రాష్ట్రీయం

అతిరుద్ర యజ్ఞం ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, డిసెంబర్ 20: దక్షిణ కాశీగా ప్రసిద్ధిచెందిన తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామ శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయ ఉత్తర ద్వారం సమీపంలో శ్రీఅతిరుద్రం మహాయజ్ఞం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన క్షేత్రం శ్రీమణిద్వీప మహాసంస్థానానికి చెందిన భగవతీ శ్రీశ్రీశ్రీ విజయేశ్వరిదేవి కరుణామయి అమ్మ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఆదివారం ఉదయం 5.30 గంటలకు ముందుగా గంగాపూజ, గోపూజ, శ్రీగణేశపూజ, స్వస్తి పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాసనము, అంకురార్పణము, దీక్షాకంకణ ధారణ, రుత్విక్ వరణము, యాగశాల ప్రవేశము, పూర్వాంగ దశధార, దేవానంది, షోడసాధన, అగ్నిమథనం తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భగవతీ శ్రీశ్రీశ్రీ విజయేశ్వరిదేవి అతిరుద్ర యాగ ప్రారంభ పూజలను ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, సూర్యకుమారి దంపతులతో నిర్వహింపజేశారు. తదనంతరం పంచముఖ మరకత శివలింగానికి పవిత్ర గంగాజలం, విభూతి, అన్నప్రసాదం, పలు రకాలైన పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. యాగశాలలో ఏర్పాటుచేసిన 11హోమ గుండాలలో 128మంది వేదపండితులు రుద్రం పఠిస్తూ అతిరుద్రం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాలను తిలకించారు. అతిరుద్రంతో పాటు భీమేశ్వరస్వామికి కుంభాభిషేకం కూడా నిర్వహించనున్నారు. ఈనెల 25వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయ శాఖ, కేంద్ర పురావస్తు శాఖల అనుమతితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

యజ్ఞగుండంలో ఆజ్యం పోస్తున్న రుత్త్విక్కులు