కథ

ఆ రాత్రి (కథల పోటీలో ఎంపికైన రచన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వౌంట్ అబు’ - రాజస్థాన్‌లోని అత్యంత సుందరమైన హిల్‌స్టేషన్. రాజస్థాన్ అంటే విశాలమైన ఇసుక మేటలు వేసిన ఎడారులు, ఒంటెల సవారీ, రాజప్రాసాదాలు, వాటిని చుట్టుకుని వయ్యారంగా నిలబడిన సరస్సులు - ఇవే మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. అయితే వీటన్నింటికీ దూరంగా ‘అసలు ఇది రాజస్థానేనా?’ అని ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది వౌంట్ అబు.
చుట్టూ ఎతె్తైన కొండలు, పచ్చదనాన్ని పారాణిగా పూస్తున్నట్లు ఎతె్తైన వృక్షాలు, కొండ మలుపులు, లోతైన లోయలు కనువిందు చేస్తూంటాయి. వీటన్నింటి మధ్యలో మొత్తం పాలరాతితో నిర్మించిన ‘దిల్వారా జైన్ మందిరం’ చూసేవారికి జీవితాంతం మరచిపోలేని ఒక మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది...
పుస్తకం మూసేసి కళ్లు మూసుకుని వెనక్కి జారగిలబడి సీటుకి తల ఆన్చింది సుస్వర. బస్సు మెత్తగా అబు రోడ్డు వైపు పరుగులు తీస్తోంది. పుస్తకంలో వ్యాసం చదువుతుంటేనే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. రేపు ఉదయం వౌంట్ అబులో తిరుగుతూంటే ఎంత బాగుంటుందో! పెళ్లైన సంవత్సరం తరువాత మొట్టమొదటిసారి భర్తతో కలిసి వెళ్తున్న రాజస్థాన్ ప్రయాణం.
కిటికీలోంచి బయటకు చూసింది. పచ్చని చెట్లన్నీ నల్లటి చీకటి దుప్పటి కప్పుకున్నాయి. గ్లాస్‌డోర్‌ని నెమ్మదిగా పక్కకి జరిపింది. చల్లటి గాలి రివ్వున లోపలికి వచ్చింది. భుజాల చుట్టూ కప్పుకున్న చీర చెంగుని ఇంకొంచెం దగ్గరగా లాక్కుంది.
‘అబ్బా స్వరా! చల్లగా ఉంది. కిటికీ క్లోజ్ చేసెయ్..’ చంద్రవౌళి చిన్నగా వణుకుతున్నాడు.
గబుక్కున వేసేసింది సుస్వర.
వెళ్తోంది రాజస్థాన్. అదీ మార్చిలో. కాబట్టి చలి ఎక్కువగా ఉండదని అనుకొని షాల్స్, స్వెట్టర్లు తెచ్చుకోలేదు. ఇక్కడ చూస్తే చలి విపరీతంగా ఉంది. ఇంక ఆ కొండ మీద ఎలా ఉంటుందో ఏంటో?
అప్పుడు సమయం రాత్రి పనె్నండున్నర అయింది. అప్పటికే ఆరుగంటలు కూర్చుని ఉన్నారేమో అందరికీ కాళ్లు నొప్పెడుతున్నాయి. బస్సు చిన్న ఊర్లోకి ప్రవేశించింది. ఒక చిన్న టీ దుకాణం ముందు డ్రైవర్ బస్సు ఆపాడు. కొంతసేపు రిలాక్స్ అవడానికి అంతా కిందకి దిగారు. బయట చలి ఇంకా వణికించేస్తోంది.
వేడివేడి టీ కడుపులో పడగానే కొంచెం వెచ్చగా అనిపించింది.
