారమెంత ముఖ్యమో పాటంత ముఖ్యం -అంటాడో నవతరం దర్శకుడు.
హిట్టయిన సినిమాలో ఫ్లాపు పాటలున్నట్టే, ఫ్లాపు సినిమాల్లోనూ హిట్టు పాటలుంటాయి. ఒక్కోసారి అవే బతికిస్తాయి. అందుకే సినిమాతో సమాంతరంగా పాట ప్రాముఖ్యత పెరిగింది, పెరుగుతోంది కూడా -అంటాడో సీనియర్ దర్శకుడు.
కొన్ని పొడి పదాలు వింటే -బాణీ గుర్తుకొస్తుంది. కొన్ని కూనిరాగాలు తీస్తుంటే -పాట పదాలు మెదడు పొరల్లోంచి తన్నుకురావొచ్చు. ఈ రెండూ ఒద్దికగా అల్లుకుంటే -అదే గొప్ప పాట కావొచ్చు. ఒక సినిమా పదికాలాలు గుర్తుండాలంటే -సందర్భోచిత సాంగొకటి చాలన్న విషయాన్ని అనేక సినిమాలు రుజువు చేశాయి, చేస్తూన్నాయి.
ఓకే ఒక్క పాట-
లాల పోయొచ్చు. జోల పాడొచ్చు. కదిలించొచ్చు. కరిగించొచ్చు. రగిలించొచ్చు. ఎగిరించొచ్చు. నిలబెట్టొచ్చు. పడగొట్టొచ్చు. కన్నీరు పెట్టించొచ్చు. కల్మషాన్ని తుడిచేయొచ్చు... ఒక్కటేమిటి వేన వేల భావాలను పలికించొచ్చు. మసకబారిన ఆలోచనలను తట్టిలేపడం, ఒంటరితనానికి దూరంగా చిటికెన వేలుపట్టి నడిపించడం.. ఇలాంటివన్నీ పాటకూ సాధ్యమే. అందుకే -సన్నివేశానికి తగిన పద కూర్పుకోసం కవులు కసరత్తు చేస్తే -పదాలకు తగిన స్వరాల కోసం కర్తలు కృషి చేస్తూనే ఉంటారు.
**
స్వర్ణయుగం కాలంనాటి చిత్రాల్లో పది పనె్నండు పాటలుండేవి. కృష్ణ, శోభన్‌బాబుల కాలంలో వాటి సంఖ్య తగ్గింది. చిరంజీవి జనరేషన్ మొదలయ్యేసరికి -ప్రతి సినిమాలో పాటల ఫిగర్‌ను ఫైవ్‌కు ఫిక్స్ చేశారు. సంగీత ప్రాధాన్యత కలిగినవి, కొన్ని ప్రత్యక కథా వస్తువుకు సంబంధించిన సినిమాల్లో తప్ప -ఎక్కువశాతం ఇదే లెక్క కొనసాగింది. చాలకాలంగా ఈ సంఖ్య మరింత తగ్గుతోంది. పాటల్లేని సినిమా అంటూ ప్రచారం చేసుకోదగ్గ సిత్రాలూ వస్తున్నాయి, అది వేరే విషయం. నిజానికి ఎందరో మహానుభావుల (దర్శకులు, నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు.. ) కృషి ఫలితంగా తెలుగు సినిమా పాట పట్టుబట్టకట్టే స్థాయికి వచ్చింది. అలా సినిమాకంటే సినిమా పాటే జనరంజకమైన స్థితికి చేరింది కూడా. అయితే ఇప్పుడొచ్చే సినిమాల్లో పాటలు తగ్గుతుండటానికి కారణం -ఓ పాటను షూట్ చేయాలంటే మొత్తం బడ్జెట్‌లో ఏడు నుంచి పదిశాతం ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి రావడం కూడా కారణం. అది వేరే విషయం. ఈ చర్చను కాసేపు పక్కన పెడితే -తెలుగు సినిమాల్లో పాటల రాశి తగ్గుతున్నా వాసి మాత్రం పదునుదేరుతోందనే చెప్పాలి. ఒకప్పటి ఉద్దండ రచయితల స్థాయిని సాహిత్యపరంగా లెక్కిస్తే, మిక్కిలి మించి ఇప్పటి రచయితలు వినోదాన్ని అందించగలుగుతున్నారు. ఇదీ గొప్పగా చెప్పుకోవాల్సిన విషయమే.
