రాష్ట్రీయం

తెలంగాణ వ్యాప్తంగా బంద్ సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా శనివారం నిర్వహించిన రాష్ట్ర బంద్ అన్ని జిల్లాల్లో సంపూర్ణంగా విజయవంతమైంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, వివిధ ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, యువజన, సామాజిక, విద్యార్థి సంఘాలు పాల్గొనడంతో ప్రజా జీవనం స్తంభించింది. ఆర్టీసీ కార్మికులతో పాటు మద్దతు ఇచ్చిన పార్టీలు, సంఘాలకు చెందిన ఆందోళనకారులు ఆర్టీసీ డిపోల ముందు బైఠాయించి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను ఎక్కడికక్కడే అరెస్టులు చేయడానికి ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించడంతో తోపులాటలు, వాగ్వాదాలకు దారితీయడంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారుల అరెస్టుల తర్వాత డిపోల నుంచి కొన్ని బస్సులు రోడ్డు ఎక్కగా వాటిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, తాత్కాలిక డ్రైవర్లపై దాడులకు దిగిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
వరంగల్‌లో...
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంద్ విజయవంతమైంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో చెదురుమదురు సంఘటనలు మినహా బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. బస్టాండ్లన్నీ ప్రయాణికులు లేక బోసిపోయాయి. బంద్‌కు అన్ని వర్గాల నుండి మద్దతు లభించింది. బంద్‌ను విఫలం చేయడానికి ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా సకల జనుల మద్దతుతో బంద్ విజయవంతమైందని చెప్పవచ్చు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, వరంగల్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో హన్మకొండలో కార్యకర్తలు బంద్‌కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. వామపక్షాలకు చెందిన కార్మిక, విద్యార్థి సంఘాలు ఎర్రజెండాలతో బంద్‌లో పాల్గొని సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కరీంనగర్‌లో...
ఆర్టీసీ ఐకాసకు మద్దతుగా చేపట్టిన రాష్ట్ర బంద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారం విజయవంతమైంది. బంద్‌కు మద్దతుగా రోడ్లపైకొచ్చిన విపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టులు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ పోలీసుల బలగాలను మోహరించి ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు యత్నించగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిఘానేత్రంతో పర్యవేక్షించగా, పలుచోట్ల నిరసనకారులు ఆర్టీసీ బస్సుల్లో గాలి తీసేసి అడ్డుకున్నారు. ఆర్టీసీ జేఏసీ బంద్‌కు బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతునిచ్చాయి. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను ఆందోళనకారులు దగ్ధం చేశారు. బంద్‌కు సందర్భంగా వ్యాపార, వాణిజ్యి సంస్థలను ఆందోళనకారులు మూసివేయించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లిలో పూర్తి బంద్ జరిగింది.
నిజామాబాద్‌లో...
ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర బంద్‌లో భాగంగా శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విజయవంతమైంది. జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో బస్సులు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అతికష్టమీద పోలీసుల సహకారంతో మధ్యాహ్నం వరకు 38 బస్సులను మాత్రమే ప్రధాన రూట్లలో నడుపగలిగారు. నిజామాబాద్ నగర శివారులోని దాస్‌నగర్ వద్ద ఆర్మూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై పలువురు కార్మికులు రాళ్లు రువ్వడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్ పార్టీ మినహా ఇతర అన్ని రాజకీయ పార్టీలు, వామపక్షాలు, టీ.జేఏసీ, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు బంద్ విజయవంతానికి కృషి చేశారు.
నల్లగొండలో...
ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా సంపూర్ణంగా సాగింది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, అనుబంధ కార్మిక, విద్యార్థి సంఘాలు బంద్‌లో ప్రత్యక్షంగా భాగస్వామ్యంకాగా, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీలు బంద్‌కు మద్దతునివ్వడంతో బంద్ సంపూర్ణంగా సాగింది. దుకాణాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, పెట్రోల్ బంక్‌లు, సినిమా హాల్స్, బ్యాంకులు బంద్ పాటించాయి. ఆందోళనకారులు మోటార్ సైకిళ్ల ర్యాలీలతో దుకాణాలు మూసివేయించారు. ప్రభుత్వం పోలీసు బలగాలతో బంద్‌ను భగ్నం చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకుండా కార్మిక సంఘాలు, విపక్షాలన్ని ఉమ్మడిగా డిపోల ముందు బైఠాయించి బస్సులను బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకుని బంద్ విజయవంతం చేయడం సఫలీకృతమయ్యారు.
మహబూబ్‌నగర్‌లో...
ఆర్టీసీ జేఏసీ చేపట్టిన రాష్ట్ర బంద్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పూర్తి విజయవంతమైంది. జిల్లాలో ఎక్కడ కూడా ఆర్టీసీ బస్సులు ఉదయం నుండి సాయంత్రం దాకా రోడ్డెక్కలేదు. కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్ డిపోల నుంచి ఎక్కడ కూడా బస్సులు రోడ్డెక్కలేదు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం శ్రేణులు బంద్‌ను విజయవంతానికి కృషి చేశారు.
ఆర్టీసీ బస్సులను ఎలాగైనా నడిపించాలని పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బంద్‌కు ఆటో యూనియన్లు కూడా మద్దతు పలకడంతో బంద్ ప్రభావం మరింత చూపింది. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్, రాయిచూర్ వెళ్లే ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది. ఉదయం నుండి సాయంత్రం వరకు దుకాణాలను కూడా వ్యాపారస్థులు స్వచ్ఛందంగా మూసుకున్నారు.
ఆదిలాబాద్‌లో...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్ విజయవంతమైంది. బంద్‌కు మద్దతు ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. డిపోలు, బస్టాండ్ల నుంచి ఆర్టీసీ బస్సులు కదలనివ్వకుండా అడ్డుకున్న కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నేతలను అదుపులోకి తీసుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఉట్నూరు, భైంసా, ఆసిఫాబాద్ డిపోల పరిధిలో పోలీసులు పహారా కాస్తూ బంద్‌ను విఫలయత్నం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అఖిలపక్ష పార్టీల మద్దతుతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సంఘీభావంతో బంద్ విజయవంతమైంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల పట్టణాల్లో సాయంత్రం వరకు దుకాణాలు, వ్యాపార సంస్థలు, హోటళ్ళు, సినిమా హాళ్ళు, క్యాంటిన్లు మూతపడ్డాయి.
మెదక్‌లో...
ఆర్టీసీ జేఎసీ పిలుపు మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాల్లో బంద్ విజయవంతమైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వివిధ పార్టీలు, ప్రజల సంఘాల మద్దతు ఇవ్వడంతో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. బంద్ విజయవంతం కాకుండా శనివారం తెల్లవారుజాము నుండి వివిధ పార్టీల నేతలు, కార్మికుల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్‌కు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు, విద్యార్థి, కార్మిక, ఉపాధ్యాయ సంఘాల నేతలు ర్యాలీగా తరలిరావటంతో పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆర్టీసీ కార్మికులతో పాటు కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు మద్దతుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించాయి. సిద్దిపేటలో ఆర్టీసీ మహిళా కార్మికులు తాత్కాలిక డ్రైవర్‌పై చెప్పులతో దాడి చేయగా అతను బస్సును వదిలేసి పరారయ్యారు.

*చిత్రాలు..హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో వామపక్షాల ఆందోళన