రాష్ట్రీయం

ఖమ్మం బంద్ సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 14: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ, అందుకు నిరసనగా ఆర్టీసీ జేఏసీ సోమవారం తలపెట్టిన ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్ విజయవంతం అయింది. ఇలాఉంటే టీవీలో ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన వార్తలు చూస్తూ కొణిజర్ల మండలంలో ఒక మహిళ కుప్పకూలి మృతిచెందింది. ఆమె ఇద్దరు కుమారులు ఆర్టీసీలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కాగా ఆర్టీసీ కార్మికుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.
హఠాత్‌మరణం చెందిన ఆర్టీసీ కార్మికుల తల్లి అగ్నేష్ మృతదేహాన్ని సోమవారం సందర్శించి నివాళులు అర్పించారు. బంద్ సందర్భంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వర్తక, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టాయి. ఆయా మండల కేంద్రాల్లో కూడ అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఒకే వేదికపైకి వచ్చి బంద్‌లో పాల్గొనడం గమనార్హం. ఖమ్మం నగరంలో సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, బీజేపీలతో పాటు అన్ని సంఘాలు ప్రదర్శన నిర్వహించి కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోకెనేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మికుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్నారు.
ప్రభుత్వం వైఖరి కారణంగానే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. అనేక మంది ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేయాలని, న్యాయమైన కార్మికుల కోర్కెలను తీర్చాలని డిమాండ్ చేశారు. ముందుగా కార్మికులను చర్చలకు ఆహ్వానించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. అనంతరం నాయకులు తమ కార్యకర్తలతో కలిసి ఖమ్మం నగరంలో భారీ ప్రదర్శనను చేపట్టారు. డిపో వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. కాగా బంద్ సందర్భంగా ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండ ఎక్కడికక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
టీవీలో వార్తలు చూస్తూ
కుప్పకూలి మహిళ మృతి
కొణిజర్ల: తన బిడ్డల ఉపాధి పోతుందేమోనన్న బెంగతో ఓ తల్లి హఠాత్ మరణం చెందింది. ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని పెదగోపతి శివారు అనంతారం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన దామెర్ల అగ్నేష్ (70)కు నలుగురు కుమారులు. వీరిలో ఇద్దరు కుమారులు ఆర్టీసీ డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరభద్రం మధిర డిపోలో, రాఘవులు ఖమ్మం డిపోలో డ్రైవర్లుగా పని చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం గత పదిరోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం నిర్బంధం కొనసాగిస్తుండటంతో చలించిపోయిందని, తన కుమారులు ఎక్కడ అఘాయిత్యం చేసుకుంటారోనని బెంగతో గత రెండు రోజులుగా ముభావంగా ఉంటోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆవేశంలో ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడ వద్దని కుమారులకు ధైర్యంగా ఉండాలని చెప్పిందని కుటుంబ సభ్యులు వివరించారు. అదే సమయంలో హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న కండక్టర్ శంకర్ గౌడ్ మరణ వార్త టీవీలో విని అక్కడిక్కడే కుప్పకూలిపోయి మృతి చెందిందని తెలిపారు.
*చిత్రం... టీవీలో వార్తలు చూస్తూ కుప్పకూలి మృతి చెందిన వృద్ధురాలు