రాష్ట్రీయం

అవినీతి రహితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 18: అవినీతి, లంచగొండితనం ఊసే లేని రాష్ట్రాన్ని చూడాలన్నది తన కల అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. ‘నాకొక కల ఉంది’.. అని చెప్పిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మాటలు తనకు స్ఫూర్తిదాయకమన్నారు. అమెరికాలోని డల్లాస్‌లో ప్రవాసాంధ్రులతో భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుఝామున 4.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నం పెడుతున్న రైతు ఆకలి బాధతో కనుమూయకూడదనీ, ఏ ప్రభుత్వ పథకమైనా లంచం, వివక్ష లేకుండా పేదవాడికి అందుబాటులోకి రావాలన్నదీ తన కల అంటూ వివరించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి కాల్వల ద్వారా సాగునీరు అందించాలన్నది తన కల అన్నారు. పల్లెలు కళకళలాడాలని, అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువులు ఉండాలని, వైద్యం ఖర్చు భరించలేక చనిపోయే పరిస్థితి పేదవాడికి రాకూడదని, పేదరికం వల్ల తల్లి తన బిడ్డలను చదివించలేని స్థితి ఉండకూడదన్నది తన కల అని చెప్పారు. పాలకులు మనసు పెడితే చేయలేనిది ఏదీ లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమ్మఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. మహాత్మా గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, మద్యపాన నిషేధం, బెల్టుషాపుల మూసివేత, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ వంటివి అమలు చేయాలని నిర్ణయించామన్నారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేశామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో న్యాయసమీక్ష చేపట్టాలని నిర్ణయించామన్నారు. దేశంలో కనీవినీ ఎరుగని విధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తున్నామని చెప్పారు. అవకాశం ఉన్నా గత ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయలేదని, 13నెలలుగా విద్యుత్ పంపిణీ సంస్థలకు బిల్లులు చెల్లించలేదన్నారు. దాదాపు 20వేల కోట్ల రూపాయలు బకాయి పడిందన్నారు. కనీసం ఏడాదికి ఒకటి,
రెండుసార్లైనా రాష్ట్రానికి రావాలని ప్రవాసాంధ్రులను ఆయన కోరారు. ప్రభుత్వం, ప్రవాసాంధ్రులు కలిపి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఒక పోర్టల్ ప్రారంభిస్తున్నామని, ఇది నేరుగా సీఎంవోతో అనుసంధానమై ఉంటుందన్నారు. ఎవరైనా ప్రవాసాంధ్రులు పెట్టుబడులు పెట్టాలనుకుంటే పోర్టల్ ద్వారా చెప్పవచ్చన్నారు. పోర్టల్ పర్యవేక్షణకు ఒక అధికారిని నియమిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వివరించారు.
చరిత్రను మార్చే దిశగా అడుగులు
మొన్నటి ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు పోషించిన పాత్ర చాలా గొప్పదని ముఖ్యమంత్రి ప్రశంసించారు. చారిత్రక విజయం వెనుక మీ కృషి ఉందన్నారు. మీ ప్రేమకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. అమెరికన్లను మించి భారతీయులు, తెలుగువారు ఎదుగుతున్న తీరు గర్వకారణమన్నారు. అమెరికా అభివృద్ధి వెనుక తెలుగువారి కృషి ఉందని స్వయంగా ఆ దేశాధ్యక్షుడే చెప్పారని గుర్తుచేశారు. మాతృభూమిని మీరు గౌరవిస్తున్న తీరు చూసి ముచ్చటేస్తోందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం పెంచేలా తమ రెండున్నర నెలల పాలనలో విప్లవాత్మక చర్యలు చేపట్టామన్నారు. చరిత్రను మార్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఆర్థికం, రాజకీయం, సామాజికంగా ప్రతి మనిషి, ప్రతి కుటుంబ గౌరవాన్ని పెంచేలా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లో 19 బిల్లులు తీసుకొచ్చామని ఆయన ఉదహరించారు. మన సోదర రాష్ట్రం తెలంగాణతో సఖ్యత పెంచుకుంటున్నామని, సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టు ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు రెడ్‌కార్పెట్ వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి అనుకూల వాతావరణం కల్పించామన్నారు. పారిశ్రామిక రంగంలో భారీ పెట్టుబడులు వచ్చేలా నిజాయతీతో కూడిన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇది మీ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోవాలని, రాష్ట్రానికి రావాలని ప్రవాసాంధ్రులను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆహ్వానించారు.
చిత్రం...
డల్లాస్‌లో జరిగిన ప్రవాసాంధ్రుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి