రాష్ట్రీయం

తప్పిదానికి బాధ్యులెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 24: ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించతలపెట్టిన నవ్యాంధ్ర రాజధాని అమరావతి చుట్టూ రాజకీయ నీలినీడలు కమ్ముకున్నాయి. కొద్దిరోజులుగా రాజధాని తరలింపుపై జరుగుతున్న ప్రచారంతో రైతులు, ఈప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర విభజన తరువాత రాజధాని నిర్మాణంపై కేంద్రం నాడు నియమించిన శ్రీకృష్ణ కమిషన్ వివిధ ప్రాంతాల్లో పర్యటించి కొన్ని సిఫార్సులు చేయటం తెలిసిందే. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో పర్యటించి రాజధానికి అనువైన ప్రాంతాలను గుర్తించింది. అయితే రాష్ట్రానికి కేంద్రబిందువుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని 24 గ్రామాలతో పాటు మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని మరో నాలుగు గ్రామాలను కలుపుతూ 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా సింగపూర్ సంస్థలు మాస్టర్‌ప్లాన్ రూపొందించాయి. మొత్తం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో నగర నిర్మాణంతో పాటు 8386 కిలోమీటర్ల పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 33 మండలాలతో కలుపుకుని రాజధాని ప్రాంతం అభివృద్ధికి ముసాయిదా ప్రణాళిక సిద్ధమైంది. నగర నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా 33వేల 500 ఎకరాల భూములు అందించారు. వీటితోపాటు అటవీ, దేవాదాయ, అసైన్డ్ భూములతో కలుపుకుని మొత్తం 50వేల ఎకరాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొన్ని నిర్మాణాలను గత ప్రభుత్వం చేపట్టింది. విభజన అనంతరం పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ సొంత రాజధాని
ఏర్పాటుకు 2014 ఏప్రిల్‌లో క్యాపిటల్ రీజియన్ అథారిటీని నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భూసమీకరణ కింద రైతులిచ్చిన భూములకు సంబంధించిన లావాదేవీలన్నింటినీ సీఆర్‌డీఏ పర్యవేక్షించింది. రైతులకు ఏటా రూ. 30వేల నుంచి రూ. 50వేల వరకు కౌలు చెల్లించటంతో పాటు నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయించారు. రాజధాని నగర నిర్మాణంలో భాగంగా వివిధ జాతీయ విద్యాసంస్థల్ని కూడా అమరావతిలో నెలకొల్పారు. ఎయిమ్స్ లాంటి సంస్థలూ ఇక్కడే ఏర్పాటవుతున్నాయి. రాజధాని ప్రాంతం చుట్టూ 186 కిలోమీటర్ల పరిధిలో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, 27 టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఆర్థిక నగరంగా అమరావతితో పాటు రాజధాని ప్రాంతాన్ని సింగపూర్ మాస్టర్‌ప్లాన్ ప్రకారం నిర్మించటం ద్వారా 2029 నాటికి ప్రపంచ చిత్రపటంలో నిలపాలనేది నాటి ప్రభుత్వ ప్రతిపాదన. ఇందులోభాగంగా ప్రపంచ బ్యాంక్ రూ. 2వేల కోట్లకు పైగా రుణాలు అందించేందుకు ముందుకొచ్చింది. ఆసియన్ ఇన్‌ఫ్రా ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంక్ కూడా రుణ మంజూరుకు సుముఖత వ్యక్తం చేసింది. వివిధ దేశాలకు చెందిన సుప్రసిద్ధ సంస్థలతో గత ప్రభుత్వం ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. రాజధాని నగరంలో విద్యా, వైద్య, సాంస్కృతిక, చారిత్రక, న్యాయ నగరాల వంటి ‘నవ నగరాల’ నిర్మాణంతో పాటు జోనల్ ప్లాన్‌ను అభివృద్ధి చేయడం ద్వారా రానున్న 15ఏళ్లలో 35లక్షల మందికి ఉపాధి కల్పన జరిగేలా మాస్టర్‌ప్లాన్ నిర్దేశించింది.
తుళ్లూరు ప్రాంతంలో రాజధాని నగర నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న కొండవీటి వాగు ముంపు ప్రమాదం ఉందని, భూకంపాల జోన్ 3 పరిధిలో ఉన్నందున ఇక్కడ ఏర్పాటు చేయటం సహేతుకం కాదని వాదిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో అప్పట్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీనిపై సీఆర్డీఏ కొన్ని వివరణలు ఇచ్చింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు 500 కిలోమీటర్ల పరిధిలో ఇక్కడే రాజధాని నిర్మాణం శ్రేయస్కరమని నాటి ప్రభుత్వం వాదించింది. అంతేకాదు పాలనాపరమైన చిక్కులు ఎదురుకావటంతో హైదరాబాద్ నుంచి 2016 ఏప్రిల్‌లోనే కార్యాలయాల తరలింపును చేపట్టింది. 2017 మార్చిలో వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, శాసనసభ నిర్మాణాలు పూర్తికావటంతో మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగం యావత్తునూ అమరావతికి తరలించారు. ఈ ప్రాంతంలోనే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులు, న్యాయమూర్తుల నివాస భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. తాత్కాలిక హైకోర్టు కూడా ఇక్కడే ఏర్పాటైంది. రాజధాని నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత మూడేళ్ల క్రితం ఎకరం రూ. 2కోట్ల పైచిలుకు ధర పలికింది. భూసమీకరణ రైతులకు నివాస, వాణిజ్య ప్లాట్ల ధర కూడా పెరిగింది. ప్రపంచ నగరంగా రూపుదిద్దుకుంటే తమకు బంగారు భవిష్యత్ ఉంటుందని భావించారు.
ఈలోగా గత ఎన్నికల్లో ప్రభుత్వం మారటంతో రాజధాని నగర నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. రాజధాని అభివృద్ధి ఒకే ప్రాంతంలో జరిగితే హైదరాబాద్‌ను వదులుకోవటం ద్వారా జరిగిన నష్టం పునరావృతం అవుతుందని వైసీపీ ప్రభుత్వం గుర్తుచేస్తోంది. వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. గత నెలరోజులుగా ఇందుకు కసరత్తు జరుగుతోంది. పాలనాపరమైన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ కీలక సంస్థలను వివిధ ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కొండవీటి వాగు ముంపు నేపథ్యంలో ఇకపై నిర్మాణాలను మంగళగిరితో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలో చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాజధాని గ్రామాలు కొండవీటి వాగు ముంపుబారిన పడకుండా గత ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలోకి వరద నీటిని కలిపేందుకు ఎత్తిపోతల నిర్మాణం చేపట్టింది. ఈ పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో ఇటీవల వచ్చిన వరదల వల్ల కొండవీటి వాగు పొంగి ప్రవహించి రాజధాని గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. దీంతో అమరావతిని పాలనా నగరంగానే కొనసాగిస్తూ అభివృద్ధిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వటం ద్వారా ప్రాంతీయ వాదాలకు స్వస్తి చెప్పాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. కర్నూలులో హైకోర్టు బెంచి డిమాండ్ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. ఈనేపథ్యంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖను ఐటీ హబ్, ప్రకాశం జిల్లా దొనకొండలో పారిశ్రామిక హబ్, దేవాదాయ శాఖ అనుబంధ విభాగాలను తిరుపతికి తరలించి టెంపుల్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. రాయలసీమ ప్రాంతంలో ఆటోమొబైల్ హబ్‌తో పాటు కడపలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణాలు జరిగితే రాష్ట్రం మొత్తంగా సమగ్ర అభివృద్ధి సాధించవచ్చనేది ప్రభుత్వ భావన. ఇందుకోసం ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. నిపుణుల సూచనలు, సలహాలతో మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిపి తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ప్రభుత్వ నిర్ణయం వల్ల రాజధాని మనుగడకే ముప్పు వస్తుందనే ఆందోళన నెలకొంది. ముందుగా కొండవీటి వాగు ముంపును నియంత్రించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌ను పూర్తిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రముఖ సంస్థలన్నీ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లోనే ఏర్పాటవుతున్నందున పూర్తిస్థాయిలో రాజధాని నిర్మాణాలు జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని తరలింపు యోచనతో అమరావతిలో పూర్తిస్థాయిలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఏటా మూడు పంటలతో ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైతుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ప్రపంచ స్థాయిలో అభివృద్ధిని కాంక్షించి స్వచ్ఛందంగా భూములిచ్చి నిలువునా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలకు తమను బాధ్యుల్ని చేయటం సమంజసం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజధాని తరలింపు నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నాయి.