రాష్ట్రీయం

పోలవరం సబ్-కాంట్రాక్టులపై కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, నవంబర్ 25: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తిచేస్తామని పదే పదే హామీలిస్తున్న రాష్ట్రప్రభుత్వం దానికి అనుగుణంగా కసరత్తు ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన హెడ్‌వర్క్స్ పనులు ఇపుడు సాగుతున్నట్టే సాగితే మరో పదేళ్లయినా పూర్తికావన్న నిర్ణయానికి వచ్చిన రాష్ట్రప్రభుత్వం కొన్ని పనులను సబ్-కాంట్రాక్టుకు ఇవ్వాలని భావిస్తోంది. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్‌వాల్‌ను బహుళజాతి నిర్మాణ కంపెనీకి సబ్-కాంట్రాక్టుకు ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్న నేపథ్యంలో, ఇతర పనులను కూడా సబ్-కాంట్రాక్టుకు ఇవ్వాలని భావిస్తోంది. అయితే ఎలాంటి పనులు ఏఏ కాంట్రాక్టు సంస్థలకు ఇవ్వాలన్న అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హెడ్‌వర్క్స్‌లోని ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యామ్, స్పిల్ వే, పవర్‌హౌస్‌లను వేర్వేరు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించి, తరువాత ఆ కాంట్రాక్టును రద్దుచేసి, మళ్లీ ఒకే కాంట్రాక్టు సంస్థకు అప్పగించాలని నిర్ణయించిన సంగతి విదితమే.
అయినప్పటికీ పనుల్లో పురోగతి కనిపించటం లేదన్న అసంతృప్తిని రాష్ట్రప్రభుత్వం వ్యక్తంచేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి కాంట్రాక్టును రద్దుచేయటం కన్నా, ప్రధాన కాంట్రాక్టు సంస్థను కొనసాగిస్తూనే, సబ్- కాంట్రాక్టు విధానాన్ని తెరపైకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సబ్-కాంట్రాక్టు విధానాన్ని ఎలా అమలుచేయాలి? ఏ పనులను అప్పగించాలన్న అంశాలపై ఇంజనీరింగ్ నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. పవర్‌హౌస్, స్పిల్ వే, స్పిల్ చానల్, ఎర్త్‌కంరాక్‌ఫిల్ డ్యామ్ తదితర పనులను సబ్-కాంట్రాక్టుకు అప్పగిస్తే బావుంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే ఇలాంటి విధానంలోనైనా సరయిన సబ్-కాంట్రాక్టు సంస్థలను ఎంపికచేయకపోతే మళ్లీ పరిస్థితి మొదటికొస్తుందన్న ఉద్దేశ్యంతో ఈసారి పక్కా ప్రణాళికను రూపొందించాలని ఇంజనీరింగ్ నిపుణులు భావిస్తున్నారు.మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదం కోసం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని తాజా స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లకు అనుగుణంగా సవరించే కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం చేపట్టినట్టు తెలుస్తోంది. 2010-11 ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం పోలవరం నిర్మాణానికి రూ.16వేల కోట్లు ఖర్చవుతుందని రాష్ట్రప్రభుత్వం అంచనావేసింది. దీనికి సిడబ్ల్యుసి ఆమోదం కూడా లభించింది. అయితే ఇంకా పనులు పూర్తికాకపోవటంతో 2015- 16ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం అంచనా వ్యయాన్ని సవరించే కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అంచనాలను సిడబ్యుసితో పాటు పిపిఎ ఆమోదించిన తరువాతే కేంద్రం నిధులు విడుదలచేస్తుంది. ఇదంతా పూర్తయ్యే సరికి మరో నిర్మాణ సీజన్ దాటిపోతుందన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది.

