రాష్ట్రీయం

బ్రహ్మకు నామాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని అతిప్రాచీన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో గల అపూర్వ, అపురూప, బ్రహ్మ దేవుని విగ్రహానికి అకస్మాత్తుగా, అనూహ్యంగా నామాలు పెట్టడం విస్తృత చర్చనీయాంశంగా మారింది. స్మార్త ఆగమ సంప్రదాయాలతో నిత్య పూజలు నిర్వహించే దేవస్థానంలోని కోరిన కోర్కెలు తీర్చే శ్రీయోగానంద లక్ష్మీ నారసింహుని ప్రధానాలయంలో ఎడమ పక్కన వెలసి, ప్రసిద్ధి నొంది, శతాబ్దులుగా నుదిటిపై అడ్డు భస్మం రేఖలతో అలంకృతుడవుతూ, పూజలందుకుంటున్న త్రిమూర్తులలో ఒకరైన సృష్టికర్త బ్రహ్మ దేవునికి, కారణాలేవో తెలుపకుండా, అనుభవజ్ఞులైన స్థానికులను సైతం సంప్రదించక, ఇటీవలి కాలంగా మధ్య ఎదురు ముఖానికి అడ్డు భస్మపు రేఖలు, పక్క ముఖాలకు నిలువు నామాలతో అలంకారం చేసి విచిత్ర రూపంగా తయారు చేయడం వెనుక మతలబు ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు. దేవస్థానంలో ఆరడుగల భారీ బ్రహ్మ విగ్రహం ఉంది. 6 అడుగుల విగ్రహం, 4 చేతులు, ఒకముఖం వెనక, మూడు కనబడేవి, మధ్య ముఖానికి పొడవైన గడ్డం, వేదాలు, గరిటెలాంటి సాధనం పై చేతుల్లో, ఎడమ చేయి అభయముద్రాలంకితంగా, కుడి చేయి అక్షర మాలాయుత గదాధరుడై హంసవాహనుడై దర్శనమిస్తున్నాడు. భక్తులు, యాత్రికులు, సందర్శకులు, స్థానికులు ప్రధాన దైవమైన శ్రీలక్ష్మీ నారసింహుని దర్శించుకునే ముందే బ్రహ్మ దర్శనం చేసుకుని, ముందుకు వెళ్ళడం సంప్రదాయం.
భృగు మహర్షి శాపం పురాణ, మనస్సు శాపం వేదాధారంగా భూలోకాన బ్రహ్మకు ఆలయాలు, పూజార్హత లేకుండా చేశాయని గాథలున్నాయి. ‘‘స మాయా మోహితం కృత్వా మాం మహేశో ధృతం మునే! తన్నాభి పంకజాదావిర్భావయామాస లీలయా!! ఏవ మాద్యోత్తతో జజ్ఞే పుత్రోహం హేమగర్భగకః! చతుర్ముఖో రక్తవర్ణ త్రిపుండ్రాంకిత మస్తకః!!’’ హిరణ్య గర్భుడగు నేను నాలుగు ముఖాలతో, ఎర్రని దేహంతో, త్రిపుండ్రంతో భాసించు లలాటముతో ఆది దేవుని పుత్రునిగా జన్మించానని అని బ్రహ్మ నుడివినట్టు వేదవ్యాస విరచిత అష్టాదశ పురాణాంతర్గత శివ మహా పురాణంలో స్పష్టపరుస్తున్నది. శివ గణానికి చెందిన బ్రహ్మ మూడు భస్మపురేఖలను కలిగి ఉండాడని పురాణాధారం. ఇలాంటి చరిత్ర కందనంత కాలం నుండి దేశంలో అరుదైన, ప్రత్యేకించి సృష్టికర్తయై లెక్కకు అందనన్ని వత్సరాల వయస్సున్న గడ్డం కలిగిన అపురూప బ్రహ్మ ప్రతిమకు హఠాత్తుగా ఒక నుదుటిపై అడ్డపు భస్మ రేఖలను, పక్క ముఖాల నుదిటిపై నామాలు దిద్దడం ఎందుకు చేపడుతున్నారో అర్థం కావడం లేదని క్షేత్రవాసులు అంటున్నారు. బ్రహ్మ స్వరూపాన్ని మార్చి వేయడం అర్థరహితమని వ్యాఖ్యానిస్తున్నారు. నిర్నిమిత్త, నిర్హేతుకంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని హితవు పలుకుతున్నారు. దీని వల్ల ఆలయ ప్రాచీనత్వ ఆచారం కనుమరుగు కాలదని స్థానికులు అంటున్నారు. క్షేత్ర సనాతన సంప్రదాయ నేపథ్యంతో నడుస్తున్న ప్రాచీన ఆలయాలలో ఎలాంటి మార్పులు చేయ దలుచుకున్నా, ముందుగా స్థానిక అనుభజ్ఞుల సూచనలు పాటించాలని అంటున్నారు.
*చిత్రం... ధర్మపురి క్షేత్రంలో విచిత్రంగా అలంకృతుడవుతున్న బ్రహ్మ దేవుడు