కొంతగ్యాప్ తరువాత -గడచిన ఏడాది పాట ప్రజలకు మరింత దగ్గరైందని అనిపిస్తుంది. చిన్న పెద్ద అన్న సినిమా బడ్జెట్ వ్యత్యాసాలు కాసేపు పక్కనపెడితే -అన్ని చిత్రాల్లోని పాటలు ఆడియన్స్‌ని రంజింప చేయడానికి ప్రయత్నించిన పాటల్లాగే తోస్తాయి. 2018లో సుమారుగా 150 తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు వచ్చాయనుకుంటే -సుమారుగా 450 వరకూ పాటలు పురుడుపోసుకున్నాయనే చెప్పాలి. కలం తిరిగిన సీనియర్, జూనియర్ రచయితలు తమ సృజనాత్మక ఆలోచనా పరిధిని సన్నివేశానికి అనుగుణంగా మలిచి అద్భుతమైన పాటలే అందించారు. ఆ సవాల్‌కు సంగీత దర్శకులూ తక్కువేం చేయలేదు. అద్భుతమైన బాణీలను అందించి పాట సూటిగా జనంలోకి వెళ్లగలిగేలా చేయడంలో కృతకృత్యులయ్యారు. అయితే, అన్ని పాటలనూ ప్రస్తావించలేం కనుక -జనరంజక గీతాల్లో ‘స్థాయి పులాక న్యాయం’ ప్రకారం ఎన్నదగిన పాటల్ని గుర్తు చేసుకుందాం. విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్ జోడీగా రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించిన ‘టాక్సీవాలా’ చిత్రంలోని ‘మాటె వినదుగా’ పాట జనాల్లోకి సూటిగా వెళ్లిపోయింది. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరాం ఆలపించిన తీరు ఒక ఎత్తయితే, జేక్స్ బిజోయ్ కట్టిన బాణీ మనసు పొరల్లో నిక్షప్తమైపోయింది. ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో శంకర్ తెరకెక్కించిన రోబో సీక్వెల్ 2.ఓ కోసం అనంత శ్రీరాం కలం అద్భుతాన్ని సృష్టించింది. ‘యంతరలోకపు సుందరివే’ అంటూ సాగిన పాటకు సిద్ శ్రీరామ్, షాషా తిరుపతి తమ గాత్రంతో ప్రాణంపొస్తే, ఏఆర్ రెహమాన్ క్రియేటివ్ ట్యూన్‌తో పాటను మరో లోపకంలోకి తీసుకుపోయాడు. ఇక పడిపడి లేచె మనసు చిత్రం కోసం విశాల్ చంద్రశేఖర్ డిజైన్ చేసిన టైటిల్ సాంగ్‌ను అర్మన్ మాలిక్, సింధూరి విశాల్ పాడిన తీరును మర్చిపోలేం. తాజాగా సంక్రాంతికి విడుదలవుతున్న ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగం ‘కథానాయకుడు’ టైటిల్ సాంగ్ కోసం ఖైలాష్‌కేర్ గొంతు ఖంగుమంది. కె శివదత్తా, డాక్టర్ కె రామకృష్ణ రచించిన పాటకు ఎంఎం కీరవాణి చేసిన ట్యూన్ -మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇక ‘హుషారు’గా వచ్చిన కుర్రాళ్ల చిత్రంలో కిట్టూ విస్సాప్రగడ ‘ఉండిపోరాదే’ అంటూ గుండెను మెలితిప్పే గీతాన్ని అందించాడు. రథన్ అందించిన అద్భుత బాణీని అంతే చక్కగా ఆలపించి సిద్ శ్రీరాం