ఆంధ్రప్రదేశ్‌

భగ్గుమన్న బీసీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగ్రవర్ణాలతో కలిసి విజయవాడ కేంద్రంగా పెద్దఎత్తున ఉద్యమాలు
కృష్ణయ్య, గంగాధర్ నాయకత్వంలో నేడు వేర్వేరుగా విస్తృత సమావేశాలు

విజయవాడ: రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేకెత్తించి క్షణక్షణానికి ఉత్కంఠగా మారిన కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణతో సిఎం చంద్రబాబు కాస్త కుదుటపడినట్టు కనిపించినా, మరోవైపు ఇతర వర్గాలనుంచి ఉద్యమాల సెగ తగులుతోంది. రాష్ట్ర రాజధాని విజయవాడ కేంద్రంగా ఓవైపు బీసీ సంఘాలు, మరోవైపు ఓపెన్ కేటగిరి యువకులు పోరాటాలకు సిద్ధవౌతున్నారు. బీసీ రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం కలగకుండా కాపులకు బీసీ రిజర్వేషన్లు వర్తింపచేస్తానంటూ సిఎం పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ, బీసీ సంఘాల నేతలెవరూ ఏమాత్రం విశ్వసించటం లేదు. ప్రధానంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గిన బీసీ వర్గాల నేత ఆర్ కృష్ణయ్య కూడా చంద్రబాబును విశ్వాసంలోకి తీసుకోకుండా ఈ విషయమై మండిపడుతున్నారు. అవసరమైతే పార్టీతో తెగతెంపులు చేసుకుంటానని ముఖ్య నేతలతో చెబుతున్నట్టు ప్రచారం సాగుతోంది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడైన కృష్ణయ్య నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షులు, తెలుగుదేశం నేత కేసన శంకరరావు అధ్యక్షతన మంగళవారం నగరంలో విస్తృత సమావేశం జరగబోతోంది. దీనికి 13 జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలు తరలి రాబోతున్నారు. ఇదే సమయంలో బీసీ జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జి గంగాధర్ అధ్యక్షతన వేరుగా మరో కీలక సమావేశం జరగనుంది. సోమవారం ముద్రగడ దీక్ష విరమిస్తున్న సమయంలోనే నగర బీసీ ఐక్యవేదిక విస్తృత సమావేశం జరిగింది. బీసీ రిజర్వేషన్లకు భంగం కలగకుండా కాపులకు ఏవిధంగా రిజర్వేషన్లు వర్తింపజేస్తారో సిఎం చంద్రబాబు స్పష్టం చేయాలంటూ బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల వరకు కొత్తగా ఎఫ్-గ్రూప్ పెట్టినా స్థానిక సంస్థల విషయానికి వచ్చేసరికి ఏవిధంగా వ్యవహరిస్తారో ముందుగా స్పష్టం చేయాలంటున్నారు. సంచార జాతులు ఆర్థిక, సాంఘిక, సామాజిక, ఇతర అసమానతలు, కులవృత్తులు, సేవారంగం (చాకలి, మంగలి..) ఇలా పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని బీసీ రిజర్వేషన్లు నిర్దేశించగా కాపులను ఏ కేటగిరి కింద చేరుస్తారని ప్రశ్నిస్తున్నారు. బీసీల్లో ఇప్పటికే 144 కులాలుంటే, యాదవ, గౌడ, మత్స్యకార, చేనేత వంటి ఐదారు కులాలు వినా మిగిలిన వర్గాలనుంచి రాష్ట్రంలో కనీసం ఒక్కరు కూడా సర్పంచ్, మేయర్, ఎంపిటిసి, జెడ్పీటిసి కాదుకదా వార్డు మెంబర్‌గా కూడా ఎన్నిక కాలేదని గుర్తు చేస్తున్నారు. ఇక కాపులు ముఖ్యమంత్రి మినహా కేంద్రం, రాష్ట్రంలో కీలక మంత్రి పదవులు నిర్వహించారు, నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల్లో ఓపెన్ కేటగిరీ కిందనే కీలకమైన పోస్టులన్నింటినీ తమకున్న ఆర్థిక బలంతో కైవసం చేసుకుంటే ఇక వారిని బీసీలుగా గుర్తిస్తే బీసీ వర్గాలు ఏంకావాలని