సబ్ ఫీచర్

పరలోక యాత్రకు మధ్యవర్తులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2009లో జరిగిన జపాన్ అకాడమి అవార్డుల పోటీలో 13 విభాగాలలో పోటీ చేసిన జపాన్ చిత్రం ‘ఒకురిబిటో(డిపార్చర్స్)’- ఉత్తమ చిత్రం, స్క్రీన్‌ప్లే, డైరెక్టర్, హీరో హీరోయిన్లతో సహా పది విభాగాలలో బహుమతులు గెలుచుకోవడం ఒక రికార్డు. 81వ అకాడమీ అవార్డ్సు రేసులో పాల్గొని ఇజ్రాయిలీ చిత్రం ‘వాల్జ్ విత్ బషీర్’, ఫ్రెంచి చిత్రం ‘ది క్లాస్’లతో తీవ్రమైన పోటీని ఎదుర్కొని, ఉత్తమ విదేశీయ చిత్రం అవార్డు గెలుచుకుంది. శవాలంకరణ కూడా ఒక కళగా తీర్చిదిద్దిన జపాన్ కళాకారుల కృషి, సేవా, అంకితభావాన్ని తెలియజేసిన చిత్రం ‘డిపార్చర్స్’. ఇందులో సంగీతకారుడిగా బతకలేని వ్యక్తి శవాలంకరణ వృత్తినెంచుకుని అందరి అభిమానాన్ని చూరగొన్న విధానాన్ని ఈ చిత్రం తెలియజేస్తుంది.
మనిషి బతికున్నంతసేపే రాజవైభవం. ప్రాణాలు వదిలిన మరుక్షణం ఆ శవాన్ని ఎంత త్వరగా వదిలించుకోవాలా? అని ఆరాటపడతారు. చనిపోయిన తర్వాత కూడా అంత్యక్రియలు వారి మతాలు నిర్దేశించిన విధానంలోనే పూర్తిచేయబడతాయి. జపాన్‌లో కూడా అంత్యక్రియల పద్ధతి బౌద్ధ ఆచారాలకు అనుగుణంగా అత్యంత సంప్రదాయ పద్ధతిలో కొనసాగుతాయి. ముందుగా శవాన్ని చాపపై పడుకోబెట్టి తడి గుడ్డతో శుభ్రం చేసి, నవరంధ్రాలను దూదితోమూసివేస్తారు. శవం తలవెంట్రుకలను దువ్వి ముఖాన్ని మేకప్‌తో అలంకరించి, క్రమంగా శవంపై ఉన్న దుస్తులపై తెల్లటి దుస్తులను తొడిగి, క్రింది నుండి పాత గుడ్డలను తీసివేయడం, వాళ్ళ చేతులు ముడిచి ఛాతిపై పెట్టడం- ఇలా శుభ్రంగా తయారుచేసిన తర్వాత ఎంపిక చేసిన శవపేటికలో జాగ్రత్తగా దించి, ఆ వ్యక్తి ఉపయోగించిన వ్యక్తిగత వస్తువులతోపాటు, మరణానంతర జీవితానికి అవసరమైన వస్తువులను కూడా అందులో ఉంచి, శవపేటికను మూసివేస్తారు. డబ్బున్నవాళ్ళు ఆ శవపేటికను ఊరేగింపుగా స్మశానానికి తీసుకువెళ్తారు. ఏ మాత్రం అసహ్యపడకుండా, భక్తిశ్రద్ధలతో ఈ పనిచేసే వృత్తిపరమైన కళాకారులను నొకాషి (డిపార్చర్స్)లుగా పిలుస్తారు. జపాన్ ఫ్యూడల్ సమాజంలో అపరిశుభ్రంగా వుండి శవాలంకరణ చేసినవాల్ళను ‘బురాకుమిన్’ (అస్పృశ్యులు)గా పరిగణించి, వాళ్ళను నివాసాలతో సహా దూరంగా వుంచేవారు. 1968లో వచ్చిన సాంస్కృతిక మార్పులవల్ల అంత్యక్రియల పట్ల మరింత శ్రద్ధాసక్తులు పెరిగినప్పటికీ, అంటరానివాళ్ళ పట్ల వివక్షత తొలగిపోలేదు. 1998 సర్వే ప్రకారం 70 శాతం మంది జపానీయులు మరణానంతర జీవితాన్ని నమ్ముతారు. యువతరంలో ఈ నమ్మకం ఎక్కువగా వుండటం విశేషం.
