సబ్ ఫీచర్

మధురమైన బాల్య జ్ఞాపకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినెమా పారడైసో ( ప్రపంచ సినిమా : ఇటలీ)

= = = = = = = = = = =======
అందరికి అందుబాటులో వున్న ఏకైక వినోద సాధనం సినిమా. బాల్యంలో తొలిసారి సినిమాను చూడటం అద్భుత ఆశ్చర్యాలకు లోను చేస్తుంది. ఆ అనుభవం కోసం పదే పదే సినిమాలు చూడటం అలవాటవుతుంది. ఈ అలవాటు క్రమంగా వ్యామోహంగా, వ్యసనంగా మారి మనిషిని నిలవనీయకుండా చేస్తుంది. సినిమాలు చూడటం, సినిమాలకు సంబంధించిన వార్తలను ఆసక్తితో పోగుచేయడం, వినడం, చర్చించడం లాంటివి చేస్తారు. మరికొందరు సినిమా తారలకు, సినిమా పత్రికలకు రాస్తారు. ఇంకా కొందరు సినిమా ప్రపంచంలోకి ఏ విధంగానైనా అడుగుపెట్టడానికి విశ్వప్రయత్నం చేస్తారు. అందులో నూటికో, కోటికో ఒక్కరు సక్సెస్ అవుతారు. బాల్యంలోనే సినిమాతో అనుబంధం పెంచుకున్న ఒక బాలుడు భవిష్యత్తులో సినీ దర్శకుడిగా ఎదుగుతాడు. అతని మధుర బాల్య స్మృతులను వివరిస్తూ ‘‘సినెమా పారడైసో’’ అనే ఇటలీ చిత్రం 1969లో వెలువడింది.
1980 రోమ్‌లో ప్రఖ్యాత ఇటాలియన్ దర్శకుడు ఒక రోజు రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తాడు. పడుకుని వున్న అతని గర్ల్‌ఫ్రెండ్ మీ అమ్మ దగ్గరినుండి ఫోన్ వచ్చింది, అల్‌ఫ్రెడ్ చచ్చిపోయాడని. ఇంతకూ అల్‌ఫ్రెడ్ ఎవరూ అని అడగడంతో, సాల్వాటార్ గతంలోకి వెళ్ళిపోతాడు.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి కొన్ని సంవత్సరాలవుతుంది. యుద్ధంలోకి పోయిన భర్తకోసం ఎదురుచూసే భార్య, ఆరేళ్ళ కొడుకు సాల్వటార్‌తో వుంటుంది. టోటో అనే ముద్దుపేరుగల సాల్వటార్ చర్చిలో ప్రీస్ట్ దగ్గర వేదిక మీద సహాయకుడిగా వుంటూనే, అతడ్ని అనుసరిస్తూ థియేటర్‌కు చేరుకుంటాడు. ఆ చిన్న ఊళ్ళో వున్న ఏకైక సినిమా థియేటర్ ప్యారడైజ్. ముందుగా ప్రీస్ట్ ఒక్కడే ఆ థియేటర్లో కూచొని సినిమా చూస్తుంటాడు. ముద్దులు, ఆలింగనాలు, బట్టలూడతీసే దృశ్యాలు రాగానే చేతి ఘంట వూపుతూ చేయి పైకెత్తుతాడు. అది కేబిన్ అద్దాలలోంచి చూసే ప్రొజెక్టర్ ఆపరేటర్ ఆల్‌ఫ్రెడో, ఆ దృశ్యాన్ని కత్తిరించి డస్ట్‌బిన్‌లో పారేస్తాడు. అలా ప్రీస్ట్ లోకల్ సెన్సార్ చేసిన తర్వాతనే ప్రజలకు ఆ సినిమా చూపించడం జరుగుతుంది. ప్రీస్ట్ వెనకాలే వచ్చి సినిమాలు చూసే టోటోకు క్రమంగా సినిమా