రాష్ట్రీయం

ఆర్టీసీ అప్పులు చెల్లిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెస్టెంబర్ 22: ఆర్టీసీకి ఉన్న అప్పులు త్వరలో చెల్లిస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. అయితే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తారా? లేదా అన్న అంశాన్ని చెప్పకుండా మంత్రి దాటవేశారు. ఆర్థిక మాంద్యం కారణంగా ఇప్పటికిప్పుడు ఆర్టీసీకి ఉన్న అప్పులు చెల్లించడానికి వీలుకాదన్నారు. తెలంగాణలో ప్రజా రవాణాలో అగ్రభాగాన ప్రజల మన్నలను పొందుతున్న ఆర్టీసీని ఆదుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఆదివారం మండలి సమావేశాల చివరి రోజున రాష్ట్ర ద్రవ్యబిల్లుపై జరిగిన చర్చల్లో మంత్రి పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీపై పైవిధంగా స్పందించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. నిరుద్యోగ భృతిపై అధికారులు కసరత్తు చేస్తున్నారని, నివేదిక వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి అమలు చేస్తామని సభకు హామీ ఇచ్చారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కేంద్రం ఏ మేరకు నిధులు విడుదల చేస్తుందో ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమన్నారు. ఆర్థిక మాంద్యంతో కేంద్ర బడ్జెట్‌లో లక్షా డెబ్భై కోట్లు తగ్గించిందన్నారు. ఏ మేరకు తగ్గుతుందో ఆ నిష్పత్తిలో రాష్ట్రానికి నిధులు విడుదల అవుతాయన్నారు. కేంద్రం ఇచ్చే నిధుల కోసం ఎదురు చూడకుండా సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే తెలంగాణ బడ్జెట్‌ను తగ్గించిన మాట వాస్తవం అన్నారు. 2019 ద్రవ్య బల్లును ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. ద్రవ్య బిల్లుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. విభజన తర్వాత గిరిజన జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని సభలో ఆయన గుర్తుచేశారు. గిరిజన రిజర్వేషన్ అంశంపై కేంద్రం వద్దకు పోవాల్సిన అవసరం లేదన్నారు.ఉత్తర తెలంగాణకు చెందిన వేలాది మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి వివిధ కారణాలతో మృత్యువాత పడుతున్నారన్నారు. కుటుంబాలకు అండగా ఉండాల్సిన వ్యక్తి మృతి చెండంతో ఆయా కుటుంబాలు అనాథలు అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రవాణా శాఖలో డ్రైవర్లు, కండక్టర్లకు మెకానికల్‌గా ఉద్యోగాలు ఇవ్వవచ్చునని ఆయన గుర్తు చేశారు మహాత్మా గాంధీ 150 జయంత్యుత్సవాల సందర్భంగా వివిధ కేసుల్లో జైల్లో ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఖైదీలకు క్షమాభిక్ష అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలన్నారు. ఉపాధ్యాయుల అర్హత పరీక్షలను (టెట్) నిర్వహించడంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో నిరుద్యోగులు తమ వయోపరిమితి దాటిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని జీవన్‌రెడ్డి మండలి దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్యబిల్లుకు తన మద్దతును జీవన్‌రెడ్డి ప్రకటించారు.
కౌలుదార్లను ఆదుకోవాలి: బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు
తెలంగాణలో కౌలు రైతులు 30 శాతం ఉన్నారని వారికి కూడా రైతుబంధు పథకం అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావుప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సమన్వయ కమిటీ ద్వారా కౌలు రైతులకు బ్యాంకుల నుంచి రుణాలను అందివ్వాలని ఆయన సూచించారు. అటవీ ప్రాంతాల్లో పోడు భూములు స్థానిక గిరిజనులకు పట్టాలు ఇవ్వాలన్నారు. అటవీ ప్రాంతల్లో స్థానికేతరులు ప్రభుత్వ అండచూసుకుని పోడు భూములను సాగు చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ యూనివర్సిటీల్లో పాలక మండళ్లు లేకపోవడంతో చదువులు ముందుకు సాగడంలేదన్నారు. వర్సిటీల్లో వీసీల నియామకంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. అందుకు మంత్రి హరీశ్‌రావు సమాధానం చెబుతూ వర్సిటీల్లో వీసీల నియామకాలు జరగకుండా బీజేపీ నేతలు కోర్టుల్లో కేసులు పెట్టారన్నారు. రాష్ట్రంలో అనేక వర్సిటీల్లో ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయన్నారు. మున్సిపల్ చట్టాల సవరణతో ఆయా మున్సిపాల్టీలకు మేలు జరుగుతుందో లేదా తెలియదుకాని మున్సిపల్ చట్టం సవరణతో ముస్లింలకు మేలు జరుగుతుందన్నారు. గతంలో ఇద్దరు పిల్లలకు మించి ఎక్కువ ఉంటే మున్సిపాల్టీల్లో పోటీ చేసే అర్హత కోల్పోయేవారన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన మున్సిపల్ చట్ట సవరణతో ముస్లింలకు అవకాశం కల్పించినట్లుగా ఉందని రామచందర్‌రావు ఎంఐఎం సభ్యుడు జాఫ్రీ నుద్దేశించి మాట్లాడారు. దీంతో సభ్యులు నవ్వులతో బల్లలు చరిచారు.
కేంద్రం తప్పదాలతోనే ఆర్థిక మాంద్యం: ప్రభాకర్
కేంద్ర ప్రభుత్వం అనాలోచిత చర్యలతో దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చిందని అధికార పార్టీ ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. కేంద్రం ఎవరితోనూ సంప్రదించకుండా 2016 డిసెంబర్‌లో నోట్ల రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు. అలాగే జీఎస్‌టీని రాష్ట్రాలపై మోపడంతో రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయానికి కేంద్రం గండికొట్టిందన్నారు. ప్లానింగ్ వ్యవస్థను మార్చి నీతి ఆయోగ్‌ను తీసురావడాన్ని ఆయన తప్పుపట్టారు.
ఉద్యోగుల సంగతేంటి: నర్సిరెడ్డి
తెలంగాణ ఆవిర్భావంతో ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయని ఎదురుచూచిన ఉద్యోగుల సంగతేంటని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. పీఆర్‌సీ, సీపీఎస్, ఐఆర్‌లను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఆయన ధ్వజమెత్తారు.
తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు రెండు లక్షల మంది ఉన్నారని, వారికి వేతనాలు పెంచే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? లేదా అంటూ మంత్రి హరీశ్‌రావును ప్రశ్నించారు. జర్నలిస్టులకు ఇస్తామన్న ఇళ్ల విషయాలను ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందో చెప్పాలని ఆయన మంత్రిని కోరారు. విద్యాశాఖలో ఖాళీ ఉన్న ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో సభకు చెప్పాలని మంత్రిని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.