రాష్ట్రీయం

ప్రజలే ప్రగతి సారథులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 11: గ్రామాలు, జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎన్ని వనరులు కల్పించినప్పటికీ, ప్రజా భాగస్వామ్యంతోనే సత్ఫలితాలు సాధించవచ్చని సిఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపాల్టీ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు 310 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించి, స్పీకర్ కోడెల శివప్రసాద రావును పొగడ్తలతో ముంతెచ్చారు. కార్యక్రమంలో మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని పేర్కొంటూనే, తెలుగువారు తెలివైన వారని, సంపదను సృష్టించి ముందుకెళ్లే శక్తి యుక్తులు ఉన్నాయన్నారు. రాజధాని అమరావతిలో 33వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చి ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. నరసరావుపేట మున్సిపాల్టీ వందేళ్ల వేడుక సందర్భాన్ని శక్తిగా స్పీకర్ కోడెల మలుచుకొని రాష్ట్రానికే ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. కోడెల హయాంలోనే పట్టణాభివృద్ధి జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్ర ప్రజలకు తొలి శాసన సభాపతులు నరసరావుపేటకు చెందినవారే కావటం గమనించాల్సిన అంశమన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారన్నారు. శృంగేరి పీఠాధిపతి కూడా నరసరావుపేటకు చెందినవారే కావడం గర్వకారణమన్నారు. రాజధాని సమీపంలోని నరసరావుపేటను నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఏడాదికి ఐదు వేల కిలోమీటర్ల సిసి రోడ్లను గ్రామాల్లో నిర్మిస్తామన్నారు. రాజధానిలో నిర్మించనున్న ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్లను నాలుగు, ఆరు లేన్ల రహదారులుగా నిర్మిస్తామన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి 65వేల కోట్లు ప్రకటించారని సిఎం గుర్తు చేశారు. వైద్యం ప్రభుత్వమే చేయాలనే ధృక్పథంలో ప్రజలున్న సమయంలో కార్పొరేట్ ద్వారా వైద్యం అందించ వచ్చనే ఆలోచనతో అమెరికాలో నివాసముంటున్న ప్రతాప్ సి రెడ్డి అపోలో ఆస్పత్రులు నిర్మించి ఆదర్శంగా నిలిచారన్నారు. ఆసుపత్రి అంటే అపోలో గుర్తుకొచ్చే స్థాయికి తీసుకెళ్లారన్నారు. జిఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావు విమానశ్రయాల నిర్మాణం నుంచి నిర్వహించే స్థాయికి ఎదగటం అపూర్వమన్నారు.
చిత్తశుద్ధితో అభివృద్ధి: స్పీకర్
నియోజకవర్గాల్లో ఏదోక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజాసహకారంతో అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు శ్రీకారం చుడితే అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో సుసాధ్యమన్నారు. నరసరావుపేట పురపాలక శాఖ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా తీసుకొని 300 పడకల ఆసుపత్రి, స్వర్గపురి, మరుగుదొడ్లు, రైల్వే అండర్ బ్రిడ్జి తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. గతంలో నరసరావుపేట పట్టణం నిర్మించి 200 సంవత్సరాలైన సందర్భంగా ద్విశతాబ్ది ఉత్సవాల పేరుతో కోటప్పకొండ, స్టేడియం తదితర అభివృద్ధి పనులను పూర్తిచేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, కామినేని శ్రీనివాసరావు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, భారతి బయోటిక్స్ జెఎండి సుచిత్ర ఎల్లా, ప్రముఖ సిని దర్శకుడు కె రాఘవేంద్రరావు, జిల్లా పరిషత్ చైర్మన్ జానీమూన్, మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా తదితరులు పాల్గొన్నారు.