తెలంగాణ

కలసికట్టుగా విజయం పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కలసికట్టుగా కృషి చేసి, విజయం సాధించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. టి.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అధ్యక్షతన ఆదివారం గాంధీ భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో గాంధీ భవన్ ఆవరణలోని ప్రకాశం హాలు నిండిపోయి, వెలుపలా కార్యకర్తలు నిలుచున్నారు. ఈ సమావేశంలో టి.పిసిసి ముఖ్య నేతలు మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు అరమరికలు లేకుండా కలిసి పని చేసి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ సమావేశంతోనే పార్టీ ఎన్నికల ప్రచారానికి అంకురార్పణ జరిగినట్లు అయ్యిందని అన్నారు. సోమవారం నుంచి మరింత ఉధృతం చేయాలని సూచించారు. 5వ తేదీన గ్రేటర్ పరిథిలోని 24 నియోజకవర్గాల్లోని డివిజన్లలో సభలు, సమావేశాలు నిర్వహించాలని, పాదయాత్రలు చేయాలని సూచించారు. 6న అన్ని డివిజన్లలో పాదయాత్రలు చేయాలని తెలిపారు. అన్ని డివిజన్లకు ఒక్కొక్కరి చొప్పున పార్టీ ఇన్‌ఛార్జీలను నియమిస్తామని, నియోజకవర్గాలకు ముగ్గురు చొప్పున పార్టీ తరఫున ఇన్‌ఛార్జీలను నియమిస్తామని ఆయన చెప్పారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇన్‌ఛార్జీలుగా ఉంటారని ఆయన తెలిపారు. టిక్కెట్టు ఆశించే వారు మంగళవారం మధ్యాహ్నంలోగా దరఖాస్తులు గాంధీ భవన్ కార్యాలయంలో అందజేయాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరారు. అభ్యర్థులను సిఫార్సు చేసే నాయకులు కూడా మంగళవారం లోగా తమకు లిఖితపూర్వకంగా అందజేయాలని ఆయన చెప్పారు. తామూ నివేదిక తెప్పించుకుని గెలుపొందే వారికే టిక్కెట్లు ఇస్తామని అన్నారు. టిఆర్‌ఎస్ మెప్పు పొందడానికి ఆదివారం ఒక టివీ ఛానల్ బోగస్ సర్వే ప్రసారం చేసిందని ఆయన విమర్శించారు.
సిఎల్‌పి నేత జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసేందుకు కుట్ర చేస్తున్న టిఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేసి పార్టీకి విజయం చేకూరేలా చూడాలని అన్నారు. టి.శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ హైదరాబాద్‌లో శిలాఫలకాలు వేయడం తప్ప అభివృద్ధి చేయలేదని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ప్రసంగించారు.

