రాష్ట్రీయం

ప్రతి రూపాయికీ జవాబుదారీతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో స్వాతంత్య్రం అనే పదానికి ప్రతి రూపంగా పరిపాలన సాగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా పరిపాలన అందించాలనే దృఢ సంకల్పంతో పాలన సాగిస్తున్నామన్నారు. సమాజంలో నిస్సహాయుల కన్నీటి బొట్టును తుడవడమే తన కర్తవ్యమన్నారు. ఎందరో దేశ భక్తుల త్యాగాల ఫలితం మన స్వాతంత్య్రమని, వారందరికీ శిరస్సు వంచి ప్రమాణాలు చేస్తున్నానన్నారు. మన మూడు రంగుల జాతీయ పతాకానికి రూపకల్పన చేసిన విజయవాడ వాసి పింగళి వెంకయ్యకు మనందరి గుండెల్లో గొప్ప స్థానం ఉంటుందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం అంటే ఆగస్టు 15వ తేదీన జెండాకు వందనం చేయడం, నినాదాలు ఇవ్వటం కాదని, అది ప్రభుత్వ విధానం కావాలన్నారు. ప్రతి రూపాయికి జవాబుదారీతనం ఉండాలన్న సంకల్పంతో మొత్తం టెండరింగ్ పద్ధతిలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. జ్యుడీషియల్ సమీక్ష ద్వారా టెండర్ పనుల ఖరారు ప్రక్రియను
హైకోర్టు జడ్జి ముందు పెడుతూ ఆయన నిర్ణయమే తుది నిర్ణయంగా మారుస్తూ దేశ చరిత్రలోనే తొరిసారిగా టెండర్ల ప్రక్రియలో అత్యుత్తమ విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర అభివృద్ధి సౌధాన్ని నాలుగు పునాదుల మీద నిలబెట్టేలా ప్రణాళిక రూపకల్పన చేశామన్నారు. వౌలిక సదుపాయాల్లోనూ, పరిశ్రమలలో భారీగా పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు.
రైతుల సంక్షేమమే ధ్యేయం
రైతు అప్పుల్లో మునిగితేలుతుంటే జీడీపీలో వ్యవసాయం వాటా పెరిగిందన్న లెక్కలు చెప్పటం వారిని అవమానించటమే అవుతుందని, రైతు ఆనందం, రైతు ఆదాయం కోసం ఏం చేయాలనే ఆలోచనలతో అనేక చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ఏడాది బ్యాంకుల నుండి రూ. 84వేల కోట్లు పంట రుణాలుగా అందిస్తున్నామని, పంట రుణాలు సకాలంలో తిరిగి చెల్లిస్తే ఆ రుణాలపై వడ్డీ ఉండదన్నారు. రైతు భరోసా కింద రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి రూ. 12.500లు చొప్పున అక్టోబర్ నుండి అందించబోతున్నామని, ఇదొక చారిత్రాత్మక ఘట్టమని ఆయన పేర్కొన్నారు.
వచ్చే బడ్జెట్ మహిళలకు అంకితం
వైఎస్‌ఆర్ ఆసరా పథకం కింద తాము అధికారంలోకి వచ్చిన రోజు వరకు ఉన్న డ్వాక్రా రుణాలను నాలుగు విడతలుగా అక్క చెల్లెమ్మలకు చెల్లిస్తామన్న మాట నిలుపుకుంటామన్నారు. రానున్న ఏడాది నుండి రూ. 27,147 కోట్లు మొత్తాన్ని నాలుగు విడతలుగా నేరుగా మహిళల చేతికే అందిస్తామన్నారు. వైఎస్‌ఆర్ చేయూత కింద 45 ఏళ్లు దాటిన ప్రతీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల కుటుంబానికి ఆయా కార్పొరేషన్ల ద్వారా పూర్తి పారదర్శకతతో అవినీతికి తావులేకుండా ప్రతీ మహిళకు రూ. 75వేలు సాయం చేసే పథకాన్ని వచ్చే ఏడాది నుండి అమలు చేస్తామన్నారు.
పక్షవాతం, కండరాల బలహీనులకు భరోసా
కిడ్నీ, తలసేమియా బాధితులకు అందిస్తున్న విధంగానే పక్షవాతం, కండరాల బలహీనతతో కదలలేని పరిస్థితిలో ఉన్న వారిని కూడా పింఛన్ భరోసాను కల్పించి ఆదుకునేందుకు ఆలోచిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ కింద ప్రస్తుతం 1095 వ్యాధులకు మాత్రమే చికిత్స అందిస్తుండగా, అదనంగా 936 వ్యాధులకు, మొత్తం 2031 వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకం వర్తించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.
శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్
శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్న మొదటి రాష్ట్రం మనదేనన్నారు. వెనుకబడిన కులాలుగా కాకుండా వెనె్నముక కులాలుగా చూస్తామన్న మాటకు కట్టుబడి శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, పనులు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేసిన మొదటి ప్రభుత్వం తమదేనన్నారు.
అందరికీ ఇళ్లు
రానున్న ఉగాది నాటికి రాష్ట్రంలోని 25లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందించబోతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ తరువాత నాలుగు సంవత్సరాల్లో పేదలకు 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా అమ్మబడి, గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు, వలంటీర్ల నియామకం, స్పందన, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్, ముఖ్యమంత్రి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు, వెలంపల్లి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ సలహాదారు అజయ కల్లం, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడలో గురువారం జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి