ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగుల తరలింపుపై వీడని సందిగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 20: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల తరలింపుపై సర్వత్రా సందిగ్ధత నెలకొంది. ఈ నెల 29లోగా 4 వేల మంది ఉద్యోగులను తరలించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే భవనాల నిర్మాణాలు ఇంకా పూర్తికాలేదు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో సచివాలయ ప్రాంగణం బురదమయమైంది. ప్రహరీ గోడ పనులు ఇంకా పూర్తికాలేదు. 1, 5వ నెంబర్ భవనాలు మాత్రమే తుదిరూపు సంతరించుకుంటున్నాయి. మిగిలిన 3 భవనాల పనులు మరో నెల రోజులకు గాని పూర్తయ్యే పరిస్థితులు లేవు. వర్షాలవల్ల ప్రాంగణంలో పనులు నిలిపివేశారు. భవనాలు సిద్ధమైన అనంతరం ఇంటీరియర్ డెకరేషన్ పూరె్తైతే గానీ ఉద్యోగుల తరలింపు సాధ్యపడదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సంబంధించి 1వ నెంబర్ బ్లాకుతో పాటు 5వ బ్లాకు భవనాలు మాత్రమే తుదిరూపు సంతరించుకుంటున్నాయి. 5వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఆర్ అండ్ బి, ఏపి విసి, 400 మందికి సరపడా సమావేశ మందిరాలు, గ్రౌండ్ ఫ్లోర్‌లో పిఆర్ ఆర్ అండ్ బి, హెచ్‌ఎం అండ్ ఎఫ్‌డబ్ల్యు, ఎల్‌ఇటి అండ్ ఎఫ్, హౌసింగ్ శాఖలతో పాటు ఐదుగురు మంత్రులకు పేషీలకు నిర్దేశించారు. ఇందులో ముఖ్యమంత్రి కార్యాలయ భవనాన్ని షాపూర్జీ పల్లోంజీ సంస్థ, మరో మూడు భవనాలను ఎల్ అండ్ టి సంస్థ నిర్మిస్తున్నాయి. మూడు షిఫ్ట్‌లుగా కార్మికులు పనిచేస్తున్నప్పటికీ కార్యాలయ భవనాల్లో ఇంకా ఫ్లోరింగ్, విద్యుదీకరణ, ఫైర్, ప్లాస్టింగ్ పనులు ఇంకా పూర్తికాలేదు. ఇవన్నీ పూర్తిస్థాయిలో కార్యాలయాల నిర్వహణకు అనుకూలంగా రూపుదిద్దుకోవాలంటే కనీసం మరో మూడు నాలుగు నెలల వ్యవధి పడుతుందని అధికారులే చెపుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల తరలింపునకు ప్రత్యేక రైళ్లు, ఇతర రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ సచివాలయ భవనాల నిర్మాణం పూర్తికాక పోవడంతో విధులు ఎక్కడ నిర్వహించాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఏడాదికి హైదరాబాద్‌లోనే ఉండదలచిన ఉద్యోగులకు హాస్టల్ వసతి కల్పిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు దీనికి తగిన భవనాలను పరిశీలించలేదు. ఉన్నపళంగా తరలివస్తే ఉద్యోగులు చెట్లకింద కాలక్షేపం చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 2వ తేదీ వరకు స్థానికత విషయంలో వెసులుబాటు ఉన్నందున ఈ ఏడాదికి కీలకమైన శాఖల వరకే తరలించి ‘మమ’ అనిపించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సచివాలయ పనులు, ఉద్యోగుల తరలింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో తొలిదశ తరలింపుపై స్పష్టత వస్తుందని ఉద్యోగ నేతలు ఆశిస్తున్నారు.

చిత్రం... వర్షంతో బురదమయమైన ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ ప్రాంగణం