చూడకుండా వుండలేని పరిస్థితి వస్తుంది. డబ్బులు లేకపోవడంవల్ల టోటో మెల్లగా ప్రాజెక్టర్ ఆపరేటర్ అల్‌ఫ్రెడోతో స్నేహం చేస్తాడు. రోజూ వెళ్లి కేబిన్‌లో కూర్చోవడం. కేబిన్ అద్దాలలో నుండి స్క్రీన్‌ను చూడడం, ప్రేక్షకుల ప్రవర్తనను గమనించడం, కత్తిరించిన ఫిలిం ముక్కలను ఎత్తుకొచ్చుకోవడం, వాటిని ఇంటికి తెచ్చుకుని దీపం వెలుగులో చూసుకుని మురిసిపోవడం లాంటవి చేస్తుంటాడు. టోటో చురుకుదనం, తెలివితేటలు, ముద్దుమాటలు అల్‌ఫ్రెడోని ఆకర్షిస్తాయి. ఇల్లు గడవడం కష్టంగా వుంటే, సరుకులు తేవడానికి ఇచ్చిన యాభై లీరాలు సినిమాకే తగలేసినందుకు వెతుక్కుంటూ వచ్చిన తల్లి, టోటోను పట్టుకుని చితకబాదుతుంటే, ఇంటికి వెళుతున్న అల్‌ఫ్రెడో చూసి అడ్డుకుంటాడు. వాళ్ళ క్లిష్ట పరిస్థితిని గమనించి, ఆ యాభై లీరాలు థియేటర్లో నాకు దొరికాయని చెప్పి తల్లికి ఇచ్చేస్తాడు. ఇంట్లో టోటో దాచుకున్న ఫిలిం ముక్కలతో ఒక డబ్బా నిండిపోతుంది. ఆ ఫిలిం ముక్కలవల్ల ఇంట్లో అగ్నిప్రమాదం జరిగితే తల్లి, టోటోను చితకబాదుతుంది. అల్‌ఫ్రెడ్ వచ్చి విడిపించి తనతో తీసుకువస్తాడు. టోటో ప్రొజెక్టర్ నడిపిస్తానంటే ఈ ఉద్యోగం చేయవద్దు. తీరిక, సెలవులు లేని ఉద్యోగమిది. పండుగలు లేవు. వేడుకలు వుండవు. ఎప్పుడూ ప్రొజెక్టర్‌తోనే. ఒంటరి బతుకై పోతుంది అన్నా టోటో వినిపించుకోడు. ప్రొజెక్టర్‌లో రీలు ఎక్కించడానికి టోటోకు ఎత్తు సరిపోకపోతే, ఒక స్టూల్ వేసి నించోబెడతాడు. రీలు ఎక్కించడం, సైడునుండి ఫిలిం తీసి, ప్రదర్శనకు అనుకూలంగా సిద్ధం చేయడం చకచకా చేసి, అల్‌ఫ్రెడోను ఆశ్చర్యపరుస్తాడు. నీవు ఇక్కడితోనే ఆగొద్దు. నీ చదువు కొనసాగిస్తునే వుండాలి అని వాగ్దానం తీసుకుంటాడు. ప్రొజెక్షన్, లైటింగ్ మెళకువలను అల్‌ఫ్రెడో నేర్పిస్తాడు. థియేటర్లో ఒక హిట్ సినిమాను అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ప్రదర్శించాలని ప్రేక్షకులు గొడవ చేస్తే, యజమాని అందర్ని తరిమేసి హాలు మూసివేస్తాడు. పైనుండి చూస్తున్న టోటో, వాళ్ళకు మనం సినిమా చూపిస్తే ఎలా వుంటుందని అడగ్గా, అల్‌ఫ్రెడో లైటింగ్‌ను, తిప్పి బయటవున్న ఇంటి గోడమీదకు ఫోకస్ చేయగా తెల్లగోడ మీద సినిమా కనబడటంతో ప్రేక్షకులు పరుగెత్తుకుంటూ వస్తారు. దాన్ని బయట చూస్తున్నందుకుగాను ప్రేక్షకులు సగం ధరకు టికెట్లు కొనాలని యజమాని