సబ్ ఫీచర్

ఎవ్వడూ.. ఆకాశం నుండి ఊడిపడలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి దాదాపు 14 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. ఇలాంటి సమయంలో నచ్చిన కథ ఎంచుకోవడంకంటే.. మా కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా ఆశిస్తారో అలాంటి కథతో సినిమా చేసాం. త్రివిక్రమ్‌తో సినిమా నాకో కొత్త అనుభూతి*
*
త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవలో నటిస్తున్నాడు జూ. ఎన్టీఆర్. సినిమా 11న విడుదలవుతున్న సందర్భంలో మీడియాతో ఎన్టీఆర్ ముచ్చట్లు.
త్రివిక్రమ్‌తో సినిమా కల అన్నారు?
-అవును.. త్రివిక్రమ్ దర్శకుడు కాకముందునుంచే మంచి స్నేహితుడు. చాలా రోజులనుండి సినిమా చేయాలని అనుకుంటున్నాం, కానీ ఇప్పటిదాకా కుదరలేదు. దీనికోసమేనేమో.
కథ, టైటిల్ విషయంలో సంతృప్తిగా ఉన్నారా?
-త్రివిక్రమ్‌తో సినిమా అంటే కథ బాగుంటుంది. ఇది మా ఇద్దరి కాంబినేషన్‌లో రావాల్సిన సినిమానే. ఇక టైటిలంటారా.. అద్భుతమైన టైటిల్.. అరవింద సమేత వీర రాఘవ.. ప్రతి మగాడి ఆయుధం ఆడదే. అంతెందుకు దేవుళ్లను కూడా లక్ష్మీ సమేత నరసింహస్వామి, సీతా సమేత శ్రీరాముడు అంటూ పిలుస్తుంటాం కాబట్టి టైటిల్ విషయంలో నో టెన్షన్, పైగా యూనీక్.
ఫ్యాక్షన్ సినిమా కదా.. హీరోయిజం..?
-ఇందులో హీరోయిజం ఉండదు.. మంచి హ్యూమన్ ఎమోషన్ ఉంటుంది. రాయలసీమ ఫ్యాక్షన్ అంటే కేవలం వయలెన్స్ మాత్రమే కాదు. మనకున్న నవరసాల్లో కోపం కూడా ఒకటి. అంతే తప్ప ఇందులో హీరోయిజం కోసం పెద్ద పెద్ద డైలాగ్స్, భారీ ఫైట్స్ లాంటి అంశాలు ఉండవు. ఇందులో యుద్ధం చేయనివాడికి శాంతిని కోరుకునే హక్కులేదు.
మరి ఈ విషయంలో ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు?
-నిజమే.. ఫ్యాన్స్‌కు నా సినిమా అనగానే హీరోయిజం ఉండాలని భావిస్తాను. కానీ మనం ఓ కథను చెబుతున్నాం.. ఆ కథను బట్టి నడవాలి తప్ప.. హీరోయిజం కోసం కథను కిల్ చేయకూడదు. ఇంతకుముందు అలాంటి హీరోయిజం చేసి తప్పుచేసానేమో. జనతా గ్యారేజ్ తరువాత నాలో చాలా మార్పొచ్చిందని చెప్పారు. ఇక ఈ సినిమా పక్కా త్రివిక్రమ్ స్టైల్‌లోనే ఉంటుంది. ఇది పూర్తిగా త్రివిక్రమ్ సినిమా.. అందులో నేను నటించాను తప్ప, ఇది నా సినిమా కాదు. నిజానికి దర్శకుడు, హీరో అంటే భార్యాభర్తల్లాంటివారు. దర్శకుడి ఎమోషన్స్‌ని బయటపెట్టేది హీరోనే. అలాగే హీరో ఎలా చేసాడో చెప్పే మొదటి ప్రేక్షకుడు దర్శకుడే.
అజ్ఞాతవాసి ఎఫెక్ట్ త్రివిక్రమ్‌పై ఉందంటారా?
-ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ఆ దర్శకుడిని తక్కువగా అంచనా వేయకూడదు. అతని ప్రయత్నం మాత్రమే ఫెయిల్ అయింది.. అతను కాదు. ఇక్కడ ఎవరికి ఫెయిల్యూర్స్ లేవు చెప్పండి.. అంతెందుకు, నా విషయమే తీసుకుంటే నాకూ ఫ్లాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరూ ఆకాశంనుండి ఊడిపడలేదు. మనం ఓ ప్రయత్నం చేస్తున్నాం, అంతే.
ఈ సినిమా సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగాయా?