బస్సు డ్రైవర్, టీ దుకాణం యజమాని ఇద్దరూ హిందీలో మాట్లాడుకుంటున్నారు. బస్సులో దిగిన అంత మందికీ చకచకా టీలు అందిస్తూ మరోపక్క హుషారుగా మాట్లాడేస్తున్నాడు. ‘్భయ్యా! మొన్న రాత్రి ఈ రోడ్డు మీదే కొంచెం ముందుకు వెళ్తే, అక్కడొక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. చాలా ఘోరం. నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వేన్ నడుపుతున్నాడు. ఏమైందో ఏమో ఆ స్పీడులో వెళ్లి రోడ్డు పక్కనున్న రెండు చెట్లను గుద్దుకుంటూ వెళ్లి, మరో చెట్టుకి చుట్టుకుపోయింది. తలుపు తెరచుకుంది. అందులో వున్న ముగ్గురు వయసు మళ్లినవారు పక్కనున్న మైలురాయిని గుద్దుకుని చెల్లాచెదురుగా పడిపోయారు. మొహాలు కూడా గుర్తించలేనంత భయంకరంగా చెక్కుకుపోయాయి. అక్కడంతా రక్తమయం అయిపోయింది. పాపం ముగ్గురి ప్రాణాలూ అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి. అందుకే కాస్త జాగ్రత్తగా బస్సుని నడుపు. స్పీడొద్దు. నా దగ్గరికి వస్తున్న ప్రతివారికీ ఇదే చెబ్తున్నాను’
ఆ మాటలు సుస్వరలో భయం రేకెత్తించాయి.
‘మరేం ఫర్వాలేదు’ అన్నట్లు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, ‘పద బస్సు లోపల కూర్చుందాం’ అన్నాడు చంద్రవౌళి.
అందరూ బస్సు ఎక్కిన తర్వాత బస్సు మళ్లీ బయల్దేరింది. నల్లటి రోడ్డు చీకటిలో త్రాచుపాములా మెలికలు తిరుగుతోంది.
‘ట్రావెలింగ్ ఏజెంట్‌కి ఫోన్ చెయ్యాలేమో కదండీ!’
‘అవును స్వరా! మనం ఇప్పుడు టీ తాగింది ‘పంచ్‌జంగ్’ గ్రామంలో. అది దాటిన గంట తర్వాత ఫోన్ చెయ్యమన్నాడు. అప్పుడు మనల్ని వౌంట్ అబుకి తీసుకువెళ్లే కేబ్ నెంబర్, డ్రైవర్ సెల్ నెంబర్ ఇస్తానన్నాడు. ఇంకా టైం ఉంది కదా! చేస్తాను’
టీ దుకాణం యజమాని మాటలు బాగా పని చేసినట్లున్నాయి డ్రైవర్ మీద. బస్సు వేగం కొంచెం తగ్గింది.
గంట తర్వాత చంద్రవౌళి ఫోన్ చేశాడు. ట్రావెలింగ్ ఏజెంట్ వెంటనే కేబ్ నెంబర్, డ్రైవర్ సెల్ నెంబర్ ఇచ్చాడు.
చంద్రవౌళి ఆ నంబర్‌కి రింగ్ చేశాడు. అవతల ఒక తెలుగబ్బాయి ఫోన్ ఎత్తాడు. ‘సార్! నా పేరు సురేష్. మా సార్ మీ నంబర్ ఇచ్చారు. అలాగే మీ బస్సు నంబర్ కూడా ఇచ్చారు. నేను కేబ్ తీసుకుని ఇప్పుడే బయల్దేరుతున్నాను. మీరు ఎక్కడ దిగాలో చెబుతాను. అక్కడనుంచైతే మనం త్వరగా కొండ మీదకి చేరుకోవచ్చు. నేను రోడ్డు పక్కనే వెహికల్ ఉంచుతాను. మీరక్కడ దిగిపోండి. మీరు పంచ్‌జంగ్ దాటి గంట అయింది కదా.. మరో అరగంటలో పదమూడో నెంబర్ మైలురాయి వస్తుంది. ఆ పక్కనే ఒక పాత బిల్డింగ్ ఉంటుంది... అక్కడ..’ ఫోన్ కట్ అయింది.
