సబ్ ఫీచర్

ఫైర్ స్టేషన్ల సంఖ్యను పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అగ్నిమాపక కేంద్రాలు (ఫైర్ స్టేషన్లు) అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కేంద్రాల పరిధి ఎక్కువ ఉంటుంది. సదుపాయాలు తక్కువ. వేసవి మొదలైంది. మేల్కొనాలి పాలకులు. అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్న సందర్భాల్లో అగ్నిమాపక శకటాలు (ఫైర్ ఇంజన్లు) సరైన సమయానికి రాకపోతే భారీ నష్టం వాటిల్లుతుంది. నివాస గృహాల్లో, పాఠశాలలు, ఆసుపత్రులు, గోదాముల్లో అగ్నిప్రమాదం జరిగినపుడు అంతా బుగ్గిపాలు అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జనాభా దినదినం అభివృద్ధి చెందుతున్న కొత్త ఫైర్ స్టేషన్లు మంజూరు చేయటం లేదు. ప్రతి మండలానికి ఒక ఫైర్ స్టేషన్ మంజూరుచేస్తే అగ్నిప్రమాదాల్లో భారీ నష్టాలను నివారించవచ్చునని అధికారుల అంచనా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కనీసం నియోజకవర్గానికి ఒక ఫైర్‌స్టేషన్ లేకపోవటం విచారకరం. చాలా నియోజకవర్గ కేంద్రాల్లో లేకపోగా ఉన్నచోట నీటి సౌకర్యాలు, కనీస సౌకర్యాలు కరువయ్యాయి. సిబ్బంది కొరతవల్ల ప్రతి వేసవిలో పెద్దఎత్తున ఆస్తినష్టం జరుగుతోంది.
ప్రతి జిల్లా కేంద్రంలో మాత్రం రెండేసి ఫైర్ ఇంజన్లు ఉన్నాయి. ఐతే 50 నుంచి 100 కిలోమీటర్ల దూరం నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి ప్రమాదం నుంచి కాపాడవల్సి రావటంవల్ల ఆస్తి, ప్రాణనష్టాలు జరుగుతున్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్ ప్రమాద స్థలానికి చేరేసరికి గంట నుంచి రెండు గంటల సమయం పడుతున్నది. ఈలోగా భారీ నష్టం వాటిల్లుతోంది. కరీంనగర్ జిల్లాలో 13 శాసనసభా నియోజకవర్గాలు ఉండగా నాలుగు నియోజకవర్గాలకు ఇన్ని ఏళ్ళు ఐనా ఫైర్ స్టేషన్లు మంజూరు చేయలేదు. మానకొండూరు, చొప్పదండి, వేములవాడ డివిజన్‌లో కొత్త అగ్నిమాపక కేంద్రాలు ఎప్పుడు వస్తాయో పాలకులకే తెలియాలి. ప్రతి ఫైర్ స్టేషన్‌లో 10 మంది ఫైర్‌మెన్లు, ఇద్దరు లోడింగ్ ఫైర్‌మెన్లు, ఇద్దరు డ్రైవర్లు, ఒక ఫైర్ ఆఫీసర్ ఉండాలి. కాని తెలుగు రాష్ట్రాల్లో సగానికి పైగా ఫైర్‌స్టేషన్లకు ఏడుగురు చొప్పున సిబ్బంది ఉన్నారు. కొన్నిచోట్ల ఇద్దరు డ్రైవర్లు కాదుగదా! ఒక్క డ్రైవర్ పోస్టుకూడా లేదు. ఒకే రోజు రెండు అగ్నిప్రమాదాలు జరిగితే ఇక దేవుడిపై భారం వేసి వూరుకోవలసిందే. ప్రజల ధన, ప్రాణ, మానాలని రక్షిస్తామని ఎన్నికల్లో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన పాలకులు, రిస్క్‌తో కూడిన అగ్నిమాపక శాఖలో కూడా ప్రైవేట్ వారితో పనులు చేయించటం అన్యాయం. ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో తక్కువ వేతనంతో ఉద్యోగులను నియమించడంవల్ల జవాబుదారీతనం లోపిస్తున్నది. ధర్మపురిలోని కూరగాయల మార్కెట్ దగ్గర ఇటీవల అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక యంత్రం ఆలస్యంగా ప్రమాద ప్రదేశానికి చేరుకోవటం శకటంలో నీరు సరిపడ లేకపోవడంతో మంటలను ఆర్పలేక పోయింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కూడా అగ్నిమాపక కేంద్రాలు పూర్తిస్థాయిలో ఉండకపోతే ఎలా? అగ్నిమాపక కేంద్రంలో నీరు నింపుకోవాలంటే నదిలో నింపుకోవాలి. బావిలో నింపుకోవాలి. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నింపుకోవాలి. నీరు అయిపోయి మరోసారి నీరు నింపుకోవటానికి గంటనుంచి రెండు గంటలు పడుతుంది. మారుమూల మండల కేంద్రాల్లో ప్రమాదాలు జరిగితే 100 కిలోమీటర్ల దూరంనుంచి ఫైర్ ఇంజన్లు రావాల్సి ఉంటుంది. వాహనం ప్రమాద ప్రదేశానికి చేరేసరికి ఆస్తి కాలి బూడిద మాత్రమే మిగులుతుంది.
కొన్ని జిల్లాల్లో 9 మండలాలకు ఒక్క ఫైర్‌స్టేషన్లు ఉన్నాయి. అందులో కూడా పూర్తిస్థాయి సిబ్బంది లేదు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల స్టేషన్‌లో 9 మండలాలకు 202 గ్రామాలకు దిక్కుగా నిలిచినది అంటే తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల 5 ఏళ్ళ క్రితం ఫైర్‌స్టేషన్లను మంజూరుచేశారు. కాని భవనాలు నిర్మించలేదు. సిబ్బంది నియామకం చేయలేదు. ఏకకాలంలో నాలుగైదుచోట్ల అగ్నిప్రమాదం జరిగితే పరిస్థితి ప్రశ్నార్థకమే. వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ఐతే సంబంధిత అధికారులు మాత్రం విధులను సమర్ధవంతంగా నిర్వహించడంలేదనే విమర్శలు ఉన్నాయి. కాటన్, జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లుల్లో ప్రతి ఏటా అడ్డగోలు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇన్సూరెన్స్ డబ్బులకోసం కాటన్ ట్రేడర్లు ‘ఫైర్’ఆక్సిడెంట్లు చేస్తుంటారన్న ఆరోపణలున్నాయ. ప్రతి ఏటా దీపావళికి అధికారులకు కాసుల పండగే. పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు ఇతర పర్మిషన్లు కావాలంటే ‘ఫైర్ సర్ట్ఫికెట్’కావాలనే నిబంధన పెట్టారు. దీనితో ఈ శాఖ అధికారులు వేలాది రూపాయలు ముక్కుపిండి వసూలుచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇవ్వనిదే ఏ ఫైలుకదలని పరిస్థితి. ప్రభుత్వాలు, జనాభాకు సరిపడేటన్ని కేంద్రాలు మంజూరుచేయాలి. ప్రతి మండలానికి ఒక స్టేషన్ ఇస్తే కొంత పనిభారం తగ్గవచ్చు. లంచాలు తీసుకునే అధికారుల మీద ప్రభుత్వం నిఘాపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, పూర్తిస్థాయిలో అగ్నిమాపక సేవలు విస్తరింపజేయాలి. 30 కిలోమీటర్ల దూరానికి ఒక స్టేషన్‌ను ఏర్పాటుచేయాలి. తప్పుచేసిన వారిని కఠినంగా శిక్షించాలి.

- రావుల రాజేశం