సబ్ ఫీచర్

ఈ బాలికల్ని ఆపడం ఎవరి తరం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న అటవీ ప్రాంతం.. నిత్యం పోలీసుల గాలింపు చర్యలు.. తరచూ తుపాకుల మోతే.. నిత్యం శాంతి భద్రతల సమస్యే.. మరోవైపు కనీస సౌకర్యాలు లేక దీనావస్థలో నదీ తీరాన పల్లెసీమలు.. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ అక్కడి బాలికలు పాఠశాలకు వెళ్లేందుకు రోజూ నదిని దాటుకుంటూ వెళతారు.. సైకిళ్లతో పాటు నదిని దాటి బడికి వెళ్లడం వారికి అనునిత్యం సాహసమే..
ఆ గ్రామాల్లోని చాలామంది కుర్రాళ్లు మావోయిస్టుల ప్రభావానికి లోనై చదువుకు స్వస్తి చెబుతుండగా బాలికలు మాత్రం బడికి వెళుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఝార్ఖండ్ రాష్ట్రంలోని లతేహార్ జిల్లా మనికా పంచాయతీ సమితిలో పలు గ్రామాలకు చెందిన అమ్మాయిలు బాగా చదువుకోవాలన్న ఆకాంక్షతో కష్టాలను మరచిపోతూ బడిబాట పడుతున్నారు. జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనికా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలంటే సమీప పల్లెలకు చెందిన బాలికలు నిత్యం ‘ఔరంగా’ నదిని దాటాల్సిందే. నదిని దాటాక కనీసం ఇరవై కిలోమీటర్లు సైకిల్ తొక్కితేగానీ వారు పాఠశాలకు చేరుకోలేరు. వర్షాకాలంలో నదిలో ప్రవాహం ఎక్కువగా ఉంటే వీరు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి తప్పదు. మనికా సమితిలోని కటియా, నవాదిహ్, హుమమరా, యుమున, హోసి తదితర గ్రామాలు ఇప్పటికీ రోడ్లు, విద్యుత్, మంచినీరు, వైద్యం, విద్య వంటి ప్రాథమిక సౌకర్యాలకు నోచుకోలేదు. ఔరంగా నదిపై వంతెన గానీ, కాజ్‌వే గానీ లేనందున ప్రతిరోజూ సైకిళ్లను పట్టుకుని బాలికలు నీటి ప్రవాహాన్ని దాటడం సాహస కృత్యమే. ప్రమాదకరమని తెలిసినా బాలికలు నదిని దాటుతూ బడికి వెళ్లడం తమకు ఆశ్చర్యం కలిగిస్తుందని వారి తల్లిదండ్రులు చెబుతుంటారు. వర్షాకాలంలో అయితే బాలికలు సమీపంలోని కుమంది రైల్వేస్టేషన్‌కు వెళ్లి అక్కడి నుంచి రైలులో లతేహార్ చేరుకుని, ఆ తర్వాత బస్సులో మనికా గ్రామానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రయాణం చేస్తే ప్రతి విద్యార్థికి రోజుకు ఎనభై నుంచి వంద రూపాయలు ఖర్చవుతుంది. ఇంతటి ఆర్థిక స్థోమత లేనందున బాలికలు ప్రాణాలకు తెగించి నదిని దాటేందుకు సుముఖత చూపుతుంటారు. మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు పోలీసు శిబిరాలను ఏర్పాటు చేయడంతో బాలికలను ధైర్యంగా బడికి పంపగలుగుతున్నామని కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలని, ఔరంగా నదిపై వంతెన నిర్మించాలని ఈ ప్రాంతీయులు ఇప్పటికీ పాలకులకు మొర పెట్టుకుంటారు. అయితే, ఇక్కడి బాలికలు మాత్రం వంతెన గురించి ఎప్పుడూ ఆలోచించరు.. వారి ధ్యాసంతా- నదిని దాటుకుంటూ బడికి వెళ్లడంపైనే..!

-లాస్య