సబ్ ఫీచర్

దేశ సౌభాగ్యాన్ని పెంచిన శూద్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెయ్యి సంవత్సరాల చరిత్ర పుస్తకాలలో ఏ ఒక్క పుటలోనైనా భారత రాజ్యానే్నలిన వంశాలలో శూద్ర జాతికి చెందిన ఏ ఒక్క వంశం పేరు కూడా కన్పించదు. సైనికులు, సేవకులు, కార్మికులు, కర్షకులు, శ్రామికులు భారత సమాజంలో 80% పైగా శూద్రులే. సమాజాన్ని నిర్మించిన సకల జాతులు శూద్రులే. కాని వీరికి ప్రాచీన కాలంనుండి ప్రస్తుత కాలంవరకు కూడా ప్రాధాన్యత దక్కలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అటవికం ఆధునికంగా రూపాంతరం చెందడానికి కారణమైన అభ్యుదయకర్తలు శూద్రులు. ఆది నుంచి శూద్రులను అణగదొక్కి అణచబడే ఉంచుతున్నాయి ఆధిపత్యవర్గాలు. ఎందుకంటే సంఘర్షించే పరిస్థితులలోనే మానవ జాతి నిత్యం మనుగడ సాగిస్తుందని తెలుసుకోలేక శ్రమజీవులుగా వారి జీవితాల్ని గడుపుతున్నారు. కనుక రాజీపడిపోయారు శూద్రులు. మనిషి జీవితం పోరాటమని తిరుగుబాటు చేయకుండా ఏ రాజ్యంలోనైనా రావల్సిన రాజ్యభాగం రాదని తెలియదు శూద్రులకు. అదీకాక ప్రజలల్లో మూఢ నమ్మకాలను సృష్టించి శూద్రులను విద్యకు దూరంచేసి వర్ణ వ్యవస్థని ఏర్పరచి వృత్తిరీత్యా వివిధ రకాల పనులు చేసుకొని బ్రతికే వారికి ఆయా కులాల పేర్లను అంటకట్టి మనుషుల మధ్య తారతమ్యాలను రగిలించి అనేక రకాల హింసలు పెట్టి బానిసలుగా మార్చి భయభ్రాంతులకు గురిచేసి శూద్రులను మూగ జంతువులకన్న హీనంగా పనిచేయించుకున్నారు. ఊడిగం చేయించారు.
అలనాటి ఎన్నోరకాల చిత్రహింసలు భరించి కూడా శూద్రులు భారతదేశానికి సేవలందించారు. ఈ దేశ సౌభాగ్యాన్ని పెంపొందించారు. తట్టలతో మట్టి తలకెత్తుకొని, రాళ్ళురప్పలు మోసి ఆనకట్టలు నిర్మించారు. నిరంతరం శ్రమించి నదుల నుంచి కాల్వలు తవ్వారు. అడవులను చదునుచేసి (సాప్) సాగు భూమిగా మార్చారు. ఇలా మట్టినుండి మృష్టాన్నం పుట్టించి మానవ జాతికి అందించిన మహానుభావులు శూద్రులు. ఇలాంటి వారి సేవను ప్రముఖ చరిత్రకారులు వారియొక్క గ్రంథాలలో ఎక్కడైనా ప్రస్తావించలేదు. వారి గురించి వ్రాయకుండా చరిత్రనుండి శూద్ర కులాల పాత్రను తొలగించారు. కనీసం ఫలానా కులాలు, ఫలానా కాలంలో ఈ రకంగా జీవించాయని కూడా చరిత్రకారులు శూద్రుల గురించి వ్రాయకుండా మోసం చేశారు. ఒక పదార్థం ఫలహారంగా రూపాంతరం చెందాలంటే ఎంతో కష్టపడాలి.
అలా కష్టంచేసిన వ్యక్తుల కులాల భాగస్వామ్యాన్ని గత కాలంలో కలం పట్టేందుకు అర్హత కలిగిన ఏ ఒక్క అగ్రకులస్థుడు కూడా కష్టజీవుల గురించి వ్రాయదలచుకోలేదు. వ్రాయలేదు. పనిచేసుకొని బ్రతికే వాళ్ళమీద చరిత్రకారులు ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నారు. శూద్ర కులాల చరిత్రను ప్రస్తుత కాలానికి కనబడకుండా చరిత్ర నుండి దూరం చేశారు. శూద్రులను బానిసలుగా చిత్రీకరించారు. ఈ రక్తచరిత్ర అంతా చరిత్రకారుల కళ్ళకు కనపడలేదా? కనపడ్డా కనికరం లేదా? రాజుల ఆడంబరాలను పొగడటమే చరిత్ర అనుకున్నారు.