ప్రతిఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుంటే సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఓవైపు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి, మరోవైపు కాపులను బీసీలుగా గుర్తించి తీరుతామని సిఎం, మంత్రులు పదేపదే స్పష్టం చేస్తుంటే ఆ ప్రభావం కమిషన్‌పై పడదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వపరంగా కమిషన్‌కు తగిన సహాయ సహకారాలు ఉంటాయా? అని నిలదీస్తున్నారు. గత ఎన్నికల్లో కాపులు ఓట్లువేసి తనను సిఎం చేసినందుకే వారిని బీసీలుగా గుర్తిస్తామని చెబుతున్న చంద్రబాబు, రేపు కమ్మ సామాజిక వర్గం పార్టీ ఆవిర్భావం నుంచి తమవెంట వుందంటూ వారిని కూడా బీసీలుగా గుర్తిస్తారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక కాపుల్లో మరో ఆందోళన వ్యక్తవౌతోంది. మంజునాథ కమిషన్ ఒకవేళ కాపులకు ప్రతికూలంగా నివేదిక సమర్పిస్తే తమ గతి ఏంకానుందని కాపు నేతలు ప్రశ్నిస్తున్నారు. కమిషన్ ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చినా కేంద్రం సమర్థిస్తుందా? అనే అనుమానం కలుగుతోంది. ఇదిలావుంటే ఓపెన్ కేటగిరీకి చెందిన కమ్మ, రెడ్డి వర్గాలు తక్షణం బైటపడకపోయినా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాల యువకులు, విద్యార్థులు మాత్రం ఎక్కడికక్కడ సమావేశమవుతూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే నగరంలో బ్రాహ్మణ సంఘాల నేత జింకా చక్రధర్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆందోళన కార్యక్రమాన్ని కూడా దాదాపు ఖరారు చేశారు. 50శాతం రిజర్వేషన్ల పరిధిలోని వారిలో అత్యధికులు ఓపెన్ కేటగిరీలో 20 శాతం పైగానే సీట్లు సాధిస్తున్నారనేది వీరి వాదన. దశాబ్దాల తరబడి రిజర్వేషన్లతో అన్నివిధాలా ఉన్నతస్థాయికి చేరినవారు విద్యా, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో ఓపెన్ కేటగిరీలోనే నిలుస్తున్నారని ఉదహరిస్తున్నారు. పైగా ఉచిత హాస్టల్ వసతి, ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు, వృత్తివిద్యా కోర్సుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సౌకర్యాలు అనేకం వారికున్నాయి. అగ్రవర్ణాల్లోని దినసరి వేతన కూలీలు ఎన్నో వ్యయ ప్రయాసలతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తుండటంతో ఓపెన్ కేటగిరీలో అగ్రస్థానంలో నిలవలేకపోతున్నారు. అగ్రవర్ణాల్లోని శ్రీమంతులు ఎటూ తమ పిల్లలను ఎల్‌కెజి నుంచి కార్పొరేట్ విద్య చదివిస్తున్నారు. అవసరమైతే యాజమాన్య కోటాలో అయినా సీట్లు పొందుతున్నారు. అత్తెసరు మార్కులు వచ్చినా రిజర్వేషన్లతో ముందుకు సాగవచ్చని, అలాంటి అవకాశం తమకు లేదని అగ్రవర్ణాల పేద విద్యార్థులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే బీసీలకు ఇబ్బంది లేకుండా రిజర్వేషన్లు కల్పిస్తామంటే ఓపెన్ కేటగిరీకి తూట్లు పొడవాలన్నదే ఆయన ఆలోచనగా ఉందని వీరు అనుమానిస్తున్నారు. ఏదిఏమైనా అగ్రవర్ణాల పేద యువకులు ప్రత్యక్ష పోరుకు సన్నద్ధమవుతున్నారు. మొత్తంపై రానున్న కాలంలో బీసీలు, అగ్రవర్ణాలు, కాపులనుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ముప్పేట దాడిని ఎదుర్కోబోతున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది.