రాష్ట్రీయం

మానవ తప్పిదంతోనే వరద ఉపద్రవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 23: కృష్ణా వరదల కారణంగా రాష్ట్రంలో కలిగిన నష్టం నూటికి నూరుశాతం మానవ తప్పిదమేనని, దీనిలో ఎటువంటి సందేహం లేదని, తరచి చూస్తే ప్రభుత్వ ఉద్దేశపూర్వక విపత్తేనని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టీఆర్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వరద విపత్తు అంశాన్ని వివరించారు. వాతావరణ హెచ్చరికలకు సంబంధించి ఎప్పటికప్పుడు రియల్‌టైమ్‌లో ఇస్రో, ఎన్‌ఎండీ, సీడబ్ల్యుసీ, కేంద్రం నుంచి సమస్త సమాచారం రాష్ట్రప్రభుత్వానికి అందినప్పటికీ సకాలంలో వైసీపీ ప్రభుత్వం స్పందించలేదని, దీంతో తీవ్ర నష్టం సంభవించిందన్నారు. సమర్థవంతమైన చర్యలు తీసుకోవడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఆరు నియోజకవర్గాల్లోని 19 గ్రామాల్లో రెండు రోజుల పాటు తాను పర్యటించి వరద బాధితుల కష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించానన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా హృదయ విదారక సంఘటనలే కనిపించాయని, లంక గ్రామాల్లో 53 వేల ఎకరాల్లో పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.
ఆల్మట్టి నుండి నారాయణపూర్‌కు మధ్య 72 కిలోమీటర్ల దూరం ఉందని, ఈ దూరాన్ని దాటాలంటే 12 గంటల సమయం పడుతుందన్నారు. అక్కడి నుండి జూరాలకు 185 కిలోమీటర్లు దాటేందుకు 30 గంటలు, అక్కడి నుండి శ్రీశైలంకు 210 కిలోమీటర్లు చేరేందుకు మరో 30 గంటలు, అక్కడి నుండి నాగార్జున సాగర్‌కు 122 కిలోమీటర్లు చేరేందుకు 12 గంటలు చొప్పున సమయం పడుతుందన్నారు. సాగర్ నుండి ప్రకాశం బ్యారేజీకి 188 కిలోమీటర్లని, ఈ ప్రయాణానికి 24 గంటలు పడుతుందని అధికారులే అంచనా వేశారన్నారు. వరద ఉద్ధృతిని బట్టి కాస్త అటు ఇటుగా ఆల్మట్టి ప్రాజెక్టు నుండి ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం చేరాలంటే నాలుగున్నర రోజులు పడుతుందని నిపుణుల నివేదికలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం వద్ద ఈ వివరాలన్నీ స్పష్టంగా ఉన్నాయని, వీటిని ఎప్పటికప్పుడు పరిశీలించి కార్యాచరణ ప్రకారం ముందుకెళ్లినట్లయితే ఇంత నష్టం జరిగేదా అని ప్రశ్నించారు. జూలై 29 నుండి ఆగస్టు 12వ తేదీ వరకు 15 రోజుల పాటు సమయం ఉన్నప్పటికీ వరద నియంత్రణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఆగస్టు 3న శ్రీశైలంకు ఇన్‌ఫ్లో ప్రారంభమైనా అవుట్ ఫ్లో వదలలేదని, ఆగస్టు 12న నాగార్జున సాగర్‌కు 6 లక్షల క్యూసెక్కులు వదిలారని, 11న 3 లక్షల క్యూసెక్కులు, 12న 6 లక్షల క్యూసెక్కుల చొప్పున శ్రీశైలం నుండి వదిలితే రెండు రోజులకు కలిపి నాగార్జున సాగర్ నుండి కేవలం 60 వేల క్యూసెక్కులు మాత్రమే కిందకు వదిలారన్నారు. ఆగస్టు 13న పులిచింతలకు 2,64,798 క్యూసెక్కుల చొప్పున ఇన్‌ఫ్లో ఉంటే అదే రోజు కేవలం 91 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో మాత్రమే వదిలారని గుర్తుచేశారు. నాగార్జున సాగర్, పులిచింతల నుండి అకస్మాత్తుగా ప్రకాశం బ్యారేజీ మీదకు నీటిని వదిలేశారని, ప్రకాశం బ్యారేజీ నుండి 2.50 లక్షల క్యూసెక్కుల చొప్పున అదనంగా ఉద్ధృతంగా వదిలినందునే లంక గ్రామాలన్నీ వరద ముంపునకు గురయ్యాయని చంద్రబాబు వివరించారు. కృష్ణా వరదల్లో ప్రజలకు చేసిన ఈ నష్టం ప్రభుత్వం చేసిన దుర్మార్గపు చర్య అని, కాబట్టి దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. నా ఇంటికి నోటీసు అంటించడంపై చూపే శ్రద్ధ, నా ఇంటిపై డ్రోన్‌లు ఎగురవేయడంపై చూసే ఆసక్తి వరద బాధితులకు కాపాడటంపైనా, పంటలను రక్షించడంపైనా చూపితే ఇంతనష్టం జరిగేది కాదన్నారు. వరదల నుంచి ప్రజల దృష్టికి మళ్లించేందుకే రాజధానిని మారుస్తామని మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాజధానికి ముంపు ప్రమాదం ఉందని దుష్ప్రచారం చేశారన్నారు. గత నెలలో గోదావరి వరద భీభత్సంలో నష్టపోయిన రైతులను కూడా ఆదుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వలన 309 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిందని, ఈ నీటిని రాయలసీమకు ఎందుకు తీసుకెళ్ల లేకపోయారని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు నీటి విడుదలలో తెలంగాణ ప్రభుత్వం కెఆర్‌ఎంబికి ఫిర్యాదు చేసిందని, రీడింగులకు, డిస్‌ఛార్జ్‌లకు మధ్య తేడాలున్నాయని బోర్డుకు అభ్యంతరం చెప్పిన మాట వాస్తవం కాగా అంటూ నిలదీశారు.
సముద్రంలోకి వృధాగా వెళ్తున్న నీటిని రాయలసీమకు మళ్లిస్తే కూడా ఫిర్యాదు చేస్తే ఏ విధంగా చూడాలని ప్రశ్నించారు. అలాంటిది తెలంగాణ భూభాగంలో నీళ్లు నడిపి ఏపీకి నీళ్లు ఇస్తామంటే ఎలా నమ్మాలంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. విలేఖర్ల సమావేశంలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, అశోక్‌బాబు, అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ దాడులను
సంఘటితంగా ఎదుర్కొందాం
పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు
రాష్టవ్య్రాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రధానంగా గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతల దాడులు మితిమీరాయని, వీటిని అడ్డుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పాల్పడుతున్న అరాచకాలు, దౌర్జన్యాలను నిలువరించేందుకు సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని, కార్యకర్తలకు అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉందని నేతలకు నిర్దేశించారు. శుక్రవారం గుంటూరులోని టీడీపీ కార్యాలయానికి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ నాయకులు పోలీసుల అండతో గ్రామాల్లో ఉండకుండా తమను వెళ్లగొడుతున్నారని చంద్రబాబు ఎదుట పలువురు కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై స్పందించిన చంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రోత్సాహంతో వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా చేస్తున్న దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు అన్ని స్థాయిల్లో టీడీపీ నాయకత్వాన్ని పటిష్టపరుస్తున్నామన్నారు. అహంభావంతో వ్యవహరిస్తున్న జగన్ మెడలు వంచి, దేశం కార్యకర్తలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలను కాపాడిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. 37 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన టీడీపీ ఎన్నో సంక్షోభాలను, సంక్లిష్ట పరిస్థితులను అధిగమించి నిలబడిందన్నారు. జగన్ దుష్ట పాలనను నిలువరించడంలో కార్యకర్తలకు అండగా ఉండేందుకు అవసరమైతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని భరోసా కల్పించారు. నాయకులంతా కలిసి దాడులు జరిగే ప్రాంతాలకు వెళితే వైసీపీ రౌడీమూకలు తోక ముడుస్తాయన్నారు. శాసనసభ్యులు లేని నియోజకవర్గాల్లో ముగ్గురు సభ్యులతో కమిటీని నియమిద్దామని, ఈ కమిటీలో దాడులను సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడే వ్యక్తులకు అవకాశం ఇద్దామని చంద్రబాబు తెలిపారు.