రాష్ట్రీయం

ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 15: ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. గురువారం రాత్రి 9 గంటల సమయానికే మొత్తం 70 గేట్లను పూర్తి సామర్థ్యం మేర తొమ్మిది అడుగుల మేర పైకి ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు పూర్తి సామర్థ్యం మేర 9 అడుగులను పైకి ఎత్తి వేయటంతో బ్యారేజీ, వారధి దిగువన చూస్తే ఎక్కడ గేట్లు ఉన్నాయో కూడా తెలియని స్థితి నెలకొంది. దశాబ్దం క్రితం కన్పించిన ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు జనం వేల సంఖ్యలో వాహనాలపై వచ్చి తిలకిస్తూ ఫొటోలు దిగుతున్నారు. దీని వల్ల అడుగడుగున ట్రాఫిక్ స్తంభిస్తుండటంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకే పోలీసులు నానా హైరానా పడుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి నాలుగున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వెళుతోంది. నాగార్జున సాగర్ నుంచి 7.45 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలటంతో పులిచింతల నుంచి ఐదున్నర లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదలుతున్నారు. శుక్రవారం తెల్లవారుజాము సమయానికి కనీసం ఆరున్నర లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకోగలదని భావిస్తూ కృష్ణాజిల్లాలోని నదీ పరివాహక ప్రాంతం మొత్తంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుండగా నదీ పరివాహక ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి, ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో పర్యటిస్తూ తమ ప్రాంత ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నారు.
వారధి, బ్యారేజీల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్
విజయవాడ కనకదుర్గ వారధి, ప్రకాశం బ్యారేజీల వద్ద గురువారం అటు ఇటు దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. కనీసం నాలుగు గంటల పాటు వాహన చోదకులు పడరాని పాట్లు పడ్డారు. ఓ వైపు సందర్శకుల తాకిడి, మరో వైపు వారధిపై లారీ ప్రమాదానికి గురికావటంతో కృష్ణలంక, తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాల్లో వందలాది వాహనాలు నిలిచాయి. ఓ దశలో పోలీసులు సైతం చేతులెత్తేశారు. బెంజిసర్కిల్ నుంచి వారధి వరకు ఒక ఫేజ్, బస్‌స్టేషన్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సెకండ్ ఫేజ్‌లో ట్రాఫిక్ జామ్ అయితే ఆర్టీసీ బస్సులు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. ప్రయాణికులు కాలిబాట పట్టారు.
చిత్రం...విజయవాడ వద్ద రైలు వంతెనను తాకేలా ప్రవహిస్తున్న కృష్ణమ్మ