-నిజంగా అది అలా జరుగుతుందని అనుకోలేదు.. నేను నటించిన 27 సినిమాల్లో ఎప్పుడూ తండ్రి చితికి నిప్పంటించే సన్నివేశం ఎప్పుడూ చేయలేదు. అంతెందుకు, నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా అలాంటి సన్నివేశం కూడా లేదు. కానీ ఈ సినిమాలో యాదృచ్ఛికంగా.. ఆ ఘటన జరిగి నాన్నను కోల్పోడం బాధాకరం. నిజంగా ఆయన గోల్డ్ లాంటి వ్యక్తి. ఆయనను కోల్పోవడం మాకు తీరని లోటు.
పెనివిటీ సాంగ్‌కు ఎమోషన్‌గా కనెక్ట్ అయ్యారు?
- నిజమే.. నా జీవితంలో ఓ గొప్ప పాట అది. దానికితోడు ఎమోషనల్‌గా మేము బాగా కనెక్ట్ అయ్యాము.. ఆ పాట మేల్ అండ్ ఫిమేల్ వాయిస్‌లో వుంటుంది. నాన్న మిస్ అవ్వడం, ఆయన కోసమే ఈ పాట వచ్చిందా అన్న ఫీలింగ్ కలిగింది. మొత్తానికి అరవింద సమేత నా ఎమోషన్స్‌ని టచ్ చేసింది.
సిక్స్ ప్యాక్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారా?
- లేదు. మామూలుగానే చేశాను. ప్రత్యేకంగా ఓ ట్రైనర్‌ను పెట్టుకున్నాను. నిజానికి జైలవకుశ తరువాత మళ్లీ బరువు పెరిగాను. ఓ సారి బరువు చూసుకుంటే 80 కిలోలు పెరిగాను. బాబోయ్ ఇంత వెయిట్ పెరిగానా అని జిమ్‌లో కుస్తీలు పట్టాను. పైగా ఈ సినిమా కోసం ఫిజిక్ ఫిట్‌గా ఉండాలని త్రివిక్రమ్ చెప్పడంతో దానికోసం కష్టపడ్డా.
అరవింద మీ జీవితంలో చాలా మార్పు తెచ్చింది?
-నిజమే.. మన జీవితం క్షణికం.. ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం. నాన్న విషయం చూస్తే.. క్షణాల్లో మొత్తం జరిగిపోయింది. మనం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. జీవితం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం. అందుకే ఉన్నంతలో హాయిగా బ్రతకాలి. మంచి తండ్రిగా, మంచి కొడుకుగా, మంచి అన్నగా, మంచి తమ్ముడిగా, మంచి నటుడిగా- అదే నా ఆలోచన. ఇది వైరాగ్యం కాదు నిజం. ఇక్కడ ఏది మనకు శాశ్వతం కాదు.. అందుకే ఉన్నంతలో సంతృప్తిగా బతకాలి.
త్రివిక్రమ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే..?
-ఆయనతో కొంతసేపు మాట్లాడితే చాలు.. చాలా విషయాలు తెలుస్తాయి. అతను ఒక దర్శకుడు మాత్రమే కాదు.. మంచి ఫ్రెండ్, మంచి గైడ్, మంచి గురువు.
ఈ సినిమా తరువాత హాలిడేస్‌కు వెళుతున్నారా?
-ప్రస్తుతం చాలా ఎమోషన్‌లో ఉన్నాను కాబట్టి కాస్త రిలాక్స్ కోసం హాలిడే వెళ్లాలని ఉంది కానీ.. చూద్దాం.
రామ్‌చరణ్‌తో మల్టీస్టారర్ గురించి?
-చరణ్ నేను బెస్ట్ ఫ్రెండ్స్.. ఇద్దరం కలిసి సినిమా నచ్చే చేస్తున్నాం.. ముఖ్యంగా ఇక్కడ హీరోలమధ్య అంతరాలను తగ్గించాలన్నది నా ప్రయత్నం.
రాజవౌళి మల్టీస్టారర్ ఎలా ఉండబోతుంది? ఎప్పుడు ప్రారంభం?
-దాని గురించి రాజవౌళిని అడగండి, ఎప్పుడు ప్రారంభమో ఆయననే అడగండి..
మహేష్, చరణ్‌లతో సినిమా ఎప్పుడు?
-మహేష్, చరణ్‌లతో మంచి అనుబంధం ఉంది. మంచి కధ, దాన్ని డీల్ చేసే దర్శకుడు దొరికితే సినిమా తప్పకుండా చేస్తాం.
అట్లీ దర్శకత్వంలో సినిమా ఉందా?
-అశ్వినీదత్‌తో అయితే సినిమా ఉంది.. కానీ దానికి అట్లీ దర్శకుడా కాదా అన్నది తెలియదు.
* రాజకీయాల గురించి?
- ప్రస్తుతం తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదు.. ఈ విషయం గురించి అడగకండి ప్లీజ్..

* తదుపరి సినిమాలు..?
- నేను ముందుగా ఏదీ ప్లాన్ చేసుకోను. ఎందుకంటే, ఒక సినిమా విడుదల తరువాత ఈక్వేషన్స్ మారిపోతాయి. ప్రస్తుతానికైతే రాజవౌళి సినిమా ఉంటుంది.

-శ్రీ