‘హలో హల్లో...’ చంద్రవౌళి మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తున్నాడు. అయినా నంబర్ కలవడంలేదు. సిగ్నల్ లేదా అంటే బాగానే ఉంది. కానీ ఎందుకో ఎవరో బలవంతంగా ఆపేస్తున్నట్లు కుయ్ కుయ్..మంటోంది సెల్.
‘ఎందుకండీ అలా కంగారు పడతారు? అతడు ఏవో గుర్తులు చెప్పాడు కదా. అక్కడ దిగుదాం. మళ్లీ కాల్ చేద్దాం..’
సుస్వర మాటలు సబబుగానే అనిపించాయి.
‘పదమూడో మైలు రాయి దగ్గర దిగిపోతాం’ అనగానే బస్సు డ్రైవర్ ఆశ్చర్యంగా చూశాడు.
‘ఇంత చీకట్లో ఈ హైవే మీద దిగిపోతారా?! వొంటరిగా ఆడవారితో అలా దిగడం మంచిది కాదు. ఇంకొంచెం ముందుకు వెళ్తే, నాలుగు రోడ్ల కూడలి వస్తుంది. అక్కడైతే భయం ఉండదు. అక్కడ ఆపమంటారా?’
‘లేదండీ.. మా డ్రైవర్ అక్కడే దిగమని చెప్పాడు. అదిగో పాత బిల్డింగ్. ఇక్కడే ఆపేయండి. దిగిపోతాం’
డ్రైవర్ అయిష్టంగానే బస్సు ఆపాడు. ఇద్దరూ దిగిపోయారు. బస్సు హెడ్‌లైట్ల వెలుగులో పదమూడో నంబర్ మైలురాయి ఎవరో ఎర్ర రంగుతో అభిషేకం చేసినట్లు భయంకరంగా మెరుస్తోంది.
ఒకపక్క విపరీతమైన చలి. మరోపక్క చిక్కటి చీకటి. ఉండుండి ఏవో కీటకాల శబ్దాలు. నిశ్శబ్దం తాండవిస్తోంది. పక్కనే సగం పడిపోయిన పాత భవనం ఆ చీకట్లో వింతగా మెరుస్తోంది. చలిగాలి శరీరాన్ని కత్తితో కోసేస్తోంది. మళ్లీ సురేష్‌కి రింగ్ చేశాడు. మళ్లీ అదే కుయ్.. కుయ్‌మనే శబ్దం.
‘లాభం లేదు. ఇంకొంతసేపు ఇలా నిలబడితే గడ్డ కట్టుకుపోవడం ఖాయం.’ చుట్టూ చూశాడు చంద్రవౌళి. హైవేకి కొంచెం దూరంలో పెద్దపెద్ద చెట్ల మధ్య నుంచి ఒక చిన్న దీపం వెలుగు కనపడుతోంది.
సుస్వర కూడా అటువైపు చూసింది.
‘లైటు వెలుగుతుందంటే అక్కడేదో షెల్టర్ ఉండే ఉంటుంది. ఎవరైనా ఉన్నారేమో. వెళ్లి చూద్దామా?’ అడిగాడు భార్యని.
ఇలా చలిలో నిలబడే బదులు అక్కడికి వెళ్లడమే మంచిదనిపించింది. ఇద్దరూ ఆ చీకట్లో నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లారు. అదొక పాత బిల్డింగ్. రైల్వేస్టేషన్ వెయిటింగ్ రూంలా ఉంది. చాలా రోజుల నుంచి వాడుకలో లేనట్లుంది. నడిచి వెళ్లే దారంతా పిచ్చిమొక్కలతో నిండిపోయింది. అవన్నీ దాటుకుంటూ ఇద్దరూ లోపలికి అడుగుపెట్టారు. లోపలంతా చెత్తాచెదారంతో నిండి ఉంది. నాలుగు పాత సిమెంటు బెంచీలు కూర్చోవడానికి ఉన్నాయి. ఆ గదికి అవతల వైపు ఇంకో ద్వారం ఉంది. అక్కడ నుంచి చూస్తే చీకటిగా ఉన్న ప్లాట్‌ఫామ్.. కొంచెం దూరంగా రైల్వే ట్రాక్ కనపడుతోంది.
ప్లాట్‌ఫామ్ మీద ఒక్క లైటు లేదు. పిట్ట మనిషి లేడు.
లోపల చిన్న లైటు. వెల్తురు మసకమసకగా ఉంది. మూలగా ఇంకో సిమెంట్ బెంచీ. మిగిలిన వాటికి దూరంగా. దాని మీద ఇద్దరు మనుషులు తల మీద నుంచి కింద నేలను తాకుతున్నట్లు షాల్స్ కప్పుకుని కూర్చున్నారు. మొహాలు సరిగ్గా కనిపించడంలేదు.
తమకు తోడుగా మరో ఇద్దరు జతపడేసరికి ఇద్దరికీ కొంచెం ధైర్యం వచ్చింది.
‘ఇక్కడ నుంచి వౌంట్ అబుకి దగ్గర త్రోవ ఉందా? మేం ఆంధ్రా నుంచి రాజస్థాన్ టూర్‌కి వచ్చాము’
చంద్రవౌళి అలా అడగగానే ఇద్దరూ ఒక్కసారి తలెత్తి చూశారు.
ఒక్కసారి వొళ్లు జలదరించింది.
ఆ కళ్లు.. ఇద్దరి కళ్లూ ఏదోలా వున్నాయి. ఒకే ఒక్క క్షణం కళ్లు కలిసాయి. ఆ చూపుల్లో ఏదో తీక్షణత.
అడిగింది అర్థం అయిందో, లేదో అటువైపు నుంచి సమాధానం లేదు.
సుస్వర బేగ్‌లోని ముందు జిప్ తీసి, అందులోంచి ఒక పాతగుడ్డ తీసి ఒక బెంచీని తుడిచింది. రెండు బేగ్‌లనీ పక్కన పెట్టుకుని ఇద్దరూ కూర్చున్నారు. రివ్వున వీస్తున్న చల్లటి గాలిని తట్టుకోవడం కష్టంగా ఉంది.
‘కొత్త ప్రదేశం.. ఎవరూ తెలిసినవారు లేరు. మరేం ఫర్వాలేదు’ అనుకుంటూ ఇద్దరూ బేగ్‌లోంచి చెరో దుప్పటి తీసి షాల్‌లాగ తలమీద నుంచి కప్పుకుని బెంచ్ మీద మఠం వేసుకుని కూర్చున్నారు.
వొంటిగా కొంచెం వెచ్చదనం తగలగానే నిద్రాదేవి కనురెప్పల్ని మెల్లగా ఆక్రమిస్తోంది. తలతిప్పి వాళ్ల వైపు చూసింది సుస్వర.
ఎందుకో ఆ ఇద్దరూ తమనే తీక్షణంగా చూస్తున్నట్లనిపించింది. చూపులు గుచ్చుకోవడం అంటే ఏమిటో అర్థం అవుతోంది. భయంతో శరీరం మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
మరొకసారి సురేష్‌కి ఫోన్ చేశాడు. ఫోన్ కనెక్ట్ అవడంలేదు. గడియారంలో నిమిషాల ముల్లు భారంగా నడుస్తోంది.
యధాలాపంగా వాళ్లిద్దరూ కూర్చున్న బెంచ్ వైపు చూసింది సుస్వర.
వేగంగా వీస్తున్న గాలికి వాళ్లు కప్పుకున్న షాల్ పక్కకి జరిగింది. బెంచ్ కింద చూసిన సుస్వర కళ్లు పత్తికాయల్లా విచ్చుకున్నాయి.