షాక్ నుంచి తేరుకోని విపక్షాలు

కుంటి సాకులు వెదుకుతున్న నేతలు
ప్రలోభాలతోనే గెలిచారని ఆరోపణ
ఓటమిని విశే్లషిస్తాం: జానా

హైదరాబాద్, నవంబర్ 25: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితంతో విపక్షాలు కుంటి సాకులు వెతుక్కుంటున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి నేతలు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఓడిపోతామని ముందే ఊహించినా, కారు స్పీడు ఇంత జోరుగా ఉంటుందని అనుకోలేదని ఆ రెండు పార్టీల ముఖ్య నేతలు అంటున్నారు. రెండో స్థానం కోసం రెండు పార్టీలూ తీవ్రంగా ప్రయత్నించాయి. సార్వత్రిక ఎన్నికల్లో కడియం శ్రీహరికి లభించిన ఓట్ల కంటే తక్కువ వచ్చినా కనీసం ముఖం చెల్లేదని, ప్రభుత్వ వ్యతిరేకత ఆరంభమైనందుకే మెజారిటీ తగ్గిందని చెప్పుకునేందుకు అవకాశం ఉండేది. కానీ వరంగల్ ఓటర్లు ఆ అవకాశాన్ని కూడా విపక్షాలకు విడిచి పెట్టకుండా టిఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీని అందించారు. ఈ ఫలితాన్ని రెండు పార్టీల నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇలాఉండగా వరంగల్ ఫలితంపై కాంగ్రెస్, బిజెపి నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని వేసిన అంచనాలు తారుమారయ్యాయి. గెలవడం సంగతి ఎలా ఉన్నా, కనీసం మెజారిటీ తగ్గించలేకపోయామన్న బాధ వారిని వెంటాడుతున్నది. తిరిగి ప్రజల్లోకి వెళ్ళేందుకు బిజెపి, కాంగ్రెస్ నాయకులు కుంటి సాకులు వెతుక్కుంటున్నారు. టిఆర్‌ఎస్ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ఓట్లు వేయకపోతే అభివృద్ధి నిలిచిపోతుందని, సబ్సిడీలు ఆగిపోతాయని బెదిరించారని కాంగ్రెస్, బిజెపి నాయకులు విమర్శిస్తున్నారు.
ఓటర్లను బెదిరించారు: భట్టి
వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా టిఆర్‌ఎస్ నేతలు ఓటర్లను బెదిరించారని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. టిఆర్‌ఎస్‌కు ఓటు వేయకపోతే పెన్షన్లు, రుణ మాఫీ ఆగిపోతాయంటూ బ్లాక్‌మెయిల్ చేశారని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. తెలంగాణలో ఇంటింటికీ నీళ్ళు అందించిన తర్వాతే ఓట్లు అడుగుతామంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేశాకే ఓట్లు అడుగుతామని అంటే బాగుంటుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో తమ పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే విషయంపై ఇప్పుడే చెప్పలేమని, పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కుంగిపోవడం లేదు: జానా
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె జానారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఓటమితో తాము కుంగిపోవడం లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసేలా ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యతను, కర్తవ్యాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనన్నారు. ఓటమికి గల కారణాలపై త్వరలో పార్టీ సమావేశంలో విశే్లషించుకుంటామని చెప్పారు. వరంగల్‌లో తాను మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ళలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పంటలకు నీరిస్తే, తాను టిఆర్‌ఎస్ ప్రచార కార్యకర్తగా ఉంటానని వ్యాఖ్యానించిన మాట నిజమేనన్నారు. మూడేళ్ళు కాదు కదా ముఖ్యమంత్రి కెసిఆర్ నిపుణులతో చర్చించి, ఐదేళ్ళలో అమలు చేసినా, తాను చేసిన వ్యాఖ్యకు కట్టుబడి ఉంటానని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇలాఉండగా బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ఒకటి, రెండు రోజుల్లో పార్టీ ముఖ్య నేతలు సమావేశమై ఫలితంపై చర్చించనున్నట్లు తెలిపారు.