సబ్ ఫీచర్

అభ్యుదయ కళామందిర్.. ఆవంత్స సోమసుందర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ’’ అన్నాడు చేమకూర వేంకటకవి. ఆ మాట అప్పటికేమో గానీ ఇప్పటివరకూ గోదావరిజిల్లాలకు అన్వర్ధవౌతూ వస్తోంది. ముఖ్యంగా పిఠాపురం రాజావారి కళాశాలకు స్థల మహత్యమో మరేమోగానీ, అక్కడ చదివిన వారెవరూ వ్యర్థజీవితాన్ని గడపలేదు. తెలుగు సాహిత్యంలో మొదటినుంచీ అభ్యుదయభావాలు కలిగియుండి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న కొద్దిమందిలో ఆవంత్స సోమసుందర్ ఒకరు. స్వతంత్రభావాలు, సొంత ఆలోచన, పరిశీలనాదృష్టి, సద్యఃస్పందన, కవితాశక్తి, పదునైన పదబంధాలను విసరగలిగే చాకచక్యం, ఎంత పెద్దవారినైనా నిలబెట్టగల పాండితీప్రకర్ష, సంస్కృత భాషా సాహిత్యాలపై అపారమైన అధికారం, రత్నపరిశోధకులకు ఉండవలసిన రాపిడిపెట్టే నైపుణ్యం, అన్నిటినీ మించి సదసద్ జ్ఞాన విచక్షణ, విమర్శనా దక్షత సోమసుందర్ గారిని సోమేశ్వరు నంతటివానిగా నిలబెట్టాయి. అందులోనూ అయన జన్మించిన నాటి పరిస్థితులు ఆయనను మరింత విజృంభించేలా చేశాయి. ఒకపక్క భావ కవిత్వ ప్రభావం, మరోపక్క అభ్యుదయ భావనలు, ఇంకోపక్క వ్యావహారిక భాషోద్యమం, అవతల పక్క కమ్యూనిస్టు భావజాలం , అందులోనే తిరుపతి వేంకటకవులు, వెంకట పార్వతీశ్వరకవుల సంప్రదాయ అవధాన జయ కేతనం. ఇన్నిటిమధ్య ఏదారిని వెళ్ళాలి? ఏదిశగా పురోగమించాలి? అన్నీ అనే్న. దేన్నీ వదులుకోకూడదు. ఇదీ ఆనాడున్న సందిగ్ధ పరిస్థితి. ఒక్కసారిగా తెలుగు సాహిత్యోద్యానవనం నూరు రేకులతో విప్పారి సుగంధాలు దశదిశలా వెదజల్లుతుంటే ఏ పుష్పాన్ని ఆఘ్రాణించాలి? దేన్ని వదిలిపెట్టాలి? అనే మీమాంస ప్రతివాళ్ళలోనూ గుబులు పుట్టించింది. అప్పుడు సోమసుందర్ లోని విమర్శకుడు బుద్ధిపెట్టి ఆలోచించాడు. దానికితోడు దేశంలో గాంధీ నాయకత్వంలో జరుగుతున్న స్వాతంత్య్రోద్యమం సోమసుందర్‌ను ఆకర్షిం చింది. వెంటనే 1942-43లలో క్విట్ ఇండియా ఉద్యమంలోకి ఆయన దూకేశాడు. యువజన నాయకుడై తన తోటి విద్యార్థులందరినీ సమీకరించుకుని గాంధీజీ వెంట నడిచాడు. లాఠీదెబ్బలు తిన్నాడు. ఆ ఆవేశంలో తీక్షణమైన దేశభక్తి కవిత్వం ఆయన నోటినుండి ఉరికింది. ఇక అప్పటినుండీ దేశంలో ఎక్కడ ఏ సంఘటన చోటుచేసుకున్నా సోమసుందర్ స్పందించటం, ఫలితంగా అప్పటి ప్రభావాన్ని బట్టి అభ్యుదయ గీతాలు, కవితలు ఆవేశపూరితంగా ఆయన కలంనుంచి ఉరుకులు పెట్టటం మొదలయ్యింది. ఒకవంక కవితలు అగ్నికణాల మాదిరిగా ఉరికించటంతో పాటు ఎంత లోతు భావనలో ఉన్నా విమర్శనా దృష్టిని కోల్పోకుండా పద ప్రయోగాలనుంచీ భావాల విసురులవరకూ ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీ లించి ఒక నిబద్ధతకు నిలిచిన సాహితీమూర్తి సోమసుందర్. అప్పటికే నిజాం ఆంగ్లేయులతో కలిసి తన భద్రతకు భరోసా పొంది ప్రజలను పీడించుకు తినటం, కాల్చుకు తినటంతో ప్రజల బ్రతుకు దుర్భరమైంది. తన అనుచరులైన రజాకార్లతో నిజాం హైదరాబాద్ ప్రాంతంలో దోపిడీలు సాగించాడు. జనం బ్రతకటానికి వీల్లేని పరిస్థితులు సృష్టించాడు. అప్పుడు సోమసుందర్ కలం వజ్రాయుధం వలె నిజాం పైకి ఎక్కుపెట్టబడింది. ఆ కవితలు నాటుబాంబుల్లా జనాన్ని రెచ్చగొట్టాయి. బ్రిటిష్ ప్రభుత్వం సోమసుందర్ ‘‘వజ్రాయుధం’’ కవితా సంపుటిని నిషేధించింది. ప్రజా బాహుళ్యంతో సోమసుందర్ అంతగా కలిసిపోయేవాడు అని చెప్పటానికి ఇదొక నిదర్శనం.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారికి విడిగా రాష్ట్రం కావాలని ఆనాడు అమరజీవి పొట్టిశ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా అప్పటి ప్రధాని నెహ్రూ పట్టించుకోని పరిస్థితుల్లో సోమసుందర్ ‘‘జ్వాల’’ అనే పత్రికలో వారానికి ఒక ఈటెలాంటి కవితను వెలిగించేవాడు. అది ఆంధ్రోద్యమానికి కాగడా వెలిగించినట్లయింది ఆ తరువాత ఆ కవితలన్నిటినీ కలిపి ‘‘కాహళి’’ అనే పేరుతో ఒక సంపుటిగా వెలువరించారు. దేశంలో ఎక్కడ ఏ కదలిక వచ్చినా, అది మంచిగానీ బాధగానీ ఏదైనా సరే సోమసుందర్ స్పందించకుండా ఉండేవాడుకాదు. 1953లో గోదావరికి విపరీతమైన వరదలు వచ్చి ఊళ్లకు ఊళ్ళే ఊడ్చుకు పోయాయి. కొట్టుకుపోతున్న గడ్డిఇళ్ళపైకెక్కి ప్రాణాల కోసం విలపించిన ఆర్తుల ఆర్తనాదాలు సోమసుందర్‌ను కలవర పెట్టాయి. ఆ ప్రమాదకర పరిస్థితుల్లో గోదావరీతీరంవెంట నడుస్తూ సోమసుందర్ ఆపన్నులకు ధైర్యాన్ని చెప్పాడు. వారి దీన హీన స్థితిని చూసి చలించిపోయాడు. సహజంగా కవి కావటం వలన కరుణ రసపూరితంగా కవితలను వెలయించాడు. ‘‘గోదావరీ జల ప్రళయం’’ పేరుతో తరువాత కాలంలో అవి సంపుటిగా వచ్చాయి. సోమసుందర్ అనునిత్యమూ ఏదోఒకటి రాస్తూనే ఉండేవాడు. ఆయన ప్రధానంగా అభ్యుదయ భావాలున్న ఆధునిక కవియే అయినా ఆయన సంప్రదాయాన్ని విస్మరించలేదు. సంప్రదాయ ఛందస్సులను విడనాడలేదు. ఛందస్సర్ప పరిష్వంగాలు అని తీండ్రించిన కవులరోజుల్లోనే వారి భావాలను అడ్డుకున్నాడా అన్నట్లుగా మారుమూల ఛందస్సుల్ని తీసుకుని ఛందోబద్ధంగా పద్యాలు రాశాడు. అలా ఒకటో రెండో కాదు. ఏకంగా ఒక సుదీర్ఘకావ్యానే్న రాశాడు. అయితే ‘‘రక్తాక్షి’’ అనే పేరుతో రాసిన ఆ కావ్యంలో ఇతివృత్తం మాత్రం అభ్యుదయవాదానికి చెందినదే. కేవలం విప్లవ గీతాలనేకాక, సోమసుందర్ లలిత గీతాలు కూడా రాశాడు. ఇవేకాకుండా సోమసుందర్ సామాజిక స్ఫూర్తితో రాసిన రచనలు కూడా ఉన్నాయి. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని సోమసుందర్ సమర్ధించాడు. దేశమంతా దాన్ని వ్యతిరేకిస్తే, మేధావియైన సోమసుందర్ సమర్ధించటం చాలామందికి నచ్చలేదు. అప్పట్లో ఆంధ్రజ్యోతికి నార్ల వెంకటేశ్వరరావు ప్రధాన సంపాదకుడు. సోమసుందర్ ఆ పత్రికకు వ్యాసాలూ రాస్తే నార్లవారు అలాంటి అభిప్రాయాలు తగవని చెప్పి సోమసుందర్ చేత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అభిప్రాయాన్ని చెప్పించారు. తన అభిప్రాయాలు మార్చుకోవాల్సివస్తే సోమసుందర్ పట్టుదలకు పోయేవాడుకాడు. అలాగని తాను సరియైన విమర్శ చేసినప్పుడు ఎవరు చెప్పినా వినేవాడు కూడా కాదు. సోమసుందర్ శ్రీశ్రీ రచనలపైనా, దేవులపల్లి కృష్ణశాస్ర్తి రచనల గురించీ, సినారె రచనల గురించీ విస్తృతమైన, సమగ్రమైన వ్యాఖ్యలు రాసి తెలుగు సాహిత్యాభిమానులకు అపురూపమైన కానుకలను అందించాడు. ఈయన సిద్ధాంతపరంగా మార్క్సిస్ట్ అయినా ఒంటెద్దుపోకడ పోలేదు. నిలబడి మార్క్స్ భావాలను విశే్లషించాడు. తన ‘‘వ్యాసావళి’’లో మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలను విశే్లషిస్తూ వాటి ఆచరణాత్మక మార్గాలను అనే్వషించాడు. ఒక వ్యక్తిలో ఇన్ని భావాలు ఉండటం చాలా అపురూపం. ఆయన మార్క్సిస్ట్. అభ్యుదయవాది. అదే సందర్భంలో సంప్రదాయాలను గౌరవించే సభ్యతగల పెద్దమనిషి. వాస్తవికత కోసం అంకితమైన గొప్ప విమర్శకుడు. ముందుచూపుగల దార్శనికుడు. రచయిత యైనవాడు సమాజ నడవడికి ప్రతిక్షణం స్పందించాలి. సరియైన దిశానిర్దేశనం చేయాలి. తన పేరు ప్రఖ్యాతుల కోసం తన పంధాను మార్చుకునే అస్వతంత్రపుజీవి కారాదు. అప్పుడే రచయితకు బాధ్యత పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. సమాజం అవసరమైనవేళ సహాయం కోసం రచయిత వంక చూస్తుంది. అలా సమాజానికి సరియైన మార్గాన్ని చూపగలవాడే నిజమైన రచయిత. అతడు కీర్తికిరీటాల కోసం తపన చెందడు. తన మనుగడ కోసం కాళ్ళు కడగడు. సోమసుందర్ అలాంటి నిజమైన రచయిత. అతడు పొందిన సత్కారాలు కేవలం నామమాత్రమైనవి. అనంతంగా ఆయన రాసిన రచనలు తెలుగువారికి అమూల్య సంపద.
1924లో తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దగ్గరలోని శంఖవరంలో జన్మించిన సోమసుందర్ నిజంగా ఒక కారణజన్ముడు. సంస్కృతం చదివి మార్క్సిస్టు అయినవారిలో సోమసుందర్ అరుదైన వ్యక్తి. ధారాళంగా పద్యాన్ని వ్రాయగలిగీ, వజ్రాయుధం లాంటి వచన కవితల్ని అందించాడంటే అది ఆయన భాషా సౌధపు గట్టిదనమే. ఆయన జీవితంలోని గొప్ప విశేషమేమంటే ఆయన జీవితం చివరి నిమిషం వరకూ 92ఏళ్ళు నిండినా రాస్తూనే వెళ్ళిపోయాడు. భావి తరాలకు ఆయన రచనా స్ఫూర్తి ఆదర్శపాత్రం. ఆలోచనా శక్తి ఆచరణ సూత్రం.

- డా. చింతలపాటి మురళీకృష్ణ, 94412 71135