అక్కడో పెద్ద గోనె సంచి. మనిషి శరీరాన్ని గోనెబస్తాలో వేసి, గట్టిగా తాళ్లతో చుడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ‘నిజమేనా?’ అన్న అనుమానంతో మళ్లీమళ్లీ చూసింది. అలాగే అనిపిస్తోంది.
మెల్లగా చంద్రవౌళిని చేత్తో తట్టి, అటువైపు చూడమని చెప్పింది.
‘చూడండి.. శవంలా లేదూ.. బయటకు ఏవో కనపడుతున్నాయి. కాళ్లా?’
చంద్రవౌళికి కూడా ఒక్క క్షణం అలాగే అనిపించింది. తర్వాత తేలిగ్గా కొట్టిపారేశాడు.
‘నీకు మనసులో భయం ఉంది. అందుకే అలా కనిపిస్తోంది. చూస్తూంటే పల్లెటూరి వాళ్లలా కనిపిస్తున్నారు. ఏ మంచం కోళ్లో అలా కట్టుంటారు. అనవసరంగా ఆలోచించి మనసు పాడుచేసుకోకు...’
సుస్వర మళ్లీ అటువైపు చూసింది. ముందులాగే బెంచీ కింద కనపడకుండా తమ షాల్స్‌తో కప్పేశారు. ‘మొహాలు కన్పించకూడదు’ అన్నట్టు అటు పక్కకు తిరిగి కూర్చున్నారు.
సుస్వర అనుమానం బలపడుతోంది. ‘తామిద్దరూ మాట్లాడుకోవడం వాళ్లు చూశారు. ఎంతో చాకచక్యంగా బెంచీ కింద మూట కనపడకుండా కవర్ చేశారు. నిజంగా ఏమీ లేకపోతే వాళ్లెందుకు మొహాలు దాచుకుంటున్నారు? ఏదో ఉంది రహస్యం. ఏంటదీ?’
ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో వాళ్లెందుకు వున్నారు? ఎవరి కోసం చూస్తున్నారు?
అలాగే ఆ చూపుల్లో ఏదో తేడా. ఎందుకలా చూశారు? అసలు.. అసలు వాళ్లు మనుషులేనా? దెయ్యాలా? గుండె ఝల్లుమంది. ఈ రోడ్డు మీదే యాక్సిడెంటు అయిందంటున్నారు. ఇద్దరో ముగ్గురో చనిపోయారు. వాళ్లేనా వీళ్లు..?
దెయ్యాల పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయని అంటారు కదా! పాదాల వైపు చూడడానికి ప్రయత్నించింది. ముడుచుకుని షాల్ కప్పుకుని కూర్చున్నారు. ఏమీ కనపడటంలేదు.
భయంతో నోరు ఎండిపోతోంది. బాటిల్ తీసి చూసింది. ఖాళీ.
‘ఆ పక్కన కుళాయి ఉందేమో. చూసి రమ్మంటావా?’ చంద్రవౌళి మాటలకి ఉలిక్కిపడింది.
‘వొద్దొద్దు. మీరెటూ వెళ్లకండి. ఇక్కడే నా పక్కనే ఉండండి’ గట్టిగా భర్త చేతిని పట్టుకుంది. ఆమె చేయి చిన్నగా వణుకుతోంది.
చంద్రవౌళికి కూడా ఆ వాతావరణం ఏదో తేడాగా అనిపిస్తోంది. అక్కడ ఉండటం క్షేమం కాదని అతని మనసు పదేపదే హెచ్చరిస్తోంది.
‘స్వరా! పద. హైవే దగ్గరకు వెళ్లి నిల్చుందాం. నాలుగు అవుతోంది. సురేష్ రాకపోతే ఏదో ఒక వెహికల్ ఎక్కి వెళ్లిపోదాం...’
సుస్వర చప్పున హేండ్‌బేగ్‌ని భుజానికి తగిలించుకుంది. చంద్రవౌళి ఒక బేగ్ భుజానికి తగిలించుకుని, ఒక బేగ్‌ని చేత్తో పట్టుకున్నాడు. ఇద్దరూ బయటకు వచ్చారు.
లోపల్నుంచి నాలుగు కళ్లు తీక్షణంగా ఇద్దర్నీ చూస్తున్నాయి. అప్పుడే ఒక పిట్ట భయంకరంగా అరుస్తూ వాళ్ల తలల మీద నుంచి ఎగురుకుంటూ ఉత్తరం వైపు వెళ్లింది.
సెల్ తీసి టైం చూశాడు. నాలుగున్నర అయింది. చిమ్మచీకటి. రాజస్థాన్ మన దేశానికి పశ్చిమంగా ఉంది. సూర్యోదయమూ, సూర్యాస్తమయమూ రెండూ ఆలస్యంగానే అవుతాయి.
ఐదు నిమిషాలు గడిచాయి. ఇంతలో దూరం నుంచి ఏదో వాహనం వస్తోంది. ఆ లైట్ల వెలుగులో మరొక్కసారి పదమూడో మైలురాయి వింతగా మెరిసింది.
వాహనం వచ్చి ఆగింది. అదొక మినీ బస్సు. డ్రైవర్ సీట్లో ఒక సర్దార్జీ కూర్చుని ఉన్నాడు. ‘ఇంత రాత్రి చీకట్లో ఏం చేస్తున్నారు?’ ఆశ్చర్యంగా అన్నాడు.
చంద్రవౌళి హిందీలో అంతా చెప్పాడు.
సర్దార్జీ కళ్లల్లో ఆశ్చర్యం. ‘మీకేమైనా మతిపోయిందా? ఇక్కడ రైల్వే వెయిటింగ్ రూమ్‌లో కూర్చున్నారా? మీతోపాటూ ఇద్దరు మనుషులున్నారా? అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు అక్కడ స్టేషన్ ఉండేది. ట్రైన్లు ఆగేవి. ఆ తర్వాత్తర్వాత అక్కడ రైళ్లు ఆగడంలేదు. స్టేషనూ లేదు. ఆ పాత వెయిటింగ్ రూమ్ మనుష సంచారం లేక దెయ్యాల కొంపలా పాడుబడిపోయింది. అవునూ! అంత చీకట్లో గంటసేపు అందులో ఎలా కూర్చున్నారు?’
‘లోపల లైటు వెలుగుతోంది కదా. అందుకే వున్నాం’ అన్నాడు చంద్రవౌళి.
ఇద్దరూ చప్పున వెనక్కి తిరిగి చూశారు.
భయంతో గుండె గుభేల్‌మంది. అక్కడ నుంచి లైటు వెలుగు కనపడటం లేదు. అంతా చీకటి.. చిమ్మచీకటి.
ఇంతసేపూ ఆ లైటు వెలుగలోనే కదా కూర్చున్నాం. మరి ఇప్పుడు కనిపించదేమిటి? అసలు ఏమవుతోంది?
అంత చలిలోనూ ఇద్దరూ చెమటతో తడిసి ముద్దయిపోయారు.
‘మీకు ఇంకో విషయం తెలుసా?! మొన్న ఏక్సిడెంట్ ఇక్కడే అయింది. ఈ మైలురాయికి గుద్దుకునే వాళ్లు ప్రాణాలు కోల్పోయారు’ అని చెప్పి, సర్దార్జీ టార్చ్ వేసి చూపించాడు. తన మీద జరిగిన రక్త్భాషేకానికి గుర్తుగా మైలురాయి ఎర్రగా, భయంకరంగా మెరిసింది.
అంతవరకు ఆ రాయి మీద పెట్టిన బేగ్‌ని గబుక్కున తీసి, భుజానికి తగిలించుకున్నాడు చంద్రవౌళి.
‘్భయిసాబ్! ముందు బస్ ఎక్కండి. కొంచెం దూరం వెళ్తే ఒక సర్కిల్ వస్తుంది. అక్కడ జన సంచారం ఉంటుంది. మిమ్మల్ని అక్కడ దింపేస్తాను. మీ డ్రైవర్ రాకపోతే నా స్నేహితుడి నంబర్ ఇస్తాను. అతడు మిమ్మల్ని క్షేమంగా వౌంట్ అబు చేరుస్తాడు’ సర్దార్జీ బస్‌ని స్టార్ట్ చేశాడు. ఇద్దరూ బస్సు ఎక్కారు. చంద్రవౌళి బస్సులోంచి వెనక్కి చూశాడు. రక్తంతో తడిసిన పదమూడో నెంబర్ మైలురాయి వికృతంగా నవ్వుతున్నట్లనిపిస్తోంది.
అప్పుడే ఒక గబ్బిలం టపటపా రెక్కలు ఆడించుకుంటూ, వృత్తాకారంగా తిరుగుతూ మైలురాయి పక్కనే ఉన్న పెద్దచెట్టు కొమ్మని పట్టుకుని తలక్రిందులుగా వేలాడుతోంది.
బస్సు ముందుకు పరుగులు తీస్తోంది.
హఠాత్తుగా చంద్రవౌళి జేబులోని సెల్ మోగింది.
‘హలో’ చంద్రవౌళి గొంతు నూతిలోంచి వస్తున్నట్లుంది.
‘ఏంటి సార్! ఎన్నిసార్లు చేస్తున్నాను. ఫోన్ రింగ్ అవుతోంది. మీరు తీయడం లేదు. అసలేమైంది మీకు? ఎక్కడున్నారు మీరు? మైలురాయి దాటిన తర్వాత కొంతదూరం వెళ్తే, సర్కిల్ వస్తుంది. అక్కడ దిగండి’ అని చెబుతున్నాను. మీరు వినిపించుకోవడం లేదు. గంటకు పైగా అయింది నేను వచ్చి. ఇంక వెళ్లిపోదాం అనుకుంటూ ఎందుకైనా మంచిదని మళ్లీ చేస్తున్నాను’
‘సారీ సురేష్! ఫోన్ ప్రాబ్లం. మేం వస్తున్నాం. నువ్వక్కడే ఉండు’ ఇంక మాట్లాడటానికి ఓపిక లేనట్లు నీరసంగా వెనక్కి సీటుకి జేరగిలబడి కళ్లు మూసుకున్నాడు.
అసలేం జరిగింది? హఠాత్తుగా సెల్ ఎందుకు పని చెయ్యలేదు? గంటసేపు లైటు వెలుగులో కూర్చున్నాము. మరి తర్వాత ఆ లైటు ఏమైంది? ఆ ఇద్దరూ ఎవరు? ఏ ఒక్క ప్రశ్నకీ సమాధానం దొరకడం లేదు. చంద్రవౌళి ఆలోచనల్లో మునిగిపోయాడు.
అక్కడ - ఆ పాత వెయిటింగ్ రూంలో
రెండు ఆకారాలు నెమ్మదిగా పైకి లేచాయి.
చీకట్లో నెమ్మదిగా కదులుతున్నాయి.
* * *
ఇద్దరూ మెల్లగా మూటను లాక్కుంటూ ప్లాట్‌ఫామ్ మీదకి తెచ్చారు.
పట్టాల కవతల ఒక వేను నెమ్మదిగా వచ్చి ఆగింది.
మూడుసార్లు వేను లైట్లు వెలిగి ఆరాయి. వెంటనే ఇద్దరూ టార్చిలైట్లను రెండుసార్లు వెలిగించి ఆర్పారు. అలా సంకేతాల మార్పిడి జరిగింది.
వేన్‌లోంచి ఇద్దరు మనుషులు దిగారు. చీకట్లో నడవటం బాగా అలవాటు పడినట్లున్నారు. గబగబా పట్టాలు దాటి వచ్చి మూట అందుకున్నారు.