క్లర్క్‌ను పంపిస్తే, ప్రేక్షకులు వాడ్ని లాగి అవతల పడేస్తారు. అలా సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో అధిక వేడికి ఫిలిం కాలిపోతూ అగ్నిప్రమాదం సృష్టిస్తుంది. అప్పట్లో తయారైన ఫిలింకు అతి త్వరగా అగ్నిని ఆకర్షించే గుణం వుండటం ఒక ప్రధాన కారణం. కేబిన్‌లో అగ్నిని ఆర్పడానికి ప్రయత్నిస్తుంటే రీలు బాక్సు బద్దలై అల్‌ఫ్రెడో ముఖానికి బలంగా తాకడంతో అతను గుడ్డివాడైపోతాడు. అచేతనంగా పడిపోయిన అల్‌ఫ్రెడోను ఎంతో కష్టపడి టోటో బయటకు తీసుకువస్తాడు. మంటల్లో కాలిపోయిన ఆ థియేటర్‌ను ఫుట్‌బాల్ లాటరీ గెలిచిన స్థానికుడొకడు పునర్నిర్మిస్తాడు. అక్కడ ప్రొజెక్టర్ నడిపే ఏకైక వ్యక్తి టోటో కావడంవలన, లేబర్ చట్టాలను పక్కనబెట్టి బాలుడైన టోటోను ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా నియమిస్తారు.
పది సంవత్సరాలు గడుస్తాయి. టీనేజ్‌లోకి ప్రవేశించిన సాల్వటార్ హైస్కూలు చదువుతునే, సినిమా థియేటర్లో ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ వుంటాడు. తన ప్రాణాలు కాపాడిన సాల్వడార్ పట్ల ఆల్‌ఫ్రెడోకు విపరీతమైన ప్రేమ. కెబిన్‌లో, బయట తిరుగుతూ సినిమాల గురించి, నిర్మాణ విషయాల గురించి, క్లాసిక్స్ గురించి వివరించి చెబుతుంటాడు. సాల్వటార్ హోమ్ మూవీ కెమెరాతో తీసిన చిత్రీకరణలతో పరిశోధనలు చేస్తుంటాడు. ఆ స్కూల్‌లోకి కొత్తగా వచ్చిన ఎలెనా అనే అమ్మాయిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె దృష్టిని ఆకర్షించడానికి ఎన్నో తిప్పలు పడి చివరకు ఆమె ప్రేమను గెలుచుకుంటాడు. ధనవంతుడైన ఎలెనా తండ్రి, వీరిద్దరి ప్రేమను సహించలేక, ఆ వూరు వదిలి కుటుంబంతోసహా వెళ్ళిపోతాడు. అప్పుడే నిర్బంధ మిలటరీ శిక్షణకు సాల్వటార్ వెళ్ళాల్సి వస్తుంది. మిలటరీ నుండి ఎలెనాకు రాసిన ఉత్తరాలన్నీ తిరిగి వచ్చేస్తాయి. మిలటరీ నుండి ఇంటికి తిరిగి వచ్చిన సాల్వటార్ దిగాలుగా వుంటే, ఆల్‌ఫ్రెడో అతనికి కర్తవ్యబోధ చేస్తాడు. ఈ వూళ్ళో వుండి నీవు ఏమి చేయలేవు. నీ కలలు సాకారం కావాలంటే ఈ వూరు వదిలి నగరానికి వెళ్ళిపో. నీ గత స్మృతులు, నీ బంధాలు అన్ని తెంచుకో. వాటి గురించి ఆలోచించకు, ప్రస్తావించకు. వెళ్ళి నీ భవిష్యత్తును సరిదిద్దుకో’’ అని చెబుతాడు. సాల్వటార్ కన్నీళ్ళతో ఆ ఊరు విడిచి రోమ్‌కు చేరుకుంటాడు.
