సబ్ ఫీచర్

సర్వోదయ కవితా వైతాళికుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభినవ తిక్కన, తెలుగు లెంక, గాంధీకవి, తుమ్మల సీతారామమూర్తి
119వ జయంతి సందర్భంగా...
*
‘‘సర్వతంత్ర స్వతంత్రుడే సత్కవీంద్రు
డెన్నడో కల్పమున కొక్కడే లభించు’’
- అభినవ తిక్కన, తెలుగు లెంక, గాంధీకవి, యుగకవి, యుగకర్త అయిన శ్రీ తుమ్మల సీతారామమూర్తిగారు తెలుగుజాతికి తెలుగు సాహిత్యానికి 20వ శతాబ్దమున లభించిన అపూర్వమైన సరిక్రొత్త కానుక. ఆధునిక కవులలో వారు విలక్షణమైన మహాకవి. వారు ఆకారంలో ఆంధ్రుడు. ధర్మములో భారతీయుడు. భావనలో విశ్వమానవుడు. వారు కవనార్థముదయించిన నలువపడతి మగరూపు. ధర్మ సంరక్షణార్థము కవితలల్లిన ఋషితుల్యులు. వారు సంప్రదాయ కవితాభినివేశంతో సాహితీ లోకంలో అడుగుమోపి జాతీయభావ సోయగంతో నవయుగ హృదయ స్పందనతో సర్వస్వతంత్రాంధ్ర సర్వోదయ కవితా సృష్టిచేసిన కారణజన్ములు. హాలిక కుటుంబంలో పుట్టి, పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో జీవించి సహజ ప్రతిభతో సందేశాత్మక కావ్యాలను వెలయించిన నిరంతర కవితా హాలికుడు. మధురతా పూర్ణకావ్య నిర్మాణ చణుతగల కవితాతేజస్వి. ‘‘సాధుశీల మాభిజాత్యమ్ము చెలువమ్ము ననసి మెఱయువనిత నాదు కవిత’’అని ఎంతో విశ్వాసంతో చెప్పగలిగిన కళాప్రపూర్ణుడు. కాలంతోపాటు కాలంకంటె ముందు నడచి జగద్ధితమైన కవితను కళాన్వితంగా వెలయించిన కవితా తపస్వి. ‘‘కళకొఱకే కవిత్వమని గంతులు వేయక’’ మానవాభ్యుదయానికి కవితాగానమొనర్చిన అభ్యుదయ కవి. తమ కవిత్వానికి ఆంధ్రత్వాన్ని ఊపిరిగా, భారతీయత్వాన్ని జీవాత్మగా, గాంధీతత్త్వాన్ని వజ్రకవచంగా చేసుకొన్న జాతీయ కవి. స్వరాజ్య సాధనకు సురాజ్య నిర్మాణానికి తమ కవితను అంకితంచేసిన దేశభక్తికవి. స్వరాజ్య సిద్ధికి, అభ్యుదయానికి తమ కవితను ముడుపుగట్టిన రాష్ట్ర కవి. గాంధి దివ్యగాథను ఆధునిక ఇతిహాసంగా తెలుగు సారస్వత పీఠంపై సుప్రతిష్ఠించిన గాంధీకవి. గాంధీ కావ్యాలను ‘ఆంధ్ర మహాభారత ప్రతిబింబంగా తీర్చిదిద్దిన అభినవ తిక్కన. ‘ప్రజల బాధ తన బాధగా’్భవించి సామాజిక కల్యాణంకొరకు కవితాగానం చేసిన అసలుసిసలైన ప్రజాకవి. సమాజ సమస్యలకు చక్కని పరిష్కారాలను సూచించిన సాహితీప్రవక్త. సమధర్మం సహజ ధర్మమని నమ్మి, అందరి అభ్యుదయానికి సర్వోదయ కవితను సృష్టించిన నవ్య సంప్రదాయ సర్వోదయ కవితావైతాళికులు. రైతుగా జీవించటమేగాక రైతు జీవనానికి కావ్యగౌరవం చేకూర్చిన కాపుకవి. హలముపట్టిన చేతితో కలముపట్టి తెలుగు తీపి, తెలుగు పసగల మృదుమధుర సంశోభితములైన రచనలు చేసిన తెలుగు వస్తాదు. తెలుగు భాషార్చకుడై కవితాకళకు నూతన జవమును జీవమును కలిగించి ప్రకాశింపజేసిన తెలుగులెంక, భాషా విపర్యయముసైపని సంప్రదాయ కవితా సంరక్షణాభినివిష్టులు. కవితా పాకమునుమార్చి సరళ సుందరమైన, కవితను వెలయించిన నవ్యాతినవ్య కవి. అభ్యుదయ దృష్టిఉన్న కవికి ఛందస్సు ఇనుపసంకెలకాదని, మల్లెపూల మాలయని నిరూపించిన కవితాకళాశిల్పి. కాసునుకోరక తమ కావ్యకన్యలను వరణీయ కథాబాసురులకు కన్యాదానంచేసిన ఆదర్శకావ్య కన్యాదాత. మచ్చమసకలేని మనుగడను సాగించిన మానవోత్తముడు. తమ సారస్వతేయ జీవితమంతా గాంధేయ సాహిత్యానికే అంకితంచేసిన ‘మహాత్ముని ఆస్థానకవి’.. భావితరాలకు స్ఫూర్తిదాయకమైన సర్వోదయ విప్లవ కవితను వెలయించిన యుగకర్త. కవితలో యుగలక్షణమును గుబాళించి, జాతికుపకరించి సందేశమును కళాన్వితముగా వచించిన యుగకవి.
ఆంగ్ల భాషాసాహిత్యాల ప్రభావంతో భావజాలంలో రూపనిర్మాణంలో వస్తుస్వీకరణలో ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నో మార్పులు వచ్చినవి. ఎందరో కవులు ఉద్భవించారు. ఎన్నో సాహిత్యోద్యోమాలు వెలుగుచూసినవి. ఏదో ఒక ఉద్యమం ఆధారంగా కవులు స్వేచ్ఛగా నవ్యరీతుల కవితాగానంచేశారు. ఆనాటి కవులలో తుమ్మలవారికి ఒక ప్రత్యేక స్థానం కలదు. గాంధీకి పూర్వం సాహిత్యం కళాప్రేరణచే వెలువడింది. తర్వాత అవతరించినది జీవన ప్రేరణ చేత. ఈ ప్రేరణయే తుమ్మలవారి కవితకు మూలకందమైంది. ఒక విధంగా వారు గాంధీ మానసపుత్రుడని చెప్పవచ్చును.
‘‘నైతిక పునరుజ్జీవన
జాతీయ వికాస విశ్వజనతాశ్రేయః
ప్రతము మచ్చేతము; నా
కైతము తత్దర్పణమ్ముగానుదయించున్- ’’ అంటూ
తమ కవితాతత్త్వ స్వరూపాన్ని వివరించారు.
