రాష్ట్రీయం

యాదాద్రి పనుల్లో వేగం పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 17: ప్రపంచం అబ్బురపడే రీతిలో అద్భుత శిల్పకళతో నిర్మితమవుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా ఆలయం స్వయంభూ దర్శనాలను భక్తులకు కల్పించేందుకు వీలుగా మూడు నెలల్లో ప్రధానాలయం పనులు పూర్తి చేయాలని, ఫిబ్రవరిలో శ్రీ మహాసుదర్శన నారసింహ సహాస్ర కుండాత్మక యాగం నిర్వహించనున్నందున, అప్పటిలోగా ఆలయం అభివృద్ధికి సంబంధించి అన్ని పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. శనివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో నాలుగు గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా నిర్మితమవుతున్న యాదాద్రి సందర్శనకు భవిష్యత్తులో నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తారని భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రధానాలయం నిర్మాణంతో పాటు వౌలిక వసతుల అభివృద్ధి చేయాల్సివుందన్నారు. ఆలయ పునర్ నిర్మాణం మాత్రమే జరుగుతున్నందున, ప్రత్యేకంగా ప్రారంభోత్సవం ఉండబోదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో శ్రీ మహాసుదర్శన నారసింహహోమాన్ని నభూతో నభవిష్యత్ అన్న రీతిలో చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని, 45దేశాల నుండి మూడు వేల మంది రుత్విక్‌లు, మూడువేల మంది వేద పారాయణాలు, మూడువేల మంది సహా వేద పండితులతో 1048 కుండలతో సుదర్శన యాగం జరుగనుందన్నారు. యాగానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు, గవర్నర్లు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశవిదేశీ ప్రముఖులు హాజరవుతారని అప్పటిలోగా ఆలయ అభివృద్ధి పనులతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన పనులన్ని తుది దశకు చేర్చాలని ఆదేశించారు. ముఖ్యంగా కాటేజీలు, ప్రెసిడెన్షియల్ సూట్స్ నిర్మాణాలను మూడునెలల్లో పూర్తి చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. టెంపుల్ సిటీలో 250కాటేజీలు నిర్మించాలని ఇందుకు 400కోట్ల విరాళాలు అందించేందుకు కార్పొరేట్ సంస్థలు, దాతలు సిద్ధంగా ఉన్నాయని, వెంటనే డీజైన్‌లు రూపొందించి పనులు వేగవంతం చేయాలని ఆర్‌ఆండ్‌బీ శాఖను ఆదేశించారు. ఇప్పటికే టెంపుల్ సిటీలో వౌలిక వసతుల కల్పనకు 103కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రధానాలయ పునరుద్ధరణకు ఇప్పటిదాకా 235 కోట్లు రూపాయలు ఖర్చు చేశామని, భూసేకరణ, రహదారులు, టెంపుల్ సిటీ, మున్సిపాల్టీ అభివృద్ధి, భక్తుల వసతుల కల్పనకు రూ. 692 కోట్ల వ్యయం జరిగిందన్నారు. రూ. 145 కోట్లతో కొండ చుట్టు నిర్మించనున్న గిరిప్రదక్షిణ, నాలుగులైన్ల రింగురోడ్ల నిర్మాణాల పనుల్లో భాగంగా భూసేకరణ పూర్తి చేసి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఇందుకు 54 కోట్ల రూపాయలను
తక్షణమే విడుదల చేస్తామన్నారు. కొండకు వచ్చి వెళ్లే రహదారుల విస్తరణ పనులన్ని పూర్తి చేయాలని, కొండ దిగువన ప్రస్తుత బస్టాండ్, బస్ డిపోలను మరోచోటికి తరలించే పనులు చేపట్టాలన్నారు. ఆలయ నిర్మాణంతో అన్ని శాఖల పరిధిలో చేపట్టాల్సిన పనులకు తక్షణమే ఆర్ధిక శాఖ కార్యదర్శితో చర్చించి నేడు 430 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయిస్తామన్నారు. గంథమల్ల, బస్వాపురం రిజర్వాయర్లను మైసూర్ బృందావన్ గార్డెన్ తరహాలో అభివృద్ధి చేసే పనులు చేపట్టాలని, హరిత హోటల్స్, రెస్టారెంట్లు, బోటింగ్ వసతితో ఆహ్లాద కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఇందుకోసం ముందుగా రిజర్వాయర్‌ల పనులు చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టుతో నింపేందుకు నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. యాదాద్రి కొండ చుట్టూ, నవగిరుల చుట్టు ఉన్న చెరువులను సుందరీకరించాలని సూచించారు.
