సబ్ ఫీచర్

చార్జీల పేరుతో సామాన్యుల దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబంలోని, సమాజంలోని సభ్యుల యొక్క, దేశంలోని ప్రజల యొక్క క్రమశిక్షణాయుత ప్రవర్తననుబట్టే, ఆయా వ్యవస్థల యొక్క ఆర్థికాభివృద్ధి, శాంతిభద్రతలూ ఆధారపడి వుంటాయి. అందరూ బాధ్యతను, సంస్కారాన్నీ ఎరిగి ప్రవర్తిస్తే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయి. శాంతిభద్రతలు రక్షింపబడతాయి. వారు బాధ్యతలు మరచి, క్రమశిక్షణా రాహిత్యంతో ఎవరిష్టంతోవారు ప్రవర్తిస్తే కుటుంబం కాని, దేశం కాని వృద్ధిచెందవు. అంతేకాదు, క్రమశిక్షణతో వుండే కొందరు ప్రజలు, నెమ్మదస్తులు, అమాయకులూ నష్టపోతారు. ఈనాడు ఈ దేశంలో పరిస్థితి అలాగే వుంది.
గత కాలంలో దేశ నాయకులను ప్రజలనుసరించేవారు. ఆ నాయకులు దేశభక్తితో, త్యాగాలుచేస్తూ రుజువర్తనతో ఆదర్శప్రాయంగా వుండేవారు. వారి సుగుణాలనే ప్రజలు గౌరవించి అనుసరించేవారు. అయితే, ఈనాటి దేశ నాయకుల్లో జాతీయభావం తొలగిపోయింది. వ్యక్తిగత అధికార కాంక్ష, ధనార్జనా మితిమీరాయి. వీటిని సాధించుకోడానికి చాలామంది నాయకులు పాలనా సాంప్రదాయాలనూ, చట్టాలనూ, చివరకు రాజ్యాంగాన్ని కూడా అతిక్రమించి ప్రవర్తిస్తున్నారు. ఇపుడు కూడా ప్రజలు వీరినే అనుసరిస్తూ దిగజారి పోతున్నారు. ఎవరి లాభం వాళ్ళకేనని, తోటి ప్రజల గురించి ఆలోచన ఎవరికీ లేదు. నాయకులే అలా చేస్తున్నపుడు, మనం చేయడంలో తప్పేంటి అని కొందరు ప్రజలు సమర్ధించుకుంటున్నారు. నాయకులు, అధికారంలో వున్నవారు, ప్రభుత్వ యం త్రాంగమూ, రాజ్యాంగంలోని వివిధ అధికరణలను తమకనుకూలంగా వ్యాఖ్యానించుకుని పబ్బం గడుపుకుం టున్నారు. వివిధ చట్టాల్లోని చిన్నచిన్న లోపాలను ఆసరాగా తీసుకుని, ప్రజావ్యతిరేకమైన కార్యక్రమాలను చేయగలుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎంతో ప్రముఖమైనవి, ఆదర్శంగా వుండవలసినవీ అయిన చట్టసభల్లో (అసెంబ్లీలు, పార్లమెంటు) విలువలు లుప్తమైపోయాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, క్రమశిక్షణా స్థాయ సాధారణ ప్రజల్లో కంటే ప్రజా ప్రతినిధుల్లో దిగజారి పోవడం. ఇలాంటి సంఘటనలను తరచుగా అసెంబ్లీలలోను, పార్లమెంటులోనూ చూస్తున్నాం. స్పీకర్లు సభలను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడుతున్నది. చేయదలచిన చట్టంపై చర్చ జరగడం లేదు. అలా పాసైన చట్టాల స్థాయి ఎలా వుంటుందో ఊహించవచ్చు.
ప్రజల క్రమశిక్షణ గురించి చెప్పుకోవాలంటే - దగ్గర దారిలో అపసవ్యంగానైనా, లాభాలను పొందాలని ప్రయత్నిస్తున్నారు. అందరూ నడవవలసిన రోడ్లమీద కూడా క్రమశిక్షణ లేదు. నడిచి, మోటారు వాహనాల మీద వెళ్లేవారూ ట్రాఫిక్ నిబంధనలను పాటించడం లేదు. కుడి, ఎడమలు పాటించకుండా వాహనాలు నడిపేస్తున్నారు. కొందరు చెవిదగ్గర సెల్‌ఫోన్ పెట్టుకుని, తలను భుజంమీద వాల్చి బజారులోనే దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయానే ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్.టి.సి.కి సాధారణ ప్రజలకు వర్తించే క్రమశిక్షణ వర్తించదా? ఇదివరలో ప్రైవేటు బస్సుల రవాణా వున్నపుడు, సీటింగు సామర్థ్యానికి మించి ప్రయాణీకులను ఎక్కించుకుంటే, ప్రభుత్వ సూపర్‌వైజర్లు చర్యలు తీసుకునేవారు. కాని, ఇపుడు ప్రభుత్వరంగంలో నడుస్తున్న బస్సుల్లో సీటింగుతో సంబంధం లేకుండా, జనాన్ని కుక్కేస్తున్నారు. అంతేకాదు, డీలక్స్, లగ్జరీ బస్సుల్లో కూడా నిలబెడుతున్నారు. ఆ బస్సులో బాగా ఎక్కువ చార్జీ ఎందుకంటే, ప్రయాణచార్జీలతోపాటు డీలక్స్ సదుపాయాలు ప్రయాణీకులకు ఏర్పాటుచేయాలి. కాని, కూర్చోడానికి కూడా చోటులేకపోయినా, ఆర్డినరీ బస్సుల్లో లాగ నిలబెడుతున్నారు. అయినా డీలక్సుచార్జీలు వసూలుచేస్తారు. పండుగల సమయంలోనూ, వారాంతంలో ఎక్కువగా రద్దీగా వున్నపుడూ 50శాతం చార్జీలు ఎక్కువ వసూలు చేసుకోవచ్చుననే అధికారాన్ని ఆర్.టి.సికిస్తూ జి.వో.నెం.70 విడుదల చేసారని పత్రికల్లో చదువుతున్నాం. ప్రభుత్వమే అలాంటి అధికారాన్ని కట్టబెడితే, ఆర్.టి.సి. చార్జీ ఎంతమేరకు పెంచుతారో ప్రజలు ఊహించవచ్చును. ఇదేం న్యాయమని ప్రజలు ప్రశ్నించరు! అది ప్రభుత్వరంగ సంస్థ కనుకే!
