రాష్ట్రీయం

రాజధానిపై సీఎం వైఖరి స్పష్టం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 23: గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతికి మూడు పంటలు పండే భూములు ఇచ్చిన రైతులు తాజాగా మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలతో ఆందోళనకు గురవుతున్నారని, రాజధాని విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తమ వైఖరి స్పష్టం చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటం లేదని విమర్శించారు. గతంలో రాజధాని అమరావతికి జగన్ అంగీకరించారని, అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కొందరి కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కన్పిస్తోందని ఆరోపించారు. శుక్రవారం టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు ఆధ్వర్యాన రాజధాని పరిధిలోని ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, తుళ్లూరు, వెంకటపాలెం తదితర గ్రామాల రైతులు గుంటూరు నగరంలోని కన్నా స్వగృహానికి చేరుకుని తమ సమస్యలను వివరించారు. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తమను ఆందోళనకు గురిచేశాయన్నారు. ఈ విషయమై సీఆర్‌డీఏ అధికారులను కలిసినా తమకు స్పష్టత రాలేదని పేర్కొన్నట్లు రైతులు తెలిపారు. రాజధానిని అమరావతి నుండి మార్చకుండా చూడాలని కన్నాకు విజ్ఞప్తిచేశారు. రాజధానికి వరద వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దేశంలో చాలా రాజధానులు నదులు, సముద్రాల పక్కన ఉన్నాయని, నదీ తీరంలో రాజధాని ఉండటం మనకు సానుకూల అంశమని వారు వివరించారు. స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధానికి ఇప్పటికే వేలాది కోట్లు ఖర్చయ్యాయని, రాజధాని ఇక్కడ ఉండాలన్నదే తమ భావన అని స్పష్టంచేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా బీజేపీ అండగా నిలుస్తుందని, త్వరలోనే రాజధాని ప్రాంతంలో మీతో కలిసి నడుస్తామని కన్నా రైతులకు భరోసా ఇచ్చారు.
అన్ని మతాలను గౌరవించాలి..
తిరుమలలో అన్యమత ప్రచారంపై కన్నా స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో అన్ని మతాలను గౌరవించాలని, ప్రభుత్వం ఓ మతాన్ని ప్రముఖంగా ప్రచారం చేయడం సరికాదన్నారు. ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయని వాటిని గౌరవించాలని కన్నా సూచించారు.