తెలంగాణ

గాంధీకి జరిగినట్టే రోహిత్‌కూ అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా సహ విద్యార్థులు శనివారం ఉద్యమించారు. యూనివర్శిటీ క్యాంపస్‌లో నిర్వహించిన సామూహిక దీక్షలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ లోక్‌సభ స్పీకర్ పిఎ సంగ్మా సైతం పాల్గొన్నారు. విద్యార్ధులతో కలిసి వారికి సంఘీభావంగా ఇరువురు నేతలు కూర్చుని సామూహిక దీక్ష చేశారు. రోహిత్ తరఫున ఆయన కుటుంబీకులకు న్యాయం చేసేందుకు హైదరాబాద్ వచ్చానన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ శనివారం సాయంత్రం వరకూ దీక్షలో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు చెప్పారు. రాహుల్ పాల్గొన్న దీక్షలో రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజు, సస్పెండైన విద్యార్థులు పాల్గొన్నారు. 8 గంటలపాటు దీక్షలో పాల్గొన్న రాహుల్‌కు ఇన్‌చార్జి విసి పెరియసామి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలో గాంధీజీకి జరిగినట్టే ఇక్కడా రోహిత్‌కు అవమానం జరిగిందని రాహుల్‌గాంధీ అన్నారు. ఎంతో మంచి విద్యార్థిని కోల్పోయామన్నారు. దానివల్ల రోహిత్ కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. సత్యం కోసం మాట్లాడే హక్కు, స్వేచ్ఛ రోహిత్‌కు ఇవ్వలేదని రాహుల్ పేర్కొన్నారు. భారతీయ విద్యార్థుల మీద ప్రధాని నరేంద్రమోదీ, ఆరెస్సెస్ వాళ్లు ఒకే భావజాలాన్ని రుద్దుతున్నారని, దయచేసి అదేమిటో బయటకు చెప్పాలని అన్నారు. విద్యార్థుల భావజాలాన్ని వారు ఆమోదిస్తే అది తనకూ ఆమోదయోగ్యమేనన్నారు.
సెంట్రల్ వర్శిటీలో జరిగింది కేవలం ఒక విద్యార్థి సమస్య కాదని, దేశం మొత్తం మీద అన్ని వర్శిటీల్లో వివక్ష తీవ్రంగా ఉందని ఆవేదనగా చెప్పారు. మహిళలు, మతం, కులం.. ఇలా అన్ని రకాలుగా వివక్ష కొనసాగుతోందన్నారు. రోహిత్‌కు జరిగిన అవమానం ఎవరికైనా జరగవచ్చని, అందుకే తాను ఇక్కడికి వచ్చి విద్యార్థులకు మద్దతుగా నిలిచానన్నారు. వివక్ష రూపుమాపేందుకు చట్టం తేవాలని రాహుల్ డిమాండ్ చేశారు. కొన్నాళ్ల క్రితం తాను విమానంలో వెళ్తుంటే పక్కనే ఒక జపనీయుడు ఉన్నారని, ఆయనను తాను ఏంచేస్తుంటారని అడిగితే ఆటోమొబైల్ పరిశ్రమలో పనిచేస్తానని చెప్పాడని, జపాన్‌లో ఇన్నోవేషన్ చాలా ఎక్కువ కదా భారతదేశంలో ఎందుకు తక్కువని అడిగితే అక్కడ కుల వ్యవస్థ ప్రధాన అడ్డంకి అని ఆయన పేర్కొన్నాడని రాహుల్ వివరించారు. పైనుండి కిందకు సమాచారం రావడానికి చాలా కష్టం అవుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ చెబుతున్న మేకిన్ ఇండియా, కనెక్ట్ ఇండియా లాంటి ఐడియాలు కిందివరకూ రావని, దిగువస్థాయిలో వివక్ష చాలా ఎక్కువగా ఉంటోందని రాహుల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఓ యువకుడిని జాతి వ్యతిరేక శక్తిగా చెబుతున్నారని, ఏ మతం నుంచి వచ్చినా, ఏ కులం నుండి వచ్చినా భారతీయులంతా దేశాన్ని బలోపేతం చేయాలని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే అనుకుంటారన్నారు. ఎవరికీ తలవంచని రోహిత్ అనే కుర్రాడి ముందు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అంటూ రాహుల్ తన ప్రసంగాన్ని ముగించారు.
రాష్టప్రతిని కలవనున్న రోహిత్ కుటుంబం
రోహిత్ మరణానంతరం తమ కుటుంబం రోడ్డున పడిందని, న్యాయం చేయాలని కోరుతూ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్టు రోహిత్ సోదరుడు రాజు చెప్పారు. రోహిత్ వ్యవహారం కేంద్రం పరిధిలో ఉందని, తమ డిమాండ్లను పరిష్కరించాల్సింది కేంద్రమేనని, అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని తాము ఆశించడం లేదన్నారు. సెంథిల్ కుమార్ అనే పరిశోధన విద్యార్ధి ఆత్మహత్యకు ప్రొఫెసర్ శ్రీవాస్తవ కారణమని, రోహిత్ కేసు విషయమై ఇసి నియమించిన కమిటీకి ప్రొఫెసర్ శ్రీవాస్తవ చైర్మన్‌గా వ్యవహరించారని ఆయన తీసుకున్న నిర్ణయాలే రోహిత్ ఆత్మహత్యకు కారణమయ్యాయని రోహిత్ సోదరుడు రాజు పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులతో తాము చర్చించేందుకు సిద్ధంగా లేమని చెప్పారు.
సమస్య పరిష్కారం కావాలంటే తాము వర్శిటీ పాలకుల ముందుంచిన నాలుగు డిమాండ్లు పరిష్కరించాలన్నారు. వర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావును సస్పెండ్ చేయాలి, ఆయనను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబానికి 50 లక్షలు పరిహారంగా చెల్లించాలని, అలాగే రోహిత్ కుటుంబీకులకు ఉద్యోగం ఇవ్వాలని, విద్యార్ధులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

చిత్రం... సస్పెండైన విద్యార్థులతో కలిసి సామూహిక దీక్షలో కూర్చున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