సబ్ ఫీచర్

విజ్ఞాన ఉద్యమ వైతాళికుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రదేశంలో విజ్ఞాన ఉద్యమం ప్రారంభికులలో ముఖ్యుడు కొమర్రాజు లక్ష్మణరావు. తెలుగు భాషలో చరిత్ర, సాహిత్యం, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు ముద్రించి ఆంధ్రులు విజ్ఞానవంతులు కావడానికి ప్రాతిపదికను ఏర్పరచారు. ఈయన కృషి ఆంధ్ర దేశంలో పునరుజ్జీవన ఉద్యమానికి దోహదపడింది. 18 మే, 1877లో కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో గంగమ్మ, వెంకటప్పయ్యదంప తులకు జన్మించారు. బాల్యంలోనే తండ్రి చనిపోవడంవలన కొమర్రాజు తన అక్కగారయిన అచ్చమాంబ ఉంటున్న నాగపూర్‌కు వెళ్ళవలసి వచ్చింది. సుమారు 12 సంవత్సరాలపాటు అక్కడ గడిపి బి.ఎ. పూర్తి చేశారు. నాగపూర్‌లో ఉంటున్న సమయంలో మహారాష్టల్రో జరుగుతున్న జాతీయోద్యమాన్ని సంస్కరణోద్యమాలను ఆసక్తిగా గమనించారు. మహారాష్ట్ర మేధావులతో కలిగిన పరిచయంవలన పుస్తక ప్రచురణల ప్రాధాన్యతను తెలుసుకోగలిగారు. మరాఠీ భాషలో విజ్ఞాన సర్వస్వం గ్రంథాల రచనలో శ్రీ్ధర వెంకటేశ్వర కేట్కర్‌కు సహకరించారు. ఈయనలోని దేశభక్తి భావాలకు మూలం మహారాష్టల్రో జరిగిన ఉద్యమ పరిణామాలే. మునగాల సంస్థానాధిపతి అయన నాయని వెంకట రంగారావు ఆహ్వానంమేరకు కొమర్రాజుగారు సంస్థాన సలహాదారునిగా ఉద్యోగంలో చేరారు. జమీందారీకి సంబంధించిన కోర్టు వ్యాజ్యాల కోసం కొమర్రాజుమద్రాసు వెళ్ళవలసి వచ్చింది. అక్కడున్న రోజులలో ‘‘స్వరాజ్య ఫండ్’’ వసూలు కార్యక్రమంలో పాల్గొని ధన సేకరణ చేసి తనలోని జాతీయోద్యమ భావాన్ని ప్రకటించారు. ఆయనకు సమాజ ప్రగతి, దేశ ప్రగతి గురించి కొన్ని స్పష్టమైన ఆశయాలున్నాయి.
* స్ర్తిలు విజ్ఞానవంతులైనపుడే దేశాన్ని నాగరిక దేశమని పిలవడానికి ఆస్కారముంటుంది.
* మాతృభాషలలోనే విద్యాభ్యాసం జరగాలి.
* ప్రకృతి శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలను మాతృభాషలో రాయించి ప్రచురించాలి.
* చిన్నయసూరి రచనలను ఆదర్శంగా తీసుకొని భాషను సరళంగా రూపొందించాలి.
* ఆధునిక నాగరికతా పరిణామాలకు కేంద్రాలైన ఇంగ్లండ్, గ్రీస్, ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్ దేశాల చరిత్రలను తెలుగులో రచించి అందరూ చదువుకోవడానికి వీలుగా అందుబాటులోకి తీసుకురావాలి.
* పదార్థవిజ్ఞానం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, పశుశాస్త్రం, జీవశాస్త్రం, భూగర్భ శాస్త్రాలకు సంబంధించి పుస్తకాలు అందుబాటులో లేవు. కావున వాటిని తెలుగు భాషలో ముద్రించి విద్యాలయాలకు అందించాలి.
* అంక గణితం, బీజ గణితం, రేఖాగణితం, క్షేత్ర గణితం, త్రికోణమితి మొదలగు గ్రంథాలను తెలుగులో రచించి అందుబాటులోకి తీసుకురావాలి.
* అస్పృశ్యతను నిర్మూలించకుండా పూర్ణ స్వరాజ్యం సాధించలేం.
తన ఆశయాల సాధనకోసం కొమర్రాజుగారు మిత్రులతో కలసి హైదరాబాద్‌లో ‘శ్రీకృష్ణదేవరాంధ్ర భాషానిలయాన్ని’ స్థాపించారు. 1906లో ‘‘విజ్ఞాన చంద్రికామండలి’’ని స్థాపించారు. ఈ మండలిలో 8వేల మంది చందాదారులు ఉండేవారు. ఈ సంఖ్య ఆంధ్రదేశంలో పెరుగుతున్న విజ్ఞాన చైతన్యానికి తార్కాణం. విజ్ఞాన గ్రంథాల ప్రచురణకోసం ‘‘విజ్ఞాన చంద్రికా గ్రంథమాల’’ను ఏర్పాటు చేశారు. సంవత్సరానికి 1600 పేజీల స్వతంత్ర గ్రంథాలను ప్రచురించడం, శాశ్వత చందాదారులను ఏర్పరచడం, చౌక ధరలకు పుస్తకాలు విక్రయించడం ఈ గ్రంథమాల ఆశయాలు, నియమాలు.