తొమ్మిది గంటల పాటు యాదాద్రిపైనే సీఎం కేసీఆర్
*నాలుగు గంటలు కొనసాగిన సమీక్ష
సీఎం కేసీఆర్ శనివారం ఉదయం 11గంటలకు యాదాద్రికి చేరుకుని ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన, పనుల పురోగతి సమీక్షలు సాగిస్తు రాత్రి 8గంటల వరకు మొత్తం తొమ్మిది గంటల పాటు కొండపైనే ఉన్నారు. యాదాద్రికి చేరుకున్న కేసీఆర్ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జి.జగదీష్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్‌లతో కలిసి ముందుగా కొండచుట్టు నిర్మించతలపెట్టిన నాలుగులైన్ల రింగురోడ్డు, గిరిప్రదక్షిణదారుల నిర్మాణ ప్రాంతాలను, రాయగిరి చెరువును పరిశీలించారు. అనంతరం కొండపైకి చేరుకుని నేరుగా బాల ఆలయంలోకి వెళ్లి లక్ష్మీనరసింహులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్ నిర్మాణ పనులను కీసీఆర్ రెండుగంటలకుపైగా ఆలయం చుట్టు అడుగడుగు కలియతిరిగి పరిశీలించారు. ఆలయ ప్రాకారాలు, మాడవీధులు, గోపురాలు, శిల్పాలు, అంతరాలయం, గర్భాలయం నిర్మాణ పనులను, నూతన శివాలయం నిర్మాణ పనులను, పుష్కరిణి నిర్మాణాలను పరిశీలించారు. వెంట ఉన్న స్థపతులు, అర్కిటెక్ట్, సంబంధిత శాఖల అధికారులకు అక్కడికక్కడే సూఛనలిస్తు సాగారు. ఆగమశాస్త్రానుసారం ఆలయ నిర్మాణ పనులు కొనసాగించాలని పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, విద్యుత్ శాఖల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తు ప్రత్యేకాధికారులను నియమించి పనులు నెలరోజుల్లో పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. కొండ దారుల్లో విద్యుత్ స్తంభాల తొలగింపు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంపుల్ సిటీలో కాటేజీల నిర్మాణాలను మూడునెలల్లో పూర్తి చేయాలని ఆర్‌ఆండ్‌బీ శాఖను ఆదేశించారు. మిషన్ భగీరథలో యాదాద్రికి ప్రత్యేక పైప్‌లైన్‌లు వేయాలన్నారు. గర్భాలయం ఎదురుగా ఉన్న పీఠాల ఎత్తును తగ్గించాలని సూచించారు. కొండపైన ఆలయ సమీపంలో సంప్ నిర్మాణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెప్పోత్సవం నిర్వహించే గండి చెరువు అభివృద్ధి పనులు చేపట్టాలని, కొండపై కల్యాణకట్టాలు, దుస్తులు మార్చుకునే గదులు, కొండదిగువన ఆటోస్టాండ్, పార్కింగ్, ఫైర్ స్టేషన్, పోలీస్ ఔట్‌పోస్టు, అన్నదాన సత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పునరుద్ధరణ పిదప కొండపైకి భక్తులను బస్సుల్లోనే చేర్చాలని గుట్టపై బస్ బేస్ నిర్మించాలన్నారు. అనంతరం కలెక్టర్ అనితారామచంద్రన్, సీఎంవో భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ జీ. కిషన్‌రావు, ఈవో గీత, ఆర్కిటెక్ట్ ఆనందసాయి, స్థపతి వేలు, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహించి శాఖల వారిగా పనుల పురోగతిని సమీక్షించి అవసరమైన ఆదేశాలిచ్చారు.
చిత్రం... యాదాద్రిలో శనివారం ఆలయ పునరుద్ధరణ పనులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్