సబ్ ఫీచర్
సరిహద్దుల మధ్య ఘర్షణలో..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రపంచ సినిమా : ఇజ్రాయెల్ (లెమన్ ట్రీ)
శత్రు రాజ్యాల మధ్య వున్న ఉద్రిక్తతలకు సరిహద్దు గ్రామాలు ఎప్పుడూ బలవుతూనే వుంటాయి. ముఖ్యంగా శత్రు రాజ్యాల మధ్య ప్రతి చిన్న విషయానికి- ఒక్కోసారి ఏ కారణం లేకుండానే సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు పెరుగుతుంటాయి. అత్యంత ఉద్రిక్తతలు కలిగిన ప్రాంతాలుగా ఇండో-పాకిస్తాన్ సరిహద్దు, ఇజ్రాయిల్-అరబ్ సరిహద్దులు ముఖ్యమైనవి. ఖచ్చితమైన సరిహద్దులు లేనిది పాలస్తీనా- ఇజ్రాయిల్ మధ్య జరిగే ఏ వివాదాస్పద సంఘటన అయినా అలజడులకు, కర్ఫ్యూలకు, కాల్పులకు దారితీసే ప్రమాదముంది. అక్కడ జరిగిన ఒక నిజమైన సంఘటన ‘‘లెమన్ ట్రీ’’ చిత్రంగా రూపుదాల్చింది. ఒకసారి ఇజ్రాయిల్ రక్షణ మంత్రి తమ దేశ సరిహద్దుల దగ్గరున్న తన ఇంటికి వచ్చినప్పుడు, సరిహద్దుల్లో వున్న నిమ్మతోట ఉగ్రవాదులు దాక్కోవడానికి ఉపయోగపడే ప్రమాదముందని భావించి, ఆ తోటను నరికేస్తారు. ఆ తోట యజమానులు ఈ విషయమై కోర్టుకుపోయినా లాభం లేకుండాపోతుంది. అరబ్బులకు, మధ్యప్రాచ్య యూదులకు మధ్య వ్యక్తిగత సంబంధాలను పెంపొందించే విధంగా సినిమాలు తీస్తున్న ప్రఖ్యాత ఇజ్రాయిల్ డైరెక్టర్ ఎరాన్ రిక్లీస్ దృష్టికి ఈ నిమ్మతోట ఉదంతం రావడంతో, ఈ సంఘటన చుట్టూ కాల్పనిక సన్నివేశాల్ని అల్లుకుని ఈ సినిమాను తీశారు.
‘లెమన్ ట్రీ’ చిత్రంలో సల్మా అనే పాలస్తీనియన్ వితంతువుకు, చనిపోయిన తండ్రి వారసత్వంగా మిగిల్చిపోయిన స్థలంలో నిమ్మతోటను వేసి దాన్ని సంరక్షించుకుంటూ, దానిమీద వచ్చే ఫలసాయం మీద జీవనం గడుపుతుంటుంది. ఎప్పుడయితే కొత్త ఇజ్రాయిల్ రక్షణ మంత్రి అతని భార్య మీరాతో కలిసి ఆమె ఎదురు ఇంట్లోకి రావడంతో, ఆమెకు కష్టాలు ప్రారంభమవుతాయి. సరిహద్దుకు అటు ఇటు వీరిద్దరి ఇళ్ళు వుండడం, ఇద్దరి ఇళ్ళమధ్య నిమ్మతోట అడ్డుగా వుండడం ఒక సమస్యగా పరిణమిస్తుంది. ఏపుగా, దట్టంగా పెరిగిన నిమ్మతోట టెర్రరిస్టులు దాక్కోవడానికి అనువుగా వుంది. కాబట్టి మంత్రిగారి రక్షణ దృష్ట్యా, ఆ తోటను నిర్మించాలని సెక్యూరిటీవాళ్ళు సూచిస్తారు. అందుకుగాను సల్మాకు నష్టపరిహారం ఇవ్వబడుతుందని ఇజ్రాయిల్ ప్రభుత్వంనుండి లేఖ వస్తుంది. సల్మా ఇద్దరు కూతుళ్ళకు పెళ్ళిచేసి పంపిస్తుంది. ఉన్న ఒక్క కొడుకు దూరంగా వాషింగ్టన్‌లోని