రాష్ట్రీయం

తూర్పు నౌకాదళం మరింత పటిష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 3: దేశ రక్షణలో తూర్పు నౌకాదళం మరింత పటిష్టంగా మారనుందని ఈఎన్‌సీ చీఫ్ అతుల్ కుమార్ జైన్ వెల్లడించారు. నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఐఎన్‌ఎస్ జలాశ్వన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఎన్‌ఎస్ డిల్లీ, ఐఎన్‌ఎస్ ముంబై, ఐఎన్‌ఎస్ మైసూర్ తదితర యుద్ధ నౌకలు ఫ్లీట్‌లో చేరి సేవలందించనున్నాయని పేర్కొన్నారు. తూర్పు నౌకాదళంలో ఐఎన్‌ఎస్ రంజిత్ ఇటీవలే సేవల నుంచి విరామం తీసుకుందని, త్వరలోనే ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ కూడా సేవలు ఉపసంహరించుకోనుందని, వీటి స్థానంలో కొత్త యుద్ధ నౌకలు ఫ్లీట్‌కు రానున్నాయని తెలిపారు. ప్రస్తుతం వివిధ నౌకానిర్మాణ కేంద్రాల్లో తయారవుతున్న ఏడు యుద్ధ నౌకల్లో మూడు నౌకలు తూర్పు నౌకాదళంలోకి వచ్చి చేరనున్నట్టు వెల్లడించారు. దీనితో పాటు ఆఫ్‌షోర్ పెట్రోలింగ్ వెసలు ఒకటి అందుబాటులోకి రానుందన్నారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ కూడా త్వరలోనే సేవలకు సిద్ధం అవుతోందన్నారు. వచ్చే అయిదేళ్లలో మరిన్ని నౌకలు నౌకాదళంలో చేరనున్నాయని తెలిపారు. విశాఖ కేంద్రంగా మిగ్ 29 స్క్వాడ్రన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పైలెట్లకు శిక్షణ, తదితర కార్యకలాపాలు విశాఖ కేంద్రగా సాగునున్నాయన్నారు. ఇప్పటికే డార్నియర్ స్టేషన్‌ను ఈఎన్‌సీ పరిధిలోని తమిళనాడు రాష్ట్రం మీనంబాకంలో నెలకొల్పినట్టు తెలిపారు. ప్రస్తుతం తూర్పు నౌకాదళంల 45 యుద్ధ నౌకలు సేవలందిస్తున్నాయని తెలిపారు. వీటితోపాటు ఏడు జలాంతర్గాములు ఈఎన్‌సీ పరిధిలో పనిచేస్తున్నాయన్నారు. 40 రకాల యుద్ధ విమానాలు సహా కమోర్తా, చేతక్, సీకింగ్, యూఎస్‌ఏహెచ్ హెలికాఫ్టర్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
తీర ప్రాంతాలను ఆసరా చేసుకుని ఉగ్రవాదులు దేశంలో అలజడి సృష్టించే అవకాశాలున్నాయని, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలపై ఈఎన్‌సీ చీఫ్ అతుల్ కుమార్ జైన్ స్పందిస్తూ సువిశాల తీరప్రాంతంపై ఉగ్రవాదుల కదలికలు ఉంటాయని, అయితే ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తూర్పు నౌకాదళం పరిధిలో 2,400 కిమీ తీరప్రాంతం ఉందని, జీహాదీల ముప్పును కోస్ట్‌గార్డ్, ఇతర భద్రతా దళాల సహకారంతో తిప్పికొట్టగలమన్నారు. పూర్తి అప్రమత్తంగానే ఉన్నామని, ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. బాడంగిలో ఎయిర్ స్ట్రిప్‌ను నౌకాదళ ఆపరేషన్స్, డైవర్షన్స్ కోసం అసరాన్ని బట్టి ఉపయోగించుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
నేడు నేవీ డే
1971 నాటి ఇండో-పాక్ యుద్ధంలో ఘన విజయాన్ని పురస్కరించుకుని ప్రతి యేటా నౌకాదళం నిర్వహించే నేవీ డే కార్యక్రమం విశాఖ ఆర్కే బీచ్‌లో బుధవారం జరగనుంది. ఈఎన్‌సీ చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్, ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరుకానున్నారు.
*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఈఎన్‌సీ చీఫ్ అతుల్ కుమార్ జైన్