ఐసిస్‌కు ఇస్లాంతో
సంబంధంలేదు
యువత ఉగ్రవాదుల ఉచ్చులో పడొద్దు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, జనవరి 3: ఐఎస్‌ఐఎస్ సంస్థకు ఇస్లాంతో ఎలాంటి సంబంధంలేదని, పవిత్ర ఇస్లాంను నమ్మే ముస్లిం యువత ఉగ్రవాదుల ఉచ్చులోపడి నలిగి పోకూడదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కోరారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని జిల్లా పరిషత్ మినీ స్టేడియంలో జమాతే ఇస్లామి సంస్థ నిర్వహించిన మహ్మద్ ప్రవక్త ధార్మిక సభకు ముఖ్య అతిథిగా ఒవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థల వైఖరిని దుయ్యబట్టారు. దేశంలో బిజెపి అధికారంలో ఉన్నప్పటికీ అధికార కార్యకలాపాలు మొత్తం ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంఘాల చేతుల్లో నడుస్తున్నాయని ఆరోపించారు. పరోక్షంగా అధికారాన్ని కబ్జా చేసిన ఆర్‌ఎస్‌ఎస్ అధికార బిజెపికి దిశానిర్దేశం చేస్తూ మైనారిటీల పట్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. దేశంలో హిందూత్వవాదుల ఆగడాలు మితిమీరిపోయాయని, అజ్మీర్ దర్గాలో, మక్కా మసీదులో బాంబులు వేసింది సంఘ్ పరివార్‌కు సంబంధించిన వారేనని ఆరోపించారు. దేశంలో అన్ని మతాలు, కులాలు సమానమేనని, అయినా దేశ అధికార పగ్గాలు చేపట్టిన బిజెపి మైనారిటీలను కించపరిచే విధంగా వ్యవహరిస్తూ పాలన కొనసాగిస్తోందని ఒవైసీ విమర్శించారు. పాకిస్తాన్‌కు వెళ్లి ముస్లింలు తలదాచుకోవాలని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు నినాదాలు చేస్తుంటారని, అయితే మోదీయే ఎవరికీ చెప్పకుండా పాకిస్తాన్‌కు వెళ్లి ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో కలిసి నడిచారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సభలో పాల్గొన్న కర్నాటకకు చెందిన జమాతే ఇస్లామి నేత పిఎం మోజామిల్ శ్రీకృష్ణుడి గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ ప్రవక్త కేవలం 11 మందిని మాత్రమే వివాహమాడినా ఈ విషయాన్ని గోరంతలు కొండతలు చేసి చూపుతున్న హిందూత్వవాదులు 16 వేల మంది గోపికలతో కలిసిన అతని గురించి ఎందుకు ప్రస్తావించరని అన్నారు.
ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం
నిందితుడిపై నిర్భయ కేసు నమోదు
హైదరాబాద్, జనవరి 3: ఏడేళ్ల చిన్నారిపై సమీప బంధువు అత్యాచారం జరిపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని జవహర్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఇంటర్ విద్యార్థి సుధాకర్ (18) 45రోజుల క్రితం అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బంధువుల కుమార్తె (7)కు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం చిన్నారికి కడుపులో నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. దీంతో చిక్కడపల్లి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతనిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు చిక్కడపల్లి పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుదర్శన్ తెలిపారు.

ఖైదీల విడుదల
జాబితాపై సస్పెన్స్!

హైదరాబాద్, జనవరి 3: రెండు నెలలుగా సిద్ధమవుతున్న ఖైదీల విడుదల జాబితాపై సస్పెన్స్ నెలకొంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను జనవరి 26న విడుదల చేస్తామని ఇటీవల హోంశాఖ మంత్రి నాయిని నార్సింహరెడ్డి ప్రటించారు. ఈ మేరకు ఖైదీల జాబితాపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. తీవ్ర నేరాలకు పాల్పడిన వారు, యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నవారు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, సాధారణ ఖైదీల వివరాలను సేకరించారు. జైళ్లశాఖ ఆధీనంలోని కమిటీలో ఎవరిని విడుదల చేయాలి, ఎంతమందిని విడుదల చేయాలి అనే అంశంపై సుదీర్ఘ చర్చలు కూడా జరిగాయి. కమిటీ పరిశీలనలో దాదాపు 350 మంది ఖైదీలకు విముక్తి కలగనున్నట్టు తెలిసింది. అయితే సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేందుకు జాబితా సిద్ధమవుతుందని, త్వరలోనే తమకు విముక్తి కలుగుతుందని ఖైదీలు, ఖైదీల కుటుంబీకులు, బంధువుల్లో ఆశలు చిగురించాయి. అయితే ఖైదీల విడుదల జాబితా రూపొందించడంలో ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఖైదీల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఖైదీల విడుదలకు సమయం సమీస్తున్న నేపథ్యంలో జైళ్లశాఖ అధికారులు ఈ నెల 26న విడుదలయ్యే ఖైదీల జాబితాను సోమ, మంగళ వారాల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు పంపించనున్నట్టు తెలిసింది. సిఎం ఓకె అంటేనే.. గవర్నర్ వద్దకు జాబితా వెళ్తుంది.

