రాష్ట్రీయం

అనుసంధానంపై మరో అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: గోదావరి జలాలను కృష్ణనదికి తరలించడానికి దుమ్ముగూడెం వద్ద ఆనకట్ట నిర్మించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. గోదావరి జలాల తరలింపుపై ఇరు రాష్ట్రాల ఇంజనీర్ల కమిటీ చేసిన సిఫారసుపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సముఖత వ్యక్తం చేశారు. దుమ్ముగూడెం వద్ద ఆనకట్ట నిర్మించే అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేసి ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా ఇంజనీర్ల కమిటీకి ఇరువురు సీఎంలు ఆదేశించారు. హైదరాబాద్‌లో సోమవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ, విభజన అంశాలపై చర్చించడానికి కేసీఆర్, జగన్ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారుః సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన వీరి సమావేశం రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగింది. గోదావరి జలాలు కృష్ణకు తరలింపు, రాష్ట్ర విభజన అంశాలు, షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తుల పంపిణీ, ఆర్థిక మాంద్యం తదనంతర పరిణామాలు, కేంద్ర, రాష్ట్రాల తాజా రాజకీయ పరిణామలపై కూడా సీఎంల మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. గోదావరి జలాలను శ్రీశైలం రిజర్వాయర్‌కు తరలించి అక్కడి నుంచి రాయలసీమ, కృష్ణడెల్టాకు తరలించడానికి దుమ్ముగూడెం వద్ద ఆనకట్ట నిర్మించడమే ఉత్తమమైందిగా ఇంజనీర్ల కమిటీ అందజేసిన నివేదికతో ఇరువురు ఏకీభవించినట్టు తెలిసింది. దుమ్ముగూడెం వద్ద 40 టీఎంసీల సామర్ధ్యంతో ఆనకట్ట నిర్మించి అక్కడి నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు రోజుకు 2 టీఎంసీలు తరలించాలని కమిటీ సిఫారసు చేసింది. దుమ్ముగూడెంతో పాటు రాంపూర్, తుపాకులగూడెం వద్ద ఆనకట్ట నిర్మించే ప్రతిపాదనలు వచ్చినప్పటికీ నీటి లభ్యత, ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, భూసేకరణ తదితర కారణాలతో దుమ్ముగూడెం ఉత్తమైందిగా ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. గోదావరి జలాల తరలింపుపై ప్రతిపక్ష పార్టీలతో కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు శాసనసభలో తాను హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసినట్టు సమాచారం. విభజన అంశాలపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య విస్తృతంగా చర్చలు జరగడంతో త్వరలోనే పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇలా ఉండగా ఆర్థిక మాంద్యం వల్ల రాష్ట్రాలకు తగ్గనున్న కేంద్ర గ్రాంట్ల తగ్గుదలపై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఇరు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని సీఎంలు ఇద్దరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఇరువురూ అభిప్రాయపడినట్టు తెలిసింది. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం జగన్ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. సీఎం జగన్ వెంట టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రగతి భవన్‌కు వచ్చి చర్చల్లో పాలుపంచుకున్నారు.
*చిత్రం... హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సోమవారం సాయంత్రం సమావేశమైన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్