గతంలో భారతీయ రాజులకు విదేశీ పరిణామాల గురించి తెలుసుకొనే అలవాటు ఉండేదికాదు. ఆ కారణంగా విదేశీ దండయాత్రికులకు తమ రాజ్యాలను వారు కోల్పోవడం జరిగింది. ఇది గమనించిన కొమర్రాజు పొరపాట్లు పునరావృతం కాకుండా చేయాలని భావించారు. విదేశీ ఆంగ్లరచనలను తెలుగులోకి అనువాదం చేసి ప్రచురించడానికి పూనుకొన్నారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు రాసిన ‘అబ్రహాంలింకన్ జీవిత చరిత్ర’ను కొమర్రాజు ప్రచురించారు. తను స్వయంగా రాసిన ‘హిందూ మహాయుగ’మను చరిత్ర గ్రంథాన్ని ప్రచురించాడు, అచంట లక్ష్మీపతి రాసిన ‘జీవశాస్తమ్రు’ వేలాల సుబ్బారావు రాసిన ‘‘రాణీ సంయుక్త’, తానే స్వయంగా రాసిన ‘మహమ్మదీయ యుగము’అను గ్రంథాలను ప్రచురించారు. ‘‘ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము’’అను ఉద్గ్రంధాలను కొమర్రాజు చాలా శమించి ప్రచురింప చేసారు. 1100 పేజీల ఈ గ్రంథంలో భాషా విషయాలు, గణిత విషయాలు, ధర్మశాస్త్ర విషయాలను పొందుపరచారు. 15 సంవత్సరాల కాలంలో ఈ మండలి 30 పుస్తకాలను ప్రచురించింది. అంతేకాక అయ్యదేవర కాళేశ్వరరావుతో కలసి కొమర్రాజుగారు 1912లో ‘‘విజ్ఞానచంద్రికా పరిషత్’పేరు మీదుగా ‘‘వైజ్ఞానిక, చారిత్రక శాస్త్రగ్రంథ’’పఠన పోటీలను నిర్వహించారు. పోటీ పరీక్షలలో నెగ్గినవారికి రూ.116/- బహుమానాలు బంగారు, వెండి, పతకాలు యోగ్యతాపత్రం ఇచ్చేవారు. ఆరోజులలో ఉపాధ్యాయుని నెల జీతం కంటే ఎక్కువ మొత్తంలో బహుమతి మొత్తం ఉండటం గమనించదగిన విషయం. వీరు నిర్వహించే పోటీ పరీక్షలకు కందుకూరి వీరేశలింగం కట్టమంచి రామలింగారెడ్డి, వనప్పాకం శ్రీనివాసాచార్యులు వంటి మేధావులు వీటికి న్యాయ నిర్ణేతలుగా ఉండేవారు. వంద సంవత్సరాల పూర్వమే సమాజాభివృద్ధికి శాస్తవ్రిజ్ఞానం దోహదపడుతుందని కొమర్రాజు గుర్తించారు. చరిత్ర అధ్యయనంవలన సమాజానికి జరిగే మేలును గుర్తించిన అతి తక్కువ మందిలో ఈయన ముఖ్యుడు. తన రచనలలో కొమర్రాజు భారతీయులు సముద్రయానం నిషేధాన్ని తొలగించాలని, అణగారిన వర్గాల వారిని అందరితో సమానంగా ఎదగనివ్వాలని, ‘‘్భరవి, దేవదాసి’’ వంటి పేర్లతో స్ర్తిలను మోసంచేసే పద్ధతులను మానుకోవాలని, దేవతలకు నరబలులు ఇచ్చే ఆచారాన్ని మానివేయాలని,బాల్య వివాహాలను నిషేధించాలని కోరారు.
ఇటువంటి విజ్ఞానోద్యమ నాయకుడు 13 జూలై 1923లో మరణించారు. ‘‘ఆయన అకాల మరణం వలన ఆంధ్ర దేశమునకు ఆంధ్ర భాషకు తీరని కొరత కలిగినది.. ఆయన మాకు సారథి, సచివుడు, గురుడు... దుఃఖ సముద్రంలో ముంచి దివికేగెను’’అని అయ్యదేవర కాళేశ్వరరావుగారు ఆంధ్ర దేశానికి కొమర్రాజు లక్ష్మణరావుగారు చేసిన సేవలను కొనియాడారు.

- బడబాగ్ని శంకరరాజు సెల్: 9440508511