ఇటువంటి చార్జీల వసూలునే ఇటీవల కాలంలో రైల్వేశాఖ ప్రారంభించింది. మొన్నటిదాకా, సాధారణ ప్రయాణీకులకందుబాటులో వుండేది రైలు ప్రయాణం. కాని, వారుకూడా ఇపుడు అనుచితంగా చార్జీలను పెంచేస్తున్నారు అన్ని తరగతులకూ! ఇదివరకు కనీస ప్రయాణ చార్జీ రు.2/-. అది ఇపుడు రు.10/-, ఫ్లాట్‌ఫారం టికెట్ అర్థరూపాయుండేది. దాన్ని రు.5/-చేసి, ఇపుడు రు.10/- చేసారు. ఈ చార్జీల పెంపుదలే కాకుండా, ఈమధ్యకాలంలో ‘‘తత్కాల్’’ రిజర్వేషన్ ప్రారంభించారు. దీని ప్రకారం ఒకే తరగతిలో, ఒకే సదుపాయాలతో, ఒకే దూరం ప్రయాణించేవారికి, అదనపు తత్కాల్ చార్జీ కట్టగలిగితే, రిజర్వేషన్ ముందుగా ఇస్తారు. ఒక్కరోజు ముందు తీసుకుంటే వారికి దొరుకుతుంది. కాని, ఈ అదనపు తత్కాల్ చార్జి కట్టలేని సాధారణ ప్రయాణికునికి, 20రోజులు ముందుగా అడిగినా రిజర్వేషన్ దొరకక పోవచ్చును. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన సమాన న్యాయం (ఈక్వల్ జస్టిస్), సమానత్వం (ఈక్వాలిటీ) సూత్రాలకు ఈ తత్కాల్ పద్ధతి విరుద్ధంకాదా? ఈ తత్కాల్ చార్జీలను కూడా ఈమధ్యనే పెంచేసారు. అదికాకుండా, ‘ప్రీమియం రిజర్వేషన్’ పెట్టారు. దీని ప్రకారం-సాధారణ చార్జీకంటే కొన్ని రెట్లు అదనంగా ప్రీమియం చెల్లిస్తే, తత్కాల్ వారికంటే కూడా వీరికి ముందిస్తారు! ఇదికూడా రాజ్యాంగ విరుద్ధం కాదా? ఆర్.టి.సి.కాని, రైల్వేలు కాని, మరే ఇతర ప్రభుత్వరంగ సంస్థలు కాని ఈ విధంగా విచక్షణా రహితంగా చార్జీలను ప్రజలనుండి వసూలుచేయడం ప్రభుత్వ గుత్త్ధాపత్యమే! (స్టేట్ మోనోపలీ) ప్రైవేట్ గుత్త్ధాపత్యం కంటే, ప్రభుత్వ గుత్త్ధాపత్యం ఎక్కువ ప్రమాదం! ప్రజాప్రభుత్వాలూ, ప్రజలూ కూడా ఆలోచించరా? ఇదేమిటని ప్రశ్నించరా? దేశంలో విద్యావంతులూ, విజ్ఞానవంతులూ అయిన ప్రజలుండి కూడా ఈ వివక్ష పూరితమైన వసూళ్ళను సుప్రీంకోర్టులో సవాల్ చేయడంలేదు. అలా చేసి వుంటే, ఆర్.టి.సి., రైల్వే, ఇతర ప్రభుత్వరంగ సంస్థలూ, ప్రభుత్వమూ సుప్రీంకోర్టుకేం సమాధానం చెప్పేవారో, సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిచ్చేదో తెలిసేది కదా! కాని ప్రజల్లో అన్నీ తెలిసినవారు కూడా వౌనంగా ఈ అదనపుభారాల్ని మోస్తూ వుండిపోతున్నారు. ప్రశ్నించడం లేదు. ‘‘ప్రజలెలాంటి వారైతే, అలాంటి ప్రభుత్వమే వారికి దక్కుతుంది!’’అని రాజకీయ శాస్త్రంలో ఒక సూత్రముంది. ఆలోచించండి! ప్రశ్నించండి! మీ హక్కుల్ని కాపాడుకోండి!

- మనె్న సత్యనారాయణ