తన ఊపు ప్రదర్శించాడు. హలో గురూ ప్రేమకోసమే చిత్రం కోసం ‘మై వరల్డ్ ఈజ్ ఫ్లయింగ్’ అంటూ దేవీశ్రీ ప్రసాద్, శ్రీమణి చేసిన సృజన -ప్రతి క్షణం గాళ్‌ఫ్రెండ్‌లా గుర్తుకొస్తూనే ఉంటుంది. యు టర్న్ చిత్రం కోసం అనురుథ్ రవిచందర్ బాణీలో శ్రీ సాయికిరణ్ రాసిన ‘ది కర్మ థీమ్’, అంతరిక్షం చిత్రం కోసం అనంత్ శ్రీరామ్ అందించిన సమయమా పాటను ప్రశాంత్ ఆర్ విహారి అద్భుతంగా బాణీకడితే హరిని, యాజిన్ నజీర్ ఆకట్టుకునేలా ఆలపించారు. గీత గోవిందం చిత్రం కోసం -ఇంకేం ఇంకేం ఇంకేంకావాలే అంటూ అనంత్ శ్రీరామ్ ఒకింత హాయిని పాటగా మలిస్తే, గోపీసుందర్ బాణీని సిద్ శ్రీరామ్ తన ప్రత్యేక గాత్రంతో పీక్స్‌కి తీసుకెళ్లాడు. అంతేకాదు గాలివాలుగా (అజ్ఞాతవాసి), చూసీ చూడంగానే (చలో), నిన్నిలా (తొలి ప్రేమ) ఇలా చెప్పుకుంటూపోతే -ఎన్నో గొప్ప పాటలు. చివరిగా ఈ ఏడాది సెనే్సషనల్ హిట్లుగా చెప్పుకోదగ్గ పాటల్నీ ఇక్కడ ప్రస్తావించాలి. మంచి పాట, గొప్ప పాట, హిట్టు పాటలాంటి విశేషణాలను ఏమీ చేర్చకుండా, వీటిని ‘పాట’ అనాలంతే. ఆనందం, ఆదరణలాంటి కోణాల్లో ఈ పాటలకు ఎవరికి వారే పట్టంగట్టాలంతే. అందులో మొదటిది రామ్‌చరణ్, సమంత జోడీగా వచ్చిన రంగస్థలం చిత్రంలోని -యెంత సక్కగున్నావే. అన్నీ కలిసొచ్చిన అద్భుతమైన పాటిది.
యేరుశనగ కోసం మట్టిని తవ్వితే/ ఏకంగా తగిలిన లంకె బిందెలాగ -ఎంత సక్కగున్నావే.. లచ్చిమి ఎంత సక్కగున్నావే.
సింత సెట్టుయెక్కి సిగురు కోయబోతే/ చేతికి అందిన సందమామలాగ -ఎంత సక్కంగున్నావే.. లచ్చిమి ఎంత సక్కగున్నావే... /మల్లెపూల మద్దె ముద్ద బంతిలాగ -ఎంత సక్కగున్నావే.. /ముతె్తైదువ మెళ్లొ పసుపు కొమ్ములాగ -ఎంత సక్కగున్నావే../ సుక్కలసీర కట్టు-కున్న యెనె్నల్లాగ ఎంత సక్కాగున్నావే..
అచ్చమైన పల్లెభావాన్ని పదాల్లోకి ఒలికించి చంద్రబోస్ పాట రాస్తే -బాణీకట్టిన దేవీశ్రీ ప్రసాదే మార్ధవంతో కూడిన జీర గొంతుతో పాటకు ప్రాణం పోశాడు. ఇక హీరో నాని చిత్రం శ్రీకృష్ణార్జున యుద్ధంలో పెంచల్‌దాస్ రాసి పాడిన ‘దారి చూడు దుమ్ము చూడు మామ/ దున్నపోతుల బైరే చూడు’ అన్న పాట ఒక ఊపు ఊపేసింది. కొద్దికాలం పాటు ఏనోటనైనా, ఏచోటనైనా ఇదే పాట వినిపించిందంటే -అది ఎంతటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కోవలో మరికొన్ని పాటలూ లేకపోలేదు. సో, గడచిన ఏడాదిలో సినిమా పాట కొత్త పంథాను అందుకుంది. ఈ ఏడాదీ అలాంటి పాటలు మరిన్నిగా ఆడియన్స్‌ని రంజింప చేస్తాయని ఆశిద్దాం.