గత స్మృతులలోంచి బయటపడిన సాల్వటార్- ఆల్‌ఫ్రెడో అంతిమ క్రియలకుగాను తన ఊరు చేరుకుంటాడు. ఆ అంతిమ యాత్రలో పాల్గొన్న అనేకులు తాను ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నప్పుడు కనిపించిన ప్రేక్షకులే అని వాళ్ళను తానూ, తనను వాళ్ళు వౌనంగా గుర్తిస్తారు. తను చూసిన, పనిచేసిన థియేటర్‌ను ఎందుకు మూసివేశారని దాని యజమానిని అడుగుతాడు. టి.వి., రేడియోల వల్ల ఆదరణ కోల్పోయి మూతపడిందని అతను చెబుతాడు. మరుసటిరోజే పార్కింగ్ ప్లేస్ కోసమని ఆ థియేటర్‌ను కూల్చివేస్తారు. తన జీవితాన్ని మలుపుతిప్పిన ఆ థియేటర్‌ను తన కళ్ళముందే కూలిపోవడం చూస్తాడు. అల్‌ఫ్రెడో భార్య ‘నీ విజయాల గురించి ఎప్పుడూ గర్వంగా చెప్పుకునే అల్‌ఫ్రెడో, నీకోసం కొన్ని వస్తువులు దాచిపెట్టాడని చెబుతుంది. అందులో ప్రొజెక్టర్‌లో రీలు ఎక్కించడానికి ఉపయోగించిన స్టూలు వుంటుంది. ప్రీస్ట్ సెన్సారు చేసిన అశ్లీల దృశ్యాల ఫిలిం ముక్కలతో ఒక రీలు, తాను ఎలీనా మీద తీసిన దృశ్యాల రీలును చూస్తూ సాల్వటార్ కన్నీళ్ళ పర్యంతమవడాన్ని చూపిస్తూ సినిమా ముగుస్తుంది.
ఈ సినిమాలో బాల సాల్వటార్ అనగా టోటోగా నటించిన సాల్వటార్ కాషియో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తాడు. అల్‌ఫ్రెడోగా నటించిన ఫిలిప్ నాయిరెట్ కూడా అద్భుతంగా నటించాడు. అల్‌ఫ్రెడో, టోటోల మధ్య పెరిగిన అనుబంధాన్ని, ఆత్మీయతలను చూపే దృశ్యాలు చిత్రీకరించిన విధానం అద్భుతం. నీ గతాన్ని మరచిపో, దాన్ని ఇక్కడే విడిచిపెట్టు అని చెప్పిన అల్‌ఫ్రెడో మాటలను మన్నించిన సాల్వటార్ గత స్మృతులతోనే ఈ సినిమా సాగడం విశేషం. వర్తమానంలో వున్న సాల్వటార్ గురించి అనగా అతడు దర్శకుడిగా ఎదిగిన క్రమాన్ని వివరించకుండా- పూర్తిగా అతని బాల్యానికి, కొంత కౌమారానికి కేటాయించి ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా ఆ థియేటర్లో ప్రదర్శించే. రకారకాల బ్లాక్ అండ్ వైట్ పాత చిత్రాలలో నుండి కొన్ని దృశ్యాలను చూపించడం బాగా వచ్చింది. పనిలో పనిగా థియేటర్లో ప్రేక్షకుల హావభావాలు, చేష్టలు, అల్లరినికూడా బాగా చూపించగలిగారు. హాస్య, కరుణాత్మకంగా తీసిన ఈ చిత్రాన్ని చూడడమే గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా క్లాసిక్‌గా కూడా పేరుతెచ్చుకుంది. ఈ చిత్రం 1989లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొని గ్రాండ్ ఫ్రిక్స్ అవార్డును గెలుచుకుంది. 1989లోని ఉత్తమ విదేశీ చిత్రంగా అకాడమీ అవార్డ్‌ను, గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. 1991లో అయిదు విభాగాలలో బఫ్తా అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు అయిన గిసెప్పీ టోర్నిటోర్. ఈ చిత్రాన్ని అద్భుతమైన దృశ్యకావ్యంగా మలిచాడు. సినిమా పిచ్చి వున్న ఎవరైనా భాషాభేదం లేకుండా ఈ చిత్రాన్ని చూసి ఆనందించవచ్చు. తమ జ్ఞాపకాలను నెమరేసుకోవచ్చు.

-కె.పి.అశోక్‌కుమార్