27 ఏళ్ళ జపాన్ నటుడు మోటొకి తన మిత్రుడితో కలిసి 1990లో భారత సందర్శనకు విచ్చేశాడు. ఆయన వారణాశిని సందర్శించినపుడు అక్కడి శవదహనాలను, బూడిదను గంగానదిలో కలిపేయడం, దానిని చూడటానికి హాజరయిన జనాల సందడి ఆయనపై చెరగని ముద్రవేసింది. ఆయన జపాన్ చేరుకున్న తర్వాత మరణానికి సంబంధించి అనేక పుస్తకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి 1993లో జీవితానికి, మరణానికి మధ్య వున్న సంబంధాన్ని వివరిస్తూ ఒక పుస్తకం రాశాడు. అలా పుస్తకాలు చదివే క్రమంలో షిమోన్ ఓకి అనే నొకాషి (శవాలంకరణ చేసే వ్యక్తి) ఆత్మకథను చదివి, శవాలంకారుల జీవితాలను తెలిపే చిత్రం తీయడానికి సంకల్పించాడు. ఈ ఇతివృత్తం విని పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. నిధుల సేకరణ చాలా కష్టమై ఈ సినిమా నిర్మాణానికి పదేళ్లు పట్టింది. అనేకసార్లు స్క్రిప్టును తిరగరాశారు. ఇందులో మతపరంగా అంత్యక్రియలకు సంబంధించి అన్ని వివరాలను చూపించలేదు. కేవలం నొకాషి వాళ్ళ వృత్తి జీవన చిత్రణలకే ఈ చిత్రం పరిమితమైంది.
‘డిపార్చర్స్’ అనే ఈ చిత్రంలో- ఒక సంగీత బృందంలో సెల్లో (పెద్ద సైజు వయొలిన్) వాయించే డైగో కొబయాషి, జనాదరణ లేక ఆ సంగీత బృందం రద్దు కావడంతో, నిరుద్యోగిగా రోడ్డుమీదకు వస్తాడు. నిరుద్యోగిగా బతకలేక తన ప్రాణప్రదమైన సెల్లోను అమ్మివేసి ఆ డబ్బుతో భార్య మికాతో కలిసి టోక్యోను విడిచి, తన స్వస్థలమైన యమగతాకు వచ్చేస్తాడు. బాల్యాన్ని అక్కడే గడిపిన డైగో రెండేళ్ళ క్రితం తల్లి మరణించడంతో టోక్యోకు వస్తాడు. వాళ్ళకు ఊళ్ళో ఇంటికి ముందు భాగంలో ఒక కాఫీ షాప్ వుండేది. ఆ కాఫీ షాప్ నడిపే డైగో తండ్రి, అక్కడ పనిచేసే వెయిట్రస్‌తో పారిపోతాడు. అపుడు డైగోకు ఆరేళ్ళు. తర్వాత వాళ్ళు కలుసుకోలేదు. తండ్రిని ఇప్పటికీ క్షమించలేకపోతాడు. తల్లిని బాగా చూసుకోలేదనే అపరాధ భావన కూడా అతడ్ని పీడిస్తుంటుంది. కాని తన తండ్రి బాల్యంలో ఇచ్చిన లివింగ్ స్టోన్ (నీటి ప్రవాహానికి అరిగిపోయి నునుపుదేలిన గులకరాయి)ను అతిభద్రంగా దాచిపెట్టుకుంటాడు. తమ మనసులో నిబిడీకృతమైన ప్రేమను వ్యక్తీకరించటానికి మాటలు దొరకనపుడు, ఒక లివింగ్ స్టోన్ ఇవ్వడం ద్వారా దానిని తెలియజేస్తుంటారు.
ఉద్యోగం కోసం తీవ్రంగా వెతుకుతున్న డైగో వెళ్లిపోయే వారికి సహాయకులు కావాలనే ఉద్యోగ ప్రకటన చూసి అక్కడకు వెళతాడు. క్లుప్తంగా ముగిసిన ఇంటర్వ్యూలో యజమాని ససాక్, డైగోను ఎంపిక చేసకుని అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తాడు. తీరా ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగమని వెళ్లిన డైగోకు, అది అంత్యక్రియలకు సమాయాత్తపరిచే శవాలంకరణ ఉద్యోగమని తెలిసి బిత్తరపోతాడు. చేసేది లేక ముందుగా యజమాని ససాక్ వెంట వెళ్లి భక్తిశ్రద్ధలతో అతను చేసే శవాలంకరణను అతి జాగ్రత్తగా గమనిస్తాడు. అయినా తన ఉద్యోగం గురించి భార్య మికాకు తెలియకుండా జాగ్రత్తపడతాడు. తన ఇంట్లోనే చచ్చిపోయిన ఒంటరి మహిళను రెండు వారాల దాకా ఎవరూ గమనించలేకపోతారు. ఆమె శవాన్ని అలంకరించడానికి బాస్‌తో వచ్చిన డైగో, రిగర్ మార్టిస్ ప్రారంభమైన ఆ శవం నుండి వచ్చే వాసనకు కడుపులో తిప్పి వాంతులు చేసుకుని, అక్కడ వుండలేక ఇంటిముఖం పడతాడు. బస్‌లో వస్తుంటే తన శరీరం నుండి వచ్చే వెగటు వాసనకు ఇతర ప్రయాణీకులు దూరంగా జరిగితే, శుభ్రం కావడానికి చిన్నపుడు తరచుగా వెళ్ళే స్నానశాలకే వెళతాడు. ఆ స్నానశాల యజమానురాలు తన పాత క్లాస్‌మేట్ తల్లి.
త్వరలోనే డైగో శవాలంకరణ పనుల్లో ఆరితేరతాడు. నైపుణ్యంగా చాకచక్యంగా కదిలే చేతులు, భక్తిశ్రద్ధలతో శవాన్ని అందంగా అలంకరించిన విధానంతో ఆయా కుటుంబీకుల అభిమానాన్ని, ఆనందాన్ని చూరగొంటాడు. కాని తను చేస్తున్న పని తెలిసి స్నేహితులు అసహ్యించుకుని దూరం పెడతారు. భార్యకు తెలసి ఆమె కోపగించుకుని పుట్టింటికి వెళ్లిపోతుంది.
అతని బాస్ ససాక్, అతని లేడీ సెక్రటరీలకు డైగో సెల్లో వాయిద్యగాడని తెలిసి, అతని నైపుణ్యం చూసి ఆనందిస్తారు. డైగోకు వృత్తిపట్ల గల ఆసక్తిని, అంకితభావాన్ని గుర్తిస్తారు. డైగో అంత్యక్రియల ఏర్పాట్లలో కొత్త ప్రయోగాలకు తెరదీస్తాడు. సంగీత వాద్యాల హోరులో శవాల బండి ఊరేగింపు, రోగగ్రస్తురాలయిన ముసలిదాని శవం దగ్గరికి పిల్లలను తెల్లటి సాక్స్‌లతో అనుమతించడం ఇందులో భాగాలే. కొన్ని రోజుల తర్వాత మికా తిరిగి వచ్చి తాను గర్భవతిననే సంగతి భర్తకు తెలియజేస్తుంది. పుట్టబోయే పిల్లవాడు తన తండ్రి ఉద్యోగం గురించి, గొప్పగా చెప్పుకునే ఉద్యోగం చేయమని కోరుతుంది. మిసెస్ యమషిత చనిపోగా ఆమె అంత్యక్రియల ఏర్పాట్లకు డైగోను పిలుస్తారు. ఆమె స్నానశాల యజమానురాలే కాకుండా తన స్నేహితుడి తల్లి. ఆమె కుటుంబీకులు, అతని పని చూడటానికి పట్టుబడి వచ్చిన మికా ముందర అత్యంత నైపుణ్యంతో భక్తిశ్రద్ధలతో అతను చేసే శవాలంకరణ చూసి, అతని స్నేహితులతోపాటు అందరూ, అతడ్ని మెచ్చుకోవడమే గాక గౌరవించడం జరుగుతుంది. డైగో తన ఉద్యోగం మార్చుకోవాల్సిన అవసరం లేదని మికా చెబుతుంది.
కొన్నిరోజుల తర్వాత డైగో తండ్రి చనిపోయాడనే వార్త తెలుస్తుంది. తండ్రి తన తల్లికి చేసిన ద్రోహాన్ని తలచుకుని అసహ్యించుకోవడంవల్ల, అతనికి తనకు సంబంధం లేదని అక్కడకు వెళ్లనంటాడు. కాని భార్య, కన్నతండ్రి అని నచ్చచెప్పి దూరంగా వున్న ఆ వూరికి తీసుకెళ్తుంది. అక్కడకు పోయి నిర్లిప్తంగా వుంటే, తోటి పనివాళ్ళు తన తండ్రి శవాన్ని నిర్లక్ష్యంగా పడేయడం చూసి భరించలేకపోతాడు. తండ్రి శరీరాన్ని ప్రేమగా తీసుకుని, శరీరమంతా శుభ్రం చేస్తూ, బిగిసిపోయిన ఆ చేతివేళ్ళను విడదీయగా కనిపించిన లివింగ్‌స్టోన్‌ని చూసి నిశే్చష్టుడైపోతాడు. తండ్రితో గడిపిన క్షణాలన్నీ గుర్తుకువచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. నిజానికి తండ్రి వెయిట్రస్‌తో పారిపోలేదనీ, కుటుంబం పట్ల అత్యంత ప్రేమతో విధేయంగా ఉన్నాడనీ, అనవసరంగా తాము దూరం చేసుకున్నామని, లివింగ్ స్టోన్ ద్వారా వెలిబుచ్చిన అతని ప్రేమను గుర్తించి కుమిలిపోతాడు. ఆ లివింగ్ స్టోన్‌ను జాగ్రత్తగా గర్భిణిగా వున్న తన భార్య ఒడిలోకి జారవిడవడం ద్వారా, కన్నతండ్రి ప్రేమను వారసత్వంగా కొనసాగిస్తానని సింబాలిక్‌గా తెలియజేయడంతో సినిమా ముగుస్తుంది.