ఒక హోటల్లో పనిచేస్తుంటాడు. ఒంటరి బ్రతుకైపోయిన సల్మాకు ఊరిపెద్ద, ఆ స్థలం వదులుకోమని సలహా ఇస్తాడు. పట్టువదలని సల్మా సహాయం కోరుతూ పాలస్తీనా అథార్టీ వాళ్ళను కలిస్తే లాభం లేకుండాపోతుంది. ఇక ఇజ్రాయిల్ ఆర్మీ ఆమెను మాట్లాడనివ్వకుండా వెనక్కు పంపించి వేస్తుంది. సల్మా తన తోటను కాపాడుకోవడానికి జైదీ అనే పాలస్తీనా లాయర్‌ను కుదుర్చుకుంటుంది. ఆ లాయర్ ఆమె తరఫున ఇజ్రాయిల్ కోర్టులో వాదిస్తుంటాడు. ఐతే కోర్టు కేసును కొట్టివేయడమే కాకుండా, తోటకు ఫెన్సింగ్ వేసి కట్టుదిట్టం చేయమని ఆర్డర్ వేస్తుంది. కోర్టు తీర్పు మేరకు వెంటనే, అహర్నిశలు కాపలాకాసే సెంట్రీతో, ఇద్దరి ఇళ్ళ మధ్య వాచ్‌టవర్ వెలుస్తుంది. ఆమె చూస్తుండగానే ఎవరూ పోకుండా తోట చుట్టూ దట్టమైన ఫెన్సింగ్ ఏర్పడుతుంది. రోజులు గడుస్తున్నకొలది చెట్లు నీళ్ళు లేక ఎండిపోవడం, నిమ్మ పండ్లు రాలిపడటం జరుగుతుంది. అది చూడలేక సల్మా దొంగతనంగా ఫెన్సింగ్ గేటు ఎక్కి లోపలకు పోయి చెట్లకు నీళ్ళు పెడుతుంటే, సైనికులు అడ్డుకుని వెనక్కు పంపేస్తారు. ఆమె చెట్ల గురించి పడే తాపత్రయాన్ని బంగళాలో నుండి చూసే మీరాకు, ఆమె పట్ల అభిమానం ఏర్పడుతుంది. తోటను రక్షించమని మీరా తన భర్తను వేడుకుంటుంది. కాని అతను సెక్యూరిటీ ఆఫీసర్ల వాదనవైపే మొగ్గుచూపుతాడు.
సల్మా కేసు సందర్భంగా వాదించే లాయర్ క్రమంగా సల్మా పట్ల ఆకర్షితుడవుతాడు. నిజానికి వయసులో ఆ లాయర్ ఆమె కంటే పదేండ్లు చిన్నవాడు. ఆమె పట్టుదల, కార్యదీక్ష చూసి ఆ లాయర్ ఆమె పట్ల ఇష్టాన్ని పెంచుకుంటాడు. పాలస్తీనా జాతికి చెందిన కొందరు సాంప్రదాయ పెద్దలు, వాళ్ళమధ్య వున్న బంధం గురించి ప్రశ్నించి ఆమెను ఇబ్బంది పెడతారు. సల్మా తోట గురించి చేస్తున్న పోరాటం కోర్టును దాటి, జర్నలిస్టుల దృష్టిని ఆకర్షిస్తుంది. తోట మీద సెక్యూరిటీవాళ్ళు చేసిన దాడి గురించి ఆమె జర్నలిస్టులకు చెబుతుంది. ఈ సంగతి పాఠకులలో సంచలనం రేకెత్తిస్తుంది. టివిలో సల్మా ఆవేశ పూరితంగా చేసే విన్నపాన్ని కోర్టు గమనించాల్సి వస్తుంది. టివికి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఆమెతో వున్న లాయర్‌ను చూపిస్తూ టివి, పత్రికలు ఆమె భర్తగా పేర్కొంటాయి. ఇజ్రాయిల్ సైన్యం అతిగా ప్రవర్తించిందని మీరా భావించి, ఆమెను ఓదారుస్తుంది. వాళ్ళు అంతకుముందు మాట్లాడుకోలేకపోయినా, మానవత్వం వారిని కలుపుతుంది.