అంతకు ముందు లోపల బెంచీ మీద షాల్ కప్పుకుని కూర్చున్న ఇద్దరూ ఇప్పుడు జీన్స్ - టీ షర్టుల్లో ఉన్నారు. వయసు ముప్పైలోపే ఉంటుంది. మూట విప్పారు. అందులో ఉన్న భయంకరమైన మారణాయుధాలను వేన్‌లోని సీట్ల కింద ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక అరలో సర్దేశారు.
‘అక్కడ ఏవీ వదల్లేదు కదా!’ వేనులో వెనుక సీట్లో కూర్చున్న వారి నాయకుడు ప్రశ్నించాడు.
‘మేం పెట్టిన ‘బల్బు’తో సహా అన్నీ తెచ్చాం. ఏ ఆనవాలూ వదల్లేదు’
‘ఐతే మిమ్మల్ని చూసిన ఆ ఇద్దరి సంగతి ఏంటి?’
‘మన ప్లాన్ సక్సెస్ అయి ‘దిల్వారా జైన్ మందిరం’ బ్లాస్ట్ అయిన వెంటనే పోలీసుల ఎంక్వైరీ మొదలవుతుంది. ఆ ఇద్దరూ మన వివరాలు చెప్పే ప్రమాదం ఉంది. అందుకే వాళ్లని ఫాలో అవమని ఒక మనిషిని పంపించాం. శత్రు శేషం ఉండకూడదు. వౌంట్ అబు చేరుకున్న వెంటనే ఇద్దర్నీ ఖతమ్ చేసేద్దాం’ క్రూరంగా నవ్వింది జీన్స్ అమ్మాయి.
* * *
అప్పుడే సూర్యోదయం అవుతోంది. ప్రకృతి పసిడి వర్ణంలో ప్రకాశిస్తోంది.
‘రాత్రి ఏం జరిగింది? నిజంగా దెయ్యాలు ఉంటాయా?’
‘అదంతా మర్చిపో స్వరా! ఏదో చూశాం. ఏదో అనుకున్నాం. రాత్రి గడిచిపోయింది. ఆ విషయం అక్కడితో వదిలేద్దాం. వౌంట్ అబులో ఎలా ఎంజాయ్ చెయ్యాలో అది ఆలోచించు. ఈ ట్రిప్ ఒక మధుర జ్ఞాపకంలా మన జీవితాంతం గుర్తుండిపోవాలి’ చంద్రవౌళి ఆప్యాయంగా సుస్వర భుజం చుట్టూ చేయి వేసి, దగ్గరకు తీసుకున్నాడు.
దూరంగా గుడిలోని గంటలు మోగుతున్నాయి. ఇద్దర్నీ ఆశీర్వదిస్తున్నట్లు.
* * *
రేపటి తమ పేపర్‌లో రాబోతున్న ఒక ముఖ్య సమాచారాన్ని రిపోర్టర్లు తయారుచేసుకుంటున్నారు. ‘దిల్వారా జైన్ మందిరం పేల్చడానికి టెర్రరిస్టుల విఫల యత్నం’ అన్న హెడ్డింగ్ కింద పోలీసుల కాల్పుల్లో చనిపోయిన ఐదుగురు టెర్రరిస్టులు.. వారి ఫొటోలు వేశారు. అలాగే వారి దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల వివరాలు అందులో ఉన్నాయి.
రేపు ఉదయం పేపర్ చూసి చంద్రవౌళి, సుస్వర జరిగింది అర్థం చేసుకుంటారా? లేకపోతే ‘దెయ్యం’ భయంలోనే ఉండిపోతారా?

డి.స్వర్ణ శైలజ
W/o. రవిశంకర్, డోర్ నెం.39-33-140/5, ఎల్‌ఐజి-52
మాధవధార ఉడా కాలనీ, మర్రిపాలెం (పోస్ట్)
విశాఖపట్నం -530018.. 8500632936

-డి.స్వర్ణశైలజ