మరణం అన్నది అనివార్యం. ఈ లోకంలో మనిషి ఎంత అందంగా ఆకర్షణీయంగా వుండాలని తాపత్రయపడతాడో, అతడ్ని అలాగే పరలోకానికి పంపాలనే ఆలోచనే శవాలంకారులను సృష్టించింది. వారిని పరలోకానికి పంపించే మధ్యవర్తులుగా వీరు తమను తాము భావించుకుంటారు. జపాన్ ప్రజలు కూడా అలానే భావిస్తారు. ఈ ఆధునిక యుగంలో కుటుంబ సభ్యుల మధ్య పెరుగుతున్న అంతరాలను కూడా ఈ చిత్రం తెలియజేస్తుంది. శవాలంకరణలో భాగంగా డైగో, చనిపోయిన భార్య ఉపయోగించే లిప్‌స్టిక్ ఏమిటని అడిగితే ఆ భర్తకు తెలియదు. నపుంసకుడిగా ఇంట్లోంచి పారిపోయిన కొడుకు గురించి ఎప్పుడూ పట్టించుకోని అతని తల్లిదండ్రులు అతని సెక్సువాలిటీ గురించి చర్చించుకోవడం విచిత్రం. డైగో మిత్రుడు, తన తల్లి నడిపే స్నానవాటికవల్ల వచ్చే ప్రయోజనాల గురించే ఆలోచిస్తాడు తప్ప ఆమెను పట్టించుకోడు. చిన్నపుడే తండ్రికి దూరమైన డైగో అతనిపట్ల ద్వేషాన్ని పెంచుకోవడం మనకు తెలిసిందే. ఇవన్నీ ఆధునిక జపాన్ సమాజంలో వ్యక్తికి, కుటుంబానికి మధ్య పెరుగుతున్న దూరాల్ని తెలియజేస్తాయి. చనిపోయినపుడే కాదు బ్రతికి వున్నపుడు కూడా వారిని పట్టించుకోవాలని ఈ చిత్రం సూచిస్తుంది.
ఈ చిత్రంలో కథానాయకుడిగా డైగోగా మసహీరో మోటోకా, అతని యజమాని ససాక్‌గా సుటోము యమజాకి పోటీపడి నటించారు. సూటు బూట్లతో శుభ్రంగా తయారై వచ్చి, మొహంలో ఎలాంటి భావాలు కనిపించకుండా అత్యంత నైపుణ్యంగా చేతులను కదిలిస్తూ, శవాన్ని అందంగా తీర్చిదిద్దుతూ, దుస్తులను ఎవరికి కనిపించకుండా మార్చేస్తూ భక్తిశ్రద్ధలతో, సేవా అంకితభావంతో పనిచేసే వృత్తి కళాకారులుగా వీరు అద్భుతంగా నటించారు. కథానాయికగా పెద్దగా ప్రాముఖ్యతలేని మికా పాత్రలో జపాన్ పాప్‌సింగర్ యొకో హిరోసు నటించింది.
మరణం - అంత్యక్రియల మీద తీసిన ఈ చిత్రాన్ని పంపిణీ చేయడానికి జపాన్‌లో ఏ డిస్ట్రిబ్యూటర్ ముందుకు రాలేదు. దాంతో 2008లో జరిగిన మాంట్రియల్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్‌కు ఈ చిత్రాన్ని పంపిస్తే, అక్కడ బహుమతిని గెలుచుకోవడమే కాకుండా సినీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అక్కడ వచ్చిన పేరు ప్రతిష్ఠలతో జపాన్‌లో విడుదల చేస్తే, జనాలు విరగబడి చూడటంతో స్థానికంగా అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. 2009లో ఉత్తమ విదేశీ చిత్రంగా అకాడమీ అవార్డు గెలుచుకవోడంతోపాటు, ఇతరత్రా పోటీల్లో కూడా అనేక బహుమతులు గెలుచుకుంది. ఎందుకోగాని ఈ సినిమా చూస్తుంటే, కాటూరి త్రివిక్రమ్ రాసిన ‘పితృవనం’ అనే తెలుగు నవల జ్ఞాపకంరావడంలో ఆశ్చర్యమేమున్నది?

-కె.పి.అశోక్‌కుమార్