భావ కవిత్వం ఒక ఊపు ఊపుతున్న కాలమది. ప్రణయ కవులు ఊహాలోకంలో తమ ప్రణయ రూపిణులతో సరససల్లాపములలో తూగిపోతూ వున్న కాలమది. అభ్యుదయ కవితోద్యమాలు జాజ్జ్వల్యమాన మగుచున్న కాలమది. దీనికితోడు నూతన కవితాప్రక్రియలు వికసిస్తున్న కాలమది. అటువంటి కాలంలో-
‘‘గిఱిగీచుకొన్న కవి కృతి
చిరకాలము నిల్వ; దెల్ల సిద్ధాంతములన్
దరియించి విప్లవముదెస
కరిగిన కృతి సత్యదర్శియై రాణించున్’’- అని ప్రకటించి సిద్ధాంత రాద్ధాంతాల కతీతంగా ప్రాతక్రొత్తల మేలుకలయికతో తమ సర్వోదయ కవితోద్యమాన్ని వారే సృష్టించుకొన్నారు. అదియును సంప్రదాయ కవితా శిల్పంలోనే. సమస్త లోక మంగళకరమైన సత్యమును కమ్మనివాక్కుల నిర్భయమ్ముగా పలుకుటయే కవిత్వమని భావించి-
‘‘కళకొఱకే కవిత్వమని గంతులు వేయక, రోత రోతగా
వలపులు నింది కబ్బములు వ్రాయక, విశ్వజనీన బోద్ధృతా
లలిత ముదారవృత్తము కలాకమనీయము సంస్కృత ప్రభా
మిళియమునైన సృష్టినెదమెచ్చితి, జాతికి కాన్కలిచ్చితిన్’’
అని జాతీయ భావస్ఫూర్తితో సామాజిక స్పృహతో నైతికో జ్జీవన దృష్టితో ధర్మబోధాత్మకమైన కవిత వెలయించారు. వారి ధర్మబోధకు శిల్పచాతుర్యమే కావ్యాత్మనిచ్చింది.
ప్రాచీనుల పోకడల, ఆధునికుల క్రొత్తపోకడల మేలికలయికతో వారి రచనలు క్రొంగ్రొత్త చెలువమును సంతరించుకొన్నవి. అవి ఆంధ్రుల భారతీయుల హృదయ స్పందనలకు అపురూపమైన అక్షర రూపాలు. అవి ఆధునిక సామాజికోపనిషత్తులు. సత్యప్రియోక్తిఖనులు.
‘‘రాష్ట్ర సిద్ధికొఱకు రక్తమ్ముగార్చిన
కవిని నేను గాంధి కవిని నేను
బడలి బడలి తల్లి బాసకూడెము సేయు
కవిని నేను దేశికవిని నేను’’-అంటూ
తమనుతాము విశే్లషించుకొని చెప్పిన పద్యం. వారు జాతి నిత్యవైతాళికుడు. ఆంధ్రత్వము ముమ్మూర్తులా మూర్త్భీవించిన మూర్తి సీతారామమూర్తిగారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్రావతరణకు తమ మహోద్రేక భావామృతాన్ని చిలికి జీవంపోసిన కవిబ్రహ్మ. ఆనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రులకు జరిగిన అన్యాయాలకూ అవమానాలకూ వారు ఉడికిపోయారు. పరవళ్ళుత్రొక్కే ఆవేశంతో, తొణికిసలాడే భావుకతతో వారు వీర రసభరితమైన ‘రాష్టగ్రాన’కావ్యాన్ని రచించి ఉద్యమానికి దిశానిర్దేశం చేసి, ఆంధ్రులను కార్యోన్ముఖులను చేశారు. ‘‘తెలుగు జాతి నిరంకుశ వీరజాతిగానేలిన జాతిరా!’’అంటూ గత వైభవప్రాభవాలను గుర్తుచేసి జాతిని చైతన్యపరచారు. తెలుగురాజుల వీరగాథలను, వీరుల పౌరుషాన్ని, కవుల కవితా మాధుర్యాన్ని, గాయకుల గానామృతాన్ని, శిల్పుల కళానైపుణ్యాన్ని, వీర నారీమణుల శౌర్యసాహస సౌశీల్యాలను ‘‘చదవుడొకసారి కండలు కదలియాడ’’అంటూ రసభావావేశంలో వర్ణించి పాఠకుల మేను పులకరించే విధంగా వ్రాశారు.
