రాష్ట్రీయం

ఎమెస్కోకు లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 10: తెలుగు జ్ఞాన్‌పీఠ్ అవార్డుగా భావించే లోక్‌నాయక్ ఫౌండేషన్ ప్రతియేటా ఇచ్చే సాహితీ పురస్కారం ఈసారి వ్యక్తులకు కాకుండా, సాహితీ సేవలు అందిస్తున్న సంస్థకు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఫౌండేషన్ అధ్యక్షుడు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రకటించారు. విశాఖలోని ఫౌండేషన్ కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడచిన 80ఏళ్లలో ఎమెస్కో సంస్థ 10వేలకు పైగా పుస్తకాలను ప్రచురించిందన్నారు. తెలుగునాట సుప్రసిద్ధులైన రచయిత పుస్తకాలు ఈ సంస్థ ప్రచురణలుగా పేర్కొన్నారు. ప్రాచీనాంధ్ర సాహిత్యాన్ని సంప్రదాయ సాహితి శీర్షికన ఎమెస్కో ప్రచురించింది. తెలుగులో వచన వేదాలను ప్రచురించిన భారతీయ ప్రచురణ రంగంలో చిరస్థాయిగా నిలిచింది. ‘పొరుగు నుంచి తెలుగు’ శీర్షికన భారతీయ భాషల్లో సుప్రసిద్ధమైన సమకాలీన సాహిత్యాన్ని తెలుగు అనువాదాలుగా ప్రచురించే కార్యక్రమం చేపట్టి, ఇప్పటివరకూ 33 పుస్తకాలు ప్రచురించింది. బాలల్లో పఠనాసక్తిని పెంచడంతోపాటు వారిలో సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు 2004లో రాష్టస్థ్రాయి కథల పోటీలు నిర్వహించగా, 30 వేలకుపైగా పిల్లలు పాల్గొన్నారు. పిల్లలు రాసిన కథలకు వారితోనే బొమ్మలు వేయించి ప్రచురించడం గమనార్హం. చిత్రాల్లో తెలుగువారి చరిత్ర శీర్షికన మొదటి తెలుగు కాఫీ టేబుల్ పుస్తకాన్ని ప్రచురించి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆవిష్కరించారు. తెలుగు వెలుగుకు ఎమెస్కో అందించిన సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది పురస్కారాన్ని అందిస్తున్నామని, పురస్కారంతోపాటు రెండు లక్షల నగదును అందజేస్తామని యార్లగడ్డ తెలిపారు. పురస్కారాన్ని ఎమెస్కో సంస్థ అధినేత జూపాటి విజయ్‌కుమార్ అందుకుంటారన్నారు.
లావు రత్తయ్యకు జీవన సాఫల్య పురస్కారం
ఫౌండేషన్ ప్రతియేటా వ్యక్తులకు ఇచ్చే జీవన సాఫల్య పురస్కారాన్ని విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావురత్తయ్యకు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ పురస్కారం కింద రూ.లక్ష నగదు అందజేస్తామన్నారు. వచ్చే ఏడాది జనవరి 18వతేదీన ఎన్‌టీ రామారావు, హరివంశరాయ్ బచన్ వర్ధంతి సందర్భంగా విశాఖలో జరిగే కార్యక్రమంలో పురస్కార ప్రదానం ఉంటుందన్నారు. అతిధులుగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వర రావు, జీ రఘురాం పాల్గొంటారన్నారు. సమావేశంలో లోక్‌నాయక్ ఫౌండేషన్ ప్రతినిధి ఎన్ బాబయ్య పాల్గొన్నారు.