రాళ్ళు మోసి చేతులు కాయలు కాసేలా పనిచేసి గొడ్లకాసి, గొర్రెలను కాసి, పొలందున్ని, గొర్రుదోలి, కలుపుతీసి, కోత కోసి, పుట్లకు పుట్లు వడ్లను దొరల గడీలల్లో ఉన్న గాదెలు నింపిన వానిది చరిత్ర ఎందుకు కాదో చరిత్రకారులు మరియు ప్రజలు తెలుసుకోవాలి. రాజుల కానుకలకు ఆశపడి,రాజుల గురించి వ్రాయకుంటే వాళ్ళు కొట్టే కొరడా దెబ్బలకు భయపడి ఆనాడు చరిత్రకారులు రచనలు సాగించారు. ఈ తంతంతా మేథావులు, పండితులు, సామాజిక ఉద్యమకారులు గమనించాలి. రాజును, బంటును- సమస్త కులాలను, మతాలను, సంస్కృతీ సంప్రదాయాలను- బాధపడేవాని, బాధపెట్టేవాని వాస్తవాలను చిత్రిస్తే అది చరిత్ర అవుతుంది. కాని ఇలాంటి అంశాలను విద్యార్థి లోకమంతా లోతుగా ఆలోచించి దళిత బహుజనుల శ్రమ, సేవకు సంబంధించిన ప్రస్తావన లేనటువంటి ప్రస్తుతం ఉన్న చరిత్ర గ్రంథాలన్ని అవాస్తవాంశాలని అబద్ధపు చరిత్రని గమనించాలి. లేకుంటే అణగారిన బహుజన వర్గాలకు ఎప్పటికైనా చరిత్రలో స్థానం ఉండదు. కాబట్టి దళిత బహుజనులు ఎవరి చరిత్ర వారే వ్రాసుకునే దిశగా అడుగులు వేయాలి. వేదకాలం నుండి శూద్రులకు అన్యాయమే జరిగింది. అవమానమే ఒరిగింది. అష్టకష్టాలుపడ్డ జాతుల, కులాల గురించి అష్టాదశ పురాణాలలో ఎక్కడా అగుపడదు. మనిషిని మనిషిగా గుర్తించనటువంటి అనాగరిక, ఆటవిక పాశవిక సమాన అవకాశాలు లేని కాలంలో వ్రాయబడినది చరిత్రగా గుర్తించటానికి అర్హత లేదని, అది చరిత్రే కాదని యావత్ పౌర సమాజం గుర్తించాలి. నేటి చరిత్రకారులు ఆ దిశగా పయనించాలి.
నాడు శూద్రులుగా పరిగణించబడిన జాతులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రజలు కొంతమంది నేటి అగ్రవర్ణ రాజకీయ అధినేతల భజన బాబులుగా పడి ఉన్నారు. దళిత బహుజన వర్గాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు, విద్యావేత్తలు మొదలగువారు ఈ రాజకీయ భజనపరులకు, పాలేర్లకు మహనీయుల బోధనలు వినిపించి, సంస్కరించి రాజకీయ దాస్యం బానిసత్వం నుండి విడిపించి బంధవిముక్తులను చేయాలి. లేకుంటే శూద్ర జాతులకు రాజ్యాధికారం ఓ కలగానే మిగులుతుంది. ఎన్నికల వేళ అగ్రవర్ణాలు శూద్రులను బలిపశువులుగా వాడుకొంటున్న వైనం చూస్తుంటే దళిత బహుజనులు బ్రతకటమే దండగ అనిపిస్తుందీ సమాజానికి. ఎలాంటి సామాజిక లోభత్వానికి శూద్రులు గురికాకుండా ఉండగలుగుతారో ఆ రోజు భారతరాజ్యం శూద్రుల సొంతమవుతుంది.

- యడవల్లి నాగేష్