మెయిన్ ఫీచర్

పోషకాలు పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజా కూరగాయల్లో ఎన్నో విలువైన పోషకాలుంటాయి. వాటిని ఆరగించటానికి అనువుగా పసందైన రుచులలో వండుకుంటాం. వండడంవల్ల ఆహార పదార్థాలకు రుచి, సువాసన కలుగుతాయి. అలాగే కంటికి ఇంపుగా కనబడతాయి. జీర్ణం చేసుకోవడం తేలికవుతుంది.
కూరగాయలను వండడంలో జాగ్రత్తలు పాటిస్తూ కొన్ని మెళకువలు వహిస్తే వండిన వంటలు రుచి, సువాసనలతోపాటు పోషక విలువలు కలిగి ఉంటాయి. కూరగాయలు కడగడం, తరగడం, ఉడకపెట్టడంలో సరియైన అవగాహన లేక ఎన్నో పోషకాలను నష్టపోతున్నాం. ఆహార పదార్థాలను ఉడకపెట్టినా, వేపుడు చేసినా ‘అతి’గా చేస్తే పోషక విలువలు నశిస్తాయి.
తినే ఆహారాన్ని ఏ పద్ధతిలో తయారుచేసినా తగు జాగ్రత్తలతోపాటుగా కొన్ని వంటింటి చిట్కాలు తెలుసుకుంటే సరిపోతుంది. ఆహార పదార్థాలలోని పోషకాలు, విటమిన్లు అన్నీ మన సొంతమవుతాయి.
తాజా కూరగాయల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. అవి పూర్తిగా ఆవిరైపోకుండా తగు మోతాదు నీటిలో మాత్రమే ఉడకపెట్టుకోవాలి. ఆరగించడం సులభం అని కూరలను ఎక్కువగా ఉడికించకూడదు. వేపుడు చేయడంవలన ఆహార పదార్థాల రుచి పెరుగుతుంది కానీ ఎంతో విలువైన పోషకాలు నష్టపోతాము. తక్కువ నూనెలో మితంగానే వేపుడు చేసుకోవాలి. డబల్ రోస్ట్ మోజులో పడితే చాలామటుకు పోషకాలు మాయమవుతాయి. వెన్న, డాల్డాలకు బదులుగా ఆలివ్ ఆయిల్‌ను వాడుకోవాలి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. అన్నం వండేటప్పుడు గంజి వార్చకుండా అత్తెసరుగా వండాలి. అంటే 1:2 నిష్పత్తిలో బియ్యం, నీరు పోసి ఉడికించాలి.
ఇడ్లీ, వడ, అట్లు, దోసెలు వగైరా తయారీలో విధిగా పొట్టు పప్పును వినియోగించాలి.
పప్పు, ధాన్యం ఒకే రకం రోజు వాడటంకన్నా రెండు, మూడు రకాలుగా వాడితే మేలు.
ఆవిరితో ఉడికిన ఆహార పదార్థాలు తక్కువగా పోషకాలను నష్టపోవడమే కాక సులభంగా జీర్ణమవుతాయి. పప్పులు, కూరలు ఉడికిన తరవాత మిగిలిపోయిన నీటిని వృధాచేయకుండా చారులో కానీ, పులుసులో కానీ వాడుకోవాలి. పోపుపెట్టి ఎంతో రుచిగల రసం చేసుకోవచ్చు. బీట్‌రూట్‌ను ఉడికించిన నీటిని పారపోయకుండా అన్నం వండేందుకు వాడితే, అన్నం రుచికరంగానూ, పోషక విలువలనూ కలిగి ఉంటుంది. రంగు ‘రెడ్ పలావ్’లా ఉంటుంది మరి.
టమాటాలు తరిగేప్పుడు రసం కారిపోకుండా ముక్కలుగా తరుగుకోవడానికి కాసేపు ఫ్రీజర్‌లో టమాటాలను నిల్వ చేసుకోవాలి.
ఆకు కూరలు, కూరగాయలను తరిగే ముందుగానే ఉప్పు నీటితో కడగాలి. అయితే తరవాత కడగాల్సి వచ్చినప్పుడు వీలైనంత పెద్ద ముక్కలను తరగడం మంచిది. తరిగిన ముక్కలను నీటిలో కడగడంవల్ల ఏమంత శుభ్రపడక పోవడంతోపాటూ నీటిలో కరిగిపోయే విటమిన్ల నష్టం జరుగుతుందని గమనించాలి.
సాధ్యమైనంతవరకు దుంప కూరలు, కూరగాయల పొట్టు తక్కువగా తీయాలి. మన శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు, ఖనిజ లవణాలు, విటమినులు ఈ తొక్కకిందనే సమృద్ధిగా ఉంటాయి.
ఆకుకూరలను వండేప్పుడు పాత్రలపై మూతలు తప్పక పెట్టాలి. నీళ్లు మరిగిన తరవాతనే ఆకుకూరల ముక్కలు వేసి ఉడికించాలి.
ఆకుకూరలను తరిగేప్పుడు లేత కాడలను కూడా తరుక్కోవాలి. ఈ కాడలలో కాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని పులియపెట్టి వండటంవలన పోషక విలువలు పెరుగుతాయి. ముఖ్యంగా బి,సి విటమినుల నష్టం ఉండదు. పప్పులు త్వరగా ఉడకాలని సోడా ఉప్పు వాడుతారు. దీనికి బదులుగా నిమ్మరసం, చింతపండు రసం వాడితే విటమిన్-బి నష్టం ఉండదు. ఘుమ ఘుమలాడే చక్కని వంటకం తయారవుతుంది. పచ్చి కూరగాయలను ఉడకపెట్టకుండా అలాగే తినడంవలన పోషకాలు పుష్టిగా లభిస్తాయి. అయితే మంచినీటితో శుభ్రంగా కడిగి వాడాలి. నీళ్లలో కాసేపు నానపెట్టడం కానీ, ఫ్లోటింగ్ వాటర్‌లో కడగడం కానీ తప్పక చేయాలి.
ఆరోగ్యకరమైన పదార్థాలను వండటంకోసం స్టీమ్ కుక్కర్, సోలార్ కుక్కర్‌లను వినియోగించాలి. వంటలు వేడిగా ఉన్నప్పుడే తినేయ్యాలి. చల్లారినా, తిరిగి వేడి చేసినా పోషకాలు హరిస్తాయి.

- హర్షిత