వేర్పాటు ధోరణిలోనున్న రాయలసీమ వాసులను పరమ మిత్రులుగా జేసి- ‘‘సైపలేమింక నుమ్మడి కాపురంబు’’ అంటూ-
‘‘ఆంధ్రుడవై జన్మించితి
వాంధ్రుడవైయనుభవింపుమాయుర్విభావం
బాంధ్రుడవై మరణింపుమి
ఆంధ్రత్వములేని బ్రతుకు నాసింపకుమీ!’’-
అంటూ జాతికి ఆత్మగౌరవ నినాదాన్నిచ్చిన తొలి జాతీయ కవి తుమ్మలవారు. ఈ పద్యం ఆంధ్రుల హృదయాలకు చబుకుదెబ్బయై వీర రసావతారులను చేసింది. దీనిని జాతి ఉన్నంతవరకు ప్రతి ఆంధ్రుడు చదివి స్ఫూర్తిని పొందదగింది. కవిగారి ఆకాంక్ష ఆరాటం ఉద్వేగం జాతిరక్తి ఆంధ్రులను ఒక త్రాటిపై నడిపించింది. ఆంధ్రులు అపూర్వమైన త్యాగాలు చేశారు. చివరకు శ్రీ పొట్టిశ్రీరాములుగారి ప్రాణత్యాగంతో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం సిద్ధించింది. నూతన రాష్ట్రావతరణానంతరం జాతి అభ్యుదయానికి ‘ఉదయగానము’ అను కృతిని వ్రాశారు. దీనియందు ఆనాటి సమస్యలను చర్చించి, తగిన సూచనలను చేశారు. మాతృభాషను అధికార భాషగా చేయాలన్నారు. రాష్ట్ర నడిబొడ్డునగల బెజవాడను రాజధానిగా చేయాలన్నారు. కృష్ణాగోదావరి నదులను అనుసంధానంచేసి ప్రాజెక్టులను నిర్మించి వ్యవసాయాభివృద్ధి చేయాలన్నారు. పదవికొరకు పుట్టినది కులతత్త్వమని హెచ్చరించారు. ‘‘జాతి పెంపు నాకు చాలును- జాతీయ గౌరవంబ నాదు గౌరవంబు- జాతి సేవ నాదు జన్మంబునకు- ఫలంబని తలంచువాడె నాయకుండు’’-అని చెప్పారు. ఆనాటి కవులకంటె మూడు అడుగులు ముందుకువేసి దైవాన్ని దేశభక్తి దిశగా, మానవుని సంస్కరించే దిశగా మరలించిన మహర్షి. ‘‘దేవుడన మాతృదేశమ- దేవతలన ప్రజల, యజ్ఞదీక్షయనంగా- సేవావ్రతనిష్ఠయ, యివి- జీవన సూత్రములుగా ప్రసిద్ధింగనుమా!’’- అని సందేశమిచ్చారు. చివరకు ఆంధ్రుల రాష్ట్భ్రామానాన్ని జాతీయ సమగ్రత దిశగా, వసుధైక కుటుంబ వ్యవస్థదిశగా మరలించిన మహోన్నతవాణి విశ్వకవితామూర్తి సీతారామమూర్తిగారిది.
ప్రతి యుగంలో ఉత్తమ కవులు కొందరే ఉంటారు. వారిలో ఉన్నత వ్యక్తిత్వం గలవారు అరుదు. ఆధునిక యుగమునందు ఉన్నతమైన సాహిత్యానికి, సమున్నతమైన వ్యక్తిత్వానికి కీర్తిగాంచిన ఉత్తమకవి తుమ్మలవారు. కవిత్వంలోనూ, జీవితంలోనూ ఉన్నతములైన నైతికములైన విలువల పరిరక్షణకు తమ కవిత్వాన్ని జీవితాన్ని ముడుపుగట్టిన ఋషితుల్యులు తుమ్మలవారు. ‘‘కవితలో స్వభావములో తుమ్మల వారిని పోలగల వారెప్పుడోగానీ జన్మింపరు’’ అన్న దివాకర్ల వేంకటావధానిగారి మాటలు అక్షర సత్యాలు.’’ అతడు నా గౌరవ పతాక, నా అమూల్య సంపద’’ అని జాతి గర్వింపదగిన ఉత్తమ కవి తుమ్మల సీతారామమూర్తిగారు.

- ఇనగంటి వేదకుమారి