రాష్ట్రీయం

ఏరులైన ఊళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 17: కృష్ణానదీ పరివాహక లంక గ్రామాలు ఏర్లను తలపిస్తున్నాయి.. వరదనీరు చుట్టుముట్టడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో జన జీవనం స్తంభించింది. గత మూడు రోజులుగా వ్యవసాయ, ఉద్యానవన పంటలు నీట నానుతున్నాయి. శనివారం మధ్యాహ్నానికి ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు 7లక్షల 78వేల 223 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, సాయంత్రానికి వరద ప్రవాహం కొంచెం తగ్గు ముఖం పట్టింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక దళాలు వరద సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. కృష్ణా జిల్లాలో 41 పునరావాస కేంద్రాల్లో 10వేల మంది, గుంటూరు జిల్లాలోని 15 కేంద్రాల్లో 5వేల మంది, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 13 పునరావాస కేంద్రాల్లో 4వేల 176 మంది ఆశ్రయం పొందుతున్నారు. రెండు జిల్లాల్లో వెయ్యికి పైగా గృహాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరో నాలుగువేల ఇళ్లలో వరద నీరు ప్రవహిస్తోంది. ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారం కృష్ణాజిల్లాలో 2839 హెక్టార్లలో, గుంటూరు జిల్లాలో 2472 హెక్టార్లలో వ్యవసాయ పంటలు నీట నానుతున్నాయి. రెండు జిల్లాల్లో రెండువేల హెక్టార్లకు పైగా ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. కూరగాయలు, పండ్ల తోటల రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 20 హెక్టార్లలో పట్టు పరిశ్రమ దెబ్బతింది. అధికార యంత్రాంగం నిర్వాసితులకు ఆహార పొట్లాలు, మంచినీరు అందజేస్తున్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా రెండు జిల్లాల్లో 54 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లాలోని 18 మండలాల్లో 24 గ్రామాలు, గుంటూరు జిల్లాలోని 14 మండలాల్లో 12 గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. వరద తగ్గుముఖం పట్టటంతో పునరావాస కేంద్రాలకు తరలివచ్చేందుకు లంక గ్రామాల ప్రజలు నిరాకరిస్తున్నారు. ఇదిలా ఉండగా అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరద పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయ కార్యక్రమాల్లో ఎలాంటి జాప్యం జరగరాదని ఆదేశించారు. ఆయనకు సీఎంఒ అధికారులు నివేదిక పంపారు. ముంపు ప్రాంతాల్లో చేపడుతున్న సహాయ చర్యలను సమీక్షించారు. ఎక్కడైనా గండ్లు పడితే యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలని ప్రజలకు అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని సూచించారు. అవసరమైతే పొరుగు జిల్లాల నుంచి బోట్లు తెప్పించాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పంటల పరిస్థితిని అధికారులు వివరించారు. ఇప్పటి వరకు వరద కారణంగా రెండు జిల్లాల్లో ఇరువురు మృతి చెందారని సీఎం దృష్టికి తెచ్చారు. ప్రాణనష్టం జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం ఆదేశించారు.

చిత్రం... వరద నీటిలో విజయవాడలోని శివారు ప్రాంతం