తోటను నిర్మూలించడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేననీ, జెనీవా ఒప్పందంలోని 53వ నిబంధనకు వ్యతిరేకమని లాయర్ సుప్రీం కోర్టులో వాదిస్తాడు. అయితే ఇజ్రాయిల్‌కు ఖచ్చితమైన సరిహద్దులు లేవనీ, తరచుగా కర్‌ఫ్యూలు ఏర్పడుతుంటాయనే సాకుతో పాలస్తీనీయుల ఆస్తులను కొల్లగొట్టడం, వాళ్ళప్రాంతాలను- ఇళ్ళను కూల్చివేసి జైళ్ళను కట్టే చట్టాలు తెచ్చిన ఇజ్రాయిల్, లాయర్ వాదనను పట్టించుకుంటుందా? ఈ కేసు జాతీయంగానే కాకుండా, అంతర్జాతీయంగా కూడా వార్తలకు ఎక్కుతుంది. కాని జాతీయ భద్రత దృష్టివల్ల సుప్రీంకోర్టు కేసు డిస్‌మిస్ చేయడంతో, లాయర్‌తో కూడా బంధం తెంచుకుని, సల్మా ఒంటరిగా వుండిపోవడానికే నిశ్చయించుకుంటుంది. చూస్తూ వుండగానే సల్మా స్థలానికి, రక్షణ మంత్రి ఇంటికి మధ్య ఒక కాంక్రీట్ గోడ ఎత్తుగా లేస్తుంది. నరికివేసిన నిమ్మ చెట్ల మొదళ్ళను స్పర్శిస్తూ, దిగాలుగా కన్నీళ్ళతో వున్న సల్మాను చూపిస్తూ సినిమా ముగుస్తుంది.
సల్మా ఒంటరి ఆడది అయినప్పటికీ, పరిస్థితులకు భయపడకుండా పోరాడటానికే నిశ్చయించుకుంటుంది. ఎక్కడా ఆమె తన గౌరవానికి గాని, మర్యాదకుగానీ భంగం వాటిల్లకుండా వ్యవహరించి, తన జీవితాన్ని తనకిష్టమైన రీతిలో మలచుకుంటుంది. ఒంటరి మహిళగా సల్మా చూపిన తెగువను, ఆత్మస్థైర్యాన్ని మనం అభినందించాల్సిందే. సల్మా ప్రధాన పాత్రగా సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. మిగతా వాళ్ళంతా గెస్ట్ పాత్రధారులే. సంక్లిష్టమైన సల్మా పాత్రలో ఇజ్రాయిలీ- అరబ్ నటి హియమ్ అబ్బాస్ అద్భుతంగా నటించింది. ఈ సినిమాను అరబిక్, హీబ్రూ భాషల్లో తీశారు. ఈ చిత్రం షూటింగ్‌ను కల్‌కిల్క్యా, రమిల్లా పట్టణాలలోనూ జలజోన్ శరణార్ధి శిబిరంలోనూ తీశారు. సుప్రీంకోర్టు దృశ్యాలు జెరూసలేంలో వున్న సుప్రీంకోర్టులోనే చిత్రీకరించారు. ఇతర దర్శకులు సాహసించని ప్రాంతాలలో సినిమా షూటింగ్ జరపడం దర్శకుడు ఎరాన్ రిక్లీస్‌కు అలవాటే. ఎరాన్ రిక్లీస్ ఈ సినిమాకు రచన, నిర్మాత, దర్శకత్వం వహించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమా, అమెరికాలో 17వారాలు నడిచి మంచి కలెక్షన్లను సంపాదించింది. అయితే ఈ సినిమా పాలస్తీనియన్లకు అనుకూలంగా వుందనే తప్పుడు అభిప్రాయంతో వున్న ఇజ్రాయిలీలు ఈ సినిమాను పట్టించుకోలేదు సరికదా వ్యతిరేక భావాలను ఏర్పరచుకున్నారు. కాని పాలస్తీనియులు మాత్రం ఈ సినిమాను సాదరంగా ఆహ్వానించారు. ఈ చిత్రం బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘‘పానోరమ ఆడియన్స్ అవార్డ్’ను, ఉత్తమ నటి- ఉత్తమ స్క్రీన్‌ప్లేలకు గాను ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డులను, యూరోపియన్ ఫిలిం అవార్డులను అందుకున్నారు. అలాగే ఇజ్రాయిల్ ఫిల్మ్ అకాడమీ అవార్డులలో ఉత్తమ నటి, ఉత్తమ కళా దర్శకత్వం, ఉత్తమ వస్త్రాలంకరణ, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ సంగీతం, ఉత్తమ ధ్వని, ఉత్తమ దర్శకత్వానికి గాను అవార్డులను అందుకున్నారు.