వంద సీట్లు గెలుస్తాం
మంత్రి తలసాని ధీమా

హైదరాబాద్, జనవరి 3:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఎవరితో పొత్తు లేకుండా 150 డివిజన్లలోనూ పోటీ చేసి, వంద స్థానాల్లో విజయం సాధిస్తుందని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. టిఆర్‌ఎస్‌కు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవలసిన అవసరం లేదని అన్నారు. అన్ని పార్టీల నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. పద్దెనిమిదినెలల కాలంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ప్రజల్లో మంచి ప్రభావం చూపిందని, మరో పార్టీకి భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో అన్ని పార్టీల నాయకులు టిర్‌ఎస్‌లో చేరుతున్నారని తలసాని తెలిపారు. విపక్షాలు మాటలు తప్ప చేసిందేమీ లేదు, చేసేదేమీ లేదని అన్నారు. సికిందరాబాద్ కంటోనె్మంట్ ఎన్నికల్లో, వరంగల్ పార్లమెంటు నియోజక వర్గం ఉప ఎన్నికల్లో ప్రజలు ఏం తీర్పు చెప్పారో అందరికీ తెలుసునని, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో సైతం ప్రజలు ఇదే తీర్పు చెప్పనున్నారని అన్నారు.గవర్నర్ రాజ ముద్ర పడితేనే ఖైదీల విడుదల జరుగుతుంది. అందుకు తగిన సమాచారం కోసం ఖైదీల బంధువులు ఉత్కంఠతతో ఎదరుచూస్తున్నారు.

రహదారులను
అభివృద్ధి చేయాలి
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ రాష్ట్రంలో రహదారులు తక్కువగా ఉన్నందున కొత్త రహదారులను నిర్మించాల్సిన అవసరం ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం నాడిక్కడ ఆయన తెలంగాణభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రహదారులను విస్తరిస్తే అత్యంత ప్రాధాన్యత కలిగిన గోదావరి పరివాహక ప్రాంతం నుంచి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఉపయోగం కలుగుతుందని అన్నారు. గతంలోనే సిఎం కెసిఆర్ ముఖ్యమైన రహదారులు జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్రాన్ని కోరిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గోదావరి నది జలరవాణాకు అనుకూలంగా మారితే తక్కువ ఖర్చుతో ఎక్కువ సరుకుల రవాణా చేసుకోవచ్చని తెలిపారు. తాము కేంద్రానికి పంపిన ప్రతిపాదనలను కేంద్రమంత్రి ఆమోదిస్తారని తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు.

9న హైదరాబాద్‌లో
టిడిపి బహిరంగ సభ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 3: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8 లేదా 9వ తేదీన నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ తెలుగు దేశం పార్టీ వ్యూహ రచన కమిటీ నిర్ణయించింది. టిడిపి శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, మాగంటి గోపినాథ్ అధ్వర్యంలో పార్టీ వ్యూహ రచన కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ పరిథిలోని 24 నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, పరిశీలకులు పాల్గొన్నారు. నిజాం కళాశాల మైదానంలో నిర్వహించే ఈ బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మిత్రపక్షమైన బిజెపితో కలిసి పోటీ చేయనున్నందున, ఈ బహిరంగ సభకు ఆ పార్టీ ముఖ్య నేతలను ఆహ్వానించాలని నిర్ణయించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇలాఉండగా బిజెపితో సీట్ల సర్దుబాటు కోసం కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టిడిపి హయాంలోనే నగరాభివృద్ధి జరిగిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, టిఆర్‌ఎస్ చేసే విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సమావేశంలో నిర్ణయించారు.

గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు
గుణపాఠం తప్పదు

టి.టిడిపి నాయకుల హెచ్చరిక

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 3: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు జిమ్మిక్కులు చేస్తున్నారని టి.టిడిపి శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పనున్నారని అన్నారు. ఒకటి, రెండు రోజుల్లో జిహెచ్‌ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నందున వందల కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారని వారు విమర్శించారు. చివరకు స్కైవేస్‌కు కూడా శంకుస్థాపన చేస్తున్నారని అన్నారు. అసలు వాటికి డిపిఆర్ ఉందా? అనుమతులు ఉన్నాయా? టెండర్లు పిలిచారా? మొదలైనవి ఏమీ పట్టించుకోకుండా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శంకుస్థాపన చేస్తున్నారని వారు విమర్శించారు.
2009లో జిహెచ్‌ఎంసికి జరిగిన ఎన్నికల్లో కనీసం పోటీ చేయడానికి టిఆర్‌ఎస్‌కు అభ్యర్థులు దొరకలేదని వారు తెలిపారు. ఒక ప్రైవేటు టివీ ఛానల్ ఎన్నికల సర్వే చేయడం బోగస్ అని అన్నారు. అసలు రిజర్వేషన్లు రాక ముందే, అభ్యర్థులు ఎవరో తెలియక ముందే సర్వే ఎలా చేశారని, పైగా ఆ సంస్ధ గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారం చేపడుతుందని చెప్పిందని, ఇప్పుడు జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని చెప